సింధు-మారిన్ల మ్యాచ్పై ఉత్కంఠ
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్లో మరో ఆసక్తికర మ్యాచ్కు మరికాసేపట్లో తెరలేవనుంది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత షట్లర్ పివి సింధు, స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ల తుది పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సింధు పసిడి పతకంతో కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఒకవేళ ఓడినా రజతంతో సగర్వంగా భారత్ కు తిరిగి వస్తుంది.
గురువారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 21-19, 21-10తో ప్రపంచ 6వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై ఘనవిజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగే ఫైనల్ పోరులో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు అమీతుమీకి సిద్ధమైంది. ఇరువురి మధ్య రాత్రి గం.7.30 ని.లకు తుది పోరు జరుగనుంది. ఇప్పటివరకూ ఇద్దరు క్రీడాకారిణులు ఏడు మ్యాచ్ల్లో తలపడగా సింధు మూడింట, మారిన్ నాల్గింట గెలుపొందింది. 2015 అక్టోబర్లో డెన్మార్ ఓపెన్లో మారిన్ను సింధు ఓడించగా, అదే ఏడాది నవంబర్ లో జరిగిన హాంకాంగ్ ఓపెన్లో సింధుపై మారిన్ గెలిచింది.
ఇప్పటివరకూ సింధు తన కెరీర్లో 184 మ్యాచ్లు గెలవగా, 86 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఇక మారిన్ తన కెరీర్లో 239 మ్యాచ్లు గెలిచి, 74 ఓడింది. మారిన్ విజయాల శాతం 76.36గా ఉండగా, సింధు విజయాల శాతం 67.00 గా ఉంది. మరోవైపు మారిన్ 19 టైటిల్స్ను సాధించగా, సింధు ఖాతాలో మూడు టైటిల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక 21 ఏళ్ల సింధు 65 కేజీల బరువుతో పాటు, 5.8 అడుగుల ఎత్తు కల్గి ఉండగా, 23 ఏళ్ల మారిన్ 65 కేజీల బరువు, 5.6 అడుగుల ఎత్తు ఉంది. తన అంతర్జాతీయ కెరీర్ను సింధు 2012 లో ఆరంభించగా, మారిన్ 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.