‘రెండు’ విధాలా మేలు! | PV Sindhu, Sakshi Malik Save India From Drawing a Blank | Sakshi
Sakshi News home page

‘రెండు’ విధాలా మేలు!

Published Mon, Aug 22 2016 2:39 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

‘రెండు’ విధాలా మేలు!

‘రెండు’ విధాలా మేలు!

బీజింగ్‌లో మూడు... లండన్‌లో ఆరు... ఈసారి రియోలో పది ఖాయం.... ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు భారత్ అంచనా ఇది. ప్చ్... ఈసారికి ఇంతే... ఇక పతకాలేం రావు... బింద్రా, సైనా, సానియాలాంటి స్టార్ క్రీడాకారులంతా వెనుదిరిగిన తర్వాత కలిగిన అభిప్రాయం. ఇక పతకాలు రావనే నైరాశ్యంలో ఉన్న సమయంలో సాక్షి, సింధు రెండు పతకాలు తెచ్చి భారత్‌కు ఊపిరి పోశారు. గతంతో పోలిస్తే ఈసారి పతకాల సంఖ్య తగ్గినా... మనకు రెండు విధాలా మేలే జరిగింది. ఒకటి... పాయింట్ల పట్టికలో మన పేరు పోకుండా చూసుకున్నాం. రెండు... మన వ్యవస్థలో ఉన్న లోపాలను, ప్రపంచంలో పెరిగిన పోటీని తెలుసుకోగలిగాం.
 
సాక్షి క్రీడా విభాగం: బ్యాడ్మింటన్‌లో నవ తార పీవీ సింధు రజత పతకంతో అభిమానులకు ఆనందాన్ని పంచింది. తన కఠోర శ్రమ, పోరాట పటిమతో పాటు కోచ్ గోపీచంద్ మార్గనిర్దేశనం ఆమెను ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత మహిళగా నిలబెట్టాయి. అంతకు ముందు అనూహ్యంగా రెజ్లింగ్‌లో సాక్షి మలిక్ కాంస్యంతో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. ఒలింపిక్స్ ముగింపు దశకు వచ్చిన వేళ, ఇక ఖాళీ చేతులతోనే వెనుదిరగాల్సి వస్తుందేమో అని ఆందోళన చెందిన క్షణాన ఆమె సాధించిన కంచు పతకం కూడా మనకు పసిడితో సమానంగా కనిపించింది. రియోకు సంబంధించి మనల్ని ఆనందంలో ముంచిన, గర్వపడిన ఈ రెండు క్షణాలు ఇక ముందు కూడా ఎప్పటికీ మన మనసుల్లో నిలిచిపోతాయి.
 
చేరువగా వచ్చినా...
రెండు పతకాలకు తోడు మరో రెండు సార్లు పతకంపై ఆశలు కలిగాయి. జిమ్నాస్టిక్స్‌లో తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మహిళగా గుర్తింపు తెచ్చుకున్న దీపా కర్మాకర్ మెడల్‌కు అతి చేరువగా వచ్చినా, చివరకు నాలుగో స్థానమే దక్కింది. చెప్పుకోదగ్గ నేపథ్యం, సౌకర్యాలు, ఎలాంటి ఆర్థిక మద్దతూ లేకపోయినా దీపా సాధించిన ఘనత చాలా పెద్దది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆమె దేశవ్యాప్తంగా అందరి మనసులు గెలుచుకుంది.

భవిష్యత్తులో అమ్మాయిలు జిమ్నాస్టిక్స్‌ను ఎంచుకునేందుకు కావాల్సిన ఒక రకమైన వేదికను దీపా సిద్ధం చేసిందనడంలో సందేహం లేదు. మరో వైపు భారత ఏకైక గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా రెండో పతకాన్ని త్రుటిలో కోల్పోయాడు. 10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో 0.5 పాయింట్ల తేడాతో అతను కాంస్యానికి దూరం కావడం కూడా అందరినీ నిరాశపర్చింది. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా వచ్చిన మంచి అవకాశాన్ని సానియామీర్జా-రోహన్ బోపన్న వృథా చేశారు. సెమీస్‌లో అద్భుతంగా ఆడిన ఈ జోడి కాంస్య పతక పోరులో తలవంచింది.

వీరిద్దరు సఫలమైతే మరో మూడు పతకాలు మన ఖాతాలో చేరేవేమో! చాలా మంది గుర్తించకపోయినా... 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో లలితా బబర్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో సఫలమైంది. పీటీ ఉష తర్వాత ట్రాక్ ఈవెంట్‌లో ఫైనల్‌కు లలిత మాత్రమే వెళ్లగలిగింది. పేదరికంలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి రియోలో కనబర్చిన పట్టుదల అసమానం.
 
హీరోలు జీరోలుగా...
భారత్‌కు గ్యారంటీగా పతకాలు తీసుకొస్తారని నమ్మిన చాలా మంది ఆటగాళ్లు రియోలో పేలవంగా నిష్ర్కమించడం బాధించే అంశం. క్రీడలపరంగా చూస్తే షూటింగ్ పూర్తిగా నిరాశపర్చింది. 12 మంది వెళ్లినా ఒక్క పతకం కూడా దక్కలేదు. ప్రపంచ కప్‌లలో రికార్డుల మోత మోగించే నారంగ్, జీతూరాయ్, హీనా సిద్ధు, అపూర్వి చండీలా, మానవ్‌జీత్ కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేదు.

ఇక మహిళల ఆర్చరీ కూడా అదే చేసింది. ప్రపంచంలోని అన్ని వేదికలపై అదరగొట్టిన దీపిక కుమారి వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పేలవంగా ఆడింది. బొంబేలా, లక్ష్మీరాణి, అతాను దాస్ అంతా విఫలమయ్యారు. బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ వైఫల్యం తీవ్రంగా నిరాశపర్చింది. ఒలింపిక్స్‌కు ముందు చాంపియన్స్ ట్రోఫీలో రెండో స్థానంలో నిలిచి ఆశలు రేపిన భారత హాకీ జట్టు మళ్లీ తమ పాత ఆటకే పరిమితమైంది. లీగ్ దశలోనే ఇబ్బందిగా ఆడిన జట్టు నాకౌట్ తొలి మ్యాచ్‌లోనే నిష్ర్కమించడం విషాదం.

ఇక బాక్సర్లు కూడా ఆకట్టుకోలేదు. రెజ్లింగ్‌లో యోగేశ్వర్ కూడా తన గత ఫలితాన్ని పునరావృతం చేయలేకపోగా... నర్సింగ్ వివాదం ఒలింపిక్స్ సమయంలో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అథ్లెటిక్స్‌లో మనం ప్రపంచం కంటే చాలా వెనుకబడి ఉన్నామని మరోసారి నిరూపణ అయింది. ఇక టీటీ, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, రోయింగ్, జూడోలలో మన పేరు హాజరు పట్టికలోనే కనిపించింది!
 
టోక్యోలో ఏం చేస్తారు...
‘నాలుగేళ్లలో ప్రపంచంలోని అన్ని దేశాలు ఒలింపిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తమ ప్రమాణాలు పెంచుకున్నాయి. మేం దీనిని అంచనా వేయలేక వెనుకబడ్డాం’... రియోలో మూడో స్థానానికి దిగజారిన తర్వాత సూపర్ పవర్ చైనానుంచి వచ్చిన వ్యాఖ్య ఇది. భారత్ కూడా విఫలం కావడానికి ఇదీ ఒక కారణమే. కేవలం లండన్ ప్రదర్శనతో మురిసి మేం బాగా మెరుగయ్యాం కాబట్టి పది పతకాలైనా వస్తాయి అని వేసిన అంచనాలు తప్పయ్యాయి.

వ్యక్తిగత ప్రతిభతో విజయాలు దక్కిన తర్వాత ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు కోట్లాభిషేకం చేసేందుకు పోటీ పడుతున్నాయి. కానీ పోటీలకు ముందు సౌకర్యాలు కల్పించి ప్రోత్సహించమని అదే సంస్థలను ఒప్పించేందుకు నానా యాతన పడాల్సిన పరిస్థితి. బ్రిటన్ ఒక్కో పతకం కోసం రూ. 48 కోట్లు ఖర్చు చేస్తుండటం, మనం ఒక్కో అథ్లెట్‌పై రోజుకు 3 పైసలు ఖర్చు పెడుతుండటాన్ని పోలిస్తే భూమ్యాకాశాలకు ఉన్నంత తేడా ఉంది. అయితే డబ్బు మాత్రమే పతకాలు తీసుకు రాలేదని చెప్పేందుకు జమైకా, కెన్యాలాంటి ఎన్నో విజేతల ఉదాహరణలు ఉన్నాయి.

కానీ ఆటలను అలుసుగా చూసే వ్యవస్థలో మాత్రం మార్పు వచ్చి మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆట గురించి తెలిసి, దూరదృష్టి గల వ్యక్తులను వ్యవస్థలోకి తీసుకు వచ్చి వారికి బాధ్యత అప్పచెప్పాలి. ఎన్నడూ క్రీడా మంత్రినే పెట్టుకోని అమెరికా, అడ్మినిస్ట్రేటర్ల ప్రణాళికతోనే అద్భుతాలు చేస్తూ వస్తోంది. ‘ఖేలో ఇండియా’ పేరుతో కొత్తగా ప్రభుత్వం రూపొందించిన పథకంలో ఇప్పటికే గోపీచంద్, అంజూ జార్జ్ సభ్యులుగా ఉన్నారు. అభినవ్ బింద్రాలాంటి మేధావిని కూడా ఇందులో చేర్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ బృందం భారత జట్టు బలాలు, మన లోపాలు, ఏమేం అవసరంవంటి అంశాలపై తగిన ప్రణాళికలు, వ్యూహాలు రూపొందిస్తే 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనైనా మన జాతీయ గీతం వినిపించవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement