కూత కుదిరింది.. ఆట అదిరింది | Audham Andhra is filling the state with enthusiasm | Sakshi
Sakshi News home page

కూత కుదిరింది.. ఆట అదిరింది

Published Thu, Dec 28 2023 4:59 AM | Last Updated on Thu, Dec 28 2023 3:00 PM

Audham Andhra is filling the state with enthusiasm - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో క్రీడా రంగానికి మహర్దశ వచ్చింది. గ్రామీణ, పట్టణ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు.. మాణిక్యాల్లాంటి క్రీడాకారులను వెలికితీసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట ఐదు క్రీడాంశాల్లో టోర్నమెంట్లు నిర్వహిస్తోంది. యువత ఆరోగ్యాన్ని పెంపొందించే.. క్రీడా స్ఫూర్తి నింపే లక్ష్యంతో వాలీబాల్, క్రికెట్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహిస్తున్నారు. రెండో రోజైన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా క్రీడాకారులు నువ్వా.. నేనా అన్నట్టుగా తలపడ్డారు. ఆయా క్రీడాంశాల్లో వేలాది జట్లు దుమ్ములేపాయి. యువతులు సైతం పోటీల్లో పాల్గొని సత్తా చాటారు.

షెడ్యూల్‌ ప్రకారం 26 జిల్లాల్లోని 8,549 గ్రామ, వార్డు సచివాలయాల్లో పోటీలు నిర్వహించారు. దాదాపు 18 జిల్లాల్లో 50 శాతం నుంచి 73.85 శాతం సచివాలయాల్లో పోటీలు ఊపందుకున్నాయి. 9,774 పోటీలను నిర్దేశిస్తే 8,594 పోటీలను దిగ్విజయంగా పూర్తి చేశారు. కొన్నిచోట్ల సమయాభావంతో పోటీలు మరుసటి రోజు షెడ్యూల్‌లోకి మార్చారు. అత్యధికంగా విశాఖపట్నంలో 95.37 శాతం, పశ్చిమ గోదావరిలో 94.95 శాతం, తూర్పు గోదావరిలో 92.93 శాతం, అనకాపల్లి, అంబేడ్కర్‌ కోనసీమ, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో 90 శాతానికిపైగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌లు జరిపించారు.

క్రీడాకారులు చెలరేగి ఆడుతుంటే.. రెట్టించిన ఉత్సాహంతో ప్రేక్షకులు క్రీడాకారులను ప్రోత్సహించడం విశేషం. తొలిరోజు కంటే అత్యధికంగా 7.02 లక్షల మంది వీక్షకుల సంఖ్య నమోదయ్యింది. ఇందులో 4.80 లక్షల మంది పురుషులు, 2.20 లక్షల మంది మహిళలు పోటీలను నేరుగా తిలకించారు. మొత్తంగా 31,169 మ్యాచ్‌లలో 70 శాతం మ్యాచ్‌లు అనుకున్న సమయానికి పూర్తి చేశారు.

ఉత్తరాంధ్రలో ఉవ్వెత్తున
శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా రెండో రోజూ ఉత్సాహంగా ఆడుదాం ఆంధ్రా టోర్నీలు కొనసాగాయి. పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కాసేపు క్రికెట్‌ ఆడి సందడి చేశారు. ఎచ్చెర్ల నియో­జకవర్గంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ యువకు­లతో కబడ్డీ ఆడి అలరించారు. ఉమ్మడి విజయ­నగరం జిల్లాలో బుధవారం వివిధ టోర్న­మెంట్లు హోరాహోరీగా సాగాయి. సచివాలయ స్థాయిలో ఐదు క్రీడాంశాల్లో జరుగుతున్న పోటీల్లో క్రీడాకా­రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు జిల్లాల్లోని 976 సచివాలయాల పరిధిలోని 485 మైదానాల్లో ఆటల పోటీలు సాగాయి.

విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలోని సింహాచలం సచివాలయాల పరిధిలో క్రికెట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. తూర్పు నియోజక­వర్గ పరిధిలోని ఏయూ ఇంజినీరింగ్‌ మైదానంలో కబడ్డీ, క్రికెట్, ఖోఖో పోటీలు జరగ్గా.. చినవాల్తేరు జిమ్నాజియం గ్రౌండ్‌లో షటిల్‌ బ్యాడ్మింటన్, క్రికెట్‌ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. గాజువాక నియో­జక­వర్గ పరిధిలోని భెల్‌ (హెచ్‌పీవీపీ) క్రీడా మైదా­నంలో 8 జట్ల మధ్య సచివాలయ స్థాయి క్రికెట్‌ పోటీలు జరిగాయి.

భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురంలో క్రికెట్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ పోటీల్లో యువ జట్లు ఉత్సాహంగా తమ ప్రతిభ చాటాయి. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని 515 సచివాల­యాల్లో ఆడుదాం ఆంధ్రా రెండో రోజు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. మామి­డికుదురు మండలం మొగిలికుదురులో పోటీ­లను పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లాలోని 511 సచివాలయాల పరిధిలో క్రీడాకారులు ఉల్లాసంగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలోని 400 మైదానాల్లో జరిగిన పోటీల్లో క్రీడాకారులు చురుగ్గా పాల్గొన్నారు.
 
రాయలసీమలో రసవత్తరంగా..
రాయలసీమలో ఆడుదాం ఆంధ్రా పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. చిత్తూరులో పోటీలను కలెక్టర్‌ షణ్మోహన్, జేసీ శ్రీనివాసులు పర్యవేక్షించారు. పీవీకేఎన్‌ మైదానంలో పోటీలను జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం 507 సచివాలయాల పరిధిలో 492 క్రీడా మైదానాల్లో పోటీలు నిర్వహించారు. షెడ్యూల్‌ ప్రకారం రెండు రోజుల్లో 2,602 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉండగా.. 2,365 మ్యాచ్‌లు జరిగాయి. తిరుపతి జిల్లా పరిధిలో రెండో రోజు 1,552 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. 1,151 మ్యాచ్‌లు జరిగాయి.

పోటీలను తిరుపతి కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి పర్యవేక్షించారు. కర్నూలు జిల్లా పరిధిలోని 672 సచివాలయాల్లో పోటీలు కొనసాగుతున్నాయి. కోడుమూరు మండలం పెంచికలపాడులో ఎమ్మెల్యే డాక్టర్‌ జరదొడ్డి సుధాకర్‌ రిబ్బన్‌ కట్‌ చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఒక్క కర్నూలు నగరంలోనే 30 క్రీడా మైదానాల్లో క్రికెట్, కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా తలపడ్డారు. కడప డీఎస్‌ఏ క్రీడా మైదానంలో పోటీలను డీఎస్‌డీవో కె.జగన్నాథరెడ్డి ప్రారంభించారు.

సత్తా చాటుతున్న సెంట్రల్‌ ఆంధ్రా
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలు కోలాహలంగా సాగుగుతున్నా­యి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని మార్టేరు, పెనుమంట్ర మండలాల్లో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం పోటీలను ప్రారంభించారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ఏలూరు జిల్లాలో 1,250 మ్యాచ్‌లు, పశ్చిమగోదావరి జిల్లాలోని 537 సచివాలయ పరిధిలో 880 మ్యాచ్‌లు నిర్వహించారు. క్రీడా ప్రాంగణాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.

విజయవాడ కృష్ణలంకలోని ఏపీ ఎస్‌ఆర్‌ఎంసీ హైస్కూల్‌ మైదానంలో రెండో రోజు పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు, వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఫిబ్రవరి 10 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన 1.20 లక్షల మంది భాగస్వాము­లవుతున్నారని కలెక్టర్‌ తెలిపారు. కృష్ణా­జిల్లాలో మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో ఆడుదాం ఆంధ్రా పోటీలకు విశేష స్పందన లభిస్తోంది.

పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో పోటీలు నిర్వహించారు. గురజాలలోని జయంతి పాఠశాలలో క్రికెట్‌ పోటీలను ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. కనిగిరి జూనియర్‌ కళాశాలలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ప్రారంభించారు. తర్లుపాడు మండలంలో పోటీలను ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి వాలీబాల్, క్రికెట్‌ ఆడారు. 

ఈనాడు కథనం పచ్చి అబద్ధం
పీసీ పల్లి: ప్రకాశం జిల్లా పీసీ పల్లి పంచాయతీలో ఆడుదాం ఆంధ్రా పోటీలకు స్థానిక మహిళలు లేక రుణాలు తీసుకునేందుకు బ్యాంక్‌కు వచ్చిన అయ్యవారిపల్లికి చెందిన పొదుపు మహిళలతో టెన్నికాయిట్‌ ఆడించారంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని వెంకటేశ్వర డ్వాక్రా గ్రూప్‌ మహిళలు తీవ్రంగా ఖండించారు. ఈనాడులో ప్రచురించిన కథనమంతా అబద్ధమని మహిళలు తెలిపారు.

పీసీపల్లి మండలం మురుగమ్మి పంచాయతీకి చెందిన వెంకటేశ్వర డ్వాక్రా గ్రూపునకు తామంతా రుణాల కోసం కమ్యూనిటీ కో–ఆర్డినేటర్‌ చిలకమ్మ కలిసి మంగళవారం పీసీ పల్లిలోని బ్యాంక్‌కు వెళ్లామన్నారు. బ్యాంక్‌లో రుణ ప్రక్రియ ఆలస్యం అవుతుందనడంతో సమీపంలోని పాఠశాలకు వెళ్లి ‘ఆడుదాం ఆంధ్రా’ తిలకించామన్నారు. అక్కడ పోటీల్లో పీసీ పల్లికి చెందిన తమ స్నేహితులు ఆటలాడుతుండటంతో విరామ సమయంలో వారితో ముచ్చటిస్తూ వారి చేతిలో ఉన్న ఆట వస్తువులను తీసుకుని సరదాగా వారితో కలసి ఆడామని చెప్పారు.

అనంతరం బ్యాంకుకు వెళుతుంటే ఈనాడు విలేకరి వచ్చి మీది ఏ గ్రామం, ఏ పనిమీద వచ్చారని అడిగి ఫొటోలు తీసుకువెళ్లినట్టు చెప్పారు. గ్రూప్‌ లీడర్‌ సులోచన మాట్లాడుతూ.. రుణాల కోసం పీసీ పల్లి బ్యాంక్‌కు వెళ్లామని.. రుణ ప్రక్రియ ఆలస్యం అవుతుందనడంతో స్కూల్‌లో జరిగే ఆటల పోటీలకు చూడటానికి వెళ్లామని చెప్పారు. తాము పోటీల్లో పాల్గొనలేదని.. కావాలనే పార్టీల మీద అక్కసుతో తమ ఫొటోలు తీసి తప్పుడు కథనం ప్రచురించారని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement