పీవీ సింధు పేరు చెబితే నోరూరించే పిజ్జా ఫ్రీ
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ఉమెన్స్ బాడ్మింటన్ లో రజత పతకాన్ని సాధించిన సింధు విజయాన్ని దేశమంతా సెలెబ్రేట్ చేసుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల నజరానాలు ప్రకటిస్తుండగా అనేక కార్పొరేట్ కంపెనీలు కూడా సింధుకు, ఆమె కోచ్ గోపిచంద్‌కు బహుమతులు ప్రకటిస్తున్నారు. అయితే వీరందరికి భిన్నంగా పిజ్జాహట్ మాత్రం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ స్టోర్‌కు వచ్చి సింధు పేరు చెప్పినవారికి పిజ్జా ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది.
రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకం గెలిచినప్పుడు కూడా పిజ్జాహట్ ఇదే ఆఫర్‌ను ప్రకటించగా చాలామంది మహిళలు సాక్షి మాలిక్ పేరు చెప్పి ఫ్రీ పిజ్జాతో బయటకొచ్చారు. ఈ కొత్త ఆలోచనకు అనూహ్య స్పందన కనిపించడంతో ఇప్పుడు సింధు పేరుతో కూడా ఆఫర్ ప్రకటించింది. పిజ్జా ఫ్రీగా ఇస్తే నష్టం కదా..? అనే అనుమానం మనకు రావొచ్చు. కానీ పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు చేసే కార్పొరేట్ కంపెనీలకు ఇది కూడా ఓ రకమైన ప్రచారాస్త్రమే కదా!