పెరగని సీట్లు.. విద్యార్థుల పాట్లు  | Government failure in the formation of new medical colleges | Sakshi
Sakshi News home page

పెరగని సీట్లు.. విద్యార్థుల పాట్లు 

Published Mon, Apr 29 2019 4:09 AM | Last Updated on Mon, Apr 29 2019 4:09 AM

Government failure in the formation of new medical colleges - Sakshi

రాష్ట్రంలో ఐదేళ్లుగా ప్రభుత్వం వైద్య విద్యపై దృష్టి సారించక పోవడంతో విద్యార్థులు భారీగా నష్టపోయారు. ఎంబీబీఎస్‌ సీట్లు పెంచుకోవడంలో బాబు సర్కారు ఏ దశలోనూ ఉత్సాహం చూపక పోవడంతో విద్యార్థుల మధ్య పోటీ పెరిగిపోయింది. ఏటికేటికీ పోటీపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, సీట్లు పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్న సీట్లను నిలుపుకోవడానికే అష్టకష్టాలు పడుతున్న దుస్థితి. వెరసి ఒక్కో సీటుకు 15 నుంచి 20 మంది వరకు పోటీ పడుతున్నారు. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో ఎంబీబీఎస్‌ సీట్లు పెరగకపోవడం విద్యార్థులకు పెద్ద శాపంగా మారింది. గడిచిన ఐదేళ్లలో ఒక్క కొత్త వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. ప్రైవేటు కళాశాలల్లో కూడా సీట్లు పెరగక పోవడంతో అటు కన్వీనర్‌ కోటా సీట్లు అనుకున్న మేరకు లాభించలేదు. వాస్తవానికి ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్‌ వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించి ఉంటే ఒక్కో కళాశాలలో 50 సీట్ల చొప్పున పెరిగేవి. కానీ ప్రభుత్వం రెండేళ్ల కిందట ఒక్కో కళాశాలకు అదనంగా ఇచ్చిన 50 సీట్లకే వసతులు లేవు. దీంతో ఆ సీట్లు కూడా పోయే పరిస్థితి దాపురించింది. గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం వంటి కళాశాలల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నట్టు తేలింది. నెల్లూరు వైద్య కళాశాలలో వసతులు లేవని 150 సీట్లకు  ఇప్పటికీ అనుమతి రాలేదు. ప్రభుత్వ వైద్య కళాశాలలు లేని పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాల్లో 2014లోనే కొత్తగా ఏర్పాటు చేస్తామన్నారు గానీ ఆ దిశగా మాట నిలుపుకోలేదు. ఈ రెండు జిల్లాల్లో కళాశాలలు వచ్చి ఉంటే 200 నుంచి 300 సీట్ల వరకూ పెరిగేవి. ఈ ఏడాది అందుబాటులో ఉన్న సీట్లకు సగటున ఒక్కో సీటుకు 18 మందికి పైగా పోటీ పడుతున్నారు. దంత వైద్య కళాశాలలు కూడా మన రాష్ట్రంలో మూడు మాత్రమే ఉండగా, అందులోనూ తక్కువ సీట్లు ఉన్నాయి.

తెలంగాణలో కొత్తగా మూడు వైద్య కళాశాలలు
మన రాష్ట్రంలో 2014 తర్వాత కొత్తగా ఒక్క వైద్య కళాశాల కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోగా, తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వైద్య కళాశాలలకు ప్రతిపాదనలు పంపించారు. ఇందులో రెండేళ్ల క్రితమే మహబూబ్‌నగర్‌లో ఉన్న వైద్య కళాశాలకు సీట్లు అందుబాటులోకి వచ్చాయి. సిద్ధిపేట, నల్గొండల్లో ఈ ఏడాది నుంచి 100 సీట్ల చొప్పున అమల్లోకి రానున్నాయని తెలంగాణ డీఎంఈ కె.రమేష్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేటలోనూ ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రతిపాదనలు పంపించారు. వచ్చే ఏడాది ఇక్కడ కూడా 150 సీట్ల వరకూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇలా మన పక్క రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో సీట్లు పెరుగుతూంటే మన రాష్ట్రంలో మాత్రం ఉన్న సీట్లను కాపాడుకునేందుకే మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితి నెలకొంది. మన రాష్ట్రంలో ఎనిమిది జిల్లా ఆస్పత్రులున్నాయి. వాటిని ఉన్నతీకరించి వైద్య కళాశాలలుగా మార్చుకుని ఉంటో ఒక్కో దాంట్లో వంద సీట్ల చొప్పున 800 సీట్లు అదనంగా వచ్చేవి. కానీ ఈ ఆస్పత్రులను కూడా ఉన్నతీకరించకపోవడం దారుణం అని వైద్య వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 

అటు పాత వాళ్లు.. ఇటు కొత్త వారు
ఈ ఏడాది ఇంటర్‌ పూర్తి చేసుకున్న వారు ఓవైపు, గత ఏడాది తృటిలో సీటు కోల్పోయి, మళ్లీ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని పోటీపడుతున్న వారు మరోవైపు.. వెరసి ఎంబీబీఎస్‌ సీట్లకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. యాజమాన్య కోటా కింద సీట్లు వచ్చినా అంత డబ్బు కట్టలేక వదులుకున్న వందల మంది ఈ ఏడాది మళ్లీ నీట్‌ రాసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ ఏడాది ఇంటర్‌ రెండో సంవత్సరం పూర్తి చేసుకున్న వారికి ఆరు మాసాల నుంచే కార్పొరేట్‌ కళాశాలలు ప్రత్యేక కోచింగ్‌ పేరుతో రేయింబవళ్లు చదివించారు. వేలాది మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీటు కోసం లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ పేరుతో 10 మాసాలకు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించారు. ఎలాగైనా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే ఎంబీబీఎస్‌ సీటు సాధించాలనే లక్ష్యంతో విద్యార్థులు కష్టపడి చదువుతున్నారు. ఎంబీబీఎస్‌ సీటు రాకపోతే దంత వైద్యంలోనైనా చేరదామనుకునే వారి సంఖ్య తక్కువే. వివిధ కారణాల వల్ల డెంటల్‌పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ కోసం మరో వారం రోజుల్లో అంటే మే 5న జాతీయ స్థాయిలో నీట్‌ పరీక్ష జరగనుంది. ప్రభుత్వ పరిధిలో ఉన్న సీట్లలో 15 శాతం జాతీయ పూల్‌కు ఇవ్వాల్సి ఉంది. దీంతో జాతీయ స్థాయిలో మన రాష్ట్ర విద్యార్థులు 15 శాతం సీట్లకు పోటీ పడొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement