మెడికల్ కాలేజీ బాలుర హాస్టల్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ రాజేంద్ర ప్రసాద్
సూర్యాపేట క్రైం: సూర్యాపేట మెడికల్ కళాశాల బాలుర హాస్టల్‌లో జరిగిన ర్యాగింగ్ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయాలని డీఎంఈ రమేశ్‌రెడ్డిని ఆదేశించారు.
ఈ మేరకు సోమవారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ దండ మురళీధర్‌రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ శారద, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బాబురావుతో పాటు పలువురు అసోసియేట్ ప్రొఫెసర్లతో కూడిన కమిటీ, విద్యార్థుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన సమాచారం సేకరించింది. అనంతరం ఈ కమిటీ విచారణ నివేదికను సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డికి సమర్పించింది. (చదవండి: కులమేంటని అడిగి.. సార్ అని పిలవాలని హుకుం, గదిలో బంధించి దారుణం)
బాధ్యులందరిపై కేసు నమోదు చేస్తాం..
బాధిత విద్యార్థి సాయికుమార్ ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కూడా విచారణ జరిపారు. హాస్టల్‌ను సందర్శించి పలువురు మెడికోలను విచారించారు. కాగా, ర్యాగింగ్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని, ప్రస్తుతం ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ చెప్పారు. ఇంకా మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నామని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
గతంలో కూడా కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ జరిగినట్లు తెలిసిందని, విద్యా సంస్థలు, వసతిగృహాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, త్వరలో మెడికల్ కళాశాల వసతి గృహాల్లో కూడా ర్యాగింగ్‌ను నిరోధించేందుకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని వివరించారు.
ఎస్పీ వెంట డీఎస్పీ మోహన్‌కుమార్, సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ శ్రీనివాస్ ఉన్నారు. ఇదిలా ఉండగా మెడికల్ కళాశాల హాస్టల్‌లో జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు మెడికల్ కళాశాల ఎదుట ధర్నా చేశారు. ర్యాగింగ్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment