న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు వెంట వ్యక్తిగత కోచ్, ఫిజియోలను అనుమతిస్తూ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్ల సింధు వచ్చే జనవరిలో తాజాగా బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతోంది. వచ్చే నెల విదేశాల్లో జరగనున్న మూడు టోర్నీల కోసం తన వెంట వ్యక్తిగత సిబ్బందిని అనుమతించాలని ఆమె ‘సాయ్’ని కోరగా... శుక్రవారం దీనిపై సానుకూలంగా స్పందించింది. ‘థాయ్‌లాండ్‌లో జనవరి 12 నుంచి 17 వరకు, 19 నుంచి 24 వరకు జరిగే రెండు టోర్నీలతో పాటు అక్కడే జరిగే వరల్డ్ టూర్ ఫైనల్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ (27 నుంచి 31) పోటీల్లో సింధుతో పాటు అక్కడికి వెళ్లేందుకు కోచ్, ఫిజియోలను ప్రభుత్వం అనుమతించింది. దీనికి సంబంధించి ఈ ముగ్గురికి అయ్యే వ్యయాన్ని సుమారు రూ.8 లక్షల 25 వేలుగా అంచనా వేసి మంజూరు చేసింది’ అని ‘సాయ్’ ఒక ప్రకటనలో పేర్కొంది.
కరోనాతో పలు టోర్నీలు వాయిదా పడగా అక్టోబర్‌లో ఒక్క డెన్మార్క్ ఓపెన్ జరిగింది. కానీ సింధు ఈ టోర్నీకి దూరంగా ఉంది. ఈ ఏడాది ఆమె ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ (మార్చి) తర్వాత మళ్లీ బరిలోకే దిగలేదు. ప్రస్తుతం సింధు లండన్‌లోని గ్యాటోరెడ్ స్పోర్ట్స్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ రెబెకా రాన్‌డెల్‌తో కలిసి వచ్చే సీజన్‌కు సిద్ధమవుతోంది. లండన్‌లోని జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు టోబీ పెంటీ, రాజీవ్ ఉసెఫ్‌లతో కలసి సాధన చేస్తోంది.
సింధు విజ్ఞప్తికి ‘సాయ్’ ఓకే
Published Sat, Dec 19 2020 5:00 AM | Last Updated on Sat, Dec 19 2020 5:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment