Sports sector
-
ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ (నాలుగో నగరం)లో ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ పేరిట సమీకృత క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో క్రీడల వాతావరణం పెంపొందించేందుకు ఈ యూనివర్సిటీ దోహద పడుతుంది. ఇందులో భాగంగా సుమారు డజనుకు పైగా క్రీడలకు సంబంధించిన ఆధునిక మౌలిక వసతులతో పాటు స్పోర్ట్స్ అకాడమీలను నెలకొల్పు తారు. క్రీడా విజ్ఞాన శాస్త్రం, క్రీడల వైద్యానికి సంబంధించిన కేంద్రాలు కూడా ఇందులో ఉంటాయి. ఈ యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రస్తుతం హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్, గచ్చిబౌలిలోని క్రీడా ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సియోల్‌లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించిన విషయం తెలిసిందే. ప్రపంచ క్రీడా రంగంలో ఇది అగ్రస్థానంలో ఉంది. 1976లో ఏర్పాటైన ఈ వర్సిటీలో అథ్లెటిక్స్‌కు సంబంధించిన అనేక కోర్సులు అందిస్తున్నారు. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా సాధించిన 32 పతకాల్లో 16 పతకాలు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించినవే కావడం గమనార్హం. కాగా యూనివర్సిటీ సందర్శన సందర్భంగా పారిస్ ఒలింపిక్స్‌లో విలువిద్య పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించిన లిమ్ సి హైయోన్తోనూ సీఎం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను సాంకేతిక భాగస్వాములుగా చేర్చుకుని భవిష్యత్తు ఒలింపిక్స్ విజేతలకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం సమీక్షకొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రహదారులు అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీఎంవో అదనపు కార్యదర్శి అజిత్‌రెడ్డి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి కలెక్టర్ శశాంక్‌లతో శనివారం తన నివాసంలో సీఎం సమీక్షించారు. రోడ్డు, మెట్రో మార్గాలకు సంబంధించి భూసేకరణ, ఇతర అంశాలపై అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. వీలైనంత త్వరగా పూర్తి స్థాయి ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేయాల, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
ధిక్కారానికి ఇది మూల్యమా?
ప్యారిస్ ఒలింపిక్స్‌లో దేశం సాధించిన పతకాల కన్నా వినేశ్ ఫోగట్‌కు అక్కడ ఎదురైన అనూహ్య పరిణామం అందరినీ ఖిన్నులను చేసింది, స్వాభిమానంతో క్రీడాపెద్దలకు ఎదురొడ్డి నిలవడమే ఈ అపరాజిత చేసిన నేరమా? క్రీడా రంగం నుంచి సినీ, రాజకీయ, మీడియా రంగాల దాకా ప్రతిచోటా ప్రశ్నించే మహిళలను పితృస్వామ్య భావజాలం తొక్కేస్తూనే ఉంది.ప్యారిస్‌లో భారత్ సాగించిన 2024 ఒలింపిక్ ప్రయాణంలో సాధించిన పతకాలను చాలా తక్కువగానే గుర్తుంచుకుంటాం. 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో కంటే ఒక పతకాన్ని తక్కువగా భారత్ ఈ ఒలింపిక్‌లో గెల్చుకుంది. దానికంటే ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ చాంపియన్ వినేశ్ ఫోగట్ అందరికంటే ఎక్కువగా పతాక శీర్షికల్లోకి ఎక్కారు. ఫోగట్ కేవలం క్రీడాకారిణి మాత్రమే కాదు. ఒక సామాజిక పురోగతికి, కట్టుబాట్ల నుండి విముక్తికి, కఠినమైన స్వావలంబనతో కూడిన స్వతంత్ర ముద్రకు ఆమె ప్రతినిధి. పితృస్వామ్య అధికారాన్ని ధిక్కరించడానికి ఆమె ఏమాత్రం భయపడదు. దాడిని ఎదుర్కొనేందుకు భయపడదు, గట్టిగా అరుస్తూ, వీధిలో నిరసన వ్యక్తం చేయడానికి, తన లక్ష్యం కోసం తనను తాను పణంగా పెట్టడానికి ఆమె సిద్ధంగా ఉంది. కానీ తిరుగుబాటు చేసే ఇలాంటి మహిళలపై భారతీయ సామాజిక విధానాలు విరుచుకుపడు తున్నాయి. బలీయమైన వ్యవస్థీకృత శక్తులు స్త్రీలను లొంగిపోవాలని బలవంతం చేస్తాయి. కానీ ధిక్కరించే స్త్రీ ధైర్యంతో కూడిన కొత్త ట్రెండ్‌ని వినేశ్ ఫోగట్ సృష్టించారు.మారని పితృస్వామ్య భావజాలంనిర్భయంగా ఉంటూ, కొన్నిసార్లు ప్రకాశించే, కొన్నిసార్లు కన్నీరు కార్చే ఫోగట్ గత కొద్ది రోజులుగా మన హృదయాలను కట్టివేశారు. ప్యారిస్‌లో ఆమెమీదే మనం దృష్టి పెట్టాం. అజేయమైన జపాన్ ప్రపంచ ఛాంపియన్ యుయి సుసాకీని ఓడించి, రెజ్లింగ్‌లో భారతదేశం మొట్టమొదటి ఒలింపిక్ బంగారు పతకాన్ని చేజిక్కించుకునే స్థాయికి వినేశ్ చేరుకున్నప్పుడు మనం సంబరాలు చేసుకున్నాం. ఆమె ఫైనల్‌కు సిద్ధమవుతున్నప్పుడు ఊపిరి పీల్చుకున్నాం. అంతు చిక్కని సాంకేతిక విషయాలపై ఆమెను అనర్హురాలిగా ప్రకటించినప్పుడు మాత్రం మనందరి ఊపిరి ఆగిపోయినంత పనయింది. ఫైనల్స్‌కు ముందు ఆమె గడిపిన సుదీర్ఘ రాత్రి గురించి మనం తెలుసుకున్నాము. 50 కిలోల ఫైనల్‌కు అర్హత సాధించడానికి, చివరి 100 గ్రాముల బరువు కోల్పోవడానికి ఆమె రాత్రంతా మేల్కొని ఉంది. ఒక ముద్ద తినలేదు. జాగింగ్చేసింది, స్కిప్పింగ్ చేసింది, సైకిల్ తొక్కింది, ఆవిరి స్నానంతో చెమటోడ్చింది, మైకంతో బాధపడింది. బరువు తగ్గడానికి ఆమె జుత్తును కూడా కత్తిరించుకుంది. కేవలం 100 గ్రాముల బరువు అదనంగా ఉండి ఆమె చివరి తూకంలో విఫలమైనప్పుడు, 140 కోట్ల మంది భారతీయుల గుండె ఆగిపోయినంత పనయింది.ఖచ్చితంగా మన దేశ క్రీడా వ్యవస్థ ద్వారా ఫోగట్‌కు మెరుగైన సేవలందించవచ్చు. భారతదేశ పితృస్వామ్య, వీఐపీలతో కూడిన స్పోర్ట్స్ మేనేజ్మెంట్ బాడీలు... క్రీడాకారులను, అథ్లెట్లను నిరంతరం ఎలా విఫలం చేస్తున్నాయనడానికి వినేశ్ ఫోగట్ సంఘటనే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. తమను తృణీకరించడం, తమ పట్ల అమర్యాదపూర్వకంగా వ్యవహరించడం పట్ల ఫోగట్, ఆమె తోటి ఒలింపిక్ రెజ్లింగ్ ఛాంపియన్లు తిరగబడ్డారు. ఆరుసార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికైన అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధినేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల ఆరోప ణలతో వారు వీధుల్లో నిరసన తెలపవలసి వచ్చింది. డబ్ల్యూఎఫ్ఐ నుంచి సస్పెండ్ అయినప్పటికీ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న బ్రిజ్ భూషణ్‌పై చర్య తీసుకోవడానికి మోదీ ప్రభుత్వం నిరాకరించింది. క్రీడా మంత్రిత్వ శాఖ మల్లయోధులపై గురిపెట్టి దాడులను కొనసాగించింది. బ్రిజ్ భూషణ్ బినామీ అయిన సంజయ్ సింగ్ భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడయ్యాడు. ఫోగట్ మాట ఎవరూ వినలేదు. తనకు అవసరమైన వైద్యం, ఫిజియోథెరపీ అందడం లేదని ఆమె ఆరోపించారు. చివరికి, ఆమె ఇష్టపడే విభాగం 53 కిలోల పోటీ అయితే... 50 కిలోల విభాగంలో పోటీ చేయవలసి వచ్చింది. ఫోగట్‌కు అన్యాయం జరిగింది. ఒలింపిక్ పతకాల కోసం పోటీపడే వారికి తప్పనిసరిగా అన్ని సౌకర్యాలు, వైద్య సహాయం, ఉన్నత స్థాయి నిపుణుల పర్యవేక్షణను అందించాలి. కానీ తాను ప్రదర్శించిన ధిక్కారానికి ఫోగట్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.ఈరోజు, ఫోగట్ గాథ చాలా కారణాల వల్ల కుస్తీ మ్యాట్ కంటే ముఖ్యమైనది. ఎలాంటి ఆధారాలూ లేకుండా జోక్యం చేసుకునే ప్రభుత్వం చేతిలో భారతదేశ శ్రేష్టమైన క్రీడాకారులు అనుభవిస్తున్న బాధలను అది ప్రతిబింబిస్తుంది. అది క్రీడలు లేదా ఇతర రంగాలలో అయినా, అధికారాన్ని సవాలు చేసే స్త్రీల విషయానికి వస్తే, వారు అధిరోహించడానికి ఇప్పటికీ ఒక పర్వతం అడ్డుగా ఉంది అనేదానికి ఫోగట్ ఒక ప్రతీక. ఆమె తోటి మహిళా రెజ్లర్లు, మల్లయోధుల జీవితాలు, వారి కెరీర్లపై పూర్తి నియంత్రణను కోరుకునే ఆధిపత్య వ్యక్తిగా అపఖ్యాతిపాలైన బ్రిజ్ భూషణ్ వంటి కరుడు గట్టిన పితృస్వామ్య ప్రతినిధి... అందరూ పురుషులతోనే కూడిన రెజ్లింగ్ సమాఖ్యను కైవసం చేసుకున్నాడు. పూర్తిగా రాజకీయాలతో అనుసంధానంలో ఉండే పురుషులు నిర్వహించే క్రీడాసమాఖ్యలు ఆధునిక క్రీడల నిర్వహణకు అత్యంత విరుద్ధం. ప్రధాన క్రీడా సంఘానికి నాయకత్వం వహించే స్థానంలో ఒక్క మహిళ కూడా ఎందుకు లేరన్నది పెద్ద ప్రశ్న. ఫోగట్ ఈ ఉక్కిరి బిక్కిరి అధికార ఆధిపత్యానికి వ్యతిరేకంగా తన స్వరం పెంచింది కాబట్టే మూల్యం చెల్లించుకుంది.అయితే క్రీడలు మాత్రమే మినహాయింపుగా లేవు. ధిక్కరించే స్త్రీలు, అణచివేయలేని మహిళల పట్ల అసహనం ఇప్పుడు కార్పొరేట్ బోర్డ్‌రూమ్‌లు, న్యూస్రూమ్లతోపాటు రాజకీయ రంగానికి కూడా విస్తరించింది. మహిళలు, ఎంత ఎక్కువ సాధించినా, తమను తాము నిరూపించుకోవాలని వారిని నిరంతరం అడుగుతారు. వారు మగ అధికారాన్ని సవాలు చేసే ’తప్పు’ చేస్తే, వారిని వెంటనే తిప్పికొడతారు, బహిష్కరిస్తారు. లేదా దూరంగా ఉంచుతారు.సినిమా ప్రపంచంలో కూడా, చలనచిత్ర పరిశ్రమ ప్రారంభ సంవత్సరాల్లో, మహిళా నటీనటులు ఆఫ్–స్క్రీన్, ఆన్–స్క్రీన్ పై ’సద్గుణ’వంతురాలైన విధేయ మహిళా ఇమేజ్‌కి అనుగుణంగా ఉండాలని భావించారు. నర్గీస్, మధుబాల, మీనా కుమారి వంటి మహిళా నటీనటులు అత్యంత విజయవంతమైన వృత్తినిపుణులు. వారు తమ వ్యక్తిగత జీవితాల్లో స్వయంప్రతిపత్తి కోసం పట్టుబట్టారు. కాబట్టే వారు అవిధేయ మహిళలుగా లేదా విఘాతం కలిగించే వ్యక్తులుగా కళంకిత ముద్ర పొందారు, సంప్రదాయ కుటుంబ ఆధారిత కట్టుబాటుకు వీరిని వ్యతిరేకులుగా పరిగణించారు. వెండి తెరపై ఆధునిక వ్యక్తిత్వాన్ని సృష్టించడానికి 1970లలో జీనత్ అమన్ శృంఖలాలను ఛేదించారు.నిజానికి, ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేందుకు భారత్ చాలా దూరంలో ఉంది. విభిన్నంగా ఉండటానికి, తమ గుర్తింపులను వ్యక్తీకరించడానికి భయపడని, సంప్రదాయ ఆలోచనా విధానాలను సవాలు చేసే మహిళల పట్ల సంబరాలు జరుపుకోవడంలో కూడా మనం చాలా దూరం వెళ్ళాలి. ఈ విషయంలో ప్రేరణ కోసం, ప్యారిస్ ఒలింపిక్స్‌లో మహిళల మారథాన్ బంగారు పతకాన్ని, మరో రెండు డిస్టెన్స్ పతకాలను గెలుచుకున్న ఇథియోపియన్ సంతతి డచ్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ అయిన సిఫాన్ హసన్ ను మనం చూడవచ్చు. హసన్ ఒక శరణార్థి. ఆమె నెదర్లాండ్స్‌కు చేరుకుంది. నర్సుగా శిక్షణ పొందుతున్నప్పుడు ఆమె విరామ సమయాల్లో పరిగెత్తింది. గెలుపు సాధించింది. స్త్రీలో ఉన్న ప్రతిభ, తేజస్సు, ధిక్కరించడం అనే గుణాలు సామాజిక దురాచారాలు కావు; మనం క్రీడలలో, ఇతర రంగాలలో ఛాంపియన్ల దేశంగా ఉండాలంటే ఇలాంటి వారిని పెంచి పోషించాలి. వారి విజయాలను చూసి పండగ చేసుకోవాలి.సాగరికా ఘోష్ వ్యాసకర్త టీఎంసీ రాజ్యసభ ఎంపీ (‘ది ప్రింట్’ సౌజన్యంతో...) -
చెదిరిన స్వప్నం
భారత్ బంగారు కల నెరవేరడానికి మరికొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్నామని మన క్రీడాభిమానులు ఉత్కంఠతో వేచిచూస్తున్న వేళ హఠాత్తుగా అంతా తలకిందులైంది. రెజ్లింగ్‌లో ఒకేరోజు దిగ్గజ క్రీడాకారిణులనదగ్గ ముగ్గురిని అవలీలగా జయించి, చరిత్ర సృష్టించి బుధవారం పతాక శీర్షికలకెక్కిన మన రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫోగాట్‌పై చివరాఖరిలో అనర్హత వేటు పడింది.అంతర్జాతీయ క్రీడలు బహు చిత్రమైనవి. ఎవరి అంచనాలకూ అందనివి. ప్రపంచ శిఖరాగ్రంపై ఎవరినైనా ప్రతిష్ఠించగలవు... అధఃపాతాళానికి తొక్కి నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయేలా కూడా చేయగలవు. కేవలం 24 గంటల వ్యవధిలో పరస్పర విరుద్ధమైన ఈ రెండు అనుభవాలనూ వినేశ్ చవిచూడాల్సివచ్చింది. క్రీడారంగంలో దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచటానికీ.., స్ఫూర్తి రగల్చడానికీ ఉద్దేశించిన ఇలాంటి సందర్భాల్లో ముందంజలో నిలిచి మాతృదేశానికి మరిచిపోలేని విజయాన్నందించాలని క్రీడాకారులంతా తపిస్తారు. తమ తమ నైపుణ్యాలకు పదునుపెట్టుకుంటారు. నిజానికి ఇలాంటి వారందరికీ వినేశ్ తలమానికమైనది. ప్రధాని చెప్పినట్టు సవాళ్లకు ఎదు రొడ్డి పోరాడే స్వభావం ఆమెది. ఒక్క రెజ్లింగ్‌లో మాత్రమే కాదు... దశాబ్దాలుగా దేశ క్రీడా రంగాన్ని పట్టిపీడిస్తున్న లింగ వివక్షపైనా, లైంగిక వేధింపులపైనా సివంగిలా తిరగబడిన చరిత్ర ఆమెది. తోటి క్రీడాకారిణులకు ఎదురవుతున్న లైంగిక హింసపై నిరుడు దాదాపు నెలన్నరపాటు ఢిల్లీ వీధుల్లో పోరాడి... అరెస్టులూ, అవమానాలూ, లాఠీ దెబ్బలూ, చంపేస్తామన్న బెదిరింపులూ సహిస్తూ భరిస్తూ మొక్కవోని ఉక్కు సంకల్పాన్ని ప్రదర్శించింది. ఆటల బరిలోనే కాదు... తేడా వస్తే అధికార మదంపైనా పోరాడతానన్న సందేశం పంపింది. ఒక దశలో ఇతర క్రీడాకారులతోపాటు తనకొచ్చిన అవార్డులన్నీ వెనక్కివ్వాలని, పతకాలను గంగానదిలో పడేయాలని నిర్ణయించుకుంది. ఏ రంగంలోనైనా మహిళలు రాణించడమంటే అంత సులువేం కాదు. గడప లోపలే కాదు, వెలుపల సైతం అడుగడుగడుగునా అవరోధాలూ, అడ్డంకులూ ఉంటాయి. క్రీడారంగంలో ఇవి మరిన్ని రెట్లు అధికం. సమస్యలను ఎదుర్కొనటంతో పాటు అవి కలిగించే భావోద్వేగాలను అధిగమించి, గాయపడిన మనసును ఓదార్చుకుంటూ తాను ఎంచుకున్న క్రీడాంశంలో ఏకాగ్రత సాధించి నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఎంత కష్టం! కానీ వినేశ్ దృఢంగా నిలబడింది. తనేమిటో నిరూపించుకుంది. కనుకనే ప్రస్తుత ఒలింపిక్ చాంపియన్, ఏకంగా మూడుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన జపాన్ క్రీడాకారిణి సుసాకి యుయుపై 3–2 తేడాతో గెలిచి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది. బరిలో ఇంతవరకూ ఓటమే చవిచూడని నంబర్ వన్ యుయు నిజానికి ఈ పోరులో అందరి ఫేవరెట్. అటుపై ప్రతిభావంతులుగా పేరొందిన ఉక్రెయిన్, క్యూబా క్రీడా దిగ్గజాలను కూడా వినేశ్ సునాయాసంగా అధిగమించింది. బుధవారం అమెరికా క్రీడాకారిణి సారా హిల్డెర్బ్రాంట్తో తలపడబోతున్న తరుణంలో ఉండాల్సిన 50 కిలోల బరువు కంటే కేవలం వందగ్రాములు అధికంగా ఉందన్న కారణంతో వినేశ్‌ను అనర్హురాలిగా ప్రకటించటం దురదృష్ట కరం. గతంలోనూ ఆమెకు బరిలో సమస్యలు తప్పలేదు. వరసగా 2016, 2020 ఒలింపిక్స్ పోటీల్లో బరి నుంచి నిష్క్రమించాల్సి వచ్చిన వినేశ్‌పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అసలు 2016లో మోకాలి గాయం అయ్యాక ఇక ఆమె క్రీడలకు స్వస్తి చెప్పక తప్పదని అనుకున్నారు. దానికి తోడు నిరుడు గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. నిరసనోద్యమం సరేసరి. వీటన్నిటినీ అధిగమించి ఆమె మ్యాట్పైకొచ్చింది. అచిరకాలంలోనే అద్భుతంగా రాణించింది. మంగళవారం నాటి ఆటను చూసినవారంతా ఫైనల్లో ఆమె స్వర్ణం చేజిక్కించుకోవటం ఖాయమని అనుకుంటుండగా ఊహించని విపరిణామమిది. ఒలింపిక్స్ చరిత్రలో భారతీయ క్రీడాకారులకు ఎన్నడూ ఎదురు కాని అనుభవమిది.వినేశ్ అనర్హత వెనక కుట్ర కోణం ఉండొచ్చని, ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బృందం అలసత్వాన్ని ప్రదర్శించిందని సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కుట్రకోణం వెలికితీయాలంటూ లోక్‌సభలో విపక్షం వాకౌట్ కూడా చేసింది. అయితే మన ఒలింపిక్ అసోసియేషన్ ఆమె బరువు తగ్గడానికి ముందురోజు రాత్రంతా ఏమేం చేయాల్సి వచ్చిందో ఏకరువు పెడుతోంది. ఆ మాటెలావున్నా ఒలింపిక్స్‌లో అనుసరించే నిబంధనలు అత్యంత కఠినమైనవవి. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిబంధనల్లోని 11వ అధికరణ ప్రకారం నిర్దిష్టమైన బరువు దాటితే క్రీడాకారులను అనుమతించే ప్రసక్తే లేదంటున్నారు. మంగళవారం ఇటలీ క్రీడాకారిణి లియుజీకి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ నిబంధనలపై ఇప్పటికి రెండుసార్లు ఒలింపిక్స్ అనుభవం గల వినేశ్‌కు గానీ, నిరంతరం అదే పనిలో ఉండే మన బృందానికి గానీ అవగాహన లేకపోవటం ఆశ్చర్యకరమే. ఈ విషయంలో వినేశ్‌ను ఎవరైనా పక్క దోవ పట్టించి వుంటారా అనేది ఆమె చెబితే గానీ తెలిసే అవకాశం లేదు. ఆటపైనే సర్వశక్తులూ ఒడ్డాల్సిన క్రీడాకారులకు ఇతరేతర సమస్యలు ఎదురుకావటం విచారించదగ్గ విషయం. వినేశ్‌కు నిరుడు చేదు అనుభవాలు ఎదురుకాకపోతే కుట్ర ఆరోపణలు వచ్చి ఉండేవే కాదు. మొత్తానికి మన దేశానికి తలమానికమనదగ్గ క్రీడాకారులను ఎలా గౌరవించుకోవాలో, ఎంత అపురూపంగా చూసు కోవాలో తాజా ఉదంతం తెలియజెబుతోంది. దీన్నుంచి గుణపాఠం నేర్వగలిగితేనే అంతర్జాతీయ క్రీడా యవనికపై మనం తళుకులీనగలమని గ్రహించాలి. రాజకీయ సంకెళ్ల నుంచి క్రీడా వ్యవస్థలను విముక్తం చేయాలి. -
రసవత్తరం..రెట్టించిన ఉత్సాహం
సాక్షి, నెట్వర్క్/అమరావతి: ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలు రాష్ట్రవ్యాప్తంగా రసవత్తరంగా జరుగుతున్నాయి. యువకులు రెట్టించిన ఉత్సాహంలో పోటీల్లో పాల్గొంటున్నారు. దీంతో రాష్ట్రానికి సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్లు ఉత్సాహంగా ఉంది. యువత బ్యాటు, బంతి పట్టుకుని మైదానాల వైపు పరుగులు పెడుతున్నారు. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం క్రీడల పట్ట ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో క్రీడా రంగం పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్న వారంతా మ్యాచ్‌లు తిలకించేందుకు మైదానాలకు క్యూ కడుతున్నారు. ఐదో రోజు శనివారం 6,386 గ్రామ వార్డు సచివాలయాల్లో షెడ్యూల్ ప్రకారం పోటీలు నిర్వహించాల్సి ఉండగా 6373 సచివాలయాల్లో పోటీలు జరిగాయి. 3,23,781 మంది ప్రేక్షకులు ఆటల పోటీలను తిలకించారు. మొత్తంగా 15 వేల గ్రామ వార్డు సచివాలయాలకుగానూ 14,690 చోట్ల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. అనంతపురం విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ’ఆడుదాం ఆంధ్ర’ కు సెలవు అయినప్పటికీ కొన్నిచోట్ల రీ షెడ్యూల్ మ్యాచ్‌లు పూర్తి చేయనున్నారు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. తిరుపతి జిల్లాలో క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. కబడ్డి, క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం, పెనుమూరు మండలాల్లో బ్యాడ్మింటన్ పోటీలు ముగిసాయి. నగరి, పుంగనూరు, కుప్పం, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో క్రీడలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ క్రీడలను మండల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని 283 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 467 మైదానాల్లో క్రీడాపోటీలు జరిగాయి. జిల్లాలో 791 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 10,151 మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనగా, 33,639 మంది ప్రేక్షకులు పోటీలను వీక్షించారు. 719 మంది ప్రజాప్రతినిధులు పోటీలను ప్రారంభించారు. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడలను నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో పోటీలు చురుగ్గా జరుగుతున్నాయి. కాకినాడ జిల్లా రాజా కళాశాల మైదానంలో జరుగుతున్న క్రీడలను శాప్ ఎండి ధ్యాన్‌చంద్ పరిశీలించారు. కడపలో మైదానాల వైపు క్యూ.. మెగా క్రీడా టోర్నమెంట్లో భాగంగా కడపలో క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఖోఖో క్రీడాంశాల్లో నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయ పోటీల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో నిర్వహించిన పోటీలను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి బ్యాడ్మింటన్ అంతర్జాతీయ అంపైర్ ఎస్.జిలానీబాషా ప్రారంభించారు. వివిధ మండలాల్లో పోటీలను ఎంపీడీఓలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు పర్యవేక్షించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉత్సాహపూరిత వాతావరణంలో క్రీడలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని 535 సచివాలయాల పరిధిలో శనివారం 864 మ్యాచ్‌లు నిర్వహించగా 10 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడలను తిలకించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దాదాపు 25 వేల మంది వరకు క్రీడలను తిలకించినట్టు జిల్లా చీఫ్ కోచ్ డి.దుర్గారావు చెప్పారు. -
ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఆదాయం 35 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 క్రికెట్ టోర్నమెంటు సీజన్లో ఫ్యాంటసీ స్పోర్ట్స్ విభాగం ఆదాయం రూ. 2,900–3,100 కోట్లకు చేరనుంది. గతేడాది సీజన్‌తో పోలిస్తే 30–35 శాతం పెరగనుంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటెజీ కన్సల్టెంట్స్ ఈ విషయాలు వెల్లడించింది. గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై 6.5–7 కోట్ల మంది యూజర్లు లావాదేవీలు జరపవచ్చని అంచనా వేసింది. గత 4–5 ఏళ్లుగా ఫ్యాంటసీ స్పోర్ట్స్ యూజర్ల సంఖ్య ఏటా 20% మేర పెరుగుతుండగా, ఈ ఏడాది 20–30% స్థాయిలో పెరగవచ్చని సంస్థ పార్ట్నర్ ఉజ్వల్ చౌదరి తెలిపారు. ప్రతి యూజరుపై ఆదాయం గత ఐపీఎల్ సీజన్లో రూ. 410గా ఉండగా ఈ సీజన్లో రూ. 440కి చేరవచ్చని పేర్కొన్నారు. మార్కెటింగ్‌పై గణనీయంగా ఖర్చు చేస్తుండటంతో ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌లపై అవగాహన పెరుగుతోందని చౌదరి చెప్పారు. ‘నిబంధనలు, జీఎస్టీపై స్పష్టత వచ్చింది. గూగుల్ కూడా తమ ప్లేస్టోర్‌లో ప్రయోగాత్మకంగా కొన్ని ఫ్యాంటసీ ప్లాట్‌ఫామ్‌లను అనుమతిస్తుండటం మరో సానుకూలాంశం. ఇవన్నీ కూడా భారత్‌లో ఈ స్పోర్ట్స్‌కు అనుకూలమైన పరిణామాలే‘ అని పేర్కొన్నారు. పైలట్ ప్రోగ్రాం కింద డ్రీమ్11, మై11సర్కిల్, ఎంపీఎల్ రమ్మీ, ఫ్యాంటసీ క్రికెట్ లాంటి కొన్ని ప్లాట్‌ఫామ్‌లను గూగుల్ తమ ప్లేస్టోర్‌లో అనుమతించింది. మార్చి 31తో ప్రారంభమైన ఐపీఎల్ 2023 క్రికెట్ టోర్నీ.. మే నెలాఖరు వరకు కొనసాగనుంది. రెడ్‌సీర్ గణాంకాల ప్రకారం.. ఏడాది మొత్తం మీద ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు వచ్చే ఆదాయంలో ఐపీఎల్ సీజన్ వాటా 35–40% ఉంటుంది. -
రూ. 10 వేల కోట్లకు టీవీ స్పోర్ట్స్ మార్కెట్
న్యూఢిల్లీ: టీవీ స్పోర్ట్స్ మార్కెట్ 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 9,830 కోట్లకు చేరనుంది. అలాగే స్పోర్ట్స్ డిజిటల్ ఆదాయం రూ. 4,360 కోట్ల స్థాయిని తాకనుంది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ, ఇండియా బ్రాడ్‌కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంచనాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం టీవీ స్పోర్ట్స్ మార్కెట్ రూ. 7,050 కోట్లుగాను, డిజిటల్ మార్కెట్ ఆదాయం రూ. 1,540 కోట్లుగా ఉంది. ఐపీఎల్ వంటి టోర్నీలతో దేశీయంగా స్పోర్ట్స్ వ్యూయర్షిప్లో క్రికెట్ అగ్రస్థానంలో కొనసాగుతోండగా.. కబడ్డీ, ఫుట్బా ల్, ఖో–ఖో వంటి క్రికెట్‌యేతర ఫ్రాంచైజీ ఆధారిత ఆటలకు కూడా క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో భారత్‌లో స్పోర్ట్స్ వ్యూయర్షిప్ 72.2 కోట్లుగా నమోదైంది. ఏడాది మొత్తం మీద చూస్తే కోవిడ్ పూర్వం (2019లో) నమోదైన 77.6 కోట్ల వ్యూయర్షిప్ను దాటేసే అవకాశాలు ఉన్నాయని నివేదిక అంచనా వేసింది. ఓటీటీ ఊతం..: ఎక్కడైనా, ఎప్పుడైనా చూసుకునే సౌలభ్యం కారణంగా ఓటీటీ (ఓవర్–ది–టాప్) ప్లాట్‌ఫామ్‌లపై స్పోర్ట్స్ వ్యూయర్షిప్ పెరుగుతోంది. అడ్వర్టయిజర్లు కూడా డిజిటల్ మాధ్యమంపై ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ పెరుగుతుండటం స్పోర్ట్స్‌కి లాభించనుంది. అయితే, గడిచిన కొన్నేళ్లుగా డిజిటల్ వినియోగం పెరుగుతున్నా.. ఇప్పటికీ టీవీ స్పోర్ట్స్ మార్కెట్ ఆధిపత్యమే కొనసాగుతోందని నివేదిక తెలిపింది. మధ్య నుండి దీర్ఘకాలికంగా ఇది .. మొత్తం డిజిటల్ స్పోర్ట్స్ మార్కెట్‌కి రెండింతల స్థాయిలో ఉంటుందని పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► స్పోర్ట్స్ డిజిటల్ ఆదాయం ఏటా 22 శాతం మేర వృద్ధి చెందుతోంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది మూడు రెట్లు పెరగనుంది. టీవీ స్పోర్ట్స్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7 శాతం మేర వృద్ధి చెందుతోంది. ► టీవీల వినియోగం పెరిగే కొద్దీ స్పోర్ట్స్ సబ్స్క్రిప్షన్ ఆదాయాలకు ఊతం లభించవచ్చని అంచనా. బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అంచనాల ప్రకారం 2020లో 21 కోట్ల కుటుంబాల్లో టీవీలు ఉన్నాయి. సుమారు 90 కోట్ల మంది వీక్షిస్తున్నట్లు అంచనా. టీవీల వినియోగం ఎక్కువగానే ఉన్నప్పటికీ వాటిలో స్పోర్ట్స్ కార్యక్రమాల వ్యూయర్షిప్ మాత్రం ఇంకా భారీ స్థాయిలో లేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మొత్తం టీవీ కార్యక్రమాల వీక్షణలో స్పోర్ట్స్ వాటా 10 శాతంగా ఉండగా భారత్‌లో ఇది 3 శాతంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో వృద్ధికి మరింత ఆస్కారముంది. భారతీయ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపిస్తుండటంతో ఆయా ఈవెంట్లను టీవీల్లో చూసేందుకు వీక్షకుల్లో ఆసక్తి పెరగవచ్చు. ► భారత్‌లో స్పోర్ట్స్‌కి సంబంధించి క్రికెట్ ఆధిపత్యమే కొనసాగుతోంది. ఐపీఎల్ సీజన్ అత్యంత ప్రభావవంతంగా ఉంటోంది. 2022లో 44వ వారం వరకూ 16,217 గంటల మేర లైవ్ క్రికెట్ కంటెంట్ టెలికాస్ట్ అయ్యింది. 2021లో ఇది 15,506 గంటలుగా నమోదైంది. పరిమాణంపరంగానూ అలాగే విస్తృతిపరంగాను ఇతరత్రా ఏ క్రీడలు కూడా క్రికెట్‌కు దరిదాపుల్లో లేవని నివేదిక పేర్కొంది. అయితే, కబడ్డీ వంటి క్రికెట్‌యేతర స్పోర్ట్స్‌ను చూడటం కూడా క్రమంగా పెరుగుతోందని వివరించింది. దీంతో ఏడాది పొడవునా ఏదో ఒక క్రీడల కార్యక్రమం వీక్షకులకు అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొంది. -
ఆధునిక సదుపాయాలతోనే క్రీడా రంగం అభివృద్ధి
సాక్షి, అమరావతి: క్రీడా రంగంలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన, ప్రోత్సాహంతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి వాణి మోహన్ అన్నారు. గుజరాత్లో జరుగుతున్న 36వ జాతీయ క్రీడలను శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎండీ ప్రభాకర్ రెడ్డితో కలిసి తిలకించారు. అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్ పట్టణాల్లో పర్యటించి క్రీడా మైదానాలు, గ్యాలరీల నిర్మాణం, మల్టీ పర్పస్ స్టేడియాలు, శిక్షణ కేంద్రాలను పరిశీలించారు. మహాత్మ మందిర్‌లో జూడో, బాక్సింగ్, ఐఐటీ గాంధీనగర్‌లో జరిగిన సాఫ్ట్ బాల్, సబర్మతి రివర్ ఫోర్ట్‌లో జరిగిన కానాయింగ్, సాప్ట్ టెన్నిస్, మల్లకంబ్ క్రీడలను వీక్షించి, క్రీడాకారులను ప్రోత్సహించారు. ఏపీ ప్రభుత్వం క్రీడా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ఏపీని అంతర్జాతీయ క్రీడా వేదికగా తీర్చిదిద్దుతామని తెలిపారు. శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు స్పోర్ట్స్ క్లబ్‌లను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. పలువురు జాతీయ పోటీల విజేతలకు మెడల్స్ బహూకరించారు. -
క్రీడా బడ్జెట్లో రూ. 230 కోట్లు కోత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశ క్రీడా రంగం కుదేలైన వేళ బడ్జెట్లో క్రీడల ప్రాధాన్యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తగ్గించారు. సోమవారం 2021–22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆమె క్రీడా బడ్జెట్లో రూ. 230.78 కోట్లు కోత విధిం చారు. గతేడాది క్రీడల కోసం రూ. 2826.92 కోట్లు కేటాయించగా... ఈసారి ఆ మొత్తాన్ని రూ. 2596.14కోట్లతో సరిపెట్టారు. ► మరోవైపు మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి సైతం బడ్జెట్లో ప్రాధాన్యం భారీగా తగ్గింది. గతేడాది రూ. 890.42 కోట్లుగా ఉన్న ఈ మొత్తాన్ని ఈ ఏడాదికి గానూ రూ. 657.71 కోట్లకు కుదించారు. దీంతో ఏకంగా రూ. 232.71 కోట్లపై కోత పడింది. ► అయితే జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలను, క్రీడాకారులను, సంస్థలను పర్యవేక్షించే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)తోపాటు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు (ఎన్ఎస్ఎఫ్) కేంద్రం సముచిత ప్రాధాన్యాన్నిచ్చింది. బడ్జెట్ కేటాయింపులో గతేడాదితో పోలిస్తే భారీ పెంపును ప్రకటించింది. దీంతో ‘సాయ్’ నిధులు రూ. 500 కోట్లు నుంచి రూ. 660.41 కోట్లకు చేరగా... సమాఖ్యల బడ్జెట్ రూ. 245 కోట్లు నుంచి ఏకంగా రూ. 280 కోట్లకు పెరిగింది. ► క్రీడాకారులకు అందించే ప్రోత్సాహకాలను రూ. 70 కోట్ల నుంచి రూ. 53 కోట్లకు తగ్గిస్తున్నట్లుగా బడ్జెట్లో ప్రతిపాదించారు. ► జాతీయ క్రీడాభివృద్ధి నిధుల్లోనూ కత్తెర వేశారు. సగానికి సగం తగ్గించి ఈ మొత్తాన్ని రూ. 25 కోట్లుగా నిర్ధారించారు. ► కామన్వెల్త్ క్రీడల సన్నాహాల బడ్జెట్‌ను రూ. 75 కోట్లు నుంచి రూ. 30 కోట్లకు తగ్గించిన కేంద్రం... జమ్ము కశ్మీర్లో క్రీడా సదుపాయాల కల్పన నిధులు (రూ. 50 కోట్లు), జాతీయ క్రీడాకారుల సంక్షేమానికి కేటాయించే నిధుల్లో (రూ. 2 కోట్లు) ఎలాంటి మార్పుచేర్పులు చేయలేదు. ► గ్వాలియర్‌లోని లక్ష్మీబాయి జాతీయ వ్యాయామ విద్య సంస్థ బడ్జెట్‌ను యథాతథంగా రూ. 55 కోట్లుగా కొనసాగించింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థకు కేటాయించే నిధుల్ని రూ. 2 కోట్లు నుంచి రూ. 2.5 కోట్లకు పెంచింది. -
ప్రాణాలకంటే ఆటలు ఎక్కువ కాదు
కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోన్న సమయంలో క్రీడల ప్రాధాన్యత సహజంగానే వెనక్కి వెళ్లిపోయింది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడగా, ఇతర ప్రధాన ఈవెంట్లు అదే బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటప్పుడు వారు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా చేయడంలో కోచ్‌ల పాత్ర కూడా కీలకం. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా దీనినే అనుసరిస్తున్నారు. కరోనా విపత్కర స్థితిని అందరూ సమష్టిగా ఎదుర్కోవడం ముఖ్యమని చెబుతున్నారు. హైదరాబాద్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ క్వారంటైన్ ఇటీవలే ముగిసింది. అయితే లాక్డౌన్ కారణంగా తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన గోపీచంద్... తాజా పరిణామాలను విశ్లేషించారు. ఒక క్రీడాకారుడికి టోర్నీలు ప్రాధాన్యతాంశమే అయినా ప్రాణాలకంటే ఎక్కువేమి కాదని ఆయన అన్నారు. గోపీచంద్ ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... లాక్డౌన్ ప్రభావం... వ్యక్తిగతంగా చూస్తే దేవుని దయవల్ల లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడని వారిలో నేనూ ఉన్నాను. మధ్యతరగతి వారికి కూడా ఎలాగో గడిచిపోతుంది. అయితే చేతుల్లో డబ్బులు ఉండని రోజూవారీ శ్రామికులు, రైతు కూలీలు నిజంగా తీవ్ర సమస్యలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఉండే వీరిని ఆదుకోవడం మన బాధ్యత. తొందరలోనే అంతా సాధారణంగా మారిపోతే సమస్య తీరుతుంది. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నా. యోగా, ధ్యానం చేస్తూ నా ఫిట్నెస్ను కాపాడుకునే పనిలో ఉన్నా. ఆటగాళ్లతో కూడా మాట్లాడుతున్నా. నాకు లభించిన ఈ విరామాన్ని ఎక్కువ భాగం ఉపయోగించుకుంటున్నా కాబట్టి లాక్డౌన్ గురించి ఫిర్యాదేమీ లేదు. ఆటగాళ్లు ఏం చేస్తున్నారంటే... ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా వారందరికీ అందుబాటులోనే ఉన్నా. మా ఫిట్నెస్ ట్రైనర్ దినాజ్ వీడియో కాల్ ద్వారా వారందరికీ రోజుకు రెండుసార్లు ఫిట్నెస్ పాఠాలు ఇస్తుంది. దానిని అందరూ అనుసరిస్తారు. ఇక చాలా మంది షట్లర్లు తమ కెరీర్లో ఎప్పుడో గాయాలకు గురై విరామం తీసుకోవాల్సి వస్తూనే ఉంటుంది. దీనిని కూడా అలాంటి సుదీర్ఘ విరామంగానే భావించాలి. జూలై వరకు టోర్నీల రద్దుపై... వచ్చే మూడు నెలల పాటు ఎలాంటి టోర్నీలు ఉండవని బీడబ్ల్యూఎఫ్ స్పష్టం చేసేసింది. అయితే అసలు ఈ లాక్డౌన్ ఎంత కాలం కొన సాగుతుందో, ఆ తర్వాత పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో చూడాలి. ఆ తర్వాతే ఆట గురించి ఆలోచించవచ్చు. ఒలింపిక్స్ సన్నాహాలపై... ఆందోళన అనవసరం. ఒలింపిక్స్ కొన్ని నెలలకు వాయిదా పడితే ఆటగాళ్ల ప్రాక్టీస్ గురించి ఆలోచించాల్సి వచ్చేది. అయితే ఏడాది పాటు వాయిదా పడ్డాయి కాబట్టి వాటికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు ప్రపంచ వ్యా ప్తంగా ఆటగాళ్లందరి పరిస్థితి ఇలాగే ఉంది కాబట్టి ఎవరికీ ప్రత్యేక ప్రయోజనం లేదు. ప్రస్తు తం మన, మన కుటుంబసభ్యుల, మిత్రుల, దేశప్రజల ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యం. క్రీడల గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు. కరోనా సమయంలో టోర్నీలపై... ఆల్ ఇంగ్లండ్ టోర్నీని నిర్వహించడంపై బీడబ్ల్యూఎఫ్‌ను చాలా మంది విమర్శించారు. ఇందులో కొంత వాస్తవం ఉంది. నిజాయితీగా చెప్పాలంటే వారు చివరి క్షణం వరకు సాగదీసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఇంగ్లండ్‌లో పరిస్థితి చూస్తుంటే మేం సరైన సమయంలో అక్కడి నుంచి బయట పడ్డామనిపిస్తోంది. ఒలింపిక్స్‌కు అర్హత అంశంపై... మనం అనుకుంటున్నంత తొందరగా పరిస్థితులు మెరుగుపడవని నా అభిప్రాయం. అయితే పరిస్థితులను సానుకూలంగా చూస్తే మీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టమని మాత్రమే ఆటగాళ్లకు చెబుతున్నా. చాలా మంది మాకు కుటుంబంతో గడిపే సమయం దొరకడం లేదంటూ ఫిర్యాదు చేసేవారు. ఇప్పుడు దానిని ఉపయోగించుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నది క్రీడలకంటే పెద్ద సమస్య. అది ఏ దేశాన్ని వదిలిపెట్టడంలేదు. ఎవరూ ఊహించనిది. ఎవరి చేతుల్లోనూ లేనిది. కాబట్టి అన్నీ తర్వాత చేసుకోవచ్చు. ఒకసారి క్వాలిఫయింగ్ ప్రమాణాలు ఏమిటో తెలిస్తే అప్పుడు ప్రణాళిక రూపొందించుకోవచ్చు. చేదు గుళికలా భరించాల్సిందే.... ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ విపత్తు ప్రభావం రాబోయే రోజుల్లో ప్రతీ రంగంపై ఉంటుంది. క్రీడారంగం మినహాయింపు కాదు. ఆర్థికంగా చాలా మంది దీని బాధితులుగా మారతారు. అందరికీ ఇది కఠిన సమయం. ఇలాంటి సమయంలోనే మానసికంగా కూడా దృఢంగా మారాల్సి ఉంటుంది. క్రీడా రంగానికి కూడా భారీ నష్టం జరుగుతుందనేది వాస్తవం. దీంతో సంబంధం ఉన్న అనేక మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. లేదా జీతాల్లో కోత పడవచ్చు. దీనిని అందరూ అర్థం చేసుకోవాల్సిందే. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో ఈ ఆరు నెలల కాలాన్ని లెక్కలోంచి తీసేయాలి. గత వందేళ్లలో ఇలాంటి పరిస్థితి చూడలేదు. దీనిని ఎదుర్కోవడం అందరికీ కష్టంగా మారింది. అయితే చేదు గుళికలా దీనిని భరించక తప్పదు. త్వరలోనే అంతా మెరుగుపడాలని కోరుకుందాం. -
ఏపీ స్క్వాష్ రాకెట్స్ సంఘం అధ్యక్షునిగా ఎంపీ విజయసాయిరెడ్డి
విజయవాడ స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ స్క్వాష్ రాకెట్స్ సంఘం అధ్యక్షునిగా ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్లో మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ రెడ్డి, కోశాధికారిగా ఎ.మహేష్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్కే పురుషోత్తంతో పాటు 12 జిల్లాల నుంచి అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికైన కార్యవర్గం 2023 వరకు కొనసాగుతుంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎంపీగా రాజ్యసభలో తన వాణిని ధాటిగా వినిపించే ఎంపీ వి.విజయసాయిరెడ్డి స్పోర్ట్స్ రంగంలో రావడం శుభపరిణామం అని పురుషోత్తం పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను విజయసాయిరెడ్డి తీసుకోవాలని ఆకాంక్షించారు. -
ఆటలే ఆరోప్రాణం
సాక్షి, రాజమండ్రి : క్రీడా రంగంలో ఆయనొక నిత్య విద్యార్థి. తాను నేర్చుకుంటూనే ఉన్నారు. ఇతరులకు నేర్పే మార్గాలను నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నారు. ఆయన వయసు ప్రస్తుతం 58 సంవత్సరాలు. క్రీడలే సర్వస్వంగా జీవిస్తున్న ఆయన నేటి యువతరానికి ఓ స్ఫూర్తి ప్రదాత. ఆయన పేరు సుంకర నాగేంద్ర కిషోర్. తండ్రి సుంకర భాస్కరరావు ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. తండ్రి ఆదర్శంగా చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకున్న నాగేంద్ర కిషోర్ టేబుల్ టెన్నిస్ క్రీడలో రాణించారు. ఆ క్రీడలో వివిధ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాల పంటలు పండించిన సుంకర క్రీడల కోటాలో భారత ఆహార సంస్థలో ఉద్యోగం సంపాదించారు. ఆ సంస్థ టీటీ జట్టు సభ్యునిగా పలు టోర్నీల్లో పాల్గొన్నారు. గత ఏప్రిల్‌లో ఉద్యోగం నుంచి రిటైరైనా క్రీడారంగంలో కృషి నుంచి విరమించలేదు. తండ్రి పేరుతో దానవాయిపేటలో సుంకర భాస్కరరావు క్రీడా పరిశోధనా కేంద్రాన్ని, ఇంటి వద్దే తల్లి రాఘవమ్మ పేరుతో టీటీ శిక్షణ, అభివృద్ధి కేంద్రాన్ని స్థాపించి దాని ద్వారా విద్యార్థులు, యువతలో క్రీడా సామర్థ్యానికి సానబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. క్రీడలు చదువులకు అడ్డంకి కాదని, శారీరక, మానసిక, జీవన వికాసాలకు దోహదపడతాయని నిరూపించే దిశగా ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచీ క్రీడాసక్తి రాజమండ్రిలో 58 సంవత్సరాల క్రితం జన్మించిన కిషోర్ గాంధీపురం మున్సిపల్ పాఠశాల, నివేదిత కిషోర్ పాఠశాలల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్లో చదివిన అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ చదివారు. ఇంటర్ వరకూ వాలీబాల్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో అన్ని స్థాయిల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. పదో తరగతి నుంచే టీటీపై మరింత మక్కువ చూపుతూ డిగ్రీ తర్వాత ఆ క్రీడ పైనే దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర, అంతర్ యూనివర్సిటీ స్థాయి టోర్నమెంట్లలో పాల్గొని పలు పతకాలు సాధించారు. భారత ఆహార సంస్థలో ఉద్యోగం సంపాదించాక ఆ సంస్థ సౌత్‌జోన్ టీం తరఫున 30 ఏళ్లు వివిధ టోర్నమెంట్లలో పాల్గొన్నారు. బీఎస్సీ విద్యార్హతకు తోడు ఇప్పటికే ఎంబీఏ కూడా పూర్తి చేసిన కిషోర్ కో ఆపరేటివ్, రూరల్ స్టడీస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంటు, పబ్లిక్ రిలేషన్స్ వంటి విభాగాల్లో డిప్లమోలు చేశారు. ప్రస్తుతం ‘సొసైటీ ఓరియంటెడ్ పార్టిసిపేటివ్ రీసెర్చి’ పేరుతో క్రీడలను సామాజిక అవ సరం గా అన్వయించేందుకు ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ డి.లలితారాణి పర్యవేక్షణలో పరిశోధన చేస్తూనే ఎంఏ సైకాలజీ చదువుతున్నారు. ఘనత వహించిన క్రీడా కుటుంబం కిషోర్ తండ్రి భాస్కరరావు, ఆయన ఐదుగురు సోదరులు జాతీయస్థాయిలో రాణించిన ఫుట్‌బాల్ ఆటగాళ్లు. భాస్కరరావు ‘ఆంధ్ర రాష్ట్ర క్రీడా పితామహుడు’గా బిరుదు పొందారు. 1978లో ఇండియా- స్వీడన్ల మధ్య అంతర్జాతీయ మహిళా ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహించి రాజమండ్రికి ఖ్యాతి తెచ్చారు. వివిధ దేశాల ఫుట్‌బాల్ టీంలను ఈ అన్నదమ్ములు మట్టి కరిపించి దేశానికి పతకాలు పండించారు. యువకుల్లో క్రీడా స్ఫూర్తి పెంపు, మానవ క్రీడా వనరుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు కిషోర్ తెలిపారు. ఇందుకోసం ఏడేళ్ల లోపు విద్యార్థుల్లో క్రీడా సామర్థాన్ని సూచించే స్పోర్ట్స్ ఇన్వెన్షన్ కార్డులు, క్రీడలకు అవసరమైన శారీరక సంసిద్ధత యువత, విద్యార్థుల్లో ఏ మేరకు ఉన్నదీ ధృవీకరిస్తూ స్పోర్ట్స్ అసెస్మెంటు కార్డులు, వారి ఆరోగ్య ప్రమాణాలను సూచి స్తూ హెల్త్ కాన్షస్ కార్డులు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇందుకు ప్రత్యేక పరీక్షలు, తర్ఫీదు నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ వైద్యుడు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ప్ర శాంతి నర్సింగ్ హోం నిర్వాహకులు డాక్టర్ సీవీ ఎస్ శాస్త్రిల సహకారంతో క్రీడాపరమైన కార్యక్రమాలు చేపడుతున్నానని చెప్పారు. -
ఆటలు.. కెరీర్‌కు రాచబాటలు
నేడు కెరీర్లో ఎదిగేందుకు ఆటలు మంచి మార్గంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొలువులు సాధించేందుకు క్రీడలు దారి చూపుతున్నాయి. ప్రభుత్వాలు కూడా క్రీడాకారులకు భారీ నజరానాలు అందిస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది క్రీడలవైపు దృష్టి సారిస్తున్నారు. తల్లిదండ్రుల దృక్పథంలోనూ మార్పు వస్తోంది. తమ చిన్నారులను ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో క్రీడల శిక్షకులు, ఇతర సిబ్బంది అవసరం నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సిటీలో, దేశంలో స్పోర్ట్స్ సంబంధిత కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీలు, అర్హతలు, అవకాశాలపై ఫోకస్.. అవకాశాలెన్నో ఆటగాళ్లను ఫిట్‌గా ఉండేలా చూసే ఫిట్నెస్ ట్రైనర్, గాయాలబారిన పడితే సేవలందించే ఫిజియో థెరపిస్ట్, ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యాన్ని పెంపొందించే స్పోర్ట్స్ సైకాలజిస్ట్, ఒత్తిడిని ఎదుర్కోవడానికి దారిచూపే యోగా ట్రైనర్, సరైన ఆహారం తీసుకునేలా సూచనలిచ్చే న్యూట్రిషనిస్ట్, క్రీడాకారుల వ్యవహారాలు పర్యవేక్షించే స్పోర్ట్స్ మేనేజర్, ఎప్పటికప్పుడు క్రీడా రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీని విశ్లేషించే స్పోర్ట్స్ టెక్నాలజిస్ట్, వివిధ క్రీడల్లో ప్రావీణ్యం కల్పించే కోచ్, స్పోర్ట్స్ మసాజ్ స్పెషలిస్ట్, ఎక్సర్‌సెజైస్ స్పెషలిస్ట్.. ఇలా ఎన్నో ఉద్యోగావకాశాలు క్రీడా రంగంలో యువతకు అందుబాటులో ఉన్నాయి. కోర్సులు - స్పెషలైజేషన్లు క్రీడలంటే మక్కువ.. క్రీడాంశాలను కెరీర్‌గా ఎంచుకోవాలనేవారికి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు పలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సర్టిఫికెట్ కోర్సులు మొదలుకుని డిప్లొమా, పీజీ డిప్లొమా, యూజీ, పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎంఫిల్, పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్ - పీహెచ్డీ, ఎంబీఏ వంటి కోర్సులను దేశంలో వివిధ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఈ కోర్సులను అందించడంలో గ్వాలియర్‌లో ఉన్న లక్ష్మీబాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు మంచిపేరుంది. ఇది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలో ఏర్పాటైన సంస్థ. దీంతోపాటు పాటియాలాలో ఉన్న నేతాజీ సుభాశ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా వివిధ కోర్సులను అందించడంలో ప్రఖ్యాతి పేరుగాంచింది. ఇవేకాకుండా మరెన్నో విద్యా సంస్థలు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. స్పెషలైజేషన్ల విషయానికొస్తే ఎక్సర్సైజ్ ఫిజియాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, స్పోర్ట్స్ బయోమెకానిక్స్, ఫిట్నెస్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ ఇంజూరీస్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ కోచింగ్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ , యోగా, స్పోర్ట్స్ టెక్నాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ మసాజ్, లైఫ్‌గార్డ్స్ అండ్ పూల్ స్విమ్మింగ్, గ్రౌండ్ మేనేజ్మెంట్ వంటివి అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల వ్యవధి ఏడాది, యూజీ కోర్సుల వ్యవధి మూడేళ్లు/నాలుగేళ్లు, పీజీ కోర్సుల వ్యవధి రెండేళ్లు. నగరంలో పలు ఫిట్నెస్ స్టూడియోలు, జిమ్‌లు.. ఫిట్నెస్ సంబంధిత ఏరోబిక్స్, ఫిజియోమసాజ్, వెయిట్ రిడక్షన్, యోగా, మెడిటేషన్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తుండడంతోపాటు.. సర్టిఫికేషన్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో పీఈసెట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో యూజీడీపీఈడీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతిఏటా ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్టును నిర్వహిస్తారు. యూజీడీపీఈడీ వ్యవధి రెండేళ్లు, బీపీఈడీ వ్యవధి ఏడాది. అర్హత: యూజీడీపీఈడీకి ఇంటర్మీడియెట్, బీపీఈడీకి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక: శారీరక సామర్థ్య పరీక్ష, ఏదైనా క్రీడలో ప్రతిభ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. వేతనాలు మనదేశంలో క్రీడలంటే నిన్నమొన్నటి వరకు క్రికెట్ మాత్రమే. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఆర్చరీ, షూటింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, రెజ్లింగ్, బాక్సింగ్, చెస్, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు ఆదరణ పెరుగుతోంది. స్పోర్ట్స్ మేనేజర్లకు ప్రారంభంలో నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు వేతనాలు ఉంటాయి. క్రీడా శిక్షకులు, సైకాలజిస్ట్లకు మొదట రూ.15,000తో కెరీర్ ఆరంభమవు తుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి మరింత ఆదాయం పొందొచ్చు. రెండేళ్ల అనుభవం, మంచి నైపుణ్యాలు ఉంటే సొంతంగా శిక్షణా సంస్థను కూడా ఏర్పాటు చేసుకోవ చ్చు. ఫిజియో థెరపిస్ట్‌లు, న్యూట్రిషనిస్ట్‌లు ప్రారంభంలో రూ.25,000 వేతనం అందుకోవచ్చు. ఈ రంగంలో మంచి పేరు సాధిస్తే రూ.లక్షల్లో ఆదాయం గడించొచ్చు. కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీలు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ వెబ్సైట్: www.andhrauniversity.edu.in ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వెబ్సైట్: www.nagarjunauniversity.ac.in జేఎన్టీయూ - కాకినాడ కోర్సు: ఎంఎస్ హెల్త్ సైన్స్ అండ్ స్పోర్ట్స్ టెక్నాలజీ వ్యవధి: రెండేళ్లు అర్హత: ఎంబీబీఎస్/బీయూఎంఎస్/బీఎన్‌వైఎస్/బీఏఎంఎస్/బీహెచ్ఎంఎస్/బీపీటీ/ఎంపీటీ ఉత్తీర్ణత. వెబ్సైట్: www.jntuk.edu.in ప్రవేశం ప్రవేశం ఆయా యూనివర్సిటీల నియమ నిబంధనల మేరకు ఉంటుంది. దాదాపు అన్ని యూనివర్సిటీలు శారీరక సామర్థ్య పరీక్ష, ఏదైనా క్రీడలో ప్రావీణ్యం, రాతపరీక్ష ఆధారంగా క్రీడాకారులకు ప్రవేశం కల్పిస్తున్నాయి. గేమ్స్ అడ్డా.. సిటీ స్పోర్ట్స్ కోర్సులను అభ్యసించినవారికి ఎన్నో అవకాశాలున్నాయి. నగరంలో క్రికెట్, చెస్, టెన్నిస్, బ్యాడ్మింటన్, గోల్ఫ్, పోలో, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో శిక్షణనిస్తున్నారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియం - యూసఫ్‌గూడ, లాల్ బహదూర్ స్టేడియం, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, జింఖానా గ్రౌండ్స్, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సానియామీర్జా టెన్నిస్ అకాడమీ మొదలైనవి ఎన్నో నగరంలో కొలువుదీరాయి. * వివిధ క్రీడలు, క్రీడా పరికరాలపై మంచి పరిజ్ఞానం ఉండాలి. * నెట్వర్కింగ్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్. * నాయకత్వ లక్షణాలు. * పరిశీలన, పరిశోధనాత్మక దృక్పథం. * నిర్ణయ సామర్థ్యాలు. * దూర ప్రాంతాలకు ప్రయాణం చేయగల సంసిద్ధత. తల్లిదండ్రుల ప్రోత్సాహమే కీలకం భారత ప్రభుత్వం పంచాయత్ యువ క్రీడ ఔర్ ఖేల్ అభియాన్ (పీవైకేకేఏ), అర్బన్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్‌లతో క్రీడలను ప్రోత్సహిస్తోంది. ప్రాథమిక విద్య దశలోనే క్రీడల్లో విద్యార్థుల భాగస్వామ్యం తప్పనిసరి చేయనుంది. కార్పొరేట్ ఉద్యోగాల ఎంపిక సమయంలోనూ గేమ్స్, స్పోర్ట్స్‌లో ప్రవేశం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. క్రీడాకారుల్లో ఉండే లీడర్షిప్, టీమ్బిల్డింగ్తో ఉద్యోగాన్ని సమర్థంగా నిర్వహించగలరని కంపెనీలు భావిస్తున్నాయి. స్కూల్ స్థాయి నుంచే పిల్లలను ఇండోర్, ఔట్‌డోర్ ఏదో ఒక ఆటకు అలవాటయ్యేలా తల్లిదండ్రులు దృష్టిసారిస్తే.. ఆరోగ్యం, కెరీర్ రెండూ బాగుంటాయి. -డాక్టర్ ఎం.వి.ఎల్.సూర్యకుమారి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్, జి. నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాల