Indian badminton
-
భర్తతో కలిసి విదేశాల్లో విహరిస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ (ఫొటోలు)
-
పెళ్లి షాపింగ్ చేసిన భారత ప్రముఖ షట్లర్
భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. శ్రావ్య వర్మ అనే అమ్మాయిని శ్రీకాంత్ త్వరలో మనువాడనున్నాడు. శ్రావ్య.. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు ఆర్జీవీ బంధువని తెలుస్తుంది. శ్రీకాంత్ ఇటీవలే కాబోయే భార్యతో కలిసి పెళ్లి షాపింగ్ చేశాడు. నగరంలోని ప్రముఖ వెడ్డింగ్ కలెక్షన్ మాల్ అయిన గౌరీ సిగ్నేచర్స్లో శ్రీకాంత్, శ్రావ్య జోడీ సందడి చేశాడు. వీరిద్దరి షాపింగ్‌కు సంబంధించిన చిత్రాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ అయిన శ్రీకాంత్.. ప్రస్తుత వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో ఉన్నాడు. -
Paris Olympics 2024: భారత బ్యాడ్మింటన్ బృందం ఇదే (ఫొటోలు)
-
Swiss Open 2024: క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–10, 21–12తో భారత్‌కే చెందిన ప్రియ–శ్రుతి మిశ్రా జంటను ఓడించింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ 17–21, 16–21తో రుయ్ హిరోకామి–యునా కాటో (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. -
తామిరి సూర్య చరిష్మాకు కాంస్య పతకం
జర్మన్ ఓపెన్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తామిరి సూర్య చరిష్మా కాంస్య పతకం గెలిచింది. బెర్లిన్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–19 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో చరిష్మా 21–15, 20–22, 17–21తో కిమ్ మిన్ జీ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు చరిష్మా క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సితి జులైఖా (మలేసియా)పై... రెండో రౌండ్ లో13వ సీడ్ పిచిత్ప్రిచాసెక్ (థాయ్‌లాండ్)పై సంచలన విజయాలు సాధించింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ షట్లర్
హైదరాబాద్‌కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను ఇన్‌స్టా వేదికగా ఇవాళ (మార్చి 4) వెల్లడించాడు. 31 ఏళ్ల సాయి ప్రణీత్ అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ఎన్ని పతకాలు సాధించిపెట్టాడు. 2019లో అతను వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ అనంతరం గాయాలతో సతమతమైన ప్రణీత్.. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. ప్రణీత్ తన కెరీర్లో సింగపూర్ ఓపెన్, కెనడా ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ టైటిళ్లను సాధించాడు. కెరీర్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రణీత్.. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించలేకపోయానని బాధపడ్డాడు. ప్రణీత్‌ను భారత ప్రభుత్వం 2019లో అర్జున అవార్డుతో సత్కరించింది. ప్రణీత్ రిటైర్మెంట్ సందేశంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. View this post on Instagram A post shared by Sai Praneeth (@saipraneeth92) ప్రణీత్ తన కెరీర్ మొత్తంలో 225 విజయాలు సాధించి, 151 పరాజయాలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 46 స్థానంలో ఉన్న ప్రణీత్.. 2019లో అత్యుత్తమంగా 10వ ర్యాంక్‌కు సాధించాడు. రిటైర్మెంట్ అనంతరం ప్రణీత్ కోచ్‌గా సేవలించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. యూఎస్‌లోని నార్త్ కరోలినా క్లబ్లో అతను కోచ్‌గా సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన భారత్
భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌ను తొలిసారి కైవసం చేసుకుంది. మలేసియా వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన ఫైనల్లో (సింగిల్స్) పీవీ సింధు, అన్మోల్ ఖర్బ్ అద్భుత ప్రదర్శనతో భారత్ 3-2తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. ఈ కాంటినెంటల్ టోర్నీలో భారత్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌ల్లో (బెస్ట్ ఆఫ్ 5) సింధు, అన్మోల్తో పాటు గాయత్రి గోపీచంద్-జాలీ ట్రీసా జోడీ (డబుల్స్) విజయాలు సాధించారు. గాయం నుంచి కోలుకున్న అనంతరం తన మొదటి టోర్నీలో పాల్గొన్న సింధు.. ఫైనల్లో థాయ్ షట్లర్ సుపనిందా కతేథాంగ్‌ను కేవలం 39 నిమిషాల్లో 21-12, 21-12 తేడాతో ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆతర్వాత మూడు గేమ్‌ల పోరులో (21-16, 18-21, 21-16) గాయత్రి గోపీచంద్, జాలీ ట్రీసా జోడీ.. జోంగ్‌కోల్‌ఫామ్ కిటితారాకుల్, రవ్వింద ప్రజోంగ్‌జల్‌లను ఓడించడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం మూడు (అస్మిత చాలిహ), నాలుగు మ్యాచ్‌ల్లో (డబుల్స్) ఓటమి చవిచూసిన భారత్.. నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో గెలుపొంది, టైటిల్‌ను కైవసం చేసుకుంది. రసవత్తరంగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో 16 ఏళ్ల అన్మోల్ (472వ ర్యాంకర్).. ప్రపంచ 45వ ర్యాంకర్ పోర్న్‌పిచా చోయికీవాంగ్‌పై వరుస గేమ్‌లలో విజయం సాధించి, భారత జట్టు చారిత్రక గెలుపు భాగమైంది. -
ఏడో ర్యాంక్‌కు ఎగబాకిన ప్రణయ్.. టాప్-100లో భారత్ నుంచి ఏకంగా..!
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్–100లో భారత్ నుంచి ఏకంగా 12 మంది చోటు సంపాదించారు. తాజా ర్యాంకింగ్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ ఒక స్థానం పురోగతి సాధించి ఏడో ర్యాంక్‌కు చేరుకొని భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా లక్ష్య సేన్ (20), శ్రీకాంత్ (24), ప్రియాన్షు (28), కిరణ్ జార్జి (36), సతీశ్ కుమార్ (49), మిథున్ మంజునాథ్ (63), శంకర్ ముత్తుస్వామి (70), సమీర్ వర్మ (77), సాయిప్రణీత్ (91), మెరాబా లువాంగ్ మైస్నమ్ (93), చిరాగ్ సేన్ (99) ఉన్నారు. -
పోరాడి ఓడిన ప్రణయ్
కుమమోటో: జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ ఓటమి చవిచూశాడు. ప్రపంచ 12వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 21–19, 16–21, 19–21తో పరాజయం పాలయ్యాడు. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్ గెలిచినా ఆ తర్వాత తడబడి వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రణయ్ ఓ దశలో 4–12తో వెనుకబడినప్పటికీ పట్టువదలకుండా పోరాడి చివరకు స్కోరును 19–19తో సమం చేశాడు. అయితే చౌ తియెన్ చెన్ కీలకదశలో రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్‌కు 1,470 డాలర్ల (రూ. లక్షా 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 3600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్లో ప్రణయ్ విశేషంగా రాణించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించాడు. మలేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన ఈ కేరళ ప్లేయర్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. -
తొలి రౌండ్లోనే సాత్విక్–చిరాగ్ జోడీకి చుక్కెదురు
కుమమోటో: జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి టాప్ సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంక్ ద్వయం సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–16, 18–21, 16–21తో ప్రపంచ 21వ ర్యాంక్ జంట లూ చింగ్ యావో–యాంగ్ పో హాన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్, చిరాగ్ తొలి గేమ్ గెలిచినా ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకున్నారు. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కొడాయ్ నరోకా (జపాన్)తో లక్ష్య సేన్; లీ చెయుక్ యి (హాంకాంగ్)తో హెచ్ఎస్ ప్రణయ్; లిన్ చున్‌యి (చైనీస్ తైపీ)తో ప్రియాన్షు రజావత్ తలపడతారు. -
డాక్టర్ పుల్లెల గోపీచంద్!
బెంగళూరు: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు మరో గౌరవం దక్కింది. కర్ణాటకకు చెందిన శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. మంగళవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆయనకు ఈ పురస్కారాన్ని అందించారు. జాతీయ అభివృద్ధిలో క్రీడల ద్వారా తనదైన పాత్ర పోషించినందుకు గోపీచంద్‌ను డాక్టరేట్ కోసం ఎంపిక చేసినట్లు యూనివర్సిటీ ప్రకటించింది. గోపీచంద్‌తో పాటు మరో నలుగురు కూడా దీనిని అందుకున్నారు. -
Asian Games 2023: ఆసియా క్రీడలకు భారత బ్యాడ్మింటన్ జట్ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్లలో చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్లను ప్రకటించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–20లో ఉన్న వారిని నేరుగా ఎంపిక చేయగా... మిగతా బెర్త్‌లను ఆదివారం ముగిసిన సెలెక్షన్ ట్రయల్స్ టోర్నీ ద్వారా ఖరారు చేశారు. భారత పురుషుల జట్టు: ప్రణయ్, శ్రీకాంత్, లక్ష్య సేన్, మిథున్ మంజునాథ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల–ఎంఆర్ అర్జున్, రోహన్ కపూర్, సాయిప్రతీక్. మహిళల జట్టు: పీవీ సింధు, అష్మిత, అనుపమ, మాళవిక, గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, సిక్కి రెడ్డి. -
ఫైనల్లో సాత్విక్ – చిరాగ్
బాసెల్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి మరోసారి మేజర్ టోర్నీలో సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్–300 టోర్నీ స్విస్ ఓపెన్‌లో సాత్విక్ – చిరాగ్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఈ టోర్నీలో ఈ జంట మినహా ఇతర భారత షట్లర్లంతా ముందే నిష్క్రమించగా...వీరిద్దరు మాత్రం తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగారు. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో రెండో సీడ్ సాత్విక్ – చిరాగ్ ద్వయం 19–21, 21–17, 17–21తో మూడో సీడ్ మలేసియా జోడి ఆంగ్ యూ సిన్ – టియో ఈ యీపై విజయం సాధించింది. 69 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను కోల్పోయినా...తర్వాతి రెండు గేమ్‌లలో సత్తా చాటి భారత జంట విజయాన్ని అందుకుంది. నేడు జరిగే ఫైనల్లో చైనాకు చెందిన అన్‌సీడెడ్ జంట రెన్ జియాంగ్ యు – టాన్ ఖియాంగ్‌తో సాత్విక్ – చిరాగ్ తలపడతారు. -
థామస్ కప్ విన్నింగ్ జట్టు సభ్యుడికి గాయం.. థాయ్ ఓపెన్ నుంచి నిష్క్రమణ
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక థామస్ కప్ టైటిల్ భారత్‌కు దక్కడంలో కీలకపాత్ర పోషించిన డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి నేటి నుంచి మొదలయ్యే థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలిగింది. చిరాగ్ శెట్టి గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో థామస్ కప్ ‘హీరో’లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ బరిలో ఉన్నారు. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, సౌరభ్ వర్మ కూడా పోటీపడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
థామస్ కప్ విజయంపై పుల్లెల గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు
థామస్ కప్ 2022లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సామాన్య పౌరుల దాకా అందరూ టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నారు. టీమిండియా సాధించిన అపురూప విజయంపై చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్పందిస్తూ.. బ్యాడ్మింటన్‌కు ఈ విజయం 1983 క్రికెట్ వరల్డ్‌కప్ విజయం కంటే గొప్పదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఏమాత్రం అంచనాలు లేకుండా వరల్డ్‌కప్ బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్.. ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిస్తే.. తాజాగా కిదాంబి శ్రీకాంత్ నేతృత్వంలోని టీమిండియా సైతం 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను 3-0తో చిత్తు చేసి బ్యాడ్మింటన్‌లో 73 ఏళ్ల భారత కలను సాకారం చేసిందని అన్నాడు. 1983 వరల్డ్‌కప్ గెలిచాక భారత క్రికెట్ రూపురేఖలు ఎలా మారిపోయాయో.. థామస్ కప్ గెలుపుతో భారత బ్యాడ్మింటన్‌కు కూడా శుభ ఘడియలు మొదలయ్యాయని తెలిపాడు. థామస్ కప్ విజయం ఇచ్చిన స్పూర్తితో భారత షట్లర్లు మున్ముందు మరిన్ని సంచనాలు నమోదు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత బృందానికి నాయకత్వం వహించిన కిదాంబి శ్రీకాంత్‌ను గోపీచంద్ ప్రత్యేకంగా అభినందించాడు. చదవండి: Thomas Cup 2022: షటిల్ కింగ్స్ -
Thomas Cup 2022: ఆకాశాన మన ‘స్మాష్’...
కిడాంబి శ్రీకాంత్ అలా గాల్లోకి ఎగిరాడు... తనదైన శైలిలో ఒక క్రాస్‌కోర్ట్ స్మాష్‌ను సంధించాడు... ప్రత్యర్థి క్రిస్టీ వద్ద దానికి జవాబు లేకపోయింది... అంతే! శ్రీకాంత్ వెనుదిరిగి రాకెట్ విసిరేయగా, భారత ఆటగాళ్లంతా ఒక్కసారిగా ప్రవాహంలా కోర్టులోకి దూసుకొచ్చారు... కనీసం ప్రత్యర్థికి మర్యాదపూర్వకంగా శ్రీకాంత్ ఒక షేక్ హ్యాండ్ అన్నా ఇవ్వమంటూ రిఫరీ చెబుతున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా మన షట్లర్ల సంబరాలతో స్టేడియం హోరెత్తింది... శ్రీకాంత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు... ఆరు సూపర్ సిరీస్ టైటిల్స్ కూడా సాధించాడు... వరల్డ్ నంబర్‌వన్‌గా కూడా నిలిచాడు. లక్ష్య సేన్ 20 ఏళ్లకే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలవడంతోపాటు మూడు బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్స్ అందుకున్నాడు... హెచ్ఎస్ ప్రణయ్ ఖాతాలోనూ బీడబ్ల్యూఎఫ్ టైటిల్ ఉండగా, ఆసియా చాంపియన్‌షిప్‌లో అతను రన్నరప్... డబుల్స్‌లోనూ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఇటీవల సంచలనాలు సృష్టిస్తోంది. విడివిడిగా చూస్తే వీరంతా వేర్వేరు అంతర్జాతీయ వేదికలపై ఎన్నో ఘనతలు సాధించారు... అంతకుముందు తరంలో ప్రకాశ్ పడుకోన్, పుల్లెల గోపీచంద్ కూడా భారత బ్యాడ్మింటన్ స్థాయిని పెంచే ఆటను ప్రదర్శించారు. కానీ జట్టుగా, కలిసికట్టుగా, సమష్టిగా చూస్తే మాత్రం భారత్ ఖాతాలో భారీ విజయం లోటు ఇన్నేళ్లుగా ఉండిపోయింది. ఇన్నాళ్లకు ఆ కల నిజమైంది. ఈ చిరస్మరణీయ ఘట్టం ఒక రోజులోనో, ఒక ఏడాదిలోనే ఆవిష్కృతమైంది కాదు... గత కొన్నేళ్లుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరానికి చేరిన ప్రస్థానమిది. సాక్షి క్రీడా విభాగం భారత జట్టు థామస్ కప్ కోసం వెళ్లినప్పుడు జట్టుపై ఎలాంటి అంచనాలు లేవు... గాయాల నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న ఆటగాళ్లతో పాటు అన్ని విభాగాల్లో బలమైన ఆటగాళ్లు ఉన్న ప్రత్యర్థులను దాటి మన జట్టు ముందంజ వేయడం కష్టమనిపించింది. ఎవరి నుంచైనా ఏదైనా అద్భుత ప్రదర్శన వచ్చినా ఇతర మ్యాచ్‌లూ వరుసగా గెలిస్తే తప్ప జట్టుకు విజయం దక్కదు. అయితే ఎలాంటి ఆశలు లేకుండా పోవడమే టీమ్‌కు మేలు చేసింది. తమను ఎవరూ నమ్మని సమయంలో ఆటగాళ్లే తమను తాము నమ్మారు... వారికి కోచ్‌లు అండగా నిలిచి స్ఫూర్తిని నింపారు. జట్టు ప్రకటించిన తర్వాత టోర్నీ ఆరంభానికి ముందు భారత బృందం ‘వి విల్ బ్రింగ్ ఇట్ హోమ్’ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను తయారు చేసుకుంది. చాంపియన్‌గా నిలిచే వరకు ఇందులో ప్రతీ క్షణం స్ఫూర్తి నింపే సందేశాలే. చివరకు మన షట్లర్లు చిరస్మరణీయ విజయంతో తామేంటో చూపించారు. సెమీస్ చేరడంతోనే కనీసం కాంస్యం ఖాయం చేసుకొని మన టీమ్ టోర్నీలో తొలి పతకంతో కొత్త చరిత్ర సృష్టించింది. కానీ ఆ జోరు తుది లక్ష్యాన్ని అందుకునే వరకు ఆగలేదు. అందరూ అదరగొట్టగా... బ్యాడ్మింటన్‌కు ప్రపంచకప్‌లాంటి థామస్ కప్‌లో భారత్‌కు విజయం అందించినవారిని చూస్తే ఒక్కరి ఖాతాలోనూ ఒలింపిక్ పతకం లేదు! కానీ ఈ మెగా టోర్నీకి వచ్చేసరికి అందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనను చూపించారు. అజేయ ఆటతో శ్రీకాంత్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. లీగ్ దశలో భారత్ ఒక మ్యాచ్ ఓడినా శ్రీకాంత్ మాత్రం ఒక్కసారి కూడా నిరాశపర్చలేదు. ఇక క్వార్టర్స్, సెమీస్‌లలో ప్రణయ్ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రెండు సందర్భాల్లోనూ జట్టు 2–2తో సమంగా నిలిచిన స్థితిలో చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగే ఆటగాడిపై అపారమైన ఒత్తిడి ఉంటుంది. కానీ ప్రణయ్ ఎంతో పట్టుదలగా నిలబడ్డాడు. తన గాయాన్ని కూడా లెక్క చేయకుండా ఆడి జట్టును గెలిపించాడు. అదృష్టవశాత్తూ ఫైనల్లో అతను ఆడాల్సిన అవసరమే రాలేదు. రెండు నాకౌట్ మ్యాచ్‌లలో నిరాశపర్చిన లక్ష్య సేన్ అసలు సమరంలో సత్తా చాటాడు. ఫైనల్లో అతడు తన స్థాయిని ప్రదర్శించడం భారత్ అవకాశాలు పెంచింది. ఇక విశ్వసనీయమైన జోడీగా గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్–చిరాగ్ ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సరిగ్గా చెప్పాలంటే థామస్ కప్‌లాంటి ఈవెంట్లలో బలహీన డబుల్స్ కారణంగానే ఇన్నేళ్లుగా వెనుకబడుతూ వచ్చిన భారత్‌కు ఈ ద్వయం కారణంగా ముందంజ వేసే అవకాశం దక్కింది. ఇంతింతై వటుడింతై... థామస్ కప్‌లో భారత్ గెలవడమే కాదు, గెలిచిన తీరుకు కూడా జేజేలు పలకాల్సిందే. ఈ రోజు మన ఘనతను చూసి సాధారణ అభిమానులు ఎంతో సంతోషిస్తూ ఉండవచ్చు. కానీ ఇన్నేళ్లుగా ఆటను దగ్గరి నుంచి చూసిన వారికి ఈ విజయం విలువేమిటో మరింత బాగా కనిపిస్తుంది. పుల్లెల గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లండ్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా షటిల్ పరిస్థితులు గొప్పగా ఏమీ లేవు. కానీ గోపీచంద్ కోచ్‌గా మారిన తర్వాత షటిల్ క్రీడకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. సరిగ్గా చెప్పాలంటే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరిన తర్వాత ఆటపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత సైనా సాధించిన వరుస విజయాలు ఈ క్రీడ స్థాయిని పెంచాయి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో సైనా మెరవడంతో బ్యాడ్మింటన్ కూడా ఆదరణ పొందుతున్న క్రీడల్లో ఒకటిగా మారింది. అయితే 2016 రియో ఒలింపిక్స్‌లో సింధు సాధించిన రజతం ఈ క్రీడ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. సాధారణ క్రీడాభిమానులు కూడా బ్యాడ్మింటన్‌ను అనుసరించసాగారు. ప్రపంచంలో ఏ మూల టోర్నీ జరిగినా వాటి ఫలితాలపై ఆసక్తి చూపించారు. ఇక ఆయా దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు టోర్నీ వేదికలకు వెళ్లి మరీ మన షట్లర్లను ప్రోత్సహించసాగారు. పలువురు ప్రముఖులు ట్వీట్ల ద్వారా బ్యాడ్మింటన్ ఫలితాలను చర్చిస్తుండటంతో సంబంధం లేనివారి దృష్టి కూడా ఆటపై పడింది. కొన్నేళ్ల క్రితం వరకు మన షట్లర్లు మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టడం, టాప్–100 ర్యాంకుల్లో ఉండటం కలగానే అనిపించేది. కానీ ఇప్పుడు ఎంతో మంది నేరుగా పెద్ద టోర్నీల్లో తలపడుతున్నారు. ఈ పురోగతి అంతా నేటి థామస్ కప్ విజయం వరకు తీసుకెళ్లిందంటే అతశయోక్తి కాదు. -
థామస్ కప్ గెలిచిన భారత బృందానికి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత బ్యాడ్మింటన్‌లో ఇదో చారిత్రక ఘట్టం అని అభివర్ణించారు. బ్యాడ్మింటన్‌లో 73 ఏళ్ల భారత కలను సాకారం చేసినందుకు గాను కిదాంబి శ్రీకాంత్ అండ్ టీమ్‌ను అభినందించారు. ఫైనల్లో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన శ్రీకాంత్‌ను సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా తన సందేశాన్నిపంపారు. A historic moment for Indian Badminton as India brings home its first #ThomasCup! Congratulations to Srikanth Kidambi and team India for their spectacular win in the finals and their remarkable journey up to the last shot. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 15, 2022 కాగా, పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత బృందం.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం.. 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియో జోడీని ఖంగుతినిపించి భారత ఆధిక్యాన్ని 2-0కు చేర్చింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వీర లెవెల్లో రెచ్చిపోయి ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21-15, 23-21 తేడాతో మట్టికరిపించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారి..! -
చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారి..!
బ్యాంకాక్: పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చిన భారత బృందం.. ఆదివారం జరిగిన ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేసియాను 3-0 తేడాతో మట్టికరిపించి థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్.. ఆంథోని జింటింగ్‌ను 21-8, 21-17, 21-16 తేడాతో ఓడించగా.. తరువాతి మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం.. 18-21, 23-21, 21-19 తేడాతో మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయ సుకముల్జియో జోడీని ఖంగుతినిపించి భారత ఆధిక్యాన్ని 2-0కు చేర్చింది. ఇక కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వీర లెవెల్లో రెచ్చిపోయి ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జోనాటన్ క్రిస్టీని 21-15, 23-21 తేడాతో మట్టికరిపించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించాడు. భారత బృందం ఫైనల్ చేరే క్రమంలో (నాకౌట్ దశలో) మలేసియా, డెన్మార్క్ లాంటి పటిష్టమైన జట్లను ఖంగుతినిపించిన విషయం తెలిసిందే. ఈ విజయం ఎంతో మందికి స్ఫూర్తి.. ప్రధాని మోదీ 73 ఏళ్ల కలను సాకారం చేసిన భారత పురుషుల బ్యాడ్మింటన్ బృందాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించిన భారత షట్లర్లకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌కు స్వర్ణ పతకం ఖాయం కాగానే మోదీ ట్వీట్ చేశారు. The Indian badminton team has scripted history! The entire nation is elated by India winning the Thomas Cup! Congratulations to our accomplished team and best wishes to them for their future endeavours. This win will motivate so many upcoming sportspersons. — Narendra Modi (@narendramodi) May 15, 2022 "భారత బ్యాడ్మింటన్ బృందం చరిత్ర సృష్టించింది. ఈ విజయం పట్ల యావత్ భారతం గర్వంతో ఉప్పొంగిపోతుంది. స్వర్ణం గెలిచిన భారత బృందానికి శుభాకాంక్షలు.. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం ఎంతో మంది భవిష్యత్తు క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది" అంటూ మోదీ ట్వీట్ ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. -
ఉన్నతి హుడాకు చోటు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లలో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్లను ‘బాయ్’ ప్రకటించింది. ఏప్రిల్ 15నుంచి 20 వరకు ఆరు రోజుల పాటు జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో షట్లర్ల ప్రదర్శనను బట్టి ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. ట్రయల్స్‌కు ముందే నేరుగా అర్హత సాధించిన ప్లేయర్లతో పాటు ట్రయల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనపర్చిన ఆటగాళ్లతో కూడిన జాబితాను సెలక్టర్లు వెల్లడించారు. ఈ ఏడాది జరిగే కామన్వెల్త్, ఆసియా క్రీడలతో పాటు థామస్, ఉబెర్ కప్‌లలో వీరు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల సింగిల్స్‌లో టీనేజ్ సంచలనం ఉన్నతి హుడాకు తొలి సారి చోటు లభించింది. హరియాణాలోని రోహ్టక్కు చెందిన 14 ఏళ్ల ఉన్నతి సెలక్షన్ ట్రయల్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల జట్టులో స్థానం దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఉన్నతి నిలిచింది. ట్రయల్స్ ద్వారా పారదర్శకంగా ఆటగాళ్ల ఎంపిక జరిగిందని, ప్రతిభ గలవారే అవకాశం దక్కించుకున్నారని ‘బాయ్’ ప్రధాన కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు. మూడు మెగా ఈవెంట్ల కోసం కాకుండా ఓవరాల్‌గా 40 మందిని సీనియర్ కోచింగ్ క్యాంప్ కోసం కూడా ఎంపిక చేశారు. ఎంపికైన ఆటగాళ్ల జాబితా: కామన్వెల్త్ క్రీడలు: పురుషుల విభాగం – లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, అశ్విని పొన్నప్ప ఆసియా క్రీడలు, థామస్–ఉబెర్ కప్ పురుషుల విభాగం – లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, ధ్రువ్ కపిల, ఎంఆర్ అర్జున్, విష్ణువర్ధన్ గౌడ్, జి.కృష్ణప్రసాద్ మహిళల విభాగం – పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, అస్మిత చాలిహా, ఉన్నతి హుడా, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, ఎన్.సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, శ్రుతి మిశ్రా -
‘నీ పని చూసుకో’...
న్యూఢిల్లీ: సినీ నటి తాప్సీపై జరుగుతున్న ఆదాయపు పన్ను దాడులకు సంబంధించి స్పంది స్తూ సహాయం కోరిన ఆమె స్నేహితుడు, భారత బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్ మథియాస్ బో (డెన్మార్క్)ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మందలించారు. ఇతర విషయాలపై కాకుండా కోచ్‌గా తన బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచించారు. తాప్సీ తదితరులపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో గురువారం ఆమెకు మద్దతుగా మథియాస్ బో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అతను స్విస్ ఓపెన్‌లో పాల్గొంటున్న జట్టుతోపాటు స్విట్జర్లాండ్‌లో ఉన్నాడు. ‘నా పరిస్థితి గందరగోళంగా ఉంది. తొలిసారి భారత జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అయితే స్వదేశంలో తాప్సీ ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులు ఆమె తల్లిదండ్రులు, కుటుంబంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. కిరణ్ రిజిజు... ఏదైనా చేయగలరా’ అని అతను రాశాడు. దీనిపై మంత్రి శుక్రవారం స్పందిస్తూ కొంత ఘాటుగానే జవాబిచ్చారు. ‘అన్నింటికంటే దేశ చట్టాలు సర్వోన్నతమైనవి. వాటిని మనందరం పాటించాలి. తాజా అంశం మనిద్దరి పరిధిలో లేనిది. మన ఉద్యోగ బాధ్యతలకే మనం కట్టుబడి ఉండాలి. అది భారత క్రీడారంగానికి మేలు చేస్తుంది’ అని రిజిజు ట్వీట్ చేయడం విశేషం. డెన్మార్క్‌కు చెందిన 40 ఏళ్ల మథియాస్ బో 2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో రజతం సాధించాడు. పీబీఎల్‌లో పుణే ఏసెస్ జట్టుకు ఆడిన నాటి నుంచి ఆ టీమ్ యజమాని తాప్సీతో మథియాస్‌కు సాన్నిహిత్యం ఉంది. -
కోచ్ గోపీచంద్‌తో విభేదాల్లేవు
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగానే గచ్చిబౌలిలోని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో సాధన చేస్తున్నానని వరల్డ్ చాంపియన్ పీవీ సింధు స్పష్టం చేసింది. గోపీచంద్ కోరిన మీదటే ‘శాట్స్’ తమ శిక్షణకు స్టేడియాన్ని సిద్ధం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ఒలింపిక్స్‌లో తాము పోటీ పడే తరహా వాతావరణం గచ్చిబౌలి స్టేడియంలో అందుబాటులో ఉండటమే తాను అక్కడికి వెళ్లేందుకు కారణమని ఆమె వెల్లడించింది. ‘నాకూ, చీఫ్ కోచ్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మా ఇద్దరి మధ్య అంతా బాగుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉన్నాయి. ఇదే తరహా వేదికపైనే ఒలింపిక్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా ఏసీ బ్లోయర్లు మ్యాచ్‌లో షటిల్ దిశను ప్రభావితం చేస్తాయి. దానికి అలవాటు పడాలంటే అలాంటి సౌకర్యం ఉన్న స్టేడియంలోనే ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ సాధన చేసేందుకు నాకు ‘సాయ్’ కూడా అనుమతి ఇచ్చింది’ అని సింధు పేర్కొంది. కొన్నాళ్ల క్రితం తాను లండన్ వెళ్లినప్పుడు తన కుటుంబంతో విభేదాల గురించి వచ్చిన వార్తలపై చాలా బాధపడ్డానని, అయితే అందరికీ తాను వివరణ ఇస్తూ ఉండలేనని సింధు వ్యాఖ్యానించింది. -
సింధు విజ్ఞప్తికి ‘సాయ్’ ఓకే
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు వెంట వ్యక్తిగత కోచ్, ఫిజియోలను అనుమతిస్తూ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్ల సింధు వచ్చే జనవరిలో తాజాగా బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతోంది. వచ్చే నెల విదేశాల్లో జరగనున్న మూడు టోర్నీల కోసం తన వెంట వ్యక్తిగత సిబ్బందిని అనుమతించాలని ఆమె ‘సాయ్’ని కోరగా... శుక్రవారం దీనిపై సానుకూలంగా స్పందించింది. ‘థాయ్‌లాండ్‌లో జనవరి 12 నుంచి 17 వరకు, 19 నుంచి 24 వరకు జరిగే రెండు టోర్నీలతో పాటు అక్కడే జరిగే వరల్డ్ టూర్ ఫైనల్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ (27 నుంచి 31) పోటీల్లో సింధుతో పాటు అక్కడికి వెళ్లేందుకు కోచ్, ఫిజియోలను ప్రభుత్వం అనుమతించింది. దీనికి సంబంధించి ఈ ముగ్గురికి అయ్యే వ్యయాన్ని సుమారు రూ.8 లక్షల 25 వేలుగా అంచనా వేసి మంజూరు చేసింది’ అని ‘సాయ్’ ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనాతో పలు టోర్నీలు వాయిదా పడగా అక్టోబర్‌లో ఒక్క డెన్మార్క్ ఓపెన్ జరిగింది. కానీ సింధు ఈ టోర్నీకి దూరంగా ఉంది. ఈ ఏడాది ఆమె ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ (మార్చి) తర్వాత మళ్లీ బరిలోకే దిగలేదు. ప్రస్తుతం సింధు లండన్‌లోని గ్యాటోరెడ్ స్పోర్ట్స్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ రెబెకా రాన్డెల్తో కలిసి వచ్చే సీజన్‌కు సిద్ధమవుతోంది. లండన్‌లోని జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు టోబీ పెంటీ, రాజీవ్ ఉసెఫ్లతో కలసి సాధన చేస్తోంది. -
ప్రాణాలకంటే ఆటలు ఎక్కువ కాదు
కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోన్న సమయంలో క్రీడల ప్రాధాన్యత సహజంగానే వెనక్కి వెళ్లిపోయింది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడగా, ఇతర ప్రధాన ఈవెంట్లు అదే బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటప్పుడు వారు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా చేయడంలో కోచ్‌ల పాత్ర కూడా కీలకం. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా దీనినే అనుసరిస్తున్నారు. కరోనా విపత్కర స్థితిని అందరూ సమష్టిగా ఎదుర్కోవడం ముఖ్యమని చెబుతున్నారు. హైదరాబాద్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ క్వారంటైన్ ఇటీవలే ముగిసింది. అయితే లాక్డౌన్ కారణంగా తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన గోపీచంద్... తాజా పరిణామాలను విశ్లేషించారు. ఒక క్రీడాకారుడికి టోర్నీలు ప్రాధాన్యతాంశమే అయినా ప్రాణాలకంటే ఎక్కువేమి కాదని ఆయన అన్నారు. గోపీచంద్ ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... లాక్డౌన్ ప్రభావం... వ్యక్తిగతంగా చూస్తే దేవుని దయవల్ల లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడని వారిలో నేనూ ఉన్నాను. మధ్యతరగతి వారికి కూడా ఎలాగో గడిచిపోతుంది. అయితే చేతుల్లో డబ్బులు ఉండని రోజూవారీ శ్రామికులు, రైతు కూలీలు నిజంగా తీవ్ర సమస్యలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఉండే వీరిని ఆదుకోవడం మన బాధ్యత. తొందరలోనే అంతా సాధారణంగా మారిపోతే సమస్య తీరుతుంది. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నా. యోగా, ధ్యానం చేస్తూ నా ఫిట్నెస్ను కాపాడుకునే పనిలో ఉన్నా. ఆటగాళ్లతో కూడా మాట్లాడుతున్నా. నాకు లభించిన ఈ విరామాన్ని ఎక్కువ భాగం ఉపయోగించుకుంటున్నా కాబట్టి లాక్డౌన్ గురించి ఫిర్యాదేమీ లేదు. ఆటగాళ్లు ఏం చేస్తున్నారంటే... ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా వారందరికీ అందుబాటులోనే ఉన్నా. మా ఫిట్నెస్ ట్రైనర్ దినాజ్ వీడియో కాల్ ద్వారా వారందరికీ రోజుకు రెండుసార్లు ఫిట్నెస్ పాఠాలు ఇస్తుంది. దానిని అందరూ అనుసరిస్తారు. ఇక చాలా మంది షట్లర్లు తమ కెరీర్లో ఎప్పుడో గాయాలకు గురై విరామం తీసుకోవాల్సి వస్తూనే ఉంటుంది. దీనిని కూడా అలాంటి సుదీర్ఘ విరామంగానే భావించాలి. జూలై వరకు టోర్నీల రద్దుపై... వచ్చే మూడు నెలల పాటు ఎలాంటి టోర్నీలు ఉండవని బీడబ్ల్యూఎఫ్ స్పష్టం చేసేసింది. అయితే అసలు ఈ లాక్డౌన్ ఎంత కాలం కొన సాగుతుందో, ఆ తర్వాత పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో చూడాలి. ఆ తర్వాతే ఆట గురించి ఆలోచించవచ్చు. ఒలింపిక్స్ సన్నాహాలపై... ఆందోళన అనవసరం. ఒలింపిక్స్ కొన్ని నెలలకు వాయిదా పడితే ఆటగాళ్ల ప్రాక్టీస్ గురించి ఆలోచించాల్సి వచ్చేది. అయితే ఏడాది పాటు వాయిదా పడ్డాయి కాబట్టి వాటికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు ప్రపంచ వ్యా ప్తంగా ఆటగాళ్లందరి పరిస్థితి ఇలాగే ఉంది కాబట్టి ఎవరికీ ప్రత్యేక ప్రయోజనం లేదు. ప్రస్తు తం మన, మన కుటుంబసభ్యుల, మిత్రుల, దేశప్రజల ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యం. క్రీడల గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు. కరోనా సమయంలో టోర్నీలపై... ఆల్ ఇంగ్లండ్ టోర్నీని నిర్వహించడంపై బీడబ్ల్యూఎఫ్‌ను చాలా మంది విమర్శించారు. ఇందులో కొంత వాస్తవం ఉంది. నిజాయితీగా చెప్పాలంటే వారు చివరి క్షణం వరకు సాగదీసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఇంగ్లండ్‌లో పరిస్థితి చూస్తుంటే మేం సరైన సమయంలో అక్కడి నుంచి బయట పడ్డామనిపిస్తోంది. ఒలింపిక్స్‌కు అర్హత అంశంపై... మనం అనుకుంటున్నంత తొందరగా పరిస్థితులు మెరుగుపడవని నా అభిప్రాయం. అయితే పరిస్థితులను సానుకూలంగా చూస్తే మీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టమని మాత్రమే ఆటగాళ్లకు చెబుతున్నా. చాలా మంది మాకు కుటుంబంతో గడిపే సమయం దొరకడం లేదంటూ ఫిర్యాదు చేసేవారు. ఇప్పుడు దానిని ఉపయోగించుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నది క్రీడలకంటే పెద్ద సమస్య. అది ఏ దేశాన్ని వదిలిపెట్టడంలేదు. ఎవరూ ఊహించనిది. ఎవరి చేతుల్లోనూ లేనిది. కాబట్టి అన్నీ తర్వాత చేసుకోవచ్చు. ఒకసారి క్వాలిఫయింగ్ ప్రమాణాలు ఏమిటో తెలిస్తే అప్పుడు ప్రణాళిక రూపొందించుకోవచ్చు. చేదు గుళికలా భరించాల్సిందే.... ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ విపత్తు ప్రభావం రాబోయే రోజుల్లో ప్రతీ రంగంపై ఉంటుంది. క్రీడారంగం మినహాయింపు కాదు. ఆర్థికంగా చాలా మంది దీని బాధితులుగా మారతారు. అందరికీ ఇది కఠిన సమయం. ఇలాంటి సమయంలోనే మానసికంగా కూడా దృఢంగా మారాల్సి ఉంటుంది. క్రీడా రంగానికి కూడా భారీ నష్టం జరుగుతుందనేది వాస్తవం. దీంతో సంబంధం ఉన్న అనేక మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు. లేదా జీతాల్లో కోత పడవచ్చు. దీనిని అందరూ అర్థం చేసుకోవాల్సిందే. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో ఈ ఆరు నెలల కాలాన్ని లెక్కలోంచి తీసేయాలి. గత వందేళ్లలో ఇలాంటి పరిస్థితి చూడలేదు. దీనిని ఎదుర్కోవడం అందరికీ కష్టంగా మారింది. అయితే చేదు గుళికలా దీనిని భరించక తప్పదు. త్వరలోనే అంతా మెరుగుపడాలని కోరుకుందాం. -
తప్పుడు నిర్ణయం... తగిన మూల్యం
నానింగ్ (చైనా): ప్రత్యర్థి ర్యాంక్ ఆధారంగా వారి ప్రతిభను తక్కువ అంచనా వేసి... విజయం సాధిస్తామనే ధీమాతో తప్పుడు నిర్ణయం తీసుకుంటే... తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భారత బ్యాడ్మింటన్ కోచ్‌ల బృందానికి తెలిసొచ్చింది. ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ సుదిర్మన్ కప్‌లో భాగంగా గ్రూప్–1‘డి’లో మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–3తో అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్‌ను కాదని... సమీర్ వర్మను ఆడించాలని కోచ్‌లు తీసుకున్న నిర్ణయం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప 16–21, 21–17, 24–22తో గో సూన్ హువాట్–లై షెవోన్ జెమీ (మలేసియా)లను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించారు. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ సమీర్ వర్మ 13–21, 15–21తో ప్రపంచ 20వ ర్యాంకర్ లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ పీవీ సింధు 21–12, 21–8తో గో జి వె (మలేసియా)పై నెగ్గడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో ప్రపంచ 24వ ర్యాంక్ జోడీ సుమీత్ రెడ్డి–మను అత్రి 20–22, 19–21తో ప్రపంచ 1394 ర్యాంక్ జంట ఆరోన్ చియా–తియో ఈ యి (మలేసియా) చేతిలో ఓడిపోయింది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 1394వ స్థానంలో ఉన్నప్పటికీ ఆరోన్–తియో జోడీ పట్టుదలతో పోరాడి మలేసియాను నిలబెట్టింది. ఇక చివరి మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో ప్రపంచ 25వ ర్యాంక్ ద్వయం సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 11–21, 19–21తో ప్రపంచ 13వ ర్యాంక్ జోడీ చౌ మె కువాన్–లీ మెంగ్ యీన్ (మలేసియా) చేతిలో ఓటమి పాలవ్వడంతో భారత్ పరాజయం ఖాయమైంది. ఒకవేళ శ్రీకాంత్‌ను పురుషుల సింగిల్స్‌లో ఆడించి ఉంటే, అతను గెలిచి ఉంటే భారత్ విజయం డబుల్స్ మ్యాచ్లకంటే ముందుగానే 3–0తో ఖాయమయ్యేది. కానీ శ్రీకాంత్కంటే సమీర్ వర్మపైనే కోచ్‌లు ఎక్కువ నమ్మకం ఉంచారు. కానీ వారి నిర్ణయం బెడిసికొట్టింది. భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరాలంటే పదిసార్లు చాంపియన్ చైనాతో నేడు జరిగే మ్యాచ్‌లో భారత్ తప్పకుండా గెలవాలి. -
వయసును తక్కువగా చూపిస్తే...
న్యూఢిల్లీ: ఆటగాళ్లు తమ వయోధ్రువీకరణను తప్పుగా వెల్లడించి పోటీల్లో పాల్గొంటే నిషేధం విధించాల్సిందేనని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సూచించారు. ‘వయస్సును తక్కువ చేసి చూపించే ఆటగాళ్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. మరొకరు ఆ తప్పుచేయకుండా నిరోధించాలంటే నిషేధం అమలు చేయాలి’ అని గోపీచంద్ అన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ)లు అలాంటి ఆటగాళ్లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నాయి. అయితే భారత బ్యాడ్మింటన్ మాజీ కోచ్ విమల్ కుమార్ మాత్రం నిషేధం సరికాదని అంటున్నారు. రెండు మూడేళ్లు సస్పెన్షన్ వేటు వేస్తే సదరు ఆటగాళ్ల ప్రతిభను చంపేసినట్లే అవుతుందని అన్నారు. అలా కాకుండా అండర్–15, 17, 19లలో పెద్ద వయస్సు వారు తప్పుడు ధ్రువీకరణతో పాల్గొంటే వాళ్లకు శిక్షగా ఈ వయోవిభాగాల నుంచి తప్పించి నేరుగా సీనియర్స్ కేటగిరీలో ఆడించడమే ఉత్తమమైన పరిష్కారమన్నారు. 2016లో కొందరు ఆటగాళ్లు తప్పు వయో ధ్రువీకరణతో పోటీల్లో పాల్గొన్న కేసు విషయంలో విచారణ జరిపిన సీబీఐ నలుగురు ఆటగాళ్లు వయస్సు ధ్రువీకరణ పత్రాలను దిద్దినట్లు తేల్చింది. పలువురు జూనియర్ ఆటగాళ్ల తల్లిదండ్రులు వయసు ధ్రువీకరణ అంశంపై, తప్పుడు ధ్రువీకరణపై చర్యలు తీసుకోవాలంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు చర్యలు చేపట్టే విధాన నిర్ణయం తీసుకోవాలంటూ భారత బ్యాడ్మింటన్ సంఘాన్ని (బాయ్) ఆదేశించింది.