రెండు దరఖాస్తులు చాలు | Simultaneous counseling for all MBBS seats across India | Sakshi
Sakshi News home page

రెండు దరఖాస్తులు చాలు

Published Tue, Jan 30 2024 12:37 AM | Last Updated on Tue, Jan 30 2024 10:42 AM

Simultaneous counseling for all MBBS seats across India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో వైద్య విద్య కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియను జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) సరళతరం చేసింది. ఎయిమ్స్‌ వంటి జాతీయస్థాయి మెడికల్‌ కాలేజీలతోపాటు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం జరిగే కౌన్సెలింగ్‌లకు పదుల సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు దేశ­వ్యాప్తంగా ఉన్న లక్షకుపైగా ఎంబీబీఎస్‌ సీట్లకు కేవలం రెండు దరఖాస్తులతో పోటీపడొచ్చు.

ఇందులో ప్రైవేటు కాలేజీల కోసం ఒకటి, ప్రభుత్వ కాలే­జీల కోసం మరో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎక్కడ సీటు వస్తే అక్కడ చేరవచ్చు. విద్యార్థి కోరుకున్నచోట సీటు రాకుంటే.. తదుపరి కౌన్సెలింగ్‌లలో పాల్గొనవచ్చు. దీనిపై  త్వరలో­నే ఆదేశాలు వెలువడనున్నాయని ఎన్‌ఎంసీ వర్గాలు తెలిపాయి. 2024–25 వైద్య విద్యా సంవత్సరం నుం­చే ఈ విధానం అమల్లోకి రానుందని వెల్లడించాయి. 

జాతీయ స్థాయి మెరిట్‌ అయినా వేర్వేరుగా..: దేశ­వ్యాప్తంగా 681 మెడికల్‌ కాలేజీల్లో 1.04 లక్షల ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్, ఎండీ, డీఎన్‌బీ ఇలా 67,802 పీజీ మెడికల్‌ సీట్లున్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయి రెండింటిలోనూ సీట్లను నీట్‌ ప్రవేశపరీక్ష ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల కోసం అఖిల భారత ర్యాంకు ఆధారంగా మెరిట్‌ జాబితాను తయారు చేస్తున్నారు. అభ్యర్థులు తమ రాష్ట్ర పరిధిలో దరఖాస్తు చేసుకున్నప్పుడు.. వారిని రాష్ట్ర కేటగిరీగా గుర్తించి, తదనుగుణంగా మెరిట్‌ జాబితాలను తయారు చేసేవారు.

కేంద్ర ప్రభుత్వం అన్ని మెడికల్‌ కాలేజీల్లోని 15శాతం ఆలిండియా కోటా సీట్లకు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఈఎస్‌ఐసీ, ఏఎఫ్‌ఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్‌ నిర్వహించేది. అభ్యర్థులెవరైనా ఈ 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర కోటా, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఇతర సీట్లకోసం అభ్యర్థులు తమ సొంత రాష్ట్రాల్లోని కాలేజీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌ అధికారులు కూడా.. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లకు ఆలిండియా ర్యాంకుల ఆధారంగా మెరిట్‌ జాబితాలు తయారు చేసి అడ్మిషన్లు చేస్తారు. 

ప్రైవేట్‌ సీట్లకూ జాతీయస్థాయి కౌన్సెలింగ్‌ 
ప్రస్తుతం రాష్ట్రాల్లోని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లకు ఆయా రాష్ట్రాల్లోనే కౌన్సెలింగ్‌ జరుగుతోంది. వాటిలో కనీ్వనర్‌ కోటాకు వేరుగా, బీ కేటగిరీ, ఎన్నారై కోటాల సీట్లకు వేర్వేరుగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. వీటిలోని ఓపెన్‌ కేటగిరీ సీట్లకు దేశంలోని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ కౌన్సెలింగ్‌ కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తోంది. ఎన్‌ఎంసీ నిర్ణయం అమల్లోకి వస్తే.. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లోని వివిధ కేటగిరీల సీట్లకు ఒకే దరఖాస్తు సరిపోతుంది, ఒకేసారి కౌన్సెలింగ్‌ జరుగుతుంది. 

► ఉదాహరణకు తెలంగాణలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఉన్న బీ కేటగిరీ సీట్లలో 85శాతం స్థానికులకు కేటాయించగా, మిగతా 15శాతం ఓపెన్‌ కేటగిరీ సీట్లకు దేశంలోని ఏ రాష్ట్రం వారైనా పోటీపడొచ్చు. ఈ ఓపెన్‌ కేటగిరీ రిజర్వేషన్లు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. ఒకే దరఖాస్తు ద్వారా ఆయా రాష్ట్రాల్లోని కాలేజీల్లో ఎక్కడో ఒకచోట సీటు పొందవచ్చు. నచ్చినచోట చేరవచ్చని, లేకుంటే తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని ఎన్‌ఎంసీ అధికారులు చెప్తున్నారు.  

► గత ఏడాది దేశవ్యాప్తంగా 20.87 లక్షల మంది నీట్‌ యూజీ పరీక్ష రాశారు. మొత్తం 11,45,976 మంది అర్హత సాధించగా.. అందులో ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654 మంది ఉన్నారు.  

ఒకేసారి విస్తృతంగా కౌన్సెలింగ్‌ 
ప్రస్తుత నిబంధనల మేరకు అభ్యర్థులు జాతీయ స్థాయి మెడికల్‌ కాలేజీల్లోని ఎంబీబీఎస్‌ సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. డీమ్డ్‌ వర్సిటీల్లోని కాలేజీలకు వేరుగా, వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవే­టు మెడికల్‌ కాలేజీలకు వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాలి. ఇలా పదుల సంఖ్యలో, కొందరైతే 50 నుంచి 60 దరఖాస్తులు చేసిన సందర్భాలూ ఉన్నాయి.

రాష్ట్రాల్లోని కాలేజీల్లో 15% జాతీయ స్థాయి ఓపెన్‌ కోటాకు ఏ రాష్ట్రంవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు వీటికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ జరిగేది. ఆ కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక రాష్ట్రాల్లోని మిగతా కనీ్వనర్‌ కోటా సీట్లకు కౌన్సెలింగ్‌ జరిపేవారు. ఈ ఏడాది నుంచి జాతీయ, రాష్ట్రస్థాయి సీట్లన్నింటికీ ఒకేసారి.. అంటే ఒకే తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement