సింధు రాక కోసం.. | Grand Welcome Awaits PV Sindhu In Hyderabad | Sakshi
Sakshi News home page

సింధు రాక కోసం..

Published Sun, Aug 21 2016 12:03 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

సింధు రాక కోసం.. - Sakshi

సింధు రాక కోసం..

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన భారత షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు సోమవారం నగరానికి రానుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం సింధు  రియో నుంచి బయల్దేరింది. రేపు  ఉదయం హైదరాబాద్ కు చేరుకునే అవకాశం ఉండటంతో ఆమెకు స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ భారీయెత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి.

శనివారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి, జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ రజత్ కుమార్ తదితరులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజేంద్ర నగర్, అత్తాపూర్, మెహిదిపట్నం, టౌలిచౌకి మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు ఉన్న మార్గాన్ని పరిశీలించారు. సింధు వచ్చే ఈ మార్గాల్లో ఎక్కడెక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలి, ఎలాంటి అలంకరణలు చేపట్టాలనే ప్రాంతాలను ఎంపిక చేశారు. చేపట్టాల్సిన ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం స్వాగత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన అనంతరం పి.వి. సింధు పై మార్గంలో గచ్చిబౌలి స్టేడియం వరకు ర్యాలీగా చేరుకుంటుందని కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.

ఈ మార్గం ప్రధాన కూడళ్ల వద్ద పాఠశాలల విద్యార్థులు, నగర పౌరులు సింధుకు అపూర్వ స్వాగతం పలుకుతారని కమిషనర్ తెలిపారు. అనంతరం గచ్చిబౌలి స్టేడియంలో నగర పౌరులు, క్రీడాకారుల సమక్షంలో ప్రత్యేక సన్మాన సభ ఉంటుందన్నారు. ఈ స్టేడియంలో జరిగే సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను జోనల్ కమిషనర్  గంగాధర్ రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ సమీక్షించారు. సింధు ప్రయాణించే శంషాబాద్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు పెద్ద ఎత్తున  స్వాగత హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే సింధు సన్మాన సభ ఏర్పాట్లను శనివారం రాత్రి కమిషనర్   జనార్దన్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణా ఇన్‌చార్జీ, ఎండీ అబ్దుల్ రహీమ్‌తో కలిసి పరిశీలించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement