ప్రాణాలకంటే ఆటలు ఎక్కువ కాదు | Indian Badminton Chief Coach Pullela Gopichand Interview With Sakshi | Sakshi
Sakshi News home page

ప్రాణాలకంటే ఆటలు ఎక్కువ కాదు

Published Wed, Apr 8 2020 1:48 AM | Last Updated on Wed, Apr 8 2020 5:05 AM

Indian Badminton Chief Coach Pullela Gopichand Interview With Sakshi

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోన్న సమయంలో క్రీడల ప్రాధాన్యత సహజంగానే వెనక్కి వెళ్లిపోయింది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడగా, ఇతర ప్రధాన ఈవెంట్లు అదే బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటప్పుడు వారు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా చేయడంలో కోచ్‌ల పాత్ర కూడా కీలకం. భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కూడా దీనినే అనుసరిస్తున్నారు. కరోనా విపత్కర స్థితిని అందరూ సమష్టిగా ఎదుర్కోవడం ముఖ్యమని చెబుతున్నారు.

హైదరాబాద్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టోర్నీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ క్వారంటైన్‌ ఇటీవలే ముగిసింది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన గోపీచంద్‌... తాజా పరిణామాలను విశ్లేషించారు. ఒక క్రీడాకారుడికి టోర్నీలు ప్రాధాన్యతాంశమే అయినా ప్రాణాలకంటే ఎక్కువేమి కాదని ఆయన అన్నారు. గోపీచంద్‌ ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... 

లాక్‌డౌన్‌ ప్రభావం...
వ్యక్తిగతంగా చూస్తే దేవుని దయవల్ల లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడని వారిలో నేనూ ఉన్నాను. మధ్యతరగతి వారికి కూడా ఎలాగో గడిచిపోతుంది. అయితే చేతుల్లో డబ్బులు ఉండని రోజూవారీ శ్రామికులు, రైతు కూలీలు నిజంగా తీవ్ర సమస్యలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఉండే వీరిని ఆదుకోవడం మన బాధ్యత. తొందరలోనే అంతా సాధారణంగా మారిపోతే సమస్య తీరుతుంది. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నా. యోగా, ధ్యానం చేస్తూ నా ఫిట్‌నెస్‌ను కాపాడుకునే పనిలో ఉన్నా. ఆటగాళ్లతో కూడా మాట్లాడుతున్నా. నాకు లభించిన ఈ విరామాన్ని ఎక్కువ భాగం ఉపయోగించుకుంటున్నా కాబట్టి లాక్‌డౌన్‌ గురించి ఫిర్యాదేమీ లేదు.  

ఆటగాళ్లు ఏం చేస్తున్నారంటే... 
ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారా వారందరికీ అందుబాటులోనే ఉన్నా. మా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ దినాజ్‌ వీడియో కాల్‌ ద్వారా వారందరికీ రోజుకు రెండుసార్లు ఫిట్‌నెస్‌ పాఠాలు ఇస్తుంది. దానిని అందరూ అనుసరిస్తారు. ఇక చాలా మంది షట్లర్లు తమ కెరీర్‌లో ఎప్పుడో గాయాలకు గురై విరామం తీసుకోవాల్సి వస్తూనే ఉంటుంది. దీనిని కూడా అలాంటి సుదీర్ఘ విరామంగానే భావించాలి.  

జూలై వరకు టోర్నీల రద్దుపై... 
వచ్చే మూడు నెలల పాటు ఎలాంటి టోర్నీలు ఉండవని బీడబ్ల్యూఎఫ్‌ స్పష్టం చేసేసింది. అయితే అసలు ఈ లాక్‌డౌన్‌ ఎంత కాలం కొన సాగుతుందో, ఆ తర్వాత పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో చూడాలి. ఆ తర్వాతే ఆట గురించి ఆలోచించవచ్చు.  

ఒలింపిక్స్‌ సన్నాహాలపై...
ఆందోళన అనవసరం. ఒలింపిక్స్‌ కొన్ని నెలలకు వాయిదా పడితే ఆటగాళ్ల ప్రాక్టీస్‌ గురించి ఆలోచించాల్సి వచ్చేది. అయితే ఏడాది పాటు వాయిదా పడ్డాయి కాబట్టి వాటికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు ప్రపంచ వ్యా ప్తంగా ఆటగాళ్లందరి పరిస్థితి ఇలాగే ఉంది కాబట్టి ఎవరికీ ప్రత్యేక ప్రయోజనం లేదు. ప్రస్తు తం మన, మన కుటుంబసభ్యుల, మిత్రుల, దేశప్రజల ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యం. క్రీడల గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు.  

కరోనా సమయంలో టోర్నీలపై... 
ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీని నిర్వహించడంపై బీడబ్ల్యూఎఫ్‌ను చాలా మంది విమర్శించారు.  ఇందులో కొంత వాస్తవం ఉంది. నిజాయితీగా చెప్పాలంటే వారు చివరి క్షణం వరకు సాగదీసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఇంగ్లండ్‌లో పరిస్థితి చూస్తుంటే మేం సరైన సమయంలో అక్కడి నుంచి బయట పడ్డామనిపిస్తోంది.
 
ఒలింపిక్స్‌కు అర్హత అంశంపై... 
మనం అనుకుంటున్నంత తొందరగా పరిస్థితులు మెరుగుపడవని నా అభిప్రాయం. అయితే పరిస్థితులను సానుకూలంగా చూస్తే మీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టమని మాత్రమే ఆటగాళ్లకు చెబుతున్నా. చాలా మంది మాకు కుటుంబంతో గడిపే సమయం దొరకడం లేదంటూ ఫిర్యాదు చేసేవారు. ఇప్పుడు దానిని ఉపయోగించుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నది క్రీడలకంటే పెద్ద సమస్య. అది ఏ దేశాన్ని వదిలిపెట్టడంలేదు. ఎవరూ ఊహించనిది. ఎవరి చేతుల్లోనూ లేనిది. కాబట్టి అన్నీ తర్వాత చేసుకోవచ్చు. ఒకసారి క్వాలిఫయింగ్‌ ప్రమాణాలు ఏమిటో తెలిస్తే అప్పుడు ప్రణాళిక రూపొందించుకోవచ్చు.

చేదు గుళికలా భరించాల్సిందే....
ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ విపత్తు ప్రభావం రాబోయే రోజుల్లో ప్రతీ రంగంపై ఉంటుంది. క్రీడారంగం మినహాయింపు కాదు. ఆర్థికంగా చాలా మంది దీని బాధితులుగా మారతారు. అందరికీ ఇది కఠిన సమయం. ఇలాంటి సమయంలోనే మానసికంగా కూడా దృఢంగా మారాల్సి ఉంటుంది. క్రీడా రంగానికి కూడా భారీ నష్టం జరుగుతుందనేది వాస్తవం. దీంతో సంబంధం ఉన్న అనేక మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. లేదా జీతాల్లో కోత పడవచ్చు. దీనిని అందరూ అర్థం చేసుకోవాల్సిందే. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో ఈ ఆరు నెలల కాలాన్ని లెక్కలోంచి తీసేయాలి. గత వందేళ్లలో ఇలాంటి పరిస్థితి చూడలేదు. దీనిని ఎదుర్కోవడం అందరికీ కష్టంగా మారింది. అయితే చేదు గుళికలా దీనిని భరించక తప్పదు. త్వరలోనే అంతా మెరుగుపడాలని కోరుకుందాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement