బ్యాడ్మింటన్ విశ్వవిజేత కరోలినా
రియో డి జనిరో: కరోలినా మారియా మారిన్ మార్టిన్ అలియాస్ కరోలినా మారిన్.. వర్తమాన బ్యాడ్మింటన్ చరిత్రలో ఎదురులేని జగజ్జేత. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో స్వర్ణం సాధించిన విశ్వవిజేత. భారత స్టార్ పీవీ సింధుతో శుక్రవారం రాత్రి జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్ లో తొలి గేమ్ కోల్పోయినప్పటికీ అనూహ్యంగా పుంజుకుని చివరి రెండు గేమ్ లను గెలిచి.. బంగారు పతకాన్ని సాధించిన మారిన్.. బ్యాడ్మింటన్ లో స్పెయిన్ తరఫున గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
చైనా జోరుకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండు సార్లు (2014,15లో) చాంపియన్ అవతరించిన మారిన్.. భారత్ కు సంబంధిచినంత వరకు దుర్భేధ్యమైన అడ్డుగొడ అని చెప్పక తప్పదు. సైనా నెహ్వాల్ ను ప్రపంచ విజేత కానీయకుండా అడ్డుకున్నా, ఇప్పుడు సింధూను రజతానికి పరిమితం చేయగలినా అది ఆటలో మారిన్ ప్రదర్శించే దూకుడు వల్లే సాధ్యమైంది. ఏమాత్రం కనికరం లేకుండా ఆమె కొట్టే స్మాష్ లు.. ప్రత్యర్థిని బిత్తరపోయేలా చేస్తాయి.
శుక్రవారం నాటి ఫైనల్స్ లో 19- 21 తేడాతో తొలి గేమ్ కోల్పోయిన మారిన్.. ఆ తర్వాత ఏ దశలోనూ తగ్గకుండా ధాటిగా ఆడింది. రెండు, మూడో గేమ్ లలో 21-15, 21-15 తేడాతో సింధుకు అడ్డుకట్టవేసింది. అయితే ఇప్పటికే ప్రపంచ చాంపియన్ గా ఉన్న కరోలినా మారిన్ తో పోరాటమంటే సింధు లాంటి రైజింగ్ స్టార్స్ పై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కానీ, అలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా సింధూ సాధ్యమైనంత మేరలో మెప్పించింది.. 2020 టోక్యో ఒలింపిక్స్ లో పసిడి పతకం తేగలననే నమ్మకాన్ని కల్పించింది.
మారిన్ ప్రొఫైల్
దేశం: స్పెయిన్
చేతివాటం: ఎడమ
పుట్టిన తేది: జూన్ 15, 1993 (ప్రస్తుతం 23 ఏళ్లు)
ప్రపంచ ర్యాంక్ : 1
అరంగేట్రం: 2009
మేజర్ టైటిల్స్: రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్(నేడు), యురోపియన్ చాంపియన్ షిప్- 2016, వరల్డ్ చాంపియన్- 2015, హాంగ్ కాంగ్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్- 2015, ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టైటిల్- 2015, వరల్డ్ చాంపియన్ షిప్- 2014 తదితరాలు