womens badminton
-
German Open: గాయత్రి–ట్రెసా జోడీ ముందంజ
జర్మన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 21–10, 21–11తో సోనా హొరిన్కోవా–కాటరీనా జుజకోవా (చెక్ రిపబ్లిక్) జంటపై గెలిచింది. -
చరిత్ర సృష్టించిన భారత్
భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌ను తొలిసారి కైవసం చేసుకుంది. మలేసియా వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన ఫైనల్లో (సింగిల్స్) పీవీ సింధు, అన్మోల్ ఖర్బ్ అద్భుత ప్రదర్శనతో భారత్ 3-2తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. ఈ కాంటినెంటల్ టోర్నీలో భారత్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌ల్లో (బెస్ట్ ఆఫ్ 5) సింధు, అన్మోల్తో పాటు గాయత్రి గోపీచంద్-జాలీ ట్రీసా జోడీ (డబుల్స్) విజయాలు సాధించారు. గాయం నుంచి కోలుకున్న అనంతరం తన మొదటి టోర్నీలో పాల్గొన్న సింధు.. ఫైనల్లో థాయ్ షట్లర్ సుపనిందా కతేథాంగ్‌ను కేవలం 39 నిమిషాల్లో 21-12, 21-12 తేడాతో ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆతర్వాత మూడు గేమ్‌ల పోరులో (21-16, 18-21, 21-16) గాయత్రి గోపీచంద్, జాలీ ట్రీసా జోడీ.. జోంగ్‌కోల్‌ఫామ్ కిటితారాకుల్, రవ్వింద ప్రజోంగ్‌జల్‌లను ఓడించడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం మూడు (అస్మిత చాలిహ), నాలుగు మ్యాచ్‌ల్లో (డబుల్స్) ఓటమి చవిచూసిన భారత్.. నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో గెలుపొంది, టైటిల్‌ను కైవసం చేసుకుంది. రసవత్తరంగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో 16 ఏళ్ల అన్మోల్ (472వ ర్యాంకర్).. ప్రపంచ 45వ ర్యాంకర్ పోర్న్‌పిచా చోయికీవాంగ్‌పై వరుస గేమ్‌లలో విజయం సాధించి, భారత జట్టు చారిత్రక గెలుపు భాగమైంది. -
సంచలన విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లిన గాయత్రి – ట్రెసా జోడీ
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 1000 టోర్నీ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ దూకుడు కొనసాగుతోంది. మహిళల డబుల్స్‌లో గాయత్రి – ట్రెసా జంట వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత ద్వయం 21–14, 18–21, 21–12 స్కోరుతో లీ వెన్ మీ – ల్యూ వాన్ వాన్ (చైనా)పై విజయం సాధించింది. 64 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో ప్రపంచ 17వ ర్యాంక్ జోడి గాయత్రి – ట్రెసా అటు అటాకింగ్, ఇటు డిఫెన్స్‌లో చెలరేగింది. గత ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించినప్పటినుంచి వరుస విజయాలతో సత్తా చాటుతున్న భారత జంట అదే జోరును ఇక్కడా ప్రదర్శించింది. తొలి గేమ్‌ను ధాటిగా ప్రారంభించిన గాయత్రి – ట్రెసా 6–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. అయితే చైనా జంట 6–6తో స్కోరును సమం చేసింది. ఈ దశలో మళ్లీ చెలరేగిన భారత జోడి ముందుగా 11–8తో ఆధిక్యం ప్రదర్శించి ఆ తర్వాత వరుస పాయింట్లతో 18–12కు దూసుకెళ్లి ఆపై గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం భారత జంటకు గట్టి పోటీ ఎదురైంది. ఏ దశలోనూ ఆధిక్యం అందుకోలేకపోయిన గాయత్రి – ట్రెసా గేమ్‌ను కోల్పోయారు. చివరి గేమ్‌లో మాత్రం మన జట్టుదే హవా నడిచింది. వరుసగా ఆరు పాయింట్లతో 8–1తో ముందంజ వేసిన అనంతరం స్కోరు 11–4..13–5..15–8..18–10...ఇలా సాగింది. 20–12 వద్ద గాయత్రి కొట్టిన ఫోర్‌హ్యాండ్ స్మాష్‌తో భారత జంట విజయం ఖాయమైంది. సెమీ ఫైనల్లో కొరియాకు చెందిన బేక్ హ నా – లీ సొ హితో గాయత్రి – ట్రెసా తలపడతారు. -
German Open 2023: మెయిన్ ‘డ్రా’కు తస్నీమ్
ముల్హీమ్: జర్మన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడి సుమీత్ రెడ్డి – అశ్విని పొన్నప్ప ఆట ముగిసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లోనే సుమీత్ – అశ్విని 10–21, 12–21 తేడాతో స్కాట్లాండ్కు చెందిన ఆడమ్ హాల్ – జూలీ మాక్‌ఫెర్సన్ చేతిలో పరాజయంపాలయ్యారు. మరో వైపు మహిళల సింగిల్స్‌లో తస్నీమ్ మీర్ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో తస్నీమ్ 24–22, 21–8 స్కోరుతో రాచెల్ దరాగ్ (ఐర్లాండ్)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో మాత్రం శంకర్ ముత్తుసామి మెయిన్ డ్రాకు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ముత్తుసామి 21–23, 19–21తో రెస్కీ డ్వికాయో (అజర్బైజాన్) చేతిలో ఓడాడు. -
స్పెయిన్ షట్లర్ చేతిలో పదో సారి ఓడిన పీవీ సింధు
కౌలాలంపూర్: కొత్త ఏడాదిని, కొత్త సీజన్‌ను భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమితో ప్రారంభించింది. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. చిరకాల ప్రత్యర్థి, మూడుసార్లు ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 12–21, 21–10, 15–21తో ఓడిపోయింది. మారిన్, సింధు ఇప్పటివరకు 15 సార్లు ముఖాముఖిగా తలపడగా... మారిన్ పదిసార్లు సింధును ఓడించి, ఐదుసార్లు ఆమె చేతిలో ఓడిపోయింది. 2018 మలేసియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో చివరిసారి మారిన్‌పై సింధు గెలిచింది. చీలమండ గాయం కారణంగా ఐదు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న సింధు ఈ మ్యాచ్‌లో ఆడపాదడపా మెరిసింది. యాదృచ్ఛికంగా మూడు గేముల్లోనూ ఒక్కసారి కూడా ఇద్దరి స్కోర్లు సమంగా కాకపోవడం విశేషం. తొలి గేమ్‌లో మారిన్ పూర్తి ఆధిపత్యం చలాయించగా... రెండో గేమ్‌లో సింధు విజృంభించింది. మూడో గేమ్‌లో మళ్లీ మారిన్ పుంజుకుంది. ఆరంభంలోనే 3–0తో ఆధిక్యంలోకి వెళ్లిన మారిన్ అదే జోరును కొనసాగించి విజయాన్ని ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్‌లో భారత్‌కే చెందిన మాళవిక బన్సోద్ 9–21, 13–21తో రెండో సీడ్ ఆన్ సె యంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత నంబర్‌వన్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 22–24, 21–12, 21–18తో భారత్‌కే చెందిన ప్రపంచ పదో ర్యాంకర్ లక్ష్య సేన్‌పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–16, 21–13తో చోయ్ సోల్ జియు–కిమ్ వన్ హో (కొరియా) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
తొలిసారి టాప్–20లోకి పుల్లెల గాయత్రి జోడీ
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి తన భాగస్వామి ట్రెసా జాలీ (కేరళ)తో కలిసి కెరీర్ బెస్ట్ 19వ ర్యాంక్‌కు చేరుకుంది. మంగళవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం రెండు స్థానాలు పురోగతి సాధించి భారత నంబర్‌వన్ జోడీగా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ రెండు స్థానాలు ఎగబాకి మరోసారి కెరీర్ బెస్ట్ ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
ప్రపంచ నంబర్ వన్ షట్లర్‌గా భారత అమ్మాయి
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అండర్–19 మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో కొత్త నంబర్‌వన్‌గా భారత్‌కు చెందిన అనుపమ ఉపాధ్యాయ అవతరించింది. హరియాణాలోని పంచ్‌కులాకు చెందిన 17 ఏళ్ల అనుపమ ఈ ఏడాది ఉగాండా, పోలాండ్ ఇంటర్నేషనల్ టోర్నీలలో విజేతగా నిలిచింది. టాప్ ర్యాంక్‌లో ఉన్న భారత్‌కే చెందిన తస్నిమ్ మీర్‌ను రెండో స్థానానికి నెట్టి అనుపమ అగ్రస్థానానికి చేరింది. భారత్‌కే చెందిన అన్వేష గౌడ ఆరో ర్యాంక్‌లో, ఉన్నతి హుడా తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. బెంగళూరులోని ప్రకాశ్ పడుకోన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న అనుపమ జూనియర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన ఆరో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. గతంలో ఆదిత్య జోషి (2014), సిరిల్ వర్మ (2016), లక్ష్య సేన్ (2017), తస్నిమ్ (2022), శంకర్ సుబ్రమణియన్ (2022) ఈ ఘనత సాధించారు. -
Singapore Open 2022: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన సింధు
సింగపూర్ ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దూసుకుపోతుంది. శనివారం (జులై 16) జరిగిన సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి, వరల్డ్ 38వ ర్యాంకర్ సయినా కవకామిపై 21-15, 21-7తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించింది. తొలి సెట్ నుంచే ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. కేవలం 32 నిమిషాల్లోనే గేమ్‌ను ముగించింది. ఈ ఏడాది రెండు సూపర్ 300 టైటిల్స్ (సయ్యద్ మోదీ, స్విస్ ఓపెన్) సాధించిన సింధు.. సింగపూర్ ఓపెన్ గెలిచి తొలి సూపర్ 500 టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధు.. క్వార్టర్ ఫైనల్లో చైనా షట్లర్ హాన్ యుయేపై 17-21, 21-11, 21-19 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, కెరీర్లో దాదాపు అన్ని సూపర్ 500 టైటిల్స్ సాధించిన సింధు సింగపూర్ ఓపెన్ మాత్రం గెలవలేకపోయింది. దీంతో సింధు ఈసారి ఎలాగైనా ఈ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుత టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సహచర షట్లర్ సైనా నెహ్వాల్ ప్రొఫెషనల్‌గా మారకముందే 2010లో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచింది. చదవండి: Singapore Open 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు.. సైనాకు తప్పని భంగపాటు -
పోరాడి ఓడిన సింధు..సెమీస్‌లో ఒలింపిక్ ఛాంపియన్ చేతిలో ఓటమి
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు థాయ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో చుక్కెదురైంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు శనివారం జరిగిన సెమీస్‌లో ఒలింపిక్ ఛాంపియన్, ప్రపంచ నాలుగో సీడ్ చెన్ యు ఫీ (చైనా) చేతిలో వరుస గేమ్‌ల్లో పరాజయం పాలైంది. కేవలం 43 నిమిషాల్లో ముగిసిన ఈ పోటీలో ఆరో సీడ్ సింధు 17-21, 16-21 తేడాతో ఓటమి చెందింది. ఫలితంగా ఆమె పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్.. ఈ పోటీలో సింధుకు ఊపిరాడనీయకుండా వరుస క్రమంలో పాయింట్లు సాధించి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు చెన్పై 6-4 ఆధిక్యం కలిగిన సింధు.. ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక చేతులెత్తేసింది. ఈ ఇద్దరు చివరిసారిగా 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో తలపడగా అప్పుడు కూడా చెన్నే విజయం వరించింది. కాగా, సింధు ఈ టోర్నీ క్వార్టర్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ అకానె యమగూచీకి షాకిచ్చి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. చదవండి: చెస్ వరల్డ్ చాంపియన్‌కు మరోసారి షాకిచ్చిన భారత కుర్రాడు -
Thailand Open: మెయిన్ ‘డ్రా’కు అష్మిత అర్హత
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువతారలు అష్మిత చాలియా, మాళవిక బన్సోద్ మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. బ్యాంకాక్‌లో మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో అష్మిత 21–16, 21–18తో జెనీ గాయ్ (అమెరికా)పై... మాళవిక 21–18, 21–8తో అనుపమ ఉపాధ్యాయ్ (భారత్)పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్లు ప్రియాన్షు రజావత్, శుభాంకర్, కిరణ్ జార్జి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయారు. -
Uber Cup 2022: సింధు సహా భారత షట్లర్లకు భంగపాటు
బ్యాంకాక్: ఉబెర్ కప్ 2022లో భారత మహిళా షట్లర్లకు ఘోర పరాభవం ఎదురైంది. బుధవారం జరిగిన గ్రూప్ డి చివరి క్లాష్‌లో పీవీ సింధుతో పాటు భారత షట్లర్లంతా మూకుమ్మడిగా చేతులెత్తేశారు. కొరియా టీమ్ చేతిలో సింధు నేతృత్వంలోని భారత జట్టు 0-5 తేడాతో ఘోర పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో భారత డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, ప్రపంచ నంబర్ 7 పీవీ సింధు.. యాన్ సే యంగ్ చేతిలో 15-21, 14-21తేడాతో ఓటమిపాలవ్వగా, రెండో మ్యాచ్‌లో డబుల్స్ జోడీ శ్రుతి మిశ్రా, సిమ్రన్ సింఘి 13-21, 12-21 తేడాతో లీ సోహీ-షిన్ సెంగ్ చాన్ జోడీ చేతిలో పరాజయం పాలైంది. మూడో మ్యాచ్‌లో తకాషి కశ్యప్ (కిమ్ గా యున్ చేతిలో 10-21, 10-21 తేడాతో), నాలుగో మ్యాచ్‌లో తనీషా క్రాస్టో, ట్రీసా జోలీ జోడీ (14-21, 11-21 తేడాతో కిమ్ హే జియాంగ్-కాంగ్ హీ యోంగ్ చేతిలో), ఆఖరి మ్యాచ్‌లో అష్మితా చలిహా ( సిమ్ యుజిన్ చేతిలో 18-21, 17-21తేడాతో) వరుసగా ఓటమిపాలయ్యారు. గ్రూప్ డి తొలి రెండు క్లాషెష్‌లో కెనడా, యూఎస్ఏ షట్లర్లను మట్టికరిపించిన భారత మహిళా జట్టు నామమాత్రమైన చివరి పోరులో కొరియా జట్టు చేతిలో దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ టోర్నీలో తొలి రెండు క్లాషెష్‌లో విజయం సాధించడం ద్వారా భారత జట్టు ఇదివరకే క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకుంది. రేపు (మే 12) జరుగబోరే క్వార్టర్ ఫైనల్లో (నాకౌట్) సింధు టీమ్.. థాయ్‌లాండ్ జట్టుతో తలపడనుంది. మరోవైపు థామస్ కప్‌లో భారత పురుషుల టీమ్ కూడా ఇదివరకే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. చదవండి: సత్తా చాటిన సింధు.. ఉబెర్ కప్ క్వార్టర్స్‌లో భారత్ -
సత్తా చాటిన సింధు.. ఉబెర్ కప్ క్వార్టర్స్‌లో భారత్
బ్యాంకాక్: ఉబెర్ కప్ 2022లో భారత మహిళా షట్లర్ల హవా కొనసాగుతుంది. గ్రూప్-డి లో భాగంగా కెనడాతో జరిగిన తొలి సమరంలో 4-1 తేడాతో విజయం సాధించిన భారత మహిళా జట్టు.. ఇవాళ (మే 10) యూఎస్ఏను 4-1తేడాతో మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్‌కు (నాకౌట్) అర్హత సాధించింది. యూఎస్ఏ టీమ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ప్రపంచ నెం.7 ర్యాంకర్ పీవీ సింధు 21-10, 21-11 తేడాతో జెన్ని గాయ్ను ఓడించగా, రెండో మ్యాచ్‌లో భారత ద్వయం తనీషా క్రాస్టో, త్రీసా జాలీ 21-19, 21-10 తేడాతో ఫ్రాంసెస్కాకార్బెట్-అల్లీసన్ లీ జోడీపై విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఆకాశి కశ్యప్ 21-18, 21-11 తేడాతో ఎస్తేర్ షిని ఖంగుతినిపించగా.. నాలుగో మ్యాచ్‌లో సిమ్రన్ సింఘి-రితికా థాకర్ జోడీ లారెన్ లామ్-కోడి తాంగ్ లీ చేతిలో 12-21, 21-17, 21-13 తేడాతో ఓటమిపాలైంది. చివరి మ్యాచ్‌లో అష్మితా చాలిహ 21-18, 21-13 తేడాతో నటాలి చిని ఓడించి భారత ఆధిక్యాన్ని 4-1కి చేర్చింది. భారత మహిళా జట్టు తమ తదుపరి గ్రూప్ మ్యాచ్‌లో బుధవారం కొరియాతో తలపడనుంది. కాగా, థామస్ కప్‌లో భారత పురుషుల జట్టు కూడా ఇదివరకే నాకౌట్ దశకు చేరుకుంది. చదవండి: నాకౌట్ దశకు భారత్ అర్హత -
Swiss Open 2022: ‘స్విస్’ క్వీన్ సింధు
బాసెల్: మరోసారి ఆద్యంతం నిలకడగా రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు ఈ ఏడాది తన ఖాతాలో రెండో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ చాంపియన్‌గా అవతరించింది. గత ఏడాది కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన 26 ఏళ్ల సింధు ఈసారి మాత్రం పట్టుదలతో ఆడి తొలిసారి స్విస్ ఓపెన్ విజేతగా నిలిచింది. ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో జరిగిన ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–16, 21–8తో గెలిచింది. అంతర్జాతీయ టోర్నీలలో బుసానన్‌పై సింధుకిది 16వ విజయం కావడం విశేషం. 49 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. అయితే స్కోరు 16–15 వద్ద సింధు వరుసగా రెండు పాయింట్లు గెలిచి 18–15తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒక పాయింట్‌ను బుసానన్కు కోల్పోయిన సింధు ఆ వెంటనే వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సింధు ఆరంభం నుంచే చెలరేగిపోగా బుసానన్ డీలా పడిపోయింది. స్కోరు 12–4 వద్ద సింధు వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 20–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత బుసానన్కు వరుసగా నాలుగు పాయింట్లు సమర్పించుకున్నాక సింధు ఒక పాయింట్ సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. విజేతగా నిలిచిన సింధుకు 13,500 డాలర్ల (రూ. 10 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది సింధుకిది రెండో టైటిల్. గత జనవరిలో ఆమె సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్, 2016 చాంపియన్ హెచ్ఎస్ ప్రణయ్ రన్నరప్‌గా నిలిచాడు. కేరళకు చెందిన ప్రణయ్ ఫైనల్లో 12–21, 18–21తో 2018 ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. ప్రధాని మోదీ, సీఎం జగన్ అభినందన సాక్షి, అమరావతి: స్విస్ ఓపెన్ విజేత సింధును ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ‘స్విస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన తెలుగు షట్లర్, దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి సింధుకు శుభాకాంక్షలు. భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలి. సింధు ప్రతి ప్రయత్నానికి దేవుడి ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకుంటున్నాను’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘సింధు విజయాలు దేశ యువతకు ప్రేరణ ఇస్తాయి. భవిష్యత్‌లో ఆమె మరిన్ని టోర్నీలలో రాణించాలి’ అని మోదీ ట్వీట్ చేశారు. All hail the champion! 👑 2️⃣nd super 300 title for @Pvsindhu1 this year 🔥#SwissOpen2022#IndiaontheRise#Badminton pic.twitter.com/EpCqmr0JeS — BAI Media (@BAI_Media) March 27, 2022 చదవండి: Swiss Open: ఫైనల్లో సింధు -
చరిత్ర సృష్టించిన భారత షట్లర్.. సింధు, సైనాలకు సాధ్యం కాని ఘనత సొంతం
Indian Shuttler Tasnim Mir Achieves Under 19 World No 1 Rank: భారత మహిళల బ్యాడ్మింటన్‌లో 16 ఏళ్ల గుజరాత్ అమ్మాయి తస్నిమ్ మీర్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అండర్ 19 మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. గతేడాది బల్గేరియా, ఫ్రాన్స్, బెల్జియంలలో జరిగిన టోర్నీల్లో సత్తా చాటడం ద్వారా మూడు ర్యాంకులను మెరుగుపర్చుకున్న తస్నిమ్.. అగ్రపీఠాన్ని అధిరోహించింది. ప్రస్తుతం తస్నిమ్ 10,810 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగతుండగా.. మరో భారత షట్లర్ అనుపమ ఉపాధ్యాయ ఏకంగా 29 స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకుంది. కాగా, అండర్ 19 విభాగంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో స్థానం వరకు మాత్రమే చేరుకోగలిగింది. చదవండి: నిషేధం గండం నుంచి గట్టెక్కిన కోహ్లి అండ్ కో..! -
పీవీ సింధు పేరు చెబితే నోరూరించే పిజ్జా ఫ్రీ
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ఉమెన్స్ బాడ్మింటన్ లో రజత పతకాన్ని సాధించిన సింధు విజయాన్ని దేశమంతా సెలెబ్రేట్ చేసుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల నజరానాలు ప్రకటిస్తుండగా అనేక కార్పొరేట్ కంపెనీలు కూడా సింధుకు, ఆమె కోచ్ గోపిచంద్‌కు బహుమతులు ప్రకటిస్తున్నారు. అయితే వీరందరికి భిన్నంగా పిజ్జాహట్ మాత్రం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ స్టోర్‌కు వచ్చి సింధు పేరు చెప్పినవారికి పిజ్జా ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకం గెలిచినప్పుడు కూడా పిజ్జాహట్ ఇదే ఆఫర్‌ను ప్రకటించగా చాలామంది మహిళలు సాక్షి మాలిక్ పేరు చెప్పి ఫ్రీ పిజ్జాతో బయటకొచ్చారు. ఈ కొత్త ఆలోచనకు అనూహ్య స్పందన కనిపించడంతో ఇప్పుడు సింధు పేరుతో కూడా ఆఫర్ ప్రకటించింది. పిజ్జా ఫ్రీగా ఇస్తే నష్టం కదా..? అనే అనుమానం మనకు రావొచ్చు. కానీ పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేసే కార్పొరేట్ కంపెనీలకు ఇది కూడా ఓ రకమైన ప్రచారాస్త్రమే కదా! -
బ్యాడ్మింటన్ విశ్వవిజేత కరోలినా
రియో డి జనిరో: కరోలినా మారియా మారిన్ మార్టిన్ అలియాస్ కరోలినా మారిన్.. వర్తమాన బ్యాడ్మింటన్ చరిత్రలో ఎదురులేని జగజ్జేత. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో స్వర్ణం సాధించిన విశ్వవిజేత. భారత స్టార్ పీవీ సింధుతో శుక్రవారం రాత్రి జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్ లో తొలి గేమ్ కోల్పోయినప్పటికీ అనూహ్యంగా పుంజుకుని చివరి రెండు గేమ్ లను గెలిచి.. బంగారు పతకాన్ని సాధించిన మారిన్.. బ్యాడ్మింటన్ లో స్పెయిన్ తరఫున గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. చైనా జోరుకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండు సార్లు (2014,15లో) చాంపియన్ అవతరించిన మారిన్.. భారత్ కు సంబంధిచినంత వరకు దుర్భేధ్యమైన అడ్డుగొడ అని చెప్పక తప్పదు. సైనా నెహ్వాల్ ను ప్రపంచ విజేత కానీయకుండా అడ్డుకున్నా, ఇప్పుడు సింధూను రజతానికి పరిమితం చేయగలినా అది ఆటలో మారిన్ ప్రదర్శించే దూకుడు వల్లే సాధ్యమైంది. ఏమాత్రం కనికరం లేకుండా ఆమె కొట్టే స్మాష్ లు.. ప్రత్యర్థిని బిత్తరపోయేలా చేస్తాయి. శుక్రవారం నాటి ఫైనల్స్ లో 19- 21 తేడాతో తొలి గేమ్ కోల్పోయిన మారిన్.. ఆ తర్వాత ఏ దశలోనూ తగ్గకుండా ధాటిగా ఆడింది. రెండు, మూడో గేమ్ లలో 21-15, 21-15 తేడాతో సింధుకు అడ్డుకట్టవేసింది. అయితే ఇప్పటికే ప్రపంచ చాంపియన్ గా ఉన్న కరోలినా మారిన్ తో పోరాటమంటే సింధు లాంటి రైజింగ్ స్టార్స్ పై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కానీ, అలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా సింధూ సాధ్యమైనంత మేరలో మెప్పించింది.. 2020 టోక్యో ఒలింపిక్స్ లో పసిడి పతకం తేగలననే నమ్మకాన్ని కల్పించింది. మారిన్ ప్రొఫైల్ దేశం: స్పెయిన్ చేతివాటం: ఎడమ పుట్టిన తేది: జూన్ 15, 1993 (ప్రస్తుతం 23 ఏళ్లు) ప్రపంచ ర్యాంక్ : 1 అరంగేట్రం: 2009 మేజర్ టైటిల్స్: రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్(నేడు), యురోపియన్ చాంపియన్ షిప్- 2016, వరల్డ్ చాంపియన్- 2015, హాంగ్ కాంగ్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్- 2015, ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టైటిల్- 2015, వరల్డ్ చాంపియన్ షిప్- 2014 తదితరాలు