సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ చదవాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం, ఆర్టికల్ 371డీ నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్‌ను సవరించారు. దీని ప్రకారం
2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లు 100 శాతం రాష్ట్ర విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది.
అంతకుముందు స్థానిక విద్యార్థులకు 85 శాతం మాత్రమే సీట్లు ఉండగా, మిగతా 15 శాతం అన్ రిజర్వుడుగా ఉండేవి. ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. తాజా నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఉండే సీట్లన్నీ కన్వీనర్ కోటా సీట్లే కాగా, ప్రైవేటు కళాశాలల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటా కిందే భర్తీ చేయాల్సి ఉంటుంది.
పాత కాలేజీల్లోనే అన్ రిజర్వుడు కోటా
తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేయడంతోపాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలుంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేరింది. నాడు తెలంగాణలో 2,850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8,340కి పెరిగాయి. అప్పటి 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కన్వీనర్ కోటా కింద 1,895 ఎంబీబీఎస్ సీట్లు (ప్రభుత్వ, ప్రైవేటు కలిపి)అందుబాటులో ఉండేవి.
ఇందులో 15 శాతం అన్ రిజర్వుడు కోటా కింద 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. వీటిని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సైతం దక్కించుకునేందుకు అవకాశం ఉండటంతో ఆ మేరకు తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోయేవారు. తాజాగా ఈ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలను సవరించింది. కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు అన్ రిజర్వుడు వర్తించకుండా చేసింది. దీంతో తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్ సీట్లు అదనంగా లభిస్తాయి.
గతేడాది నుంచి బీ కేటగిరీలో 85 శాతం తెలంగాణకే...
ఇప్పటికే ఎంబీబీఎస్ బీ కేటగిరీ సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా చేయడం (లోకల్ రిజర్వ్) వల్ల రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 1,300 ఎంబీబీఎస్ సీట్లు లభించాయి. తాజా నిర్ణయంతో ప్రతి ఏటా మొత్తం 1,820 సీట్లు అదనంగా లభించనున్నాయి. 1,820 సీట్లు అదనంగా అంటే దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానం. కాగా ప్రతి ఏటా కాలేజీల సంఖ్య పెరిగిన కొద్దీ అదనంగా లభించే సీట్లు పెరగనున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల్లో ఆలిండియా కోటా 15 శాతం సీట్లు యధాతథంగా ఉంటాయి. దీనిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని ఎక్కడివారైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు.
రాష్ట్ర విద్యార్థుల డాక్టర్ కల సాకారం చేసే నిర్ణయం
ప్రభుత్వం ఒకవైపు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూనే, ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ విద్యార్థులు స్థానికంగా ఉంటూనే డాక్టర్ కల సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది. సీఎం కేసీఆర్ ఆలోచనతో అమలు చేస్తున్న నిర్ణయాలు తెలంగాణ బిడ్డలను వైద్య విద్యకు చేరువ చేస్తున్నాయి. మొత్తం 1,820 మెడికల్ సీట్లు అదనంగా వచ్చేలా ప్రభుత్వం చేసింది. రాష్ట్ర విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
– హరీశ్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
ఎంబీబీఎస్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే..
Published Wed, Jul 5 2023 4:09 AM | Last Updated on Wed, Jul 5 2023 4:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment