రైతుల ముసుగులోని వ్యాపారులపై కేసులు
⇒ కొనుగోలు కేంద్రాల్లో కందులు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని హరీశ్ ఆదేశం
⇒మరో 5 లక్షల క్వింటాళ్ల కందుల కొనుగోలుకు నాఫెడ్ అంగీకరించినట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రైతుల ముసుగులో ఎవరైనా వ్యాపారులు ప్రభుత్వ ఏజెన్సీలకు కనీసమద్దతు ధర(ఎంఎస్‌పీ)కు విక్రయిస్తే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. దీనిపై ఎప్పటికప్పుడు తనిఖీ లు చేసి చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులకు సూచించారు. కందుల కొను గోళ్లపై మంత్రి బుధవారం ఇక్కడ మార్కె టింగ్ ఎం.డి. జగన్‌మోహన్, ఎఫ్‌సీఐ, నాఫెడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇప్పటి వరకు 93 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.17 లక్షల మంది రైతుల నుంచి రూ.628 కోట్ల విలువైన 12.64 లక్షల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కొనుగోలు సంస్థల ద్వారా 14 లక్షల క్వింటాళ్లకు మాత్రమే అనుమతించినందున ఇంకా రైతుల వద్ద కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ నేపథ్యంలో అదనంగా నాఫెడ్ ద్వారా 5 లక్షల క్వింటాళ్లు, ఎఫ్‌సీఐ ద్వారా 2.5 లక్షల క్వింటాళ్ల కొను గోలుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్, నాఫెడ్ ఎం.డి. సంజయ్ కుమార్ చందాను కోరినట్లు మంత్రి తెలి పారు. ఈ మేరకు నాఫెడ్ ద్వారా 5 లక్షల క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతి లభించి నట్లు వివరించారు. కందుల కొనుగోలులో ఎదురవుతున్న ఖాళీ బస్తాల సమస్యను పరిష్కరించాలని కోరగా రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని నాఫెడ్ ఎండీ హామీ ఇచ్చారని హరీశ్ వెల్లడించారు.