కొత్తగా మరో 150 ఎంబీబీఎస్‌ సీట్లు | Completed two rounds of counselling: MBBS seats in telangana | Sakshi
Sakshi News home page

కొత్తగా మరో 150 ఎంబీబీఎస్‌ సీట్లు

Published Thu, Oct 17 2024 12:34 AM | Last Updated on Thu, Oct 17 2024 12:34 AM

Completed two rounds of counselling: MBBS seats in telangana

మరో ప్రైవేట్‌ కాలేజీకి ఎన్‌ఎంసీ అనుమతి 

సగం సీట్లు కన్వీనర్‌ కోటా కింద భర్తీ 

ఇప్పటికే రెండు రౌండ్ల కౌన్సెలింగ్‌ పూర్తి

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ కొనసాగుతున్న కీలక సమయంలో రాష్ట్రంలో మరో కొత్త ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీకి జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతులు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్‌– విజయ వాడ జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటైన నోవా మెడికల్‌ కాలేజీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 150 ఎంబీబీఎస్‌ సీట్లు నింపుకునేందుకు ఆ కాలేజీకి అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఇప్పటికే కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌ సీట్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలైంది. రెండు రౌండ్లు ముగిసిన తర్వాత ప్రైవేటు కాలేజీకి అనుమతులు రావడం గమనార్హం.

తాజాగా అందుబాటులోకి వచ్చిన 150 సీట్లలో సగం అంటే 75 సీట్లు కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రస్తుతం రెండో రౌండ్‌ కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత 20–25 సీట్లు ఆ కోటాలో ఖాళీగా ఉన్నట్లు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. కొత్త వాటిని కలిపితే 95 నుంచి 100 సీట్లు కన్వీనర్‌ కోటాలో ఉంటాయని వెల్లడించాయి.

ఇలావుండగా కొత్త కాలేజీతో కలిపి రాష్ట్రంలో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల సంఖ్య 29కి చేరింది. వాటిలో మల్లారెడ్డి గ్రూపునకు చెందిన రెండు మెడికల్‌ కాలేజీలు ఈ ఏడాది డీమ్డ్‌ యూనివర్సిటీగా మారాయి. అందులోని సీట్లన్నీ మేనేజ్‌మెంట్‌ కోటాలోనే భర్తీ చేసుకునే అవకాశముంది. రాష్ట్ర కౌన్సెలింగ్‌తో సంబంధం ఉండదు. దీంతో తెలంగాణ విద్యార్థులకు సీట్లు లభించే ప్రైవేటు మెడికల్‌ కాలేజీల సంఖ్య 27కే పరిమితం అయింది. ఈ కాలేజీలన్నీ కలిపి 4,550 సీట్లున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement