Carolina Marin
-
PV Sindhu-Carolina: బాక్సింగ్ కోర్టు కాదు.. బ్యాడ్మింటన్ కోర్టు
డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 సెమీఫైనల్.. ఒకవైపు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మరోవైపు స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్. తొలి సెట్ నుంచే హొరా హోరీ పోటీ. వీరిద్దరూ మధ్య ఫైట్ బాక్సింగ్ కోర్టును తలపించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరికి సింధు ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ మాత్రం బ్యాడ్మింటన్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అస్సలు ఏమి జరిగిందో ఓ లూక్కేద్దం. తొలిసెట్ ఓ రణరంగం.. తొలిసెట్లో మొదటి పాయింట్ మారిన్ ఖాతాలో చేరింది. దీంతో మారిన్ అనందానికి హద్దులు లేవు. మారిన్ పాయింట్ సాధించిన ప్రతీసారి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంది. సిందూ కూడా ప్రత్యర్ధికి తగ్గట్టే సంబరాలు జరుపుకుంది. సింధు కూడా పాయింట్ సాధించినా ప్రతీసారి బిగ్గరగా అరిచింది. మొదటి వార్నింగ్.. వీరిద్దరూ సెలబ్రేషన్స్ శృతిమించడంతో మొదటి సెట్లోనే అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరిని దగ్గరకి పిలిచి గట్టిగా అరవద్దూ అంటూ అంపైర్ హెచ్చరించాడు. దీంతో సింధు సైలెంట్ అయినప్పటికీ.. కరోలినాలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించలేదు. తన పంథాను కొనసాగించింది. తొలి సెట్లో ఓటమి.. మొదటి సెట్లో పీవీ సింధు చివరవరకు పోరాడినప్పటికీ కరోలినా ముందు తలవంచకతప్పలేదు. సింధు 18-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. రెండో సెట్లో విజయం.. రెండో సెట్లో సింధు దెబ్బతిన్న పులిలా పంజా విసిరింది. ఈ సెట్ మొదటి నుంచే ప్రత్యర్ధిని సింధు ముప్పు తిప్పలు పెట్టింది. అయితే అనూహ్యంగా ప్రత్యర్ధి పుంజుకున్నప్పటికీ 21-19 తేడాతో సింధు విజయం సాధించింది. మూడో సెట్లో వాగ్వాదం.. నిర్ణయాత్మమైన మూడో సెట్లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కరోలినా పదే పదే గట్టిగా అరుస్తుండడంతో సింధు అంపైర్‌కు ఫిర్యాదు చేసింది. మరోసారి కరోలినాకు అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ కరోనా తీరు మారలేదు. చివరి గేమ్‌లో మొదటి నుంచే సింధుపై కరోలినా పై చేయి సాధించింది. మారిన్ 9-2తో ఆధిక్యంలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. సింధు సిద్ధంగా ఉండటానికి తగినంత సమయం ఇవ్వకుండా మారిన్ గేమ్‌ను వేగంగా ఆడేందుకు ప్రయత్నించింది. అంతేకాకుండా సింధు కోర్టులో ఉన్న షటిల్‌ను తనవైపు తీసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో సింధుకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా వాదించుకున్నారు. ఈ క్రమంలో అంపైర్ జోక్యం ఇద్దరికి ఎల్లో కార్డు చూపించాడు. అదే విధంగా మూడో సెట్ ఆఖరిలో షటిల్‌ను సింధు ముఖంపై కొట్టింది. వెంటనే కరోలినా తన బ్యాట్‌ను పైకెత్తి సారీ చెప్పినప్పటికీ.. సింధు వైపు మాత్రం చూడలేదు. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో అనవసర తప్పిదాలతో గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ ప్రత్యర్థికి సమర్పించుకుంది. 7-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. క్షమాపణలు చెప్పిన కరోలినా.. ఇక ఈ మ్యాచ్ అనంతరం సింధుకు కరోలినా క్షమాపణలు చెప్పింది. మ్యాచ్ ముగిసిన తర్వాత పీవీ సింధు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. అందులో "మ్యాచ్ ఓడిపోవడం బాధగా ఉంది. అయితే ఈ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాను. కానీ బ్యాక్-టు-బ్యాక్ సెమీ-ఫైనల్‌కు క్వాలిఫై కావడం సాధించడం చాలా సంతోషంగా ఉంది. నా ఫిట్నెస్ కూడా మరింత మెరుగుపడింది. ప్రతీ ఒక్కరికి భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఎదుటివారిని ద్వేషించడం సరికాదు " అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్టుకు కరోలినా స్పందిస్తూ.. "మ్యాచ్‌లో మంచి ఫైట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనమద్దిరం ఆ గేమ్‌లో గెలవాలని పోరాడాం. కానీ నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకోలేదు. ఏదైమైనప్పటికీ అందరి ముందు నేను ఈ విధమైన ప్రవర్తన చూపినందుకు క్షమించండి. త్వరలో మళ్లీ కలుద్దాం మిత్రమా అంటూ రిప్లే ఇచ్చింది. -
స్పెయిన్ షట్లర్ చేతిలో పదో సారి ఓడిన పీవీ సింధు
కౌలాలంపూర్: కొత్త ఏడాదిని, కొత్త సీజన్‌ను భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమితో ప్రారంభించింది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. చిరకాల ప్రత్యర్థి, మూడుసార్లు ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 12–21, 21–10, 15–21తో ఓడిపోయింది. మారిన్, సింధు ఇప్పటివరకు 15 సార్లు ముఖాముఖిగా తలపడగా... మారిన్ పదిసార్లు సింధును ఓడించి, ఐదుసార్లు ఆమె చేతిలో ఓడిపోయింది. 2018 మలేసియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో చివరిసారి మారిన్‌పై సింధు గెలిచింది. చీలమండ గాయం కారణంగా ఐదు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న సింధు ఈ మ్యాచ్‌లో ఆడపాదడపా మెరిసింది. యాదృచ్ఛికంగా మూడు గేముల్లోనూ ఒక్కసారి కూడా ఇద్దరి స్కోర్లు సమంగా కాకపోవడం విశేషం. తొలి గేమ్‌లో మారిన్ పూర్తి ఆధిపత్యం చలాయించగా... రెండో గేమ్‌లో సింధు విజృంభించింది. మూడో గేమ్‌లో మళ్లీ మారిన్ పుంజుకుంది. ఆరంభంలోనే 3–0తో ఆధిక్యంలోకి వెళ్లిన మారిన్ అదే జోరును కొనసాగించి విజయాన్ని ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్‌లో భారత్‌కే చెందిన మాళవిక బన్సోద్ 9–21, 13–21తో రెండో సీడ్ ఆన్ సె యంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 22–24, 21–12, 21–18తో భారత్‌కే చెందిన ప్రపంచ పదో ర్యాంకర్ లక్ష్య సేన్‌పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–16, 21–13తో చోయ్ సోల్ జియు–కిమ్ వన్ హో (కొరియా) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మారిన్ దూరం
మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో... రేపటి నుంచి తన సొంతగడ్డపై మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి వైదొలుగుతున్నట్లు స్పెయిన్ స్టార్ ప్లేయర్ కరోలినా మారిన్ ప్రకటించింది. 2014, 2015, 2018లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 28 ఏళ్ల మారిన్ ఈ ఏడాది స్విస్ ఓపెన్ సందర్భంగా మోకాలి గాయానికి గురైంది. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ క్రీడలతోపాటు మరే టోర్నీలోనూ ఆమె బరిలోకి దిగలేదు. -
ఫైనల్లో సింధూ ఓటమి
బాసెల్: స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీ ఫైనల్లో భారత ఏస్ షట్లర్ పీవీ సింధూ ఓటమిపాలైంది. ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో 12-21, 5-21తో ఓటమిపాలైంది. తొలి సెట్లో సింధూకు శుభారంభం లభించినప్పటికీ.. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమై, ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాలన్న ఆశలను అడియాశలు చేసుకుంది. తొలుత కరోలినా కాస్త నెమ్మదిగా కదిలినప్పటికీ.. ఆతరువాత గేర్ మార్చి సింధుపై పూర్తి ఆధిక్యాన్ని సాధించి, రెండో గేమ్‌లో సింధూను కనీసం రెండంకెల స్కోర్ కూడా సాధించనీయకుండా చేసింది. కేవలం 37 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో మారిన్ వరుస పాయింట్లు సాధిస్తూ సింధూకు ఊపిరి సడలనివ్వకుండా చేసి, టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఈ ఓటమితో మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 6–9తో వెనుకబడిపోయింది. వీరిద్దరూ తలపడిన గత మూడు మ్యాచ్‌ల్లో మారిన్దే పైచేయి కావడం విశేషం. -
టైటిల్‌కు విజయం దూరంలో...
బాసెల్: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకోవడానికి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 22–20, 21–10తో ప్రపంచ 11వ ర్యాంకర్ మియా బ్లిచ్‌ఫెల్డ్ (డెన్మార్క్)పై గెలిచింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదుర్కొన్న సింధు రెండో గేమ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఈ గెలుపుతో గత జనవరిలో థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలో మియా చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకున్నట్లయింది. నేడు జరిగే ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు ఆడుతుంది. మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 5–8తో వెనుకబడి ఉంది. భారత కాలమానం ప్రకారం సింధు–మారిన్ ఫైనల్ మ్యాచ్ రాత్రి 7 గంటల తర్వాత మొదలయ్యే అవకాశముంది. శ్రీకాంత్ పరాజయం పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. ప్రపంచ మాజీ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 13–21, 19–21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 10–21, 17–21తో కిమ్ అస్ట్రప్–ఆండెర్స్ రస్ముసెన్ (డెన్మార్క్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
చైనా ఓపెన్ చాంప్స్ కరోలినా మారిన్, మొమోటా
షాంఘై: స్పెయిన్ బ్యాడ్మింటన్ స్టార్ కరోలినా మారిన్ పునరాగమనంలో బరిలోకి దిగిన రెండో టోర్నమెంట్‌లోనే టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోరీ్నలో మారిన్ విజేతగా నిలిచింది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన మారిన్ 65 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 14–21, 21–17, 21–18తో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. ‘నమ్మశక్యంగా లేదు. గాయం నుంచి కోలుకుంటున్న క్రమంలో బరిలోకి దిగే రెండో టోరీ్నలోనే విజేతగా నిలుస్తానని ఊహించలేదు. ఈ ప్రదర్శనతో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను’ అని రియో ఒలింపిక్స్ చాంపియన్ అయిన మారిన్ వ్యాఖ్యానించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, విశ్వవిజేత కెంటో మొమోటా టైటిల్ దక్కించుకున్నాడు. 90 నిమిషాలపాటు జరిగిన మారథాన్ ఫైనల్లో మొమోటా 19–21, 21–17, 21–19తో ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించాడు. విజేతగా నిలిచిన మారిన్, మొమోటాలకు 70 వేల డాలర్ల (రూ. 49 లక్షల 75 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
క్వీన్ సైనా
జకార్తా: ఇండోనేసియా గడ్డపై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ అనుబంధం కొనసాగుతోంది. గతంలో ఇక్కడ పలు చిరస్మరణీయ విజయాలు సాధించిన సైనా... ఇప్పుడు మరో మేజర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. అర్ధాంతరంగా ముగిసిన ఫైనల్లో విజేతగా నిలిచి ఇండోసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నీలో సైనా విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఆమె ప్రత్యర్థి కరోలినా మారిన్ (స్పెయిన్) తొలి గేమ్‌లోనే కాలి గాయంతో తప్పుకుంది. ఆ సమయంలో సైనా 4–10తో వెనుకబడి ఉంది. విజేత సైనాకు 26, 250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 61 వేలు) లభించింది. 2018లో ఇదే టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన సైనా... ఇప్పుడు విజయం అందుకుంది. గత రెండేళ్లలో సైనాకు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కావడం విశేషం. 2017 జనవరిలో ఆమె మలేసియా మాస్టర్స్ టైటిల్ గెలిచింది. గత వారమే మలేసియా మాస్టర్స్ టోర్నీలో సైనాపై ఘన విజయం సాధించిన మారిన్ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. వేగంగా కదులుతూ తొలి రెండు పాయింట్లు తన ఖాతాలో వేసుకున్న మారిన్ అదే జోరును కొనసాగించింది. సైనా తప్పిదాలతో ఆమె 6–2తో ముందంజ వేసింది. దూకుడు పెంచిన మారిన్ 9–2తో దూసుకుపోయిన దశలో కోర్టులో అనూహ్యంగా పడిపోవడంతో కాలికి గాయమైంది. చికిత్స అనంతరం ఆమె ఆట కొనసాగించినా...మరో మూడు పాయింట్ల తర్వాత ఇక తన వల్ల కాదంటూ కుప్పకూలింది. కన్నీళ్లతో మారిన్ కోర్టు వీడగా...సైనా విజేతగా ఆవిర్భవించింది. ‘నేను టైటిల్ సాధించిన తీరు పట్ల ఆనందంగా లేను. కఠినమైన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్ వరకు వెళ్లడం సంతోషకరం. ఫైనల్లో నేను వెనుకబడ్డాననేది వాస్తవం. అయితే గట్టిగా పోరాడేదాన్ని. దురదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగింది. కోర్టులో ఈ తరహాలో గాయపడటం చాలా బాధాకరం. నాకు కూడా ఇలాంటి అనుభవం గతంలో ఎదురైంది కాబట్టి ఆ వేదన ఎలాంటిదో బాగా తెలుసు’ అని మ్యాచ్ అనంతరం సైనా వ్యాఖ్యానించింది. -
ఇండోనేసియా మాస్టర్స్ టైటిల్ సైనాదే
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్-500 టోర్నమెంట్ విజేతగా భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ నిలిచింది. స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన సైనా నెహ్వాల్.. గేమ్ ముగియకుండానే టైటిల్‌ని ఖాతాలో వేసుకుంది. ఆట ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించిన కరోలినా.. సైనాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఓ దశలో 7-2తో ఆధిక్యంలో ఉన్న సమయంలో కరోలినా కాలికి గాయం అవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యింది. ప్రాథమిక చికిత్స అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభించిన కరోలినా మరో రెండు పాయింట్లు సాధించన అనంతరం మరోసారి గాయం తిరగబెట్టడంతో ఫైనల్ పోరు నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. దీంతో టోర్నీ నిర్వాహకులు సైనా నెహ్వాల్‌ను విజేతగా ప్రకటించారు. ఈ టైటిల్ గెలవడంతో ఈ ఏడాది తొలి మాస్టర్స్ టైటిల్‌ను సైనా తన ఖాతాలో వేసుకుంది. మలేషియా మాస్టర్స్ సెమీఫైనల్లో సైనా.. కరోలినా చేతిలో ఓడిన విషయం తెలిసిందే. గతేడాది కూడా ఇండోనేసియా మాస్టర్స్ ఫైనల్ చేరిన సైనా తుది పోరులో ఓటమి చవిచూసింది. -
సైనా పోరు ముగిసె
కౌలాలంపూర్: కొత్త సీజన్లో ఆడిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనే ఫైనల్‌కు చేరాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో సైనా సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 16–21, 13–21తో ఓడిపోయింది. 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్ ఆరంభంలోనే 5–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సైనాను గతంలో ఐదుసార్లు ఓడించిన మారిన్ వెంటనే కోలుకుంది. దూకుడుగా ఆడుతూ సైనాపై ఒత్తిడి పెంచుతూ వరుసగా ఏడు పాయింట్లు సాధించి 9–5తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించిన మారిన్ తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో మారిన్ మరింత విజృంభించగా... సైనా డీలా పడిపోయింది. ఈ గేమ్‌లో మొదటి పాయింట్ సైనా సాధించినా... ఆ తర్వాత మారిన్ ఆరు పాయింట్లు గెలిచి 6–1తో ఆధిక్యంలోకి వెళ్లి ఇక వెనుదిరిగి చూడలేదు. సెమీస్‌లో ఓడిన సైనాకు 5,075 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 61 వేలు)తోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
మలేసియా ఓపెన్ : సైనా ఓటమి
కౌలాలంపూర్ : మలేసియా మాస్టర్స్ ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కథ ముగిసింది. ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో సైనా 16-21, 13–21తో పరాజయం పాలైంది. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మారిన్ జోరు ముందు సైనా చేతులెత్తేసింది. తొలి గేమ్‌లో 14-14తో మారిన్‌కు గట్టిపోటీనిచ్చిన భారత స్టార్ తర్వాత అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. దీంతో సైనా-మారిన్‌ల ముఖాముఖీ రికార్డు 5-6గా మారింది. ఈ మ్యాచ్ అనంతరం సైనా.. మారిన్‌కు అభినందనలు తెలపుతూ ట్వీట్ చేసింది.‘ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని అందుకోలేకపోయాను. అద్భుతంగా ఆడిన మారిన్‌కు అభినందనలు.. వచ్చే వారం జరిగే ఇండోనేషియా ఓపెన్‌లో రాణిస్తాను’. అని పేర్కొంటూ సైనా ధీమా వ్యక్తం చేసింది. Was not up to the mark today in the match ... but will try again next week to do well .. congratulations to @carolinamarin for playing so well today 👍 16-21 13-21 #malaysiamasterssuper500 #semifinals .. looking forward to indonesia open next week 🙏.. pic.twitter.com/i33MpMbjqs — Saina Nehwal (@NSaina) 19 January 2019 -
సింధు, హైదరాబాద్ సూపర్
ముంబై: భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు జోరు లీగ్‌లోనూ కొనసాగింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో తెలుగమ్మాయి సింధుతో పాటు హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. హైదరాబాద్ తరఫున తొలిసారి బరిలోకి దిగిన ఆమె మేటి ప్రత్యర్థి కరోలినా మారిన్‌పై పైచేయి సాధించింది. ప్రత్యక్ష వీక్షకులను, టీవీ ప్రేక్షకులను ఇలా అందరి కళ్లను ఆకట్టుకున్న మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో తెలుగమ్మాయి జయకేతనం ఎగురవేసింది. శనివారం జరిగిన తొలి పోరులో హైదరాబాద్ హంటర్స్ 6–(–1)తో పుణే సెవెన్ ఏసెస్‌పై ఘనవిజయం సాధించింది. నిజానికి సింధు బరిలోకి దిగకముందే హంటర్స్ విజయం ఖాయమైంది. అయితే ఒలింపిక్ చాంపియన్ మారిన్ తన పుణే జట్టుకు ఓదార్పునిచ్చేందుకు బరిలోకి దిగినా... సింధు జోరు ముందు తలవంచింది. కడదాకా హోరాహోరీగా జరిగిన పోరులో స్టార్ షట్లర్ సింధు 11–15, 15–8, 15–13తో మారిన్‌పై విజయం సాధించింది. ఆట ఆరంభంలో మొదట మారిన్ తన ‘పవర్’ చాటింది. దీంతో తొలిగేమ్ స్పెయిన్ స్టార్ వశమైంది. సింధు పదేపదే చేసిన అనవసర తప్పిదాలు కూడా మారిన్‌కు కలిసొచ్చాయి. కోర్టులో ఇద్దరు దీటుగా స్పందించినప్పటికీ మారిన్ షాట్లు పాయింట్లను తెచ్చిపెట్టాయి. తర్వాత రెండో గేమ్‌లో మాత్రం సింధు తన ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలివ్వలేదు. ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా కష్టపడిన ఆమె ఈ గేమ్‌లో మారిన్‌ను తొందరగానే ఓడించింది. ఇక చివరి గేమ్ మాత్రం అద్భుతంగా సాగింది. గెలుపు దశలో ఒక్కో పాయింట్ ఇద్దరికీ సమాన అవకాశాలిచ్చింది. మ్యాచ్ ముగిసేదశలో ఇద్దరు పిడికిలి బిగించారు. 13–13 స్కోరుదాకా దోబూచులాడిన విజయం చివరకు తెలుగు తేజం వరుసగా రెండు పాయింట్లు గెలవడంతో సింధు పక్షాన నిలిచింది. మొదట జరిగిన పురుషుల సింగిల్స్ తొలి పోటీలో మార్క్ కాల్జో (హంటర్స్) 10–15, 15–12, 15–14తో లక్ష్య సేన్‌పై గెలిచి హైదరాబాద్‌ను 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. పురుషుల డబుల్స్‌ను పుణే ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. కానీ ఇక్కడా నిరాశ తప్పలేదు. కిమ్ సా రంగ్– బొదిన్ ఇసార (హంటర్స్) ద్వయం 13–15, 15–10, 15–13తో చిరాగ్ శెట్టి–మథియాస్ బొయె జంటపై గెలువడంతో స్కోరు మైనస్ పాయింట్‌కు చేరింది. రెండో పురుషుల సింగిల్స్‌ను హైదరాబాద్ ట్రంప్‌గా ఎంచుకొని బరిలోకి దిగింది. లీ హ్యూన్ ఇ (హంటర్స్) 15–14, 15–12తో బ్రిస్ లెవర్డెజ్‌ను చిత్తు చేశాడు. సింధు, మారిన్‌ల మ్యాచ్ తర్వాత చివరగా జరిగిన మిక్స్డ్ డబుల్స్ పోరులో ఇయోమ్ హ్యే వోన్– కిమ్ సా రంగ్ (హంటర్స్) జోడీ 15–14, 15–11తో వ్లాదిమిర్ ఇవనోవ్–లైన్ జాయెర్స్‌ఫెల్డ్ జంటపై గెలిచింది. నేడు (ఆదివారం) జరిగే పోటీల్లో ముంబై రాకెట్స్‌తో ఢిల్లీ డాషర్స్, అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ తలపడతాయి. -
నాకు ఫైనల్ ఫోబియా లేదు: పీవీ సింధు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించడం సంతోషంగా ఉందని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపారు. గత ఆదివారం జరిగిన ఫైనల్లో స్పెయిన్ స్టార్ కరోలిన్ మారిన్ చేతిలో సింధు ఓడిన విషయం తెలిసిందే. భారత్‌కు చేరుకున్న సింధు మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడారు. ప్రపంచ చాంపియన్‌షిప్ పెద్ద టోర్నీ అని అక్కడ అందరూ గట్టి ప్రత్యర్థులే ఉంటారని ఆమె తెలిపారు. ‘అందరూ నాకు ఫైనల్ ఫోబియా ఉందంటున్నారు. నాకు ఆ ఫోబియా లేదు. ఫైనల్ వరకు రావాలంటే ఎంతో కష్టపడాలి. ఫైనల్లో కూడా గెలవాలనే నా సాయశక్తుల ప్రయత్నించా. స్పెయిన్ స్టార్ మారిన్ చాలా తెలివిగా ఆడింది. తొలి రౌండ్ నుంచి కఠినమైన ప్రత్యర్థులను ఎదుర్కొన్నాను. ఫైనల్లో ఎవరో ఒకరు మాత్రమే విజయం సాధిస్తారు. చాలా బాగా ఆడి విజయం సాధించిన మారిన్‌కు అభినందనలు. నేను ఫస్ట్ గేమ్ గెలిచి ఉంటే ఆట వేరేలా ఉండేది. ఓడిపోవడం వల్ల నాపై మరింత ఒత్తిడి పెరిగింది. చాంపియన్‌షిప్‌లో నా ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నా. ఈ ఏడాది రజతం సాధించాను.. కచ్చితంగా భవిష్యత్‌లో స్వర్ణం కైవసం చేసుకుంటాననే నమ్మకం ఉంది. ఫైనల్ వరకు వచ్చి ఓడిపోతున్నావని చాలా మంది అంటున్నారు. కానీ ఫైనల్ వరకు రావడమనేది చాలా కష్టం అని అందరూ అర్థం చేసుకోవాలి. చాలా మంది ఫైనల్‌కు రాకుండానే ఇంటిముఖం పడుతున్నారు. తుదిపోరులో ఎవరైనా బాగా ఆడాలనే అనుకుంటారు. కొన్ని సార్లు ఆడొచ్చు లేక ఆడకపోవచ్చు. ఓడిపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని రానున్న టోర్నీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నా. మారిన్ అందరూ ప్లేయర్స్‌తోనూ చాలా దూకుడుగా ఆడుతుంది. ఒలింపిక్స్ తరువాత తనతో చాలా మ్యాచ్‌ల్లో తలపడ్డాను. ఎప్పుడూ ఎటాకింగ్‌తో ఆడుతోంది. కోర్టుల్లో మేమిద్దరం ప్రత్యర్థులం అయినప్పటికీ కోర్టు బయట మంచి స్నేహితులమని’ సింధు పేర్కొన్నారు. చదవండి: సింధును చేరని స్వర్ణం -
సింధును చేరని స్వర్ణం
వేదిక మారింది. ప్రత్యర్థి మారింది. పతకం రంగు మాత్రం మారలేదు. తుది ఫలితంలోనూ తేడా రాలేదు. విశ్వ విజేతగా అవతరించ డానికి అవసరమైన విజయాన్ని భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు అందుకోలేకపోయింది. ఏడాది కాలంగా వేధిస్తోన్న ‘ఫైనల్ ఫోబియా’ను ఆమె ఈసారీ అధిగమించలేకపోయింది. ఫలితంగా వరుసగా రెండో ఏడాదీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సంతృప్తి పడింది. మరోవైపు అత్యున్నతస్థాయి టోర్నమెంట్లలో ఎలా నెగ్గాలో.. ఎలా ఆడాలో చూపిస్తూ స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ మరోసారి విజయగర్జన చేసింది. ముచ్చటగా మూడోసారి స్వర్ణం సాధించి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖించింది. నాన్జింగ్ (చైనా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ‘స్వర్ణ స్వప్నం’ సాకారం కాలేదు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాలని ఆశించిన ఈ తెలుగు తేజం ఆశలను స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్ వమ్ము చేసింది. ఆదివారం జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో ర్యాంకర్ సింధు 19–21, 10–21తో ఎనిమిదో ర్యాంకర్ మారిన్ చేతిలో ఓటమి పాలైంది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో ఆద్యంతం దూకుడుగా ఆడిన మారిన్దే పైచేయిగా నిలిచింది. ఈ మెగా ఈవెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో మూడు స్వర్ణాలు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా మారిన్ కొత్త చరిత్ర సృష్టించింది. 2014 ఫైనల్లో లీ జురుయ్ (చైనా)పై, 2105 ఫైనల్లో సైనా నెహ్వాల్ (భారత్)పై గెలిచి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మారిన్ 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్లో సింధునే ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. తాజా విజయంతో మారిన్ ఖాతాలో 13 వేల ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధు ఖాతాలో 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలకు పతకాలు మినహా ఎలాంటి ప్రైజ్‌మనీ దక్కదు. ఆధిక్యం... తడబాటు... తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరిన సింధు తుది పోరులోనూ ఆ జోరు కొనసాగిస్తుందని అనిపించింది. తొలి గేమ్‌లో 1–3తో వెనుకబడిన దశలో ఆమె వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ సింధు 15–11తో ముందంజ వేసింది. అయితే ఈ టోర్నీలో అందరికంటే ఎక్కువ దూకుడుగా ఆడుతున్న మారిన్ వెనుకంజలో ఉన్నా ఆందోళన చెందలేదు. గతంలో సింధును ఆరుసార్లు ఓడించిన అనుభవమున్న ఈ స్పెయిన్ స్టార్ ర్యాలీలు ఆడుతూనే, స్మాష్‌లతో వాటిని ముగిస్తూ లయలోకి వచ్చింది. వరుసగా ఐదు పాయింట్లు గెలిచిన మారిన్ 16–15తో ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం కీలకదశలో పాయింట్లు గెలిచి 25 నిమిషాల్లో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. అదే ఉత్సాహంతో మారిన్ రెండో గేమ్‌లో చెలరేగిపోయింది. గెలవాల్సిన గేమ్‌ను కోల్పోయిన సింధు డీలా పడిపోయింది. మారిన్ దూకుడైన ఆటతీరుకు ఎలా సమాధానమివ్వాలో తెలియక ఒత్తిడికి లోనై అనవసర తప్పిదాలు చేస్తూ 2–11తో వెనుకబడిపోయింది. యామగుచితో జరిగిన సెమీఫైనల్ రెండో గేమ్‌లో 12–19తోవెనుకంజలో ఉండి వరుసగా 8 పాయింట్లు సాధించి 20–19తో ఆధిక్యంలోకి వచ్చిన సింధు ఫైనల్లో మాత్రం అలాంటి అద్భుతమైన పునరాగమనం చేయలేకపోయింది. స్కోరు 20–10 వద్ద మారిన్ సర్వీస్‌లో సింధు రిటర్న్ షాట్ బయటకు వెళ్లడంతో స్పెయిన్ స్టార్ విజయ సంబరాలు చేసుకుంది. ఎదురులేని మొమోటా పురుషుల సింగిల్స్ విభాగంలో కెంటో మొమోటా రూపంలో కొత్త ప్రపంచ చాంపియన్ అవతరించాడు. ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ మొమోటా 21–11, 21–13తో మూడో ర్యాంకర్ షి యుకి (చైనా)పై గెలుపొందాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో పురుషుల సింగిల్స్‌లో జపాన్ ప్లేయర్ టైటిల్ సాధించడం ఇదే ప్రథమం. టైటిల్ గెలిచిన క్రమంలో మొమోటా కేవలం ఒక గేమ్ మాత్రమే కోల్పోవడం విశేషం. సింధుకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపి, రజత పతకం సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ►6 గత ఏడాది కాలంలో పీవీ సింధు తాను చేరుకున్న ఆరు ఫైనల్స్‌లో ఓడిపోయింది. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ (మారిన్ చేతిలో), థాయ్‌లాండ్ ఓపెన్ (ఒకుహారా చేతిలో), కామన్వెల్త్ గేమ్స్ (సైనా నెహ్వాల్ చేతిలో), ఇండియా ఓపెన్ (బీవెన్ జాంగ్ చేతిలో)... గత సంవత్సరం వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో (అకానె యామగుచి చేతిలో), హాంకాంగ్ ఓపెన్ (తై జు యింగ్ చేతిలో)లలో సింధు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో మరోసారి ఓడిపోవడం తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. గత ఏడాది కూడా ఇదే తరహాలో జరిగింది. తాజా ఫలితంతో చాలా బాధ పడుతున్నాను. తర్వాతి టోర్నమెంట్‌కు సన్నద్ధం కావాలంటే మళ్లీ మానసికంగా దృఢంగా మారి ప్రాక్టీస్ చేయాలి. ఒక్కో రోజు మనకు కలిసి రాదు. కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమే కాబట్టి బలంగా నిలబడాలి. మెరుగైన ఫలితాన్ని ఆశించాను అందుకే ఈ ఫలితం మరింత నిరాశ కలిగించింది. అయితే ఫైనల్ వరకు రావడంపై సంతోషంగా ఉన్నా. గెలుపోటములు జీవితంలో భాగమని భావించి దీనిని స్వీకరించాలి. మారిన్ ఆటలో వేగం ఉండటమే కాకుండా ఆమె చాలా దూకుడుగా ఆడింది. టోర్నమెంట్ మొత్తం ఆమె ఇదే తరహాలో చెలరేగింది. నిజానికి ఆ వేగాన్ని నిరోధించే లక్ష్యంతోనే నేనూ సాధన చేశాను. కానీ ఆమె ఇంకా మెరుగ్గా ఆడింది. తొలి గేమ్ గెలిచి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో? రెండో గేమ్‌లో చాలా తప్పిదాలు చేశాను. నేను కొట్టిన స్మాష్లన్నీ బయటకు వెళ్లాయి. ఇది నా రోజు కాదని మాత్రమే చెప్పగలను. తొలి గేమ్‌లో ఒక దశలో 14–9తో ఆధిక్యంలో ఉండి కూడా సులువుగా పాయింట్లు ఇచ్చేశాను. నేనూ వేగంగా ఆడే ప్రయత్నంలో పొరపాట్లు జరిగిపోయాయి. 17–17 వద్ద ఆమె అటాకింగ్ చేస్తున్నప్పుడు నేను మరింత ఓపిగ్గా ఆడాల్సింది. - పీవీ సింధు రియో ఒలింపిక్స్ తర్వాత ఫామ్ కోల్పోయాను. సుదీర్ఘ కాలంగా విజయం కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నా ఆనందాన్ని ఎలా వ్యక్తిపరచాలో కూడా అర్థం కావడం లేదు. ఎన్నో రకాల భావోద్వేగాలతో నా శరీరం నిండిపోయింది. గత వారం రోజులగా నాపై నేను ఉంచిన నమ్మకం, ఆత్మవిశ్వాసం నిజమైనందుకు సంతోషంగా ఉంది. – కరోలినా మారిన్ -
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధుకు పరాజయం
-
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధుకు పరాభవం
చైనా : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు చుక్కెదురైంది. స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో సింధు వరుస పరాజయం పాలైంది. మొదటి గేమ్‌లో కొంత పోరాటపటిమ చూపిన సింధు రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. మొదటి గేమ్‌ను 21-19 తేడాతో సొంతం చేసుకున్న మారిన్ రెండో గేమ్‌లో మరింత చెలరేగిపోయింది. మారిన్ దూకుడు ముందు సింధు తేలిపోయింది. ఎప్పటిలాగే గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ.. మైదానంలో చెలరేగిపోయిన మారిన్ రెండో గేమ్‌ను 21-10తేడాతో సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సింధు సరిపెట్టుకుంది. -
ఫైనల్లోకి తెలుగు తేజం సింధు
నాంజింగ్ (చైనా) : ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం పీవీ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో వరుసగా ఐదోసారి బరిలోకి దిగి నాలుగోసారి పతకాన్ని ఖాయం చేసుకున్న సింధు స్వర్ణపోరుకు సిద్ధమైంది. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, జపాన్‌కు చెందిన అకానె యామగుచిపై 21-16, 24-22తో వరుస గేముల్లో విజయం సాధించింది. స్వర్ణం కైవసం చేసుకునేందుకు సింధు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. పసిడి పోరులో స్పెయిన్‌కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో సింధు తలపడనుంది. తొలిగేమ్‌లో ప్రత్యర్థిని ఇరుకున పెట్టిన సింధు రెండో గేమ్‌లో తన శక్తిని కూడగట్టుకుని సత్తా చాటింది. తొలిగేమ్‌లో తొలుత యామగుచి ఆధిక్యం ప్రదర్శించినా 12-12తో సింధు సమం చేసింది. ఆపై ఆరు పాయింట్లు సాధించి 18-12లో ఆధిక్యంలో కనిపించిన సింధు.. చివరికి 21-16తో గేమ్ నెగ్గింది. రెండో గేమ్ మాత్రం సుదీర్ఘ ర్యాలీలు, ప్లేస్మెంట్లతో రెండో గేమ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఓ దశలో యామగుచి 19-12కు ఆధిక్యంలో నిలిచి రెండో గేమ్‌ను నెగ్గేలా కనిపించింది. కానీ మళ్లీ పుంజుకున్న సింధు 19-19తో స్కోరు సమం చేసింది. ఆపై 20-20, 21-21 ఇలా సాగిన ఉత్కంఠభరిత గేమ్‌ను 24-22తో సింధు నెగ్గి.. మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కీలకమైన క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌ల్లో సింధు జపాన్ క్రీడాకారిణులను ఓడించటం గమనార్హం. -
మారిన్‌కు సైనా షాక్
ఒడెన్స్: ఇటీవలే జపాన్ ఓపెన్‌లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ చేతిలో ఎదురైన పరాజయానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్రతీకారం తీర్చుకుంది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సైనా 22–20, 21–18తో ప్రపంచ 5వ ర్యాంకర్ మారిన్ (స్పెయిన్)ను బోల్తా కొట్టించింది. ఈ గెలుపుతో మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సైనా 5–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. అయితే కీలకదశలో సైనా పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. సాయిప్రణీత్ ఓటమి పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... సాయిప్రణీత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. శ్రీకాంత్ 21–17, 21–15తో భారత్‌కే చెందిన క్వాలిఫయర్ శుభాంకర్ డేను ఓడించగా... ప్రణయ్ 21–18, 21–19తో ఎమిల్ హోస్ట్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. సాయిప్రణీత్ 10–21, 15–21తో క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడీల పోరాటం ముగిసింది. తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–14, 18–21, 17–21తో చుంగ్ సియోక్–కిమ్ డ్యూక్యంగ్ (కొరియా) జంట చేతిలో... సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీ 13–21, 18–21తో మ్యాడ్స్ పీటర్సన్–కోల్డింగ్ (డెన్మార్క్) ద్వయం చేతిలో ఓటమి చవిచూశాయి. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట 19–21, 17–21తో నిక్లాస్ నోర్–సారా తిగ్సెన్ (డెన్మార్క్) జోడీ చేతిలోఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప – సిక్కి రెడ్డి జంట 21–15, 18–21, 21–23తో మీ కువాన్ చౌ–లీ మెంగ్ యీన్ (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
హైదరాబాద్ కే మారిన్..
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్) మూడో సీజన్ వేలంలో స్పెయిన్ స్టార్, ప్రపంచ నాల్గో ర్యాంకర్ కరోలినా మారిన్ ను హైదరాబాద్ హంటర్స్ మరోసారి దక్కించుకుంది. ఆమెకు రూ.50 లక్షలు వెచ్చించి మారిన్ ను కాపాడుకుంది. మరొకవైపు రూ.52 లక్షలతో మహిళల సింగిల్స్ నంబర్‌వన్ క్రీడాకారిణి తై జు యింగ్‌ను అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ కైవసం చేసుకుంది. కాగా, భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్పను రూ.20లక్షలు వెచ్చించి ఢిల్లీ ఏసర్స్ దక్కించుకుంది. ఇక వరల్డ్ నంబర్ టూ పీవీ సింధును చెన్నై స్మాషర్స్ రూ. 48 లక్షల 75 వేలతో నిలుపుకుంది. మరొకవైపు సైనా నెహ్వాల్ కు 41 లక్షల 25 వేలతో అవేథ్ వారియర్స్ అట్టేపెట్టుకుంది. ఇక కిడాంబి శ్రీకాంత్ కు రూ.56 లక్షల 10 వేలతో అవేథ్ వారియర్స్ దక్కించుకుంది. గతేడాది వేలంలో శ్రీకాంత్ కు రూ.51లక్షల దక్కగా, ఈసారి దాదాపు పదిశాతం అధికంగా దక్కడం విశేషం. పురుషుల వరల్డ్ నంబర్ వన్ విక్టర్ అలెక్సన్ ను రూ. 50 లక్షలతో బెంగళూరు బ్లాస్టర్స్ కైవసం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంఛైజీలు పాల్గొన్నాయి. ఇందులో 133 మంది స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. దీనిలో భాగంగా రూపొందించిన మోస్ట్ ఐకానిక్ ప్లేయర్స్ లిస్ట్ లోభారత్ నుంచి కిడాంబి శ్రీకాంత్ ,పీవీ సింధు, సైనా నెహ్వాలకు చోటు లభించింది. -
సైనా నెహ్వాల్ అవుట్
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిష్ర్కమించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ ఫైనల్లో సైనా 16-21, 13-21 తేడాతో ఒలిపింక్స్ స్వర్ణ పతక విజేత, స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి గేమ్ లో సైనా 11-9తో ఆధిక్యంలో నిలిచినా, దాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. కరోలినా ఒక్కసారిగా విజృంభించడంతో సైనా వెనుకబడిపోయింది. ఈ క్రమంలోనే కరోలినా 21-16తో తొలి గేమ్ ను సొంతం చేసుకున్నారు. ఆపై రెండో గేమ్ లో సైనాకు ఎటువంటి అవకాశం ఇవ్వని కరోలినా 21-13తో గేమ్ ను మ్యాచ్ ను సాధించారు. అంతకుముందు ఒకుహారా చేతిలో పివి సింధు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
ఒలింపిక్ చాంపియన్‌పై సింధు విజయనాదం
-
జయహో సింధు...
⇒ స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ కైవసం ⇒ ఇండియా ఓపెన్ విజేతగా తెలుగు తేజం ⇒ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ మారిన్‌పై గెలుపు ⇒ రూ. 15 లక్షల 79 వేల ప్రైజ్‌మనీ సొంతం ఎట్టకేలకు సొంతగడ్డపై పూసర్ల వెంకట (పీవీ) సింధు సత్తా చాటింది. ఇన్నాళ్లూ విదేశాల్లో నిలకడగా విజయాలు సాధించిన ఈ తెలుగు అమ్మాయి స్వదేశంలో ‘సూపర్ సిరీస్’ టైటిల్ లోటును తీర్చుకుంది. ఆదివారం ముగిసిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి విజేతగా అవతరించింది. రియో ఒలింపిక్స్‌చాంపియన్ కరోలినా మారిన్‌తో జరిగిన హోరాహోరీ సమరంలో సాధికారిక ఆటతీరుతో సింధు పైచేయి సాధించింది. న్యూఢిల్లీ: ముఖాముఖి రికార్డులో వెనుకంజ... ఎడంచేతి వాటం ప్రత్యర్థి... పాయింట్ గెలిచినపుడల్లా తనదే పైచేయి అన్నట్లు సంకేతం చూపిస్తూ కవ్వింపు... లయలో ఉన్నపుడు దానిని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా విరామం తీసుకోవడం... సింధును సొంతగడ్డపై ఎలాగైనా ఓడించాలని కరోలినా మారిన్ ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం సాధించలేకపోయింది. చివరి పాయింట్ వరకు ఏకాగ్రత కోల్పోకుండా ఆడుతూ... ప్రత్యర్థి వ్యూహాలను చిత్తు చేస్తూ సింధు తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. స్వదేశంలో అందని ద్రాక్షలా ఊరిస్తోన్న ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను హస్తగతం చేసుకొని విజయ గర్జన చేసింది. స్థానిక సిరిఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సొంత ప్రేక్షకులు, అభిమానుల మధ్య సింధు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకుంది. 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21–19, 21–16తో ప్రపంచ మూడో ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్)పై గెలిచింది. విజేతగా నిలిచిన సింధుకు 24,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 లక్షల 79 వేలు)తోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్ మారిన్‌కు 12,350 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.8 లక్షలు)తోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. ఆరంభం నుంచి దూకుడు... గత మూడేళ్ల కాలంలో ఒక్కసారిగా తెరపైకి దూసుకొచ్చి చైనాతోపాటు ఇతర ఆసియా దేశాల స్టార్ క్రీడాకారిణులను హడలెత్తిస్తున్న మారిన్ పరీక్షను ఈసారి సింధు పక్కా ప్రణాళికతో అధిగమించింది. మారిన్‌తో తొమ్మిదోసారి ఆడుతున్న సింధు తన ప్రత్యర్థి బలాలు, బలహీనతలపై చక్కగా హోంవర్క్ చేసి వచ్చినట్లు కనిపించింది. తొలి గేమ్‌లో తొలి పాయింట్ మారిన్ గెల్చుకున్నా... సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 6–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడారు. ఒకసారి సింధు ఖాతాలో పాయింట్లు చేరితే... మరోసారి మారిన్ది పైచేయి అయింది. వరుసగా రెండు పాయింట్లు నెగ్గిన మారిన్ స్కోరును 16–16తో సమం చేసింది. అనంతరం 19–18తో ముందుకు వెళ్లింది. కానీ సింధు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఆడుతూ కళ్లు చెదిరే స్మాష్‌లను సంధిస్తూ వరుసగా మూడు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను 22 నిమిషాల్లో కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లోనూ సింధు శుభారంభం చేసింది. వరుసగా నాలుగు పాయింట్లు గెలిచింది. సింధు దూకుడుకు అడ్డుకట్ట వేయాలని మారిన్ ప్రయత్నించినా ఆమె ఆటలు సాగలేదు. విరామానికి సింధు 11–7తో ఆధిక్యంలో నిలిచింది. విరామం తర్వాత మారిన్ స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా సింధు నిలకడగా పాయింట్లు గెలుస్తూ ఆధిక్యాన్ని కాపాడుకుంది. చివరకు మారిన్ కొట్టిన షాట్ నెట్‌కు తగలడంతో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్ సింధు వశమైంది. పురుషుల చాంప్ అక్సెల్సన్ అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) విజేతగా నిలిచాడు. ఫైనల్లో అక్సెల్సన్ 21–13, 21–10తో తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. సింధు కెరీర్లో ఇది రెండో సూపర్ సిరీస్ టైటిల్. గత ఏడాది ఆమె చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్‌ను సాధించింది. ఓవరాల్‌గా తొమ్మిదో అంతర్జాతీయ టైటిల్. గతంలో సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో మూడుసార్లు... మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రెండుసార్లు... సయ్యద్ మోడి ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఒకసారి... ఇండోనేసియా ఓపెన్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఒకసారి విజేతగా నిలిచింది. మారిన్‌తో తొమ్మిదిసార్లు ఆడిన సింధు ఆమెపై నాలుగోసారి గెలిచింది. రియో ఒలింపిక్స్ ఫైనల్లో మారిన్ చేతిలో ఓడిన తర్వాత వీరిద్దరూ మరో టోర్నీలో ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. గత ఏడాది చివర్లో దుబాయ్‌లో జరిగిన సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో మారిన్‌పై సింధు గెలిచింది. అంతేకాకుండా మారిన్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సింధు నెగ్గడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో నేను బాగా ఆడాను. తొలి గేమ్ నేను గెలవడం మ్యాచ్‌లో కీలక మలుపు. ఓవరాల్‌గా మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ ఫలితంతో నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఆరంభం నుంచీ ఇద్దరం ప్రతి పాయింట్ కోసం పోరాడాం. ఏ పాయింట్ కూడా సులువుగా రాలేదు. ఎవరి కెరీర్లో అయినా ఒడిదుడుకులు ఉండటం సహజం. సక్సెస్‌కు అడ్డదారులు లేవు. నిరంతరం శ్రమిస్తూ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తే విజయాలు అవే వస్తాయి. – సింధు సింధుకు సీఎం కేసీఆర్ అభినందనలు స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన పీవీ సింధును తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. ఈ టోర్నీలో ఆమె అసమాన ప్రతిభ కనబరిచిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా సింధును అభినందిస్తూ... భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 3 ఇండియా ఓపెన్‌కు సూపర్ సిరీస్ హోదా (2011లో) లభించాక... ఈ టైటిల్‌ను గెలిచిన మూడో భారత ప్లేయర్ సింధు. ఇంతకుముందు 2015లో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ విభాగంలో, అదే ఏడాది కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతలుగా నిలిచారు. 2010లో ఈ టోర్నీకి గ్రాండ్‌ప్రి గోల్డ్ హోదా ఉన్న సమయంలో సైనా నెహ్వాల్ టైటిల్ సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో గుత్తా జ్వాల–దిజు వలియవిటీల్ జంట చాంపియన్‌గా నిలిచింది. -
ఒలింపిక్ చాంపియన్‌పై సింధు విజయనాదం
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన కలను నెరవేర్చుకుంది. స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌ను సాధించింది. ఇండియా ఓపెన్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ కరోలినా మారిన్(స్పెయిన్) పై 21-19, 21-16 తేడాతో సింధు(భారత్) నెగ్గింది. దీంతో గతేడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో ఓటమికి సింధు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఇండియా ఓపెన్ టోర్నమెంట్ ఆరో ప్రయత్నంలో హైదరాబాద్ అమ్మాయి సింధు టైటిల్ కలను నిజం చేసుకుంది. తొలి గేమ్ ఆరంభంలో దూకుడుగా ఆడిన సింధు 6-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మారిన్ పుంజుకోవడంతో స్కోరు 17-16 అయింది. ఆపై సింధు, మారిన్ హోరీహారీగా పాయింట్లు రాబట్టడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో సింధు 21-19తో తొలి గేమ్ సాధించింది. రెండో గేమ్‌లో మారిన్ పాయింట్ల తెరవకముందే సింధు 4 పాయింట్లు తనఖాతాలో వేసుకుంది. మారిన్ వేగం పెంచడంతో సింధు గేమ్ ప్లాన్ చేంజ్ చేసి పదునైన ర్యాలీలు, స్మాష్‌లతో ఒలింపిక్ విన్నర్ ను కంగారెత్తించింది. రెండో గేమ్‌ను 21-16తో నెగ్గిన సింధు మ్యాచ్‌ను సొంతం చేసుకుని సొంత దేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ ను ఒడిసి పట్టుకుంది. ప్రత్యర్థి పాయింట్లు సాధిస్తున్నా ఏ దశలోనూ సింధు ఒత్తిడికి లోను కాకపోవడం ఆమెకు అనుకూల ఫలితాలను తెచ్చింది. ఈ విజయంతో మారిన్ పై గెలుపోటముల రికార్డును 4-5తో సింధు మెరుగు పరుచుకుంది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌ను నెగ్గిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని.. ఈ విజయాల పరంపర కొనసాగించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
మారిన్... కాచుకో!
-
మారిన్... కాచుకో!
♦ ఇండియా ఓపెన్ ఫైనల్లోకి సింధు ♦ నేడు ఒలింపిక్ చాంపియన్ మారిన్‌తో అమీతుమీ ♦ సెమీస్‌లో సుంగ్ జీ హున్‌పై విజయం స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ సాధించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒక్క విజయం దూరంలో నిలిచింది. ఇండియా ఓపెన్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆరోసారి ఈ టోర్నీలో ఆడుతోన్న సింధు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఆదివారం జరిగే ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ కరోలినా మారిన్‌తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. గత ఏడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో మారిన్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునేందుకు సింధుకు మరో అవకాశం వచ్చింది. న్యూఢిల్లీ: గతంలో సైనా నెహ్వాల్ సాధించిన ఘనతలను ఒక్కోటి అధిగమిస్తున్న పీవీ సింధు మరో చిరస్మరణీయ విజయానికి చేరువైంది. స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్‌కు ఈ తెలుగు తేజం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ పీవీ సింధు 76 నిమిషాల్లో 21–18, 14–21, 21–14తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. సుంగ్ జీ హున్‌తో 11వ సారి తలపడిన సింధు ఏడోసారి గెలుపొందడం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 3–5తో వెనుకబడి ఉంది. అంతర్జాతీయ టోర్నీలో వీరిద్దరూ చివరిసారి గత డిసెంబరులో దుబాయ్‌లో జరిగిన వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో తలపడగా... సింధు వరుస గేముల్లో 21–17, 21–13తో మారిన్‌పై గెలిచింది. అయితే ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మ్యాచ్‌లో మాత్రం మారిన్ (హైదరాబాద్ హంటర్స్) 11–8, 12–14, 11–2తో సింధుపై గెలిచింది. ప్రస్తుతం ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉండటంతో ఫైనల్ హోరాహోరీగా సాగే అవకాశముంది. క్వార్టర్ ఫైనల్లో సైనాపై సాధికారిక విజయం సాధించిన సింధు అదే జోరును సెమీస్‌లోనూ కొనసాగించింది. అడపాదడపా స్మాష్ షాట్లు సంధిస్తూ, సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ... అప్పుడప్పుడూ డ్రాప్ షాట్లు ఆడుతూ సింధు తన ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టింది. తొలి గేమ్‌లో ఒకదశలో సింధు 5–7తో వెనుకబడినా... ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 10–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న సింధు తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ ఆరంభంలో సింధు 5–1తో ముందంజ వేసినా... సుంగ్ జీ హున్ పట్టుదలతో ఆడి కోలుకుంది. వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన ఈ కొరియా స్టార్ 8–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరోవైపు సింధు కూడా అనవసర తప్పిదాలు చేయడంతో రెండో గేమ్‌ను సుంగ్ జీ హున్ 21–14తో దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆడింది. వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 4–0తో మూడో గేమ్‌లో శుభారంభం చేసింది. విరామ సమయానికి సింధు 11–4తో ఏడు పాయింట్ల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. ఆ తర్వాత సింధు నిలకడగా రాణించగా... సుంగ్ జీ హున్ పోరాడినా సింధును అందుకోలేకపోయింది. ఈ గేమ్‌లో ఇద్దరి స్కోర్లు ఒక్కసారి కూడా సమం కాకపోవడం గమనార్హం. రెండో సెమీఫైనల్లో మారిన్ 21–16, 21–14తో అకానె యామగుచి (జపాన్)పై నెగ్గింది. ఎవరు బాగా ఆడితే... దుబాయ్‌లో జరిగిన సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో నేను, మారిన్ హోరాహోరీగా తలపడ్డాం. అప్పుడు నేనే గెలిచాను. కానీ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో ఆమె చేతిలో నాకు ఓటమి ఎదురైంది. ఇప్పుడు ఢిల్లీలో మరో సమరానికి సిద్ధమయ్యాం. ఇక్కడ ప్రేక్షకుల మద్దతు నాకే వుంటుంది. దీంతో రాణిస్తాను. దుబాయ్, పీబీఎల్లతో పోల్చితే ఇక్కడ భిన్నమైన పరిస్థితులుంటాయి. గేమ్, పరిస్థితులు, శైలీ అంతా ఇక్కడ కొత్తకొత్తగానే ఉంటుంది. పైగా ఒకరి బలాబలాల గురించి మా ఇద్దరికీ బాగా తెలుసు. దీంతో ఈ మ్యాచ్‌లో తాజా వ్యూహం, తాజా గేమ్‌తో బరిలోకి దిగుతా. అంతిమంగా ఎవరు బాగా ఆడితే వాళ్లే విజేతగా నిలుస్తారు. నేను బాగా ఆడతాననే ఆశిస్తున్నా. – సింధు నేటి ఫైనల్స్ మధ్యాహ్నం గం. 2.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
మరి నీ సంగతి ఏమిటి మారిన్ ?: సైనా
న్యూఢిల్లీ: తనను తిరిగి నంబర్ వన్ కానివ్వనంటూ స్పెయిన్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేసిన వ్యాఖ్యలపై భారత షట్లర్ సైనా నెహ్వాల్ తీవ్రంగా స్పందించింది. తన సంగతి పక్కన పెడితే.. మరి నువ్వు నంబర్ అవుతావా అంటూ సైనా చురకలంటించింది. ఇందుకు ఇండియన్ ఓపెన్ సిరీస్ టోర్నీ వేదికైంది. 'నంబర్ వన్ ర్యాంకుపై దృష్టి పెట్టడం నా పని కాదు. వరుసగా టోర్నమెంట్లు గెలుస్తూ ముందుకు సాగడమే నాకు తెలిసిన విద్య. నేను ఎప్పుడూ నంబర్ వన్ ర్యాంకు కోసం ఆలోచించలేదు.. ఆలోచించను కూడా. నేను 30వ ర్యాంకులు ఉన్నప్పట్నుంచి టోర్నమెంట్లు గెలవడంపై దృష్టి సారించా. అవే నాకు అత్యంత తృప్తినిస్తాయి. ఒకవేళ నన్ను నంబర్ వన్ కానివ్వకుండా నువ్వు అడ్డుకుంటే ఓకే. మరి మారిన్ నంబర్ వన్ అవుతుందేమో చూద్దాం' అని సైనా వ్యంగ్యంగా తిప్పికొట్టింది. ప్రస్తుతం మారిన్ ప్రపంచ నాల్గో ర్యాంకులో ఉంటే, సైనా నెహ్వాల్ ఎనిమిదో ర్యాంకులో ఉంది. -
వామ్మో... అన్ని కోట్లా!
ముంబై: ఒక్క ఒలింపిక్స్ రజతంతోనే పి.వి. సింధు రూ. 13 కోట్ల మేర నగదు నజరానా అందుకోవడంపై ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రియోలో సింధును ఓడించి బంగారు పతకం నెగ్గిన ఆమెకు స్పెయిన్ ప్రభుత్వం రూ. 70 లక్షలు అందజేసింది. ‘సింధుకు అందిన మొత్తం విని ఆశ్చర్యపోయాను. ఆమె కోట్లు గడించింది. నాకూ మా ప్రభుత్వం నుంచి నజరానా అందింది. కానీ నేను ఆమె అందుకున్న మొత్తంలో కేవలం పదో, పదిహేను శాతమో పొందాను. పతకాలు గెలిచిన క్రీడాకారులు ఇక్కడెంత పాపులరో నాకర్థమైంది’ అని మారిన్ చెప్పింది. మారిన్ కోచ్ ఫెర్నాండో రివస్ కూడా ఇక్కడి భారీ పారితోషికాలపై ఆశ్చర్యపోయారు. ఒలింపిక్ చాంపియన్లపై కోట్లు గుమ్మరించడం గొప్ప విషయమన్నాడు. కరోలినా మారిన్ ప్రస్తుతం ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో ఆడుతోంది. -
ముంబై చేతిలో హంటర్స్‌కు షాక్
ముంబై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2)లో ముంబై రాకెట్స్ జోరుకు హైదరాబాద్ హంటర్స్ తలవంచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాకెట్స్ 2–1తో హంటర్స్పై విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో కరోలినా మారిన్ పరాజయం హంటర్స్‌ను నిరాశపరిచింది. మొదట పురుషుల డబుల్స్‌లో లి యోంగ్ డే–నిపిత్‌ఫోన్ ఫుంగ్ఫపెట్ (ముంబై) జోడి 11–9, 11–5తో తన్ బూన్ హ్యంగ్–తన్ వీ కియోంగ్ (హైదరాబాద్) జంటపై గెలిచింది. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో మారిన్ (హైదరాబాద్) 7–11, 11–7, 12–14తో జీ హ్యూన్ సంగ్ (ముంబై) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో రాజీవ్ ఉసెఫ్ (హైదరాబాద్) 11–7, 11–8తో అజయ్ జయరామ్ (ముంబై)పై గెలిచాడు. అనంతరం ముంబై తమ ‘ట్రంప్’ మ్యాచ్‌గా బరిలోకి దిగిన మిక్స్డ్ డబుల్స్‌లో ఓడింది. సాత్విక్ సాయిరాజ్–చౌ హో వా (హైదరాబాద్) జంట 11–13, 12–10, 15–14తో లీయోంగ్ డే– జియెబా (ముంబై) జోడిపై నెగ్గింది. చివరగా జరిగిన హైదరాబాద్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో ప్రణయ్ (ముంబై) 11–6, 11–7తో సమీర్ వర్మ (హైదరాబాద్)ను ఓడించడంతో ముంబై 2–1తో గెలుపొందింది. గురువారం జరిగే మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌తో ఢిల్లీ ఏసర్స్ తలపడుతుంది. -
హంటర్స్‌కు వారియర్స్ షాక్
5–0తో హైదరాబాద్‌పై గెలుపు మారిన్ చేతిలో సైనా ఓటమి హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్లో హైదరాబాద్ హంటర్స్ జట్టుకు అవధ్ వారియర్స్ చేతిలో పరాభవం ఎదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ 0–5తో పరాజయం చవిచూసింది. ఈ పోరులో కరోలినా మారిన్ (హైదరాబాద్) ఒక్కరే గెలిచినప్పటికీ... హంటర్స్ జట్టు ‘ట్రంప్’ మ్యాచ్ ఓడిపోవడం ద్వారా సాధించిన ఆ ఒక్క పాయింట్ కూడా కోల్పోవాల్సివచ్చింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో వాంగ్ వింగ్‌కి విన్సెంట్ (వారియర్స్) 11–13, 11–6, 13–11తో సాయి ప్రణీత్ (హంటర్స్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో రియో ఒలింపిక్స్ చాంపియన్ మారిన్ (హంటర్స్) 15–14, 11–5తో సైనా నెహ్వాల్ (వారియర్స్)ను కంగుతినిపించింది. మిక్స్డ్ డబుల్స్‌ను అవధ్ వారియర్స్ జట్టు తమ ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంచుకోగా... బొదిన్ ఇసారా–సావిత్రి (వారియర్స్) 11–9, 12–10తో చౌ వా– సాత్విక్ సాయిరాజ్ (హంటర్స్)లపై గెలిచారు. దీంతో రెండు పాయింట్లు లభించాయి. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (వారియర్స్) 11–13, 11–7, 13–11తో రాజీవ్ ఉసెఫ్ (హంటర్స్)పై గెలిచాడు. చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌ను హైదరాబాద్ తమ ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంచుకుంది. కానీ ఇందులో కూడా గో వి షెమ్–మార్క్స్ కిడో (వారియర్స్) 7–11, 11–8, 13–11తో టాన్ బూన్–టాన్ వీ (హంటర్స్)లను ఓడించారు. సోమవారంతో హైదరాబాద్ అంచె లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. మంగళవారం ముంబైలో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్‌తో చెన్నై స్మాషర్స్ తలపడుతుంది. -
సింధును చిత్తు చేసిన కరోలినా
-
‘షటిల్’ సందడి
-
మారో మారో మారిన్...
హైదరాబాద్ గెలిచింది.. హైదరాబాదీ ఓడింది ఒకవైపు సొంతగడ్డపై ఆడుతున్న సింధు... మరోవైపు స్థానిక జట్టు హైదరాబాద్ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరోలినా మారిన్... ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రేక్షకులంతా దాదాపు సమంగా చీలిపోయారు. అయితే చివరకు ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ కరోలినాదే పైచేయి అయింది. తుదకు హైదరాబాద్ హంటర్స్ 4–3తో సింధు ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై స్మాషర్స్‌ను ఓడించి బోణీ చేసింది. సింధును చిత్తు చేసిన కరోలినా తొలి మ్యాచ్‌లో హంటర్స్ శుభారంభం ఒకవైపు సొంతగడ్డపై ఆడుతున్న సింధు... మరోవైపు స్థానిక జట్టు హైదరాబాద్ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరోలినా మారిన్... ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రేక్షకులంతా దాదాపు సమంగా చీలిపోయారు. ఇద్దరు స్టార్ ప్లేయర్ల పక్షం వహించారు. అయితే చివరకు ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ కరోలినాదే పైచేయి అయింది. రెండు గేమ్‌లు హోరాహోరీగా సాగినా... నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం స్పెయిన్ స్టార్ చెలరేగిపోయింది. హంటర్స్ జట్టుకు శుభారంభాన్ని అందించింది. ఘనంగా ప్రారంభమైన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)–2 టోర్నీలో అందరూ ఆశించిన వినోదం మొదటి మ్యాచ్‌లోనే దక్కింది. తుదకు హైదరాబాద్ హంటర్స్ 4–3తో చెన్నై స్మాషర్స్‌ను ఓడించి బోణీ చేసింది. హైదరాబాద్: పీవీ సింధు వర్సెస్ కరోలినా మారిన్... రియో ఒలింపిక్స్ ఫైనల్ తర్వాత వీరిద్దరి మ్యాచ్‌ను భారత గడ్డపై చూడాలనుకున్న మన అభిమానులకు కొత్త సంవత్సరం మొదటి రోజునే ఆ అవకాశం లభించింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) టోర్నీ రెండో సీజన్లో భాగంగా ఈసారి తమ ఫ్రాంచైజీలు హైదరాబాద్ హంటర్స్, చెన్నై స్మాషర్స్ తరఫున ఆదివారం వీరిద్దరు తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో మారిన్ (హంటర్స్) 11–8, 12–14, 11–2 స్కోరుతో పీవీ సింధుపై విజయం సాధించింది. ఇటీవలే దుబాయ్‌లో జరిగిన వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ లీగ్ మ్యాచ్‌లో సింధు చేతిలో ఓడిన మారిన్, మరోసారి తన సామర్థ్యానికి తగిన ప్రదర్శనను కనబర్చడంతో సింధుకు నిరాశ తప్పలేదు. మారిన్ విజయంతో శుభారంభం చేసిన హంటర్స్ చివరకు ఈ పోరులో 4–3 పాయింట్ల తేడాతో చెన్నై స్మాషర్స్‌ను ఓడించింది. ప్రతి పోటీలో రెండు జట్లు ఒక్కో మ్యాచ్‌ను తమ ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంపిక చేసుకుంటాయి. ‘ట్రంప్’ మ్యాచ్ ల్లో గెలిస్తే రెండు పాయింట్లు లభిస్తాయి. ఇతర మ్యాచ్‌ల్లో మాత్రం ఒక్కో పాయింట్ దక్కుతాయి. మారిన్ గెలుపుతో హైదరాబాద్ హంటర్స్ 1–0తో ఆధిక్యంలో వెళ్లింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో టామీ సుగియార్తో (చెన్నై) 11–6, 11–8తో భమిడిపాటి సాయిప్రణీత్ (హైదరాబాద్)ను ఓడించాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. చెన్నై స్మాషర్స్ జట్టు మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌ను తమ ట్రంప్ మ్యాచ్‌గా ఎంపిక చేసుకుంది. ఈ మ్యాచ్‌లో క్రిస్ అడ్కాక్–గాబ్రిలీ అడ్కాక్ ద్వయం (చెన్నై) 11–7, 11–9తో హోయ్ వా చౌ–సాత్విక్ సాయిరాజ్ (హైదరాబాద్) జోడీని ఓడించింది. దాంతో చెన్నై 3–1తో ఆధిక్యంలో వెళ్లింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో రాజీవ్ ఉసెఫ్ (హైదరాబాద్) 6–11, 11–8, 11–6తో తనోంగ్సక్ సెన్సోమ్బూన్సుక్ (చెన్నై)పై గెలిచాడు. దాంతో చెన్నై ఆధిక్యం 3–2కి తగ్గింది. చివరిదైన ఐదో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్ పోరులో బూన్ హెయోంగ్ తాన్–వీ కియోంగ్ తాన్ (హైదరాబాద్) జంట 11–7, 11–8తో కోల్డింగ్–సుమీత్ రెడ్డి (చెన్నై) జోడీపై గెలిచింది. ఈ మ్యాచ్‌ను హంటర్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంపిక చేసుకోవడం, విజయం కూడా సాధించడంతో ఓవరాల్‌గా హైదరాబాద్ 4–3తో విజయాన్ని ఖాయం చేసుకుంది. మారిన్ దూకుడు... సింధుతో జరిగిన మ్యాచ్‌లో కరోలినా తొలి పాయింట్ సాధించి శుభారంభం చేసింది. అయితే ఆ తర్వాత ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. 4–4 వద్ద చక్కటి డ్రాప్ షాట్లో మారిన్ ముందంజ వేయగా, వెంటనే సింధు కోలుకుంది. అయితే 6–6 వద్ద సమంగా ఉన్న స్థితిలో మారిన్ వరుసగా మూడు పాయింట్లు సాధించింది. సింధు కాస్త పోటీనిచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రెండో గేమ్‌లో కూడా ముందుగా పాయింట్లు సొంతం చేసుకొని మారిన్ 3–0తో ముందంజ వేసింది. అయితే 2–5తో వెనుకబడి ఉన్న సమయంలో సింధు ఒక్కసారిగా చెలరేగిపోయింది. స్మాష్, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థిని కోలుకోనీయకుండా చేసిన సింధు వరుసగా 5 పాయింట్లు స్కోర్ చేసి 7–5తో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో ఆ తర్వాత పోరు మరింత రసవత్తరంగా మారింది. ఒకరితో మరొకరు పోటీ పడి ప్రతీ పాయింట్ కోసం శ్రమించడంతో స్కోరు సమమవుతూ వచ్చింది. మారిన్ 10–8 వద్ద మ్యాచ్ సొంతం చేసుకునే స్థితిలో నిలిచినా, సింధు పోరాడింది. తనదైన శైలిలో అద్భుతమైన స్మాష్‌తో స్కోరు సమం చేసిన సింధు, ఆ తర్వాత గేమ్‌ను గెలుచుకుంది. మూడో గేమ్‌లో మారిన్ ఆట ముందు సింధు సాధారణ ప్లేయర్‌గా మారిపోయింది. ఏకంగా 5–0తో ముందంజ వేసిన తర్వాత ప్రత్యర్థికి మొదటి పాయింట్ ఇచ్చిన మారిన్, తర్వాత కూడా మరో పాయింట్‌నే సింధుకు కోల్పోయింది. మారిన్ షాట్లకు సింధు వద్ద సమాధానం లేకుండా పోయింది. మారిన్ డ్రాప్ షాట్లతో పాటు లైన్ కాల్‌లను కూడా ఆమె సరిగ్గా అంచనా వేయగా... అన్నింటా పొరబడిన సింధు, సరైన రీతిలో స్పందించలేక ప్రేక్షకురాలిగా మారిపోయింది. పీబీఎల్–2లో నేడు హైదరాబాద్ హంటర్స్ గీ అవధ్ వారియర్స్ రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
సూపర్ సింధు
మారిన్‌పై విజయంతో సెమీస్‌లోకి దుబాయ్: రియో ఒలింపిక్స్ ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఎదురైన పరాజయానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బదులు తీర్చుకుంది. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో సింధు 21–17, 21–13తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్ మారిన్‌ను మట్టికరిపించింది. మోకాలి గాయంతో బాధపడుతున్న మారిన్ వరుసగా మూడు పరాజయాలతో ఈ టోర్నీని ముగించి ఇంటిదారి పట్టింది. ఇదే గ్రూప్ నుంచి సున్ యు మరో సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. గ్రూప్ ‘ఎ’ నుంచి సుంగ్ జీ హున్ (కొరియా), తై జు యింగ్ (చైనీస్ తైపీ) సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్‌తో సింధు, సుంగ్ జీ హున్‌తో సున్ యు తలపడతారు. ప్రపంచ రెండో ర్యాంకర్ మారిన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు ఆద్యంతం దూకుడుగా ఆడింది. తొలి గేమ్ ఆరంభంలో 3–7తో వెనుకబడిన సింధు ఆ వెంటనే కోలుకొని వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 8–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం ఇద్దరి మధ్య ఆధిక్యం దోబూచులాడింది. అయితే స్కోరు 11–12 వద్ద సింధు మరోసారి ఐదు వరుస పాయింట్లు నెగ్గి 16–12తో ముందంజ వేసింది. అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు ప్రణాళిక ప్రకారం ఆడి మారిన్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. -
మొదలైంది వేట...
సింధు శుభారంభం తొలి మ్యాచ్‌లో యామగుచిపై విజయం మారిన్‌కు సున్ యు షాక్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ రెండు వారాల తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు... సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో బోణీ చేసింది. కొంతకాలంగా జోరు మీదున్న ఈ హైదరాబాద్ అమ్మాయి మెగా ఈవెంట్లో శుభారంభం చేసి... టైటిల్ ఫేవరెట్స్ జాబితాలో తాను ఉన్నానని ప్రత్యర్థులకు సంకేతాలు పంపించింది. దుబాయ్: చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... సీజన్ ముగింపు టోర్నమెంట్‌కు ఆఖరి బెర్త్ రూపంలో అర్హత పొందిన పీవీ సింధు తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకుంది. వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ఈ హైదరాబాద్ షట్లర్ అంచనాలకు అనుగుణంగా రాణించి రెండో సీడ్‌ను బోల్తా కొట్టించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పీవీ సింధు 12–21, 21–8, 21–15తో రెండో సీడ్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)పై గెలిచింది. ఇదే గ్రూప్‌లోని మరో లీగ్ మ్యాచ్‌లో సున్ యు (చైనా) 21–18, 24–22తో ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)పై సంచలన విజయం సాధించింది. తడబడి... తేరుకొని... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ద్వారా ఈ ఏడాది ‘అత్యంత పురోగతి సాధించిన క్రీడాకారిణి’ పురస్కారాన్ని అందుకున్న సింధు ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో తడబడింది. ఈ ఏడాది డెన్మార్క్ ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీల్లో విజేతగా నిలిచిన అకానె ఆరంభం నుంచి దూకుడుగా ఆడి 14–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. అకానె ఆటతీరును అంచనా వేయలేకపోయిన సింధు అనవసర తప్పిదాలు కూడా చేసి తొలి గేమ్‌ను 16 నిమిషాల్లో చేజార్చుకుంది. ఇక రెండో గేమ్‌లో సింధు ఆటతీరు మారిపోయింది. కోచ్ పుల్లెల గోపీచంద్ ఇచ్చిన సలహాలను పాటిస్తూ, ఒక ప్రణాళిక ప్రకారం ఆడిన సింధు మొదట్లో 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అవకాశం దొరికినపుడల్లా పదునైన స్మాష్‌లు సంధించడం... డ్రాప్ షాట్లు కొట్టడం... సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధించడం... నెట్ వద్ద అప్రమత్తత కారణంగా సింధు ఈ గేమ్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. విరామానికి 11–7తో ముందంజలో ఉన్న సింధు అదే జోరులో రెండో గేమ్‌ను 19 నిమిషాల్లో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్ సుదీర్ఘ ర్యాలీతో మొదలైంది. అయితే యామగుచి కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో సింధు ఖాతాలో తొలి పాయింట్ చేరింది. అకానె బలహీనతలపై అవగాహన పెంచుకున్న సింధు దానికి తగ్గట్టు ఆడుతూ 6–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింధు మరింత జోరు పెంచింది. వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 16–10తో ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. మరోవైపు అకానె తేరుకునే ప్రయత్నం చేసినా సింధు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా మూడో గేమ్‌ను 27 నిమిషాల్లో దక్కించుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సున్ యు (చైనా)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో ఈ ఇద్దరూ 3–3తో సమంగా ఉన్నారు. -
కొత్త లక్ష్యంతో...
నేటి నుంచి వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్ తొలిసారి పోటీపడుతున్న పీవీ సింధు భారత షట్లర్ గ్రూప్‌లోనే కరోలినా మారిన్ ఈ ఏడాది అద్వితీయ ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు గొప్ప విజయాలు సాధించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడం... కెరీర్లో లోటుగా ఉన్న ‘సూపర్ సిరీస్’ టైటిల్‌నూ సొంతం చేసుకోవడం... ఇలా తాను నిర్దేశించుకున్న ఒక్కో లక్ష్యాన్ని ఈ హైదరాబాద్ అమ్మాయి సమర్ధవంతంగా చేరుకుంది. ఇక సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక ‘వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్’ టోర్నమెంట్‌కు సింధు తొలిసారి అర్హత సాధించింది. ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగుతున్న తొలిసారే తనదైన ముద్ర వేయాలనే లక్ష్యంతో ఆమె దుబాయ్‌లో అడుగుపెట్టింది. 2011లో సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలువడం భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన. సింధు తన దూకుడు కొనసాగించి సైనా ఘనతను సవరిస్తుందా? లేదా ఆమె సరసన నిలుస్తుందో లేదో వేచి చూడాలి. సాయంత్రం 6.00 నుంచి స్టార్ స్పోర్ట్స్4లో ప్రత్యక్ష ప్రసారం సాక్షి క్రీడా విభాగం : అంతర్జాతీయస్థాయిలో అడుగుపెట్టిన కొన్నేళ్లకే ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో పరీక్షకు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా బుధవారం తెర లేవనున్న వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈనెల 18 వరకు జరిగే ఈ టోర్నీలో సింధుతో పాటు ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), అకానె యామగుచి (జపాన్), సున్ యు (చైనా), హీ బింగ్జియావో (చైనా), సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా), ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) పాల్గొంటున్నారు. గ్రూప్ ‘ఎ’లో తై జు యింగ్, సుంగ్ జీ హున్, రచనోక్, హీ బింగ్జియావో... గ్రూప్ ‘బి’లో సింధు, మారిన్, యామగుచి, సున్ యు ఉన్నారు. బుధవారం జరిగే తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో అకానె యామగుచితో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 2–1తో ఆధిక్యంలో ఉంది. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో సున్ యుతో... శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో కరోలినా మారిన్‌తో సింధు తలపడుతుంది. చివరి టోర్నీతో బెర్త్... 2011 నుంచి గత ఏడాది వరకు మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి సైనా నెహ్వాల్ ఈ మెగా ఈవెంట్లో ఆడింది. కానీ ఈసారి మాత్రం సైనాను వెనక్కినెట్టి సింధు ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి బెర్త్ సాధించింది. సీజన్ చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్‌లో సింధు రన్నరప్‌గా నిలువడం... అదే టోర్నీలో సైనా క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించడం జరిగింది. దాంతో సూపర్ సిరీస్ ర్యాంకింగ్స్‌లో సింధు 46,290 పాయింట్లతో చివరిదైన 8వ బెర్త్ దక్కించుకోగా... 43,120 పాయింట్లతో సైనా తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచి ఈ టోర్నీకి అర్హత పొందలేకపోయింది. నిలకడగా రాణిస్తేనే... అగ్రశ్రేణి క్రీడాకారుల కోసం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సీజన్ మొత్తంలో 12 సూపర్ సిరీస్ టోర్నమెంట్లు నిర్వహిస్తుంది. ఇందులో ఆరు సూపర్ సిరీస్ టోర్నీలు కాగా... మరో ఆరు ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీలు. సూపర్ సిరీస్‌తో పోలిస్తే ప్రీమియర్ టోర్నీలో ప్రైజ్‌మనీ, ర్యాంకింగ్ పాయింట్లు ఎక్కువగా లభిస్తాయి. 12 సూపర్ సిరీస్ టోర్నీలు ముగిశాక ఈ టోర్నీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా టాప్–8లో నిలిచిన వారు ‘మాస్టర్స్ ఫైనల్స్’కు అర్హత పొందుతారు. 10 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఇదీ ఫార్మాట్... పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలుంటాయి. ప్రతి విభాగంలో రెండు గ్రూప్‌లు ఉన్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం... ఈ ఏడాది నిలకడగా రాణించిన సింధుకు దానికి తగ్గ గుర్తింపు లభించింది. ప్రపంచ బ్యాడ్మిం టన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వార్షిక పురస్కారాల్లో ఆమెకు ‘మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్’ (చాలా మెరుగైన క్రీడాకారిణి) అవార్డు లభించింది. దుబాయ్‌లో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు దావూద్ అల్ హజ్రి చేతుల మీదుగా సింధు ఈ అవార్డును అందుకుంది. ఈ పురస్కారం లభిస్తుందని అనుకోలేదు. ఊహించని అవార్డు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. దుబాయ్‌లో తొలిసారి సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్‌ను ఆడనున్నాను. నాకు ‘డ్రా’ కఠినంగా పడింది. మారిన్, బింగ్జియావో, సున్ యులతో మా గ్రూప్ పటిష్టంగా ఉంది. మంచి ఫలితాలను సాధించాలంటే నేను తొలి మ్యాచ్ నుంచే బాగా ఆడాల్సి ఉంటుంది. –పీవీ సింధు -
ఒకే గ్రూప్‌లో సింధు, మారిన్
దుబాయ్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో రియో ఒలింపిక్స్ విజేత కరోలినా మారిన్, రన్నరప్ పీవీ సింధు ఒకే గ్రూప్‌లో ఉన్నారు. ఈనెల 14 నుంచి దుబాయ్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్ ‘డ్రా’ వివరాలను వెల్లడించారు. గ్రూప్ ‘బి’లో ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ మారిన్ (స్పెయిన్), సింధు (భారత్), అకానె యామగుచి (జపాన్), సున్ యు (చైనా)లకు చోటు కల్పించారు. గ్రూప్ ‘ఎ’లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), సుంగ్ జీ హున్ (కొరియా), ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్), హీ బింగ్జియావో (చైనా) ఉన్నారు. లీగ్ దశ ముగిశాక రెండు గ్రూప్‌ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచినవారు సెమీస్‌కు అర్హత సాధిస్తారు. -
‘పీబీఎల్’ టైటిల్ గెలుస్తాం: పీవీ సింధు
-
‘పీబీఎల్’ టైటిల్ గెలుస్తాం: పీవీ సింధు
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్లో సత్తా చాటేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని, ఈసారి టైటిల్ సొంతం చేసుకుంటామని భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. పీబీఎల్‌లో సింధు చెన్నై స్మాషర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘గత సీజన్లో కూడా మెరుగైన ప్రదర్శనతో సెమీస్ చేరాం. మా జట్టులో అనేక మంది అత్యుత్తమ షట్లర్లు ఉన్నారు. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం’ అని సింధు పేర్కొంది. మరోవైపు రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ కూడా సింధుతో పోరుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ‘మా మధ్య రియోలో ఫైనల్ చాలా బాగా జరిగింది. ఈసారి కూడా అలాంటి హోరాహోరీ ఆటను ఆశిస్తున్నాం. ఆమెతో మ్యాచ్ అంటే నాకు సవాలే. ఆటలో తలపడి ఆ తర్వాత హైదరాబాద్‌లో సింధు ఆతిథ్యం కూడా స్వీకరిస్తా’ అని మాడ్రిడ్ నుంచి లైవ్ చాట్‌లో మారిన్ వ్యాఖ్యానించింది. హైదరాబాద్ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్న మారిన్, లీగ్‌లో అత్యధికంగా రూ. 61.5 లక్షలు అందుకుంటోంది. ఆరు జట్లు తలపడుతున్న పీబీఎల్ రెండో సీజన్ పోటీలు జనవరి 1 నుంచి 14 వరకు జరుగుతాయని లీగ్ నిర్వాహకులు ‘స్పోర్‌ట్సలైవ్’ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రసాద్ మంగినపూడి వెల్లడించారు. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి ఫార్మాట్‌ను కాస్త మారుస్తూ మూడు గేమ్‌లను కూడా 11 పారుుంట్లకు పరిమితం చేశారు. 11 పాయింట్ల మ్యాచ్‌ల వల్ల ఆటలో మరింత వేగం పెరుగుతుందని, ఒక్కసారి వెనుకబడితే కోలుకునే అవకాశం ఉండదని అవధ్ వారియర్స్ తరఫున బరిలోకి దిగనున్న తెలుగు ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. -
కరోలినా మారిన్‌కు షాక్
కౌలూన్:హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో వరల్డ్ నంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్, స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌కు షాక్ తగిలింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో మారిన్ 17-21, 21-14, 16-21 తేడాతో తాయ్ జు యింగ్(తైవాన్) చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌లో ఓటమి పాలై వెనుకబడిన మారిన్.. రెండో గేమ్‌ను అవలీలగా సొంతం చేసుకుంది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మారిన్ అనవసర తప్పిదాలు చేసి ఆ గేమ్‌ను చేజార్చుకుని పరాజయం చెందింది. దాంతో రియో ఒలింపిక్స్ స్వర్ణం తరువాత తొలిసారి ఫైనల్‌కు చేరాలనుకున్న మారిన్ ఆశలకు బ్రేక్ పడింది. గత రెండు వారాల్లో తాయ్ చేతిలో మారిన్ ఓటమి పాలుకావడం రెండోసారి. ఇటీవల జరిగిన చైనా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో మారిన్‌ను తాయ్ ఓడించింది. -
సింధు మ్యాచ్.. సెన్సేషనల్ హిట్!
రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు అసమాన పోరాటం దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన ఆమె ఫైనల్ మ్యాచ్.. దేశ ప్రజలను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. ప్రపంచ నంబర్, స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్‌తో సింధు తలపడిన రియో ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్‌ను ఏకంగా భారత్‌లో 6.65 కోట్లమంది చూశారు. భారత్ పరంగా చూసుకుంటే రియో ఒలింపిక్స్‌లో అత్యధికులు చూసిన సింగిల్ మ్యాచ్ ఇదే. అంతేకాదు దేశంలో అత్యంత పాపులర్ అయిన 'ద కపిల్ శర్మ షో' వంటివాటిని సింధు ఫైనల్ మ్యాచ్ అధిగమించడం విశేషం. 'ద కపిల్ శర్మ షో'ను ప్రతివారం ఐదు కోట్ల మంది వీక్షిస్తుండగా సింధు ఫైనల్ మ్యాచ్‌ను ఏకంగా 6.65 కోట్లమంది వీక్షించారని మీడియా రీసెర్చ్ సంస్థ జపర్ తెలిపింది. రియో ఒలింపిక్స్‌లో సింధు ఆడుతున్న మ్యాచ్‌లకు క్రమంగా వ్యూయర్షిప్ పెరిగింది. మొదట ఆమె మ్యాచ్‌లకు 16.4 మిలియన్ల వ్యూయర్షిప్ ఉండగా.. ఫైనల్ మ్యాచ్‌కు వచ్చేసరికి అది అమాంతం పెరిగిపోయింది. ఇక, ఆమె సెమీఫైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో చూసిన ప్రేక్షకుల్లో 57.4శాతం మంది ఫైనల్ మ్యాచ్‌ను కూడా ప్రత్యక్ష ప్రసారంలో చూశారు. సింధు ప్రతిభ మీద ఉన్న అపారమైన నమ్మకమే ఆమె ఫైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో చూసేందుకు చాలామందిని ప్రోత్సహించినట్టు నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్‌లో రికార్డు వ్యూయర్షిప్ పీవీ సింధుకు స్వస్థలం హైదరాబాద్ నుంచి భారీ మద్దతు లభించినట్టు టీవీ వ్యూయర్షిప్ స్పష్టం చేస్తున్నది. దేశంలో ముంబై తర్వాత అత్యధికంగా సింధు మ్యాచ్‌ను చూసింది హైదరాబాదీలే. నగరాల వ్యూయర్షిప్ విషయంలో ముంబై ప్రథమస్థానంలో ఉంటే హైదరాబాద్ ద్వితీయ స్థానంలో ఉంది. బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) వివరాల ప్రకారం రెండువారాలపాటు జరిగిన రియో ఒలింపిక్స్‌ను దేశంలో తొమ్మిది చానెళ్లలో 22.8 కోట్లమంది వీక్షించారు. -
'సింధు మైండ్ గేమ్ ఆడింది'
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన ఏకాగ్రతను దెబ్బతీసేలా మైండ్ గేమ్ ఆడిందని ప్రపంచ నంబర్ వన్, స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ చెప్పింది. శుక్రవారం రాత్రి జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధుపై 19-21, 21-12, 21-15 నెగ్గిన అనంతరం మారిన్ మీడియాతో మాట్లాడింది. ముఖ్యంగా సింధుకు తొలి గేమ్ కోల్పోయిన తర్వాత ఆటపై తన ఫోకస్ పెంచానని తెలిపింది. రియోకు ముందు 4-3 గెలుపోటములతో సింధుపై మెరుగైన రికార్డున్న మారిన్ ఫైనల్లో నెగ్గి మరోసారి ఆధిపత్యాన్ని చాటిచెప్పింది. సింధు చాలా ఆత్మవిశ్వాసంతో గేమ్ ఆడుతూ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని దీంతో మొదట్లో కొన్ని పాయింట్లు కోల్పోయినా, రెండో, మూడో గేమ్ లలో తన మెరుగైన ఆటను ఆడినట్లు పేర్కొంది. ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయేలా పాయింట్ సాధించిన ప్రతిసారి గట్టిగా అరవడంపై నోరు విప్పింది. మధ్యమధ్యలో షటిల్స్ మార్చడం, గట్టిగా అరవడం తన గేమ్ ప్లాన్ లో భాగమని వెల్లడించింది. దీంతో అంపైర్లు కొన్నిసార్లు ఆమెను మందలించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. అయితే సింధు మాత్రం స్థిరంగా ఒకే షటిల్ తో ఆడుతూ తన దృష్టిని ఆట నుంచి మళ్లించడానికి ప్రయత్నించి ఉండొచ్చునని మారిన్ అభిప్రాయపడింది. బెస్ట్ టీమ్ తనకు అండగా ఉందని, అందుకే తన విజయం సాధ్యమని భావించినట్లు స్వర్ణ విజేత వివరించింది. స్వర్ణం నెగ్గిన తొలి యూరోపియన్గానే కాకుండా తొలి ఆసియేతర చాంపియన్‌గా స్పెయిన్ ప్లేయర్ కరోలినా మారిన్ నిలిచిన విషయం తెలిసిందే. -
ఆమె అరుపులతో హడలిపోయారు!
'మీ టీవీని మ్యూట్ లో పెట్టండి. అయినా మారిన్ కేకలు మీకు కిటికి నుంచి వినిపిస్తాయి'... ఇది ఒలింపిక్స్ బాడ్మింటన్ చాంపియన్ మారిన్ కరోలిన్ పై ఓ నెటిజన్ సంధించిన వ్యంగ్యాస్త్రం. Put your television on mute, you will hear Marin from your window #badminton — Gaurav Kapur (@gauravkapur) 19 August 2016 వరల్డ్ నంబర్ 1 షట్లర్ అయిన మారిన్ ఫైనల్ లోనూ తనదైన ఆటశైలిని చూపించింది. మన పీవీ సింధు హోరాహోరిగా పోరాడినా.. అనుభవంతోపాటు ఆధిపత్యాన్ని చాటింది. ఫైనల్ పోరులో పీవీ సింధును ఓడించి.. ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఆసియాయేతర మహిళగా రికార్డు సృష్టించింది. 1992 నుంచి ఒలింపిక్స్ బ్మాడ్మింటన్ లో ఆసియా క్రీడాకారులదే తిరుగులేని ఆధిపత్యం. ఆ ఆధిపత్యానికి చెక్ పెట్టింది ఈ స్పెయిన్ ముద్దుగుమ్మ. స్వర్ణం గెలిచిన ఆనందంలో మైదానంలో బోర్లపడి కంటతడి పెట్టిన మారిన్ దగ్గరెళ్లి సింధూ స్వయంగా ఓదార్చింది. ఎంతో ఉత్కంఠ రేపిన ఈ ఫైనల్ పోరులో మారిన్ ఆటతీరు కన్నా.. గుర్రుగుర్రుమంటూ ఆమె చేసిన కేకలు భారతీయులకు బాగా చెవినపడ్డట్టున్నాయి. ఆ కేకలు, అరుపులు ఏంటి తల్లి అంటూ పలువురు నెటిజన్లు సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. మారిన్ కేకలపై నెటిజన్లు పెట్టిన కొన్ని ఫన్నీ ట్వీట్లు ఇవి.. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా.. ప్రెషర్ కుక్కర్ కన్నా మారినే ఎక్కువ లొల్లి చేస్తుంది. I swear to god I've met pressure cookers quieter than Marin — Rohan (@mojorojo) 19 August 2016 ఈ అమ్మాయిలు కరాట క్లాసుల నుంచి ఇప్పుడే బయటికి వచ్చినట్టు ఉంది. These women are straight out of Karate classes! #SindhuForGold #Rio2016 — Piyush Rai (@PiyushRaiTOI) 19 August 2016 మారిన్ స్నేహితులెవరూ ఆమెతో హర్రర్ సినిమాలకు వెళ్లే సాహసం చేయరనుకుంటా.. I bet Marin's friends don't go watch scary films with her -
ఓడినా...బంగారమే
-
సింధూరం.. వెండి సింగారం
-
ఓడినా...బంగారమే
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో సింధుకు రజతం ఫైనల్లో పోరాడి ఓడిన తెలుగుతేజం ఆమె ఓడితేనేమి... ఆ పోరాటానికి సలామ్.. అది స్వర్ణం కాకపోతేనేమి... ఆ అసమాన ఆటకు మేమంతా గులామ్.. ఎన్నాళ్లయింది... దేశమంతా ఒక్కటై ఒక మ్యాచ్ కోసం ఇంతగా ఎదురు చూసి.. ఎంతకాలమయింది... బ్యాడ్మింటన్ ఆటపై ఇంతటి అభిమానాన్ని ప్రదర్శించి.. ఇదంతా సింధు మహత్యమే... ఆమె చూపించిన అద్భుతమే... రియో డి జనీరో: అత్యున్నత వేదిక... అంతిమ సమరం... బరిలో ఇద్దరు సూపర్ స్టార్స్... పాయింట్ పాయింట్ కోసం పోరాటం.. అభిమానులకు కావాల్సినంత వినోదం.. ఆఖరకు అనుభవాన్నే విజయం వరించింది. రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) విజేతగా అవతరించింది. భారత యువ తరంగం పూసర్ల వెంకట (పీవీ) సింధు రన్నరప్‌తో సంతృప్తి పడి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. గంటా 23 నిమిషాలపాటు జరిగిన ఫైనల్ పోరులో తొమ్మిదో సీడ్ సింధు 21-19, 12-21, 15-21తో టాప్ సీడ్ మారిన్ చేతిలో ఓటమి చవిచూసింది. తడబడి...తేరుకొని... ఫైనల్ చేరే క్రమంలో ఆడిన మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లో వరుస గేముల్లో విజయం సాధించిన సింధుకు తుది పోరులో మాత్రం భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. మారిన్ ఎడంచేతి వాటం క్రీడాకారిణి కావడంతో సింధు వ్యూహాలు అంతగా పనిచేయలేదు. గత మూడేళ్ల కాలంలో ఎంతో పురోగతి సాధించి వరుసగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మారిన్ పూర్తి వైవిధ్యభరితంగా ఆడింది. ఒక్కోసారి సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ.... క్రాస్‌కోర్టు స్మాష్‌లు సంధిస్తూ... నెట్ వద్ద డ్రాప్ షాట్లు ఆడుతూ సింధు సత్తాకు పరీక్ష పెట్టింది. దాంతో తొలి గేమ్ ఆరంభంలో సింధు 6-11తో వెనుకబడిపోయింది. సింధు ఎంత ప్రయత్నించినా మారిన్‌కు ఇబ్బంది పెట్టడంలో సఫలం కాలేకపోయింది. సింధు 16-19తో వెనుకంజలో ఉన్నపుడు ఇక తొలి గేమ్ మారిన్ ఖాతాలో చేరడం ఖాయమనిపించింది. కానీ సింధు ఒక్కసారిగా చెలరేగింది. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను 27 నిమిషాల్లో 21-19తో కైవసం చేసుకుంది. లయ తప్పి... తొలి గేమ్‌ను కోల్పోయినా మారిన్‌లో ఏమాత్రం విశ్వాసం చెక్కు చెదరలేదు. రెండో గేమ్ ఆరంభం నుంచే ఈ స్పెయిన్ స్టార్ దూకుడుగా ఆడింది. షటిల్‌ను పూర్తిగా నియంత్రిస్తూ సింధును తనకు నచ్చినట్టుగా ఆడించింది. గత మ్యాచ్‌ల్లో స్మాష్‌లతో చెలరేగిపోయిన సింధు ఈ మ్యాచ్‌లో మాత్రం తక్కువసార్లు ఈ అస్త్రాన్ని వాడింది. అసలు మారిన్ తన ప్రత్యర్థికి స్మాష్‌లు సంధించే అవకాశం ఇవ్వలేదనడం సబబుగా ఉంటుంది. మారిన్ గేర్ మార్చడంతో సింధు ఆటతీరులో లయ తప్పింది. అనవసర తప్పిదాలు చేస్తూ పాయింట్లు కోల్పోయి రెండో గేమ్‌ను 22 నిమిషాల్లో 12-21తో చేజార్చుకుంది. హోరాహోరీ... నిర్ణాయక మూడో గేమ్‌లో కూడా మారినే తొలి పాయింట్ సాధించింది. అదే ఊపులో 6-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. సింధు కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి స్కోరును 10-10తో సమం చేసింది. ఒకదశలో ఇద్దరి మధ్య తేడా రెండు పాయింట్లకు (14-16) చేరింది. అయితే తానెందుకు నంబర్‌వన్‌గా ఉన్నానో, ప్రపంచ చాంపియన్ అయ్యానో నిరూపిస్తూ మారిన్ మళ్లీ చెలరేగింది. వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 20-14తో విజయానికి చేరువైంది. సింధు మరో పాయింట్ సాధించినా... ఆ వెంటనే ఈ హైదరాబాద్ కొట్టిన షాట్ నెట్‌కు తగలడంతో మారిన్ విజయం సంబరంలో మునిగిపోయింది. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి యూరోపియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. కోట్లాది భారతీయుల ఆశలు మోస్తూ ఒలింపిక్స్ ఫైనల్ బరిలోకి దిగిన మన మేలిమి ముత్యం సింధు మెడలో రజత మాల పడింది. స్వర్ణంపై గురి పెట్టి, సర్వం పణంగా పెట్టి సుదీర్ఘంగా పోరాడిన తెలుగు తేజం చివరకు ప్రత్యర్థికి తలవంచింది. స్టేడియం మొత్తం ‘విశ్వ సింధు పరిషత్’గా మారిపోయి మన భారత బిడ్డను అడుగడుగునా ప్రోత్సహిస్తుండగా... అలవాటైన రీతిలో అదరగొడుతూ ఆధిక్యంలో దూసుకెళ్లిన క్షణాన ‘బంగారు’ బాట కళ్ల ముందుగా కనిపించింది. అయితే అంతలోనే ఆటను మార్చేసి, అటుపై ఆఖరి వరకు అవకాశం ఇవ్వని స్పానిష్ బుల్ మన ఆశలు ఆవిరి చేసింది. రియో ఒలింపిక్స్ ఫైనల్లో పోరాడి ఓడిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు రజత పతకం అందుకుంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో వరల్డ్ నంబర్‌వన్ కరోలినా మారిన్ 19-21, 21-12, 21-15తో సింధును ఓడించింది. బ్యాడ్మింటన్‌లో గత ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్యం సాధించగా, ఇప్పుడు రజతంతో సింధు ఆ రికార్డును సవరించింది. తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే వెండి వెలుగులతో సింధు చరిత్ర సృష్టించింది. 2000లో కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి సింధునే కావడం విశేషం. మరో వైపు బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్ పతకం నెగ్గిన తొలి యూరోపియన్‌గా మారిన్ ఘనత సాధించింది. -
బ్యాడ్మింటన్ విశ్వవిజేత కరోలినా
రియో డి జనిరో: కరోలినా మారియా మారిన్ మార్టిన్ అలియాస్ కరోలినా మారిన్.. వర్తమాన బ్యాడ్మింటన్ చరిత్రలో ఎదురులేని జగజ్జేత. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో స్వర్ణం సాధించిన విశ్వవిజేత. భారత స్టార్ పీవీ సింధుతో శుక్రవారం రాత్రి జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్ లో తొలి గేమ్ కోల్పోయినప్పటికీ అనూహ్యంగా పుంజుకుని చివరి రెండు గేమ్ లను గెలిచి.. బంగారు పతకాన్ని సాధించిన మారిన్.. బ్యాడ్మింటన్ లో స్పెయిన్ తరఫున గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. చైనా జోరుకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండు సార్లు (2014,15లో) చాంపియన్ అవతరించిన మారిన్.. భారత్ కు సంబంధిచినంత వరకు దుర్భేధ్యమైన అడ్డుగొడ అని చెప్పక తప్పదు. సైనా నెహ్వాల్ ను ప్రపంచ విజేత కానీయకుండా అడ్డుకున్నా, ఇప్పుడు సింధూను రజతానికి పరిమితం చేయగలినా అది ఆటలో మారిన్ ప్రదర్శించే దూకుడు వల్లే సాధ్యమైంది. ఏమాత్రం కనికరం లేకుండా ఆమె కొట్టే స్మాష్ లు.. ప్రత్యర్థిని బిత్తరపోయేలా చేస్తాయి. శుక్రవారం నాటి ఫైనల్స్ లో 19- 21 తేడాతో తొలి గేమ్ కోల్పోయిన మారిన్.. ఆ తర్వాత ఏ దశలోనూ తగ్గకుండా ధాటిగా ఆడింది. రెండు, మూడో గేమ్ లలో 21-15, 21-15 తేడాతో సింధుకు అడ్డుకట్టవేసింది. అయితే ఇప్పటికే ప్రపంచ చాంపియన్ గా ఉన్న కరోలినా మారిన్ తో పోరాటమంటే సింధు లాంటి రైజింగ్ స్టార్స్ పై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కానీ, అలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా సింధూ సాధ్యమైనంత మేరలో మెప్పించింది.. 2020 టోక్యో ఒలింపిక్స్ లో పసిడి పతకం తేగలననే నమ్మకాన్ని కల్పించింది. మారిన్ ప్రొఫైల్ దేశం: స్పెయిన్ చేతివాటం: ఎడమ పుట్టిన తేది: జూన్ 15, 1993 (ప్రస్తుతం 23 ఏళ్లు) ప్రపంచ ర్యాంక్ : 1 అరంగేట్రం: 2009 మేజర్ టైటిల్స్: రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్(నేడు), యురోపియన్ చాంపియన్ షిప్- 2016, వరల్డ్ చాంపియన్- 2015, హాంగ్ కాంగ్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్- 2015, ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టైటిల్- 2015, వరల్డ్ చాంపియన్ షిప్- 2014 తదితరాలు -
సింధు-మారిన్‌ల మ్యాచ్‌పై ఉత్కంఠ
-
సింధు-మారిన్‌ల మ్యాచ్‌పై ఉత్కంఠ
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు మరికాసేపట్లో తెరలేవనుంది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత షట్లర్ పివి సింధు, స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌ల తుది పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సింధు పసిడి పతకంతో కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఒకవేళ ఓడినా రజతంతో సగర్వంగా భారత్ కు తిరిగి వస్తుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21-19, 21-10తో ప్రపంచ 6వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై ఘనవిజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగే ఫైనల్ పోరులో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు అమీతుమీకి సిద్ధమైంది. ఇరువురి మధ్య రాత్రి గం.7.30 ని.లకు తుది పోరు జరుగనుంది. ఇప్పటివరకూ ఇద్దరు క్రీడాకారిణులు ఏడు మ్యాచ్‌ల్లో తలపడగా సింధు మూడింట, మారిన్ నాల్గింట గెలుపొందింది. 2015 అక్టోబర్‌లో డెన్మార్ ఓపెన్‌లో మారిన్‌ను సింధు ఓడించగా, అదే ఏడాది నవంబర్ లో జరిగిన హాంకాంగ్ ఓపెన్‌లో సింధుపై మారిన్ గెలిచింది. ఇప్పటివరకూ సింధు తన కెరీర్లో 184 మ్యాచ్‌లు గెలవగా, 86 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇక మారిన్ తన కెరీర్లో 239 మ్యాచ్‌లు గెలిచి, 74 ఓడింది. మారిన్ విజయాల శాతం 76.36గా ఉండగా, సింధు విజయాల శాతం 67.00 గా ఉంది. మరోవైపు మారిన్ 19 టైటిల్స్‌ను సాధించగా, సింధు ఖాతాలో మూడు టైటిల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక 21 ఏళ్ల సింధు 65 కేజీల బరువుతో పాటు, 5.8 అడుగుల ఎత్తు కల్గి ఉండగా, 23 ఏళ్ల మారిన్ 65 కేజీల బరువు, 5.6 అడుగుల ఎత్తు ఉంది. తన అంతర్జాతీయ కెరీర్‌ను సింధు 2012 లో ఆరంభించగా, మారిన్ 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. -
సైనా నెహ్వాల్‌కు నిరాశ
జకర్తా:ఇండోనేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా 22-24, 11-21 తేడాతో వరల్డ్ నంబర్ వన్ కరోలినా మారిన్(స్పెయిన్)చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్ లో పోరాడి ఓడిన సైనా.. రెండో గేమ్ లో తీవ్ర ఒత్తిడికి లోనై పరాజయం చెందింది. తొలి గేమ్ ఆదిలో మారిన్ 11-7 తేడాతో ఆధిక్యం సాధించి ముందుకు దూసుకుపోయింది. అయితే ఆ తరువాత పుంజుకున్న సైనా 14-14 తో స్కోరును సమం చేసింది. ఇదే క్రమంలో సైనా 16-14, 19-18తో ఆధిక్యం సాధించి తొలి గేమ్ ను గెలుచుకునే దిశగా సాగింది. కాగా, స్కోరు 20-20 వద్ద ఉండగా ముందంజ వేసిన మారిన్ తొలి గేమ్ ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్ లో సైనాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆద్యంతం పైచేయి సాధించిన మారిన్ ఆ గేమ్ ను దక్కించుకుని సెమీస్ లో కి ప్రవేశించింది. కరోలినా తన తదుపరి సెమీస్ పోరులో వాంగ్ యిహాన్ తో తలపడుతుంది. -
'సూపర్' సింధు
సెమీస్‌లో ప్రపంచ చాంపియన్‌పై అద్భుత విజయం తొలిసారి సూపర్ సిరీస్ టోర్నీ ఫైనల్లోకి నేడు ఒలింపిక్ చాంప్ లీ జురుయ్‌తో అమీతుమీ డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఒడెన్స్ (డెన్మార్క్): గాయాల కారణంగా ఈ సీజన్లో అంతంత మాత్రంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు... పూర్తి ఫిట్నెస్ సంతరించుకున్నాక తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ హైదరాబాద్ అమ్మాయి అత్యద్భుత ఆటతీరుతో అదుర్స్ అనిపించింది. ప్రతి రౌండ్లో తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులను మట్టికరిపించి తన కెరీర్లో తొలిసారి ‘సూపర్ సిరీస్’ స్థాయి టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 21-15, 18-21, 21-17తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రెండో ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్)ను బోల్తా కొట్టించింది. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సింధు కీలకదశలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో 14-16తో వెనుకబడిన దశలో సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గింది. ఆ తర్వాత మారిన్ రెండు పాయింట్లు సాధించినా, సింధు వెంటనే తేరుకొని మరో పాయింట్ సాధించి చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది. ముఖాముఖి రికార్డులో మారిన్‌పై సింధుకిది రెండో విజయం. చివరిసారి 2011లో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ టోర్నీలో మారిన్‌ను ఓడించిన సింధు నాలుగేళ్ల తర్వాత ఆమెపై మళ్లీ గెలిచింది. ఈ ఏడాది సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ ఫైనల్లో, గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మారిన్ చేతిలో సింధు ఓడింది. ఈసారి మాత్రం పక్కాగా సిద్ధమై అనుకున్న ఫలితాన్ని సాధించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21-18, 21-19తో ప్రపంచ మాజీ చాంపియన్, ఏడో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా)పై సంచలన విజయం సాధించింది. 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో యిహాన్ వాంగ్‌ను ఓడించిన సింధు ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఆమె చేతిలో ఓటమి చవిచూసింది. నేడు (ఆదివారం) జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో సింధు, లీ జురుయ్ 2-2తో సమఉజ్జీగా ఉన్నారు. ఫైనల్ సాయంత్రం గం. 6.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
కరోలినాకు సింధు షాక్
ఒడెన్స్:భారత షట్లర్, హైదరాబాద్ అమ్మాయి పివి సింధు డెన్మార్క్ ఓపెన్ లో మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో రెండు సార్లు ప్రపంచ చాంపియన్ , రెండో సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్) కు షాకిస్తూ ఫైనల్ కు చేరింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో సింధు 21-15, 18-21, 21-17 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్ ను గెలుచుకున్న సింధు, రెండో సెట్ ను కోల్పోయింది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్ లో కరోలినాపై సింధు పోరాడి గెలిచింది. ఒక గంట 14 నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు ఆకట్టుకుని ఫైనల్ రౌండ్ కు చేరింది. దీంతో సింధు తన ముఖాముఖి రికార్డు 2-3 గా మెరుగుపరుచుకుంది. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21-18, 21-19 తేడాతో మాజీ నంబర్ వన్ వాంగ్ యిహాన్ (చైనా)పై వరుస సెట్లలో విజయం సాధించి సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. సింధు తన తుదిపోరులో చైనా క్రీడాకారిణి, 2012 ఒలింపిక్ చాంపియన్ లి యురేయితో తలపడనుంది. -
జపాన్ ఓపెన్ కు భారత్ బృందం సిద్దం
రేపటి నుంచి ప్రారంభం కానున్న జపాన్ బ్యాడ్మింటన్ ఓపెన్ కు భారత బృదం సన్నద్దమైంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత షట్లర్స్ సైనా నేహ్వాల్, శ్రీకాంత్, ప్రణోయ్, కశ్యప్, పీవీ సింధు లు టోక్యో చేరుకున్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో టైటిల్ తృటిలో కోల్పోయిన సైనా.. జపాన్ ఓపెన్ లో ఎలాగైనా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ టోర్నీలో కరొలినా మారిన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసం టోర్నీ కి ముందుగానే చేరుకుని తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. కాగా.. తొలి రౌండ్ మ్యాచ్ లో సైనా... థాయ్ లాండ్ కి చెందిన బుసానన్ తో తలపడనుంది. కాగా రెండో రౌండ్ లో సైనా, పీవీ సింధు ఎదుర్కో నుంది. -
నా టార్గెట్ ఆమే: సైనా
ప్రపంచ బ్యాడ్మింటన్ లో 'చైనా వాల్'ను కూల్చేసిన భారత మహిళా బ్యాడ్మింటన్ స్టార్ సైనా.. తాజాగా తన గురి స్పెయిన్ షట్లర్ మారిన్ కరొలినా పై ఎక్కుపెట్టింది. ఇటీవల రెండు మేజర్ టోర్నీల్లో సైనా టైటిటల్ ఆశలపై నీళ్లు చల్లిన ఈ యువ క్రీడాకారిణిపై ఆధిపత్యం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సైనా తెలిపింది. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, ప్రపంచ ఛాంపియన్ షిప్ లను అడ్డుకున్న కరోలినాను జపాన్ ఓపెన్ లో ఓడించి తీయని ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. దీనికోసం కోచ్ విమల్ తో కలిసి కఠోర శిక్షణ తీసుకుంటున్నట్లు వివరించింది. ఏడాది కాలంలో దాదాపు అందరు చైనీస్ క్రీడాకారిణులను ఓడించానని.. ఇక కరోలీనాను అడ్డుకోవడమే మిగిలిందని చెప్పింది. టాప్ ర్యాంక్ నిలబెట్టుకోవాలంటే.. అగ్రశ్రేణి క్రీడాకారులను మట్టికరిపించడమే కాదు.. అదే దూకుడును కొనసాగించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. బెంగళూరుకు మకాం మార్చాక తన ఆటతీరు, ఫిట్నెస్ ఎంతో మెరుగయ్యాయని తెలిపింది. -
కల చెదిరె...
-
కల చెదిరె...
♦ సైనా నెహ్వాల్‌కు రజతం ♦ స్వర్ణ పతక పోరులో పరాజయం ♦ టైటిల్ నిలబెట్టుకున్న మారిన్ ♦ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ జగజ్జేతగా అవతరించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆఖరి మెట్టుపై తడబడింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సంతృప్తి పడింది. ఈ మెగా ఈవెంట్లో ఫైనల్‌కు చేరి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సైనా ‘సువర్ణాధ్యాయం’ లిఖించలేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్‌తో జరిగిన అంతిమ సమరంలో సైనా వరుస గేముల్లో ఓడిపోవడంతో ‘పసిడి కల’ చెదిరింది. మరోవైపు మారిన్ వరుసగా రెండో ఏడాది విశ్వవిజేతగా నిలిచి తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచింది. జకార్తా : ‘పసిడి’ పతకమే లక్ష్యంగా అంతిమ సమరంలో అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ఘనమైన ముగింపు ఇవ్వలేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సైనా పరాజయం పాలైంది. 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సైనా 16-21, 19-21తో ఓటమి చవిచూసి రజత పతకంతో సంతృప్తి పడింది. ఈ విజయంతో మారిన్... జీ జింగ్ఫాంగ్ (చైనా-2005, 2006) తర్వాత వరుసగా రెండేళ్లు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా నిలిచింది. మారిన్ చేతిలో ఫైనల్లో ఓడిపోవడం సైనాకిది రెండోసారి. గత మార్చిలో జరిగిన ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ఫైనల్లోనూ మారిన్ చేతిలోనే సైనా ఓడింది. ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖి రికార్డులో సైనా 3-1తో మారిన్‌పై ఆధిక్యంలో ఉన్నా ఈ గణాంకాలు ఫైనల్లో అంతగా ప్రభావం చూపలేకపోయాయి. సైనాతో గతంలో ఇతర టోర్నీల్లో మూడుసార్లు ఫైనల్లో ఆడిన అనుభవం ఉన్న మారిన్ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగింది. ఇప్పటికే ప్రపంచ టైటిల్‌ను ఒకసారి సాధించిన మారిన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ సైనాను ఇబ్బంది పెట్టింది. చురుగ్గా కదులుతూ, అడపాదడపా స్మాష్‌లు సంధిస్తూ, డ్రాప్ షాట్లు ఆడుతూ మారిన్ తొలి గేమ్‌లో పూర్తిగా ఆధిపత్యం చలాయించింది. మారిన్ మెరుగ్గా ఆడుతుండటంతో... మరోవైపు తొలి ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతున్న సైనాపై మరింత ఒత్తిడి పెరిగింది. తొలి గేమ్‌ను కోల్పోయిన ఈ హైదరాబాద్ అమ్మాయి రెండో గేమ్‌లో పుంజుకుంది. మారిన్ ఆటతీరుకు దీటుగా బదులిస్తూ నిలకడగా పాయింట్లు స్కోరు చేసి 12-6తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో మారిన్ మళ్లీ దూకుడు పెంచింది. వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి స్కోరును 12-12తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడారు. ఒకదశలో మారిన్ 17-18తో పాయింట్ వెనుకజంలో ఉన్నా వెంటనే తేరుకొని వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 20-18తో ఆధిక్యంలోకి వెళ్లింది. సైనా మరో పాయింట్ సాధించినా... ఆ తర్వాత సుదీర్ఘంగా సాగిన ర్యాలీలో మారిన్ సంధించిన స్మాష్ షాట్‌ను సైనా బయటకు పంపడంతో స్పెయిన్ అమ్మాయి విజయం ఖాయమైంది. సెమీఫైనల్స్‌లో ఓడిన లిందావెని ఫనెత్రి (ఇం డోనేసియా), సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా) లకు కాంస్య పతకాలు లభించాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన సైనాకు అభినందనలు. టోర్నీ ఆసాంతం ఆమె బాగా ఆడింది. ఫైనల్లో కూడా ఎంతో పోరాట పటిమ ప్రదర్శించింది. ఇలాంటి ఆటగాళ్లు ఉండటం పట్ల గర్వపడుతున్న తెలంగాణ రాష్ట్రం మున్ముందు క్రీడల్లో కూడా అగ్రస్థానానికి చేరుతుంది. -తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడటం సైనాపై ఒత్తిడి పెంచింది. దాంతో ఏకాగ్రత కోల్పోయినట్లుంది. నాకు తెలిసి ఆమె ఈ పోరులో మానసికంగా వెనుకబడింది. అయినా రజతం రావడం ఆనందకరం. విజయం కోసం సైనా శాయశక్తులా ప్రయత్నించింది. మా అమ్మాయిలో ఇంకా చాలా ఆట మిగిలి ఉంది. కొన్ని లోపాలు అధిగమించడంతో పాటు ఫిట్‌గా ఉంటే వచ్చేసారి చాంపియన్ అవుతుంది. -హర్వీర్ సింగ్, సైనా తండ్రి ► ఎంతో శ్రమిస్తే గానీ వరల్డ్ చాంపియన్ కాలేరు. ఫర్వాలేదు... విజయంకంటే ఓటమి ఎక్కువ నేర్పిస్తుంది. -విశ్వనాథన్ ఆనంద్ ► బ్యాడ్‌లక్ సైనా. అయినా భారత బ్యాడ్మింటన్‌లో తొలి రజతం. అందరికీ గర్వకారణం. -గుత్తా జ్వాల ► చాలా బాగా ఆడావు. నిన్ను చూసి గర్వపడుతున్నాం. పోరాడినా ఈ రోజు కలిసి రాలేదు. మెరుగైన ప్లేయర్ చేతిలో ఓడావు. - అనిల్ కుంబ్లే ఫైనల్లో నేను నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించలేదు. నేనింకా బాగా ఆడాల్సింది. తొలి గేమ్‌లో చాలా తప్పిదాలు చేశాను. రెండో గేమ్‌లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ కొన్ని పాయింట్లు వేగంగా చేజార్చుకున్నాను. ఏం జరుగుతుందో ఆలోచించేలోపే స్కోరు సమమైపోయింది. ఫిట్నెస్పరంగా నాకెలాంటి ఇబ్బంది లేదు. ఫైనల్‌లాంటి మ్యాచ్‌లో ఆటకంటే మానసికంగా దృఢంగా ఉండటం ముఖ్యం. రెండో గేమ్‌లోని కీలకదశలో నేను అనవసర తప్పిదాలు చేశాను. రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతుండటం మారిన్‌కు అనుకూలాంశమైంది. ఆమె ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడింది. -సైనా నెహ్వాల్ గత ఏడాది విజయంతో పోలిస్తే ఈసారి మరింత సంతోషంగా ఉన్నాను. గతనెలలో కాలికి గాయమైంది. అసలు ఈ టోర్నీలో నేను ఆడతానో లేదో అనే అనుమానం కలిగింది. రెండు వారాల క్రితమే ప్రాక్టీస్ మొదలుపెట్టాను. ఈ మెగా ఈవెంట్‌ను ఆస్వాదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను. రెండో గేమ్‌లో వెనుకబడిన దశలో పొరపాట్లు చేయకూడదనే వ్యూహంతో ఆడాను. ఫలితం గురించి కాకుండా ఒక్కో పాయింట్ గురించి ఆలోచించి ఆడాను. జకార్తా ప్రేక్షకులు నాకు మద్దతు ఇవ్వడం చూశాక నేను సొంతగడ్డపై ఆడుతున్నాననే భావన కలిగింది. -కరోలినా మారిన్ చెన్ లాంగ్దే పురుషుల టైటిల్ పురుషుల సింగిల్స్ విభాగంలోనూ డిఫెండింగ్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో చెన్ లాంగ్ 21-14, 21-17తో మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)పై విజయం సాధించాడు. ఆతిథ్య ఇండోనేసియాకు పురుషుల డబుల్స్ టైటిల్ దక్కింది. ఫైనల్లో మొహమ్మద్ ఎహసాన్-హెంద్రా సెతియవాన్ ద్వయం 21-17, 21-14తో లియు జియోలాంగ్-కియు జిహాన్ (చైనా) జంటను ఓడించింది. మహిళల డబుల్స్ విభాగంలో తియాన్ కింగ్-యున్లి జావో (చైనా); మిక్స్డ్ డబుల్స్‌లో నాన్ జింగ్-యున్లి జావో (చైనా) విజేతలుగా నిలిచారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఎలాంటి ప్రైజ్‌మనీ ఉండదు. విజేత, రన్నరప్‌లకు స్వర్ణ, రజతాలు... సెమీస్‌లో ఓడినవారికి కాంస్య పతకాలు అందజేస్తారు. -
కొత్త చరిత్ర
ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో సైనా ♦ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్ ♦ సెమీస్‌లో ఫనెత్రిపై విజయం ♦ నేటి ఫైనల్లో మారిన్‌తో అమీతుమీ ఇప్పటికే ఎన్నో ‘తొలి’ ఘనతలు సొంతం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరో కొత్త చరిత్ర సృష్టించింది. 38 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల చరిత్రలో ఏ విభాగంలోనైనా ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. నేడు జరిగే అంతిమ సమరంలో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్‌తో సైనా అమీతుమీ తేల్చుకుంటుంది. ఒకవేళ ఈ హైదరాబాద్ అమ్మాయి గెలిస్తే భారత క్రీడా చరిత్రలో మరో సువర్ణాధ్యాయం లిఖించినట్టవుతుంది. జకార్తా : ఎంతో కాలం నుంచి ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం శుక్రవారమే ఖాయ మైనా... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ శనివారం మరో మైలురాయిని చేరుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరుకొని ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ప్లేయర్‌గా అరుదైన గౌరవాన్ని సంపాదించింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ సైనా నెహ్వాల్ 21-17, 21-17తో ప్రపంచ 29వ ర్యాంకర్ లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)పై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గతంలో ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు లభించిన నాలుగు పతకాలూ (ప్రకాశ్ పదుకొనే-1983లో; జ్వాల-అశ్విని జంట-2011లో; పీవీ సింధు-2013, 2014) కాంస్యాలే కావడం గమనార్హం. ఆదివారం జరిగే ఫైనల్లో సైనా నెగ్గితే స్వర్ణం దక్కుతుంది లేదంటే రజతంతో సంతృప్తి పడుతుంది. ఫలితం ఎలా ఉన్నా ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ తొలిసారి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసినట్టయింది. వ్యూహం మార్చుకొని... క్వార్టర్ ఫైనల్లో ఏకంగా ఆరు మ్యాచ్ పాయిం ట్లను కాపాడుకొని, ఓటమి అంచుల్లో నుంచి విజయతీరాలకు చేరిన ఫనెత్రిని సైనా తక్కువ అంచనా వేయలేదు. 20 ఏళ్ల తర్వాత ఓ ఇండోనేసియా క్రీడాకారిణి సెమీఫైనల్‌కు చేరుకోవడంతో ఫనెత్రికి సొంత ప్రేక్షకుల మద్దతు లభించింది. అయినప్పటికీ ఇవేమీ సైనా ప్రదర్శనపై ప్రభా వం చూపలేదు. గతంలో రెండుసార్లు ఫనెత్రిని ఓడించిన సైనా ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి గేమ్ ఆరంభంలో సైనా 2-6తో వెనుకబడ్డప్పటికీ వెంటనే తేరుకుంది. ఫనెత్రికి మోకాలిలో నొప్పి ఉండటంతో పట్టీ కట్టుకొని ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగింది. తన ప్రత్యర్థి పూర్తి ఫిట్‌గా లేకపోవడం గమనించిన సైనా తన వ్యూహాన్ని కూడా మార్చుకొని ఆడింది. దూకుడుగా వెళ్లకుండా సుదీర్ఘ ర్యాలీలకు ప్రాధాన్యమిస్తూనే, అడపాదడపా డ్రాప్ షాట్లతో ఫనెత్రికి పరీక్ష పెట్టింది. కోర్టులో ఎక్కువ సమయం కదలికలు చేయడంతో ఫనెత్రికి ఇబ్బంది తప్పలేదు. అయినప్పటికీ సైనాకు సాధ్యమైనంత పోటీనిచ్చిన ఫనెత్రి నిలకడగా పాయింట్లు సాధించింది. స్కోరు 16-16 వద్ద సమంగా ఉన్నప్పుడు సైనా రెండు పాయింట్లు నెగ్గి 18-16తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఫనెత్రి ఒక పాయింట్ సాధించినా, మరోవైపు సైనా వరుసగా మూడు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ సైనా తన వ్యూహానికి కట్టుబడి ఆడింది. తొలి గేమ్‌తో పోలిస్తే రెండో గేమ్‌లో మాత్రం సైనా చేసిన అనవసర తప్పిదాలతోనే ఫనెత్రి ఖాతాలో పాయింట్లు చేరాయి. రెండో గేమ్‌లోనూ పలుమార్లు స్కోరు సమంగా నిలిచినా... కీలకదశలో సైనా తన అనుభవాన్ని రంగరించి పోరాడి పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్) 21-17, 15-21, 21-16తో ఎనిమిదో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. ఫైనల్‌కు చేరుతానని ఊహించలేదు. ఈ టోర్నీలో నేను ఆడిన కఠిన మ్యాచ్‌ల్లో ఇదొకటి. ఫనెత్రికి స్థానిక ప్రేక్షకుల మద్దతు లభించింది. ఈ టోర్నీలో ఫనెత్రి చాలా మ్యాచ్‌ల్లో అద్భుతంగా పుంజుకొని గెలిచింది. అందుకే ఆమెను ఏదశలోనూ తక్కువ అంచనా వేయలేదు. మారిన్‌తో ఫైనల్లో నేను బాగా ఆడాలని కోరుకుంటున్నాను. -సైనా నెహ్వాల్ అత్యుత్తమ ఆటతీరుతోనే... ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్‌తో నేడు జరిగే ఫైనల్లో సైనాకు మరో సవాలు ఎదురుకానుంది. ముఖాముఖి రికార్డులో సైనా 3-1తో ఆధిక్యంలో ఉన్నా... గత మార్చిలో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో మారిన్ చేతిలో సైనా ఓడిపోయింది. ఏడాదికాలంగా అత్యంత నిలకడగా ఆడుతోన్న మారిన్‌ను ఓడించాలంటే సైనా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, తన అత్యుత్తమ ఆటతీరును కనబర్చాల్సి ఉంటుంది. -
‘ఆస్ట్రేలియన్’ చాంప్స్ మరిన్, చెన్ లాంగ్
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కరోలినా మరిన్ (స్పెయిన్), చెన్ లాంగ్ (చైనా) మహిళల, పురుషుల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఫైనల్స్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మరిన్ 22-20, 21-18తో ఐదో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)పై గెలుపొందగా... టాప్ సీడ్ చెన్ లాంగ్ 21-12, 14-21, 21-18తో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. ఈ ఏడాది మరిన్కిది మూడో ‘సూపర్ సిరీస్’ టైటిల్. ఇంతకుముందు ఆమె ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, మలేసియా ఓపెన్లలో విజేతగా నిలిచింది. -
అధికారికంగా సైనాకి అగ్రస్థానం
సైనా నెహ్వాల్... ఇక అధికారికంగా ప్రపంచ నంబర్‌వన్. వారం క్రితమే సైనాకు అగ్రస్థానం ఖరారైనా బీడబ్ల్యుఎఫ్ అధికారికంగా ర్యాంక్‌లను గురువారం ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్‌లో 78, 541 పాయింట్లతో ఆమె అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల ముగిసిన ఇండియన్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరుకోవడంతో సైనా ఈ ఘనతను అందుకుంది. కరోలినా మారిన్ (స్పెయిన్-73, 618) రెండు, లీ జురుయ్ (చైనా-71, 414) మూడో ర్యాంక్‌లో నిలిచారు. హైదరాబాద్ అమ్మాయి పి.వి.సింధు (55, 635) తొమ్మిదో ర్యాంక్‌లో ఉంది. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ నాలుగో ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. హెచ్.ఎస్. ప్రణయ్ 14, పారుపల్లి కశ్యప్ 17వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. -
ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ సైనా వశం
సిడ్నీ: ఏడాదిన్నర కాలంగా సూపర్ సిరీస్ టోర్నీల్లో విఫలమవుతున్న భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ ఈసారి ఒత్తిడిని అధిగమించి ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టైటిల్ ను కైవసం చేసుకుంది.ఈ సిరీస్ లోపూర్తిస్థాయి ఫిట్ నెస్ లో ఉండి, తన సహజ సిద్ధమైన ఆటను ప్రదర్శించిన సైనా టైటిల్ ను చేజిక్కించుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో సైనా 21-18, 21-11 తేడాతో కరోలినా మారిన్ (స్పెయిన్)ను బోల్తా కొట్టించింది. ఈ తుదిపోరు కేవలం 43 నిమిషాల్లోనే ముగియడం గమనార్హం. ఈ ఏడాది ఆమెకు ఇది రెండో టైటిల్. 2012 అక్టోబరులో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ తర్వాత ఈ హైదరాబాద్ అమ్మాయి 17 సూపర్ సిరీస్ టోర్నీలలో బరిలోకి దిగింది. కానీ ఈ సూపర్ సిరీస్ టోర్నీలలో ఏ దాంట్లోనూ ఆమె ఫైనల్‌కు చేరుకోలేదు. ఎట్టకేలకు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా తన పూర్వ వైభవాన్ని చాటుకొని టైటిల్ సాధించింది. ప్రపంచ రెండో ర్యాంకర్, చైనా క్రీడాకారిణి టాప్ సీడ్ షిజియాన్ వాంగ్ శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సైనా నెహ్వాల్ 21-19, 16-21, 21-15తో అద్భుత విజయం సాధించి ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే.