ఎంబీబీఎస్‌ అన్‌ రిజర్వుడ్‌ సీట్లు ఏపీ విద్యార్థులకే | MBBS unreserved seats are for Andhra Pradesh students | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌ అన్‌ రిజర్వుడ్‌ సీట్లు ఏపీ విద్యార్థులకే

Published Mon, Jul 17 2023 5:01 AM | Last Updated on Mon, Jul 17 2023 10:34 AM

MBBS unreserved seats are for Andhra Pradesh students - Sakshi

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్‌ అన్‌ రిజర్వుడ్‌ సీట్లు ఏపీ విద్యార్థులకే లభించనున్నాయి.  2014 జూన్‌ 2 తర్వాత ఏర్పాటైన ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ, నాన్‌ మైనారిటీ వైద్య, దంత కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లలో వంద శాతం ఏపీ విద్యార్థులకు అవ­కాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల నిబంధనల్లో సవరణలు చేస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

యూజీ, పీజీ కోర్సుల్లో 100 శాతం కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్లను ఏపీ విద్యార్థులకు కేటా­యించాలని పలువురు విద్యార్థులు, తల్లి­దం­డ్రులు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవి­ద్యాలయాన్ని కోరారు. ఈ క్రమంలో మన విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచు­కుని రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో 2014 జూన్‌ 2 తర్వాత ఏర్పడ్డ వైద్య కళాశాలలతోపాటు కొత్తగా మంజూరైన ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లను సైతం ఏపీ విద్యా­ర్థులతోనే భర్తీ చేస్తారు. ఈ కళాశాలల్లో అన్‌ రిజర్వుడ్‌ సీట్లు కూడా మనకే దక్కనున్నాయి.

ఇప్పటివరకు ఇలా..
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను ఆల్‌ ఇండియా కోటాలో భర్తీ చేస్తున్నారు. మిగిలిన సీట్లను రాష్ట్ర కోటా కింద ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ నిర్వహించి భర్తీ చేస్తోంది. కాగా, ఆల్‌ ఇండియా కోటాకు పోగా మిగిలిన సీట్లలో 85 శాతం స్థానిక, 15 శాతం అన్‌ రిజర్వుడ్‌ విభాగాల కింద భర్తీ చేసేవారు. అలాగే ప్రైవేట్‌ కళాశాలల్లో 50 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద ఉండేవి. ఈ సీట్లలో 15 శాతం సీట్లను అన్‌ రిజర్వుడ్‌ కింద భర్తీ చేసేవారు. దీంతో అన్‌ రిజర్వుడ్‌ విభాగంలో తెలంగాణ విద్యార్థులు పోటీపడి సీట్లు పొందుతూ వచ్చారు. 
  
ఇక నుంచి ఇలా..
2014 జూన్‌ 2 తర్వాత ఏర్పడిన కళాశాలలు, కొత్తగా మంజూరైన సీట్లలో 15 శాతంలోనూ తెలంగాణ విద్యార్థులకు కాకుండా ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకే అవకాశం ఉంటుంది. ఏపీ స్థానికత కలిగిన విద్యార్థులు ఈ సీట్లలో ప్రవేశాలు పొందొచ్చు. దీంతో పాటు వేరే రాష్ట్రంలో చదువుకున్న కాలం మినహాయించి రాష్ట్రంలో పదేళ్లు నివసించిన విద్యార్థులు/పదేళ్ల పాటు రాష్ట్రంలో నివసించిన పౌరుల పిల్లలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు కూడా అవకాశం కల్పిస్తారు.

అలాగే ప్రైవేటు కళాశాలల్లోని అన్‌ రిజర్వుడ్‌ సీట్లను కూడా మన రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తారు. అంటే.. ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో 100 శాతం సీట్లు (ఆల్‌ ఇండియా కోటా  మినహాయించి) ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకే దక్కనున్నాయి. అన్‌ రిజర్వుడ్‌ విభాగంలో తెలంగాణ విద్యార్థులకు ఇక అవకాశం ఉండదు.

219 అన్‌ రిజర్వుడ్‌ సీట్లు మన విద్యార్థులకే..
ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా ఐదు వైద్య కళాశాలలను ప్రారంభిస్తోంది. వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఉన్నాయి. ప్రతి చోట ఆల్‌ ఇండియా కోటా 15 శాతం సీట్లు పోగా 128 చొప్పున సీట్లు రాష్ట్ర కోటాలోకి వస్తాయి. వీటితో కలిపి 2014 జూన్‌ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన కళాశాలల్లో 1,290 సీట్లు రాష్ట్ర కోటాలోకే వస్తాయి. వీటిలో 15 శాతం అంటే 193 సీట్లు అన్‌ రిజర్వుడ్‌ విభాగంలో ఉంటాయి.

అలాగే 2014 తర్వాత కొత్తగా మంజూరైన సీట్లలో 26కు పైగా సీట్లు అన్‌ రిజర్వుడ్‌ విభాగంలోకి వస్తాయి. ఇలా 219 సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే దక్కనున్నాయి. కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో మాత్రమే కాకుండా వైద్య విద్య పీజీ సీట్లలోను 15 శాతం అన్‌ రిజర్వుడ్‌ కోటా సీట్లలో మన రాష్ట్ర విద్యార్థులకే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement