ధిక్కారానికి ఇది మూల్యమా? | Sakshi Guest Column On Vinesh Phogat By Sagarika Ghosh | Sakshi
Sakshi News home page

ధిక్కారానికి ఇది మూల్యమా?

Published Wed, Aug 14 2024 5:24 AM | Last Updated on Wed, Aug 14 2024 12:51 PM

Sakshi Guest Column On Vinesh Phogat By Sagarika Ghosh

అభిప్రాయం

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో దేశం సాధించిన పతకాల కన్నా వినేశ్‌ ఫోగట్‌కు అక్కడ ఎదురైన అనూహ్య పరిణామం అందరినీ ఖిన్నులను చేసింది, స్వాభిమానంతో క్రీడాపెద్దలకు ఎదురొడ్డి నిలవడమే ఈ అపరాజిత చేసిన నేరమా? క్రీడా రంగం నుంచి సినీ, రాజకీయ, మీడియా రంగాల దాకా ప్రతిచోటా ప్రశ్నించే మహిళలను పితృస్వామ్య భావజాలం తొక్కేస్తూనే ఉంది.

ప్యారిస్‌లో భారత్‌ సాగించిన 2024 ఒలింపిక్‌ ప్రయాణంలో సాధించిన పతకాలను చాలా తక్కువగానే గుర్తుంచుకుంటాం. 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో కంటే ఒక పతకాన్ని తక్కువగా భారత్‌ ఈ ఒలింపిక్‌లో గెల్చుకుంది. దానికంటే ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌ వినేశ్‌ ఫోగట్‌ అందరికంటే ఎక్కువగా పతాక శీర్షికల్లోకి ఎక్కారు. ఫోగట్‌ కేవలం క్రీడాకారిణి మాత్రమే కాదు. ఒక సామాజిక పురోగతికి, కట్టుబాట్ల నుండి విముక్తికి, కఠినమైన స్వావలంబనతో కూడిన స్వతంత్ర ముద్రకు ఆమె ప్రతినిధి. 

పితృస్వామ్య అధికారాన్ని ధిక్కరించడానికి ఆమె ఏమాత్రం భయపడదు. దాడిని ఎదుర్కొనేందుకు భయపడదు, గట్టిగా అరుస్తూ, వీధిలో నిరసన వ్యక్తం చేయడానికి, తన లక్ష్యం కోసం తనను తాను పణంగా పెట్టడానికి ఆమె సిద్ధంగా ఉంది. కానీ తిరుగుబాటు చేసే ఇలాంటి మహిళలపై భారతీయ సామాజిక విధానాలు విరుచుకుపడు తున్నాయి. బలీయమైన వ్యవస్థీకృత శక్తులు స్త్రీలను లొంగిపోవాలని బలవంతం చేస్తాయి. కానీ ధిక్కరించే స్త్రీ ధైర్యంతో కూడిన కొత్త ట్రెండ్‌ని వినేశ్‌ ఫోగట్‌ సృష్టించారు.

మారని పితృస్వామ్య భావజాలం
నిర్భయంగా ఉంటూ, కొన్నిసార్లు ప్రకాశించే, కొన్నిసార్లు కన్నీరు కార్చే ఫోగట్‌ గత కొద్ది రోజులుగా మన హృదయాలను కట్టివేశారు. ప్యారిస్‌లో ఆమెమీదే మనం దృష్టి పెట్టాం. అజేయమైన జపాన్‌  ప్రపంచ ఛాంపియన్‌ యుయి సుసాకీని ఓడించి, రెజ్లింగ్‌లో భారతదేశం మొట్టమొదటి ఒలింపిక్‌ బంగారు పతకాన్ని చేజిక్కించుకునే స్థాయికి వినేశ్‌ చేరుకున్నప్పుడు మనం సంబరాలు చేసుకున్నాం. ఆమె ఫైనల్‌కు సిద్ధమవుతున్నప్పుడు ఊపిరి పీల్చుకున్నాం. అంతు చిక్కని సాంకేతిక విషయాలపై ఆమెను అనర్హురాలిగా ప్రకటించినప్పుడు మాత్రం మనందరి ఊపిరి ఆగిపోయినంత పనయింది. 

ఫైనల్స్‌కు ముందు ఆమె గడిపిన సుదీర్ఘ రాత్రి గురించి మనం తెలుసుకున్నాము. 50 కిలోల ఫైనల్‌కు అర్హత సాధించడానికి, చివరి 100 గ్రాముల బరువు కోల్పోవడానికి ఆమె రాత్రంతా మేల్కొని ఉంది. ఒక ముద్ద తినలేదు. జాగింగ్‌
చేసింది, స్కిప్పింగ్‌ చేసింది, సైకిల్‌ తొక్కింది, ఆవిరి స్నానంతో చెమటోడ్చింది, మైకంతో బాధపడింది. బరువు తగ్గడానికి ఆమె జుత్తును కూడా కత్తిరించుకుంది. కేవలం 100 గ్రాముల బరువు అదనంగా ఉండి ఆమె చివరి తూకంలో విఫలమైనప్పుడు, 140 కోట్ల మంది భారతీయుల గుండె ఆగిపోయినంత పనయింది.

ఖచ్చితంగా మన దేశ క్రీడా వ్యవస్థ ద్వారా ఫోగట్‌కు మెరుగైన సేవలందించవచ్చు. భారతదేశ పితృస్వామ్య, వీఐపీలతో కూడిన స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ బాడీలు... క్రీడాకారులను, అథ్లెట్‌లను నిరంతరం ఎలా విఫలం చేస్తున్నాయనడానికి వినేశ్‌ ఫోగట్‌ సంఘటనే ఒక ఉదాహరణగా నిలుస్తుంది. తమను తృణీకరించడం, తమ పట్ల అమర్యాదపూర్వకంగా వ్యవహరించడం పట్ల ఫోగట్, ఆమె తోటి ఒలింపిక్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌లు తిరగబడ్డారు. ఆరుసార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికైన అప్పటి రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధినేత బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల ఆరోప ణలతో వారు వీధుల్లో నిరసన తెలపవలసి వచ్చింది. 

డబ్ల్యూఎఫ్‌ఐ నుంచి సస్పెండ్‌ అయినప్పటికీ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న బ్రిజ్‌ భూషణ్‌పై చర్య తీసుకోవడానికి మోదీ ప్రభుత్వం నిరాకరించింది. క్రీడా మంత్రిత్వ శాఖ మల్లయోధులపై గురిపెట్టి దాడులను కొనసాగించింది. బ్రిజ్‌ భూషణ్‌ బినామీ అయిన సంజయ్‌ సింగ్‌ భారత కుస్తీ సమాఖ్య అధ్యక్షుడయ్యాడు. ఫోగట్‌ మాట ఎవరూ వినలేదు. తనకు అవసరమైన వైద్యం, ఫిజియోథెరపీ అందడం లేదని ఆమె ఆరోపించారు. 

చివరికి, ఆమె ఇష్టపడే విభాగం 53 కిలోల పోటీ అయితే... 50 కిలోల విభాగంలో పోటీ చేయవలసి వచ్చింది. ఫోగట్‌కు అన్యాయం జరిగింది. ఒలింపిక్‌ పతకాల కోసం పోటీపడే వారికి తప్పనిసరిగా అన్ని సౌకర్యాలు, వైద్య సహాయం, ఉన్నత స్థాయి నిపుణుల పర్యవేక్షణను అందించాలి. కానీ తాను ప్రదర్శించిన ధిక్కారానికి ఫోగట్‌ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఈరోజు, ఫోగట్‌ గాథ చాలా కారణాల వల్ల కుస్తీ మ్యాట్‌ కంటే ముఖ్యమైనది. ఎలాంటి ఆధారాలూ లేకుండా జోక్యం చేసుకునే ప్రభుత్వం చేతిలో భారతదేశ శ్రేష్టమైన క్రీడాకారులు అనుభవిస్తున్న బాధలను అది ప్రతిబింబిస్తుంది. అది క్రీడలు లేదా ఇతర రంగాలలో అయినా, అధికారాన్ని సవాలు చేసే స్త్రీల విషయానికి వస్తే, వారు అధిరోహించడానికి ఇప్పటికీ ఒక పర్వతం అడ్డుగా ఉంది అనేదానికి ఫోగట్‌ ఒక ప్రతీక. 

ఆమె తోటి మహిళా రెజ్లర్లు, మల్లయోధుల జీవితాలు, వారి కెరీర్‌లపై పూర్తి నియంత్రణను కోరుకునే ఆధిపత్య వ్యక్తిగా అపఖ్యాతిపాలైన బ్రిజ్‌ భూషణ్‌ వంటి కరుడు గట్టిన పితృస్వామ్య ప్రతినిధి... అందరూ పురుషులతోనే కూడిన రెజ్లింగ్‌ సమాఖ్యను కైవసం చేసుకున్నాడు. 

పూర్తిగా రాజకీయాలతో అనుసంధానంలో ఉండే పురుషులు నిర్వహించే క్రీడాసమాఖ్యలు ఆధునిక క్రీడల నిర్వహణకు అత్యంత విరుద్ధం. ప్రధాన క్రీడా సంఘానికి నాయకత్వం వహించే స్థానంలో ఒక్క మహిళ కూడా ఎందుకు లేరన్నది పెద్ద ప్రశ్న. ఫోగట్‌ ఈ ఉక్కిరి బిక్కిరి అధికార ఆధిపత్యానికి వ్యతిరేకంగా తన స్వరం పెంచింది కాబట్టే మూల్యం చెల్లించుకుంది.

అయితే క్రీడలు మాత్రమే మినహాయింపుగా లేవు. ధిక్కరించే స్త్రీలు, అణచివేయలేని మహిళల పట్ల అసహనం ఇప్పుడు కార్పొరేట్‌ బోర్డ్‌రూమ్‌లు, న్యూస్‌రూమ్‌లతోపాటు రాజకీయ రంగానికి కూడా విస్తరించింది. మహిళలు, ఎంత ఎక్కువ సాధించినా, తమను తాము నిరూపించుకోవాలని వారిని నిరంతరం అడుగుతారు. వారు మగ అధికారాన్ని సవాలు చేసే ’తప్పు’ చేస్తే, వారిని వెంటనే తిప్పికొడతారు, బహిష్కరిస్తారు. లేదా దూరంగా ఉంచుతారు.

సినిమా ప్రపంచంలో కూడా, చలనచిత్ర పరిశ్రమ ప్రారంభ సంవత్సరాల్లో, మహిళా నటీనటులు ఆఫ్‌–స్క్రీన్, ఆన్‌–స్క్రీన్‌ పై ’సద్గుణ’వంతురాలైన విధేయ మహిళా ఇమేజ్‌కి అనుగుణంగా ఉండాలని భావించారు. నర్గీస్, మధుబాల, మీనా కుమారి వంటి మహిళా నటీనటులు అత్యంత విజయవంతమైన వృత్తినిపుణులు. 

వారు తమ వ్యక్తిగత జీవితాల్లో స్వయంప్రతిపత్తి కోసం పట్టుబట్టారు. కాబట్టే వారు అవిధేయ మహిళలుగా లేదా విఘాతం కలిగించే వ్యక్తులుగా కళంకిత ముద్ర పొందారు, సంప్రదాయ కుటుంబ ఆధారిత కట్టుబాటుకు వీరిని వ్యతిరేకులుగా పరిగణించారు. వెండి తెరపై ఆధునిక వ్యక్తిత్వాన్ని సృష్టించడానికి 1970లలో జీనత్‌ అమన్‌  శృంఖలాలను ఛేదించారు.

నిజానికి, ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేందుకు భారత్‌ చాలా దూరంలో ఉంది. విభిన్నంగా ఉండటానికి, తమ గుర్తింపులను వ్యక్తీకరించడానికి భయపడని, సంప్రదాయ ఆలోచనా విధానాలను సవాలు చేసే మహిళల పట్ల సంబరాలు జరుపుకోవడంలో కూడా మనం చాలా దూరం వెళ్ళాలి. ఈ విషయంలో ప్రేరణ కోసం, ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల మారథాన్‌ బంగారు పతకాన్ని, మరో రెండు డిస్టెన్స్‌ పతకాలను గెలుచుకున్న ఇథియోపియన్‌ సంతతి డచ్‌ మిడిల్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ అయిన సిఫాన్‌ హసన్‌ ను మనం చూడవచ్చు. 

హసన్‌ ఒక శరణార్థి. ఆమె నెదర్లాండ్స్‌కు చేరుకుంది. నర్సుగా శిక్షణ పొందుతున్నప్పుడు ఆమె విరామ సమయాల్లో పరిగెత్తింది. గెలుపు సాధించింది. స్త్రీలో ఉన్న ప్రతిభ, తేజస్సు, ధిక్కరించడం అనే గుణాలు సామాజిక దురాచారాలు కావు; మనం క్రీడలలో, ఇతర రంగాలలో ఛాంపియన్‌ల దేశంగా ఉండాలంటే ఇలాంటి వారిని పెంచి పోషించాలి. వారి విజయాలను చూసి పండగ చేసుకోవాలి.


సాగరికా ఘోష్‌ 
వ్యాసకర్త టీఎంసీ రాజ్యసభ ఎంపీ (‘ది ప్రింట్‌’ సౌజన్యంతో...)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement