హంటర్స్‌కు వారియర్స్ షాక్
5–0తో హైదరాబాద్‌పై గెలుపు
మారిన్ చేతిలో సైనా ఓటమి
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్‌లో హైదరాబాద్ హంటర్స్ జట్టుకు అవధ్ వారియర్స్ చేతిలో పరాభవం ఎదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ 0–5తో పరాజయం చవిచూసింది. ఈ పోరులో కరోలినా మారిన్ (హైదరాబాద్) ఒక్కరే గెలిచినప్పటికీ... హంటర్స్ జట్టు ‘ట్రంప్’ మ్యాచ్ ఓడిపోవడం ద్వారా సాధించిన ఆ ఒక్క పాయింట్ కూడా కోల్పోవాల్సివచ్చింది.
పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో వాంగ్ వింగ్‌కి విన్సెంట్ (వారియర్స్) 11–13, 11–6, 13–11తో సాయి ప్రణీత్ (హంటర్స్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో రియో ఒలింపిక్స్ చాంపియన్ మారిన్ (హంటర్స్) 15–14, 11–5తో సైనా నెహ్వాల్ (వారియర్స్)ను కంగుతినిపించింది. మిక్స్‌డ్ డబుల్స్‌ను అవధ్ వారియర్స్ జట్టు తమ ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంచుకోగా... బొదిన్ ఇసారా–సావిత్రి (వారియర్స్) 11–9, 12–10తో చౌ వా– సాత్విక్ సాయిరాజ్ (హంటర్స్)లపై గెలిచారు. దీంతో రెండు పాయింట్లు లభించాయి. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (వారియర్స్) 11–13, 11–7, 13–11తో రాజీవ్ ఉసెఫ్ (హంటర్స్)పై గెలిచాడు. చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌ను హైదరాబాద్ తమ ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంచుకుంది. కానీ ఇందులో కూడా గో వి షెమ్–మార్క్స్ కిడో (వారియర్స్) 7–11, 11–8, 13–11తో టాన్ బూన్–టాన్ వీ (హంటర్స్)లను ఓడించారు. సోమవారంతో హైదరాబాద్ అంచె లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. మంగళవారం ముంబైలో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్‌తో చెన్నై స్మాషర్స్ తలపడుతుంది.