
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ ఉన్నతి హుడా సింగపూర్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ ఉన్నతి 17–21, 16–21 పాయింట్ల తేడాతో రుజానా (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. 42 నిమిషాల్లో ముగిసిన పోరులో ఉన్నతి వరుస గేమ్‌ల్లో ఓడింది. టోర్నీ ఆసాంతం రాణించిన ఉన్నతి... రెండో రౌండ్‌లో ఆసియా క్రీడల పతక విజేత సయిన కవాకమి (ఆ్రస్టేలియా)ను ఓడించింది.
సెమీఫైనల్‌కు చేరే క్రమంలో చైనీస్ తైపీకి చెందిన ఇద్దరు షట్లర్లు సైయాంగ్ స్యూన్ లిన్, యీ టింగ్‌పై కూడా ఉన్నతి విజయాలు సాధించింది. సెమీఫైనల్లో ఉన్నతి 18–21, 21–19, 22–20తో థి ట్రాంగ్ వు (వియత్నాం)ను చిత్తు చేసింది. తొలి గేమ్‌లో పరాజయం పాలైన తర్వాత తిరిగి పుంజుకున్న ఉన్నతి... హోరాహోరీ పోరులో చక్కటి విజయంతో ఫైనల్ చేరింది. అయితే తుదిపోరులో యువ షట్లర్ అదే జోరు కనబర్చలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇదే టోర్నీలో భారత్‌కు చెందిన మరో యువ షట్లర్ దేవిక సిహాగ్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది.