'మూడు నెలలుగా ఫోనే వాడలేదు'
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్లో రజతం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు విజయం వెనుక ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కృషి వెలకట్టలేనిది. తనకు తెలిసిన విద్యతోనే ప్రపంచాన్ని గెలవాలనే కోరికను సింధు ద్వారా
గురువు గోపీచంద్ నెరవేర్చుకున్నాడనంలో ఎటువంటి సందేహం లేదు.అయితే రియోలో సింధు రాణించడం వెనుక ఆమె విశేష కృషితో పాటు పట్టుదలే కారణమన్నాడు గోపీచంద్. తాను కొన్ని నిబంధనలను విధిస్తే వాటిని తూచా తప్పకుండా పాటించడమే సింధు విజయం వెనుక రహస్యమంటున్నాడు.
'ఆట గురించి కొన్ని కఠినమైన నిబంధనలను ఆమె అవలంభించక తప్పలేదు. చివరకు సింధుకు ఇష్టమైన తియ్యటి పెరుగును కూడా ఆమెకు అందకుండా చేశా. దాదాపు 12-13 రోజుల నుంచి ఇదే చేశా. దాంతో పాటు గత మూడు నెలల నుంచి సింధు ఫోన్ వాడటమే మానేంది. ఫోన్ కాల్స్ కూడా దూరంగా ఉండమని చెప్పి ఆమె ఫోన్ ను నేను తీసుకున్నా. ఆమె ఫోన్ ను తిరిగి ఇవ్వడమే నేను చెసే మొదటి పని . ఇప్పుడు సింధు ఏమి కావాలనుకుంటే అది తినొచ్చు'అని గోపీ చంద్ పేర్కొన్నాడు.