మొదలైంది వేట...
సింధు శుభారంభం
తొలి మ్యాచ్‌లో యామగుచిపై విజయం
మారిన్‌కు సున్ యు షాక్
వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ
రెండు వారాల తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు... సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో బోణీ చేసింది. కొంతకాలంగా జోరు మీదున్న ఈ హైదరాబాద్ అమ్మాయి మెగా ఈవెంట్‌లో శుభారంభం చేసి... టైటిల్ ఫేవరెట్స్ జాబితాలో తాను ఉన్నానని ప్రత్యర్థులకు సంకేతాలు పంపించింది.
దుబాయ్: చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... సీజన్ ముగింపు టోర్నమెంట్‌కు ఆఖరి బెర్త్ రూపంలో అర్హత పొందిన పీవీ సింధు తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకుంది. వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ఈ హైదరాబాద్ షట్లర్ అంచనాలకు అనుగుణంగా రాణించి రెండో సీడ్‌ను బోల్తా కొట్టించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పీవీ సింధు 12–21, 21–8, 21–15తో రెండో సీడ్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)పై గెలిచింది. ఇదే గ్రూప్‌లోని మరో లీగ్ మ్యాచ్‌లో సున్ యు (చైనా) 21–18, 24–22తో ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)పై సంచలన విజయం సాధించింది.
తడబడి... తేరుకొని...
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ద్వారా ఈ ఏడాది ‘అత్యంత పురోగతి సాధించిన క్రీడాకారిణి’ పురస్కారాన్ని అందుకున్న సింధు ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో తడబడింది. ఈ ఏడాది డెన్మార్క్ ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీల్లో విజేతగా నిలిచిన అకానె ఆరంభం నుంచి దూకుడుగా ఆడి 14–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. అకానె ఆటతీరును అంచనా వేయలేకపోయిన సింధు అనవసర తప్పిదాలు కూడా చేసి తొలి గేమ్‌ను 16 నిమిషాల్లో చేజార్చుకుంది. ఇక రెండో గేమ్‌లో సింధు ఆటతీరు మారిపోయింది. కోచ్ పుల్లెల గోపీచంద్ ఇచ్చిన సలహాలను పాటిస్తూ, ఒక ప్రణాళిక ప్రకారం ఆడిన సింధు మొదట్లో 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అవకాశం దొరికినపుడల్లా పదునైన స్మాష్‌లు సంధించడం... డ్రాప్ షాట్‌లు కొట్టడం... సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధించడం... నెట్ వద్ద అప్రమత్తత కారణంగా సింధు ఈ గేమ్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. విరామానికి 11–7తో ముందంజలో ఉన్న సింధు అదే జోరులో రెండో గేమ్‌ను 19 నిమిషాల్లో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది.
నిర్ణాయక మూడో గేమ్ సుదీర్ఘ ర్యాలీతో మొదలైంది. అయితే యామగుచి కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో సింధు ఖాతాలో తొలి పాయింట్ చేరింది. అకానె బలహీనతలపై అవగాహన పెంచుకున్న సింధు దానికి తగ్గట్టు ఆడుతూ 6–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింధు మరింత జోరు పెంచింది. వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 16–10తో ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. మరోవైపు అకానె తేరుకునే ప్రయత్నం చేసినా సింధు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా మూడో గేమ్‌ను 27 నిమిషాల్లో దక్కించుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సున్ యు (చైనా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో ఈ ఇద్దరూ 3–3తో సమంగా ఉన్నారు.