Premier Badminton League
-
సెమీస్‌లో పుణే సెవెన్ ఏసెస్
సాక్షి, హైదరాబాద్: మరో అద్భుత ప్రదర్శనతో నాలుగో విజయం నమోదు చేసుకున్న పుణే సెవెన్ ఏసెస్ జట్టు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పుణే 4–1తో అవధ్ వారియర్స్‌పై గెలుపొందింది. తద్వారా 18 పాయింట్లను ఖాతాలో వేసుకున్న పుణే... పాయింట్ల పట్టికలో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఇప్పటికే చెన్నై సూపర్ స్టార్స్, నార్త్ ఈస్టర్న్ వారియర్స్ సెమీస్ లోకి అడుగుపెట్టాయి. మిగిలిన మరో బెర్త్ కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. పురుషుల డబుల్స్‌లో కొ సుంగ్ హ్యూన్–షిన్ బేక్ (అవధ్ వారియర్స్) జోడీ 6–15, 15–9, 15–12తో చిరాగ్ శెట్టి–సెతియావన్ (పుణే) జంటపై గెలుపొంది అవధ్ వారియర్స్‌కు శుభారంభం ఇచ్చింది. అయితే అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో ఆడిన అవధ్ వారియర్స్ ప్లేయర్ బీవెన్ జాంగ్ 13–15, 12–15తో రితుపర్ణ (పుణే) చేతిలో ఓడటంతో... అవధ్ వారియర్స్‌కు ఒక పాయింట్ పెనాల్టీ పడింది. మిక్స్డ్ డబుల్స్‌లో క్రిస్టీనా పెడర్సన్–సొజొనోవ్ (అవధ్ వారియర్స్) జంట 6–15, 9–15తో క్రిస్–గాబ్రియెల్ (పుణే) ద్వయం చేతిలో ఓడింది. దాంతో పుణే 2–0తో ఆధిక్యంలోకెళ్లింది. పురుషుల తొలి సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో ఆడిన కీన్ యూ లోహ్ (పుణే) 15–12, 15–14తో శుభాంకర్ డే (అవధ్ వారియర్స్)పై గెలిచాడు. చివరగా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో కజుమస సకాయ్ (పుణే) 15–6, 10–15, 13–15తో అజయ్ జయరామ్ (అవధ్ వారియర్స్) చేతిలో ఓడాడు. నేటి మ్యాచ్‌ల్లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో చెన్నై సూపర్ స్టార్స్; బెంగళూరు రాప్టర్స్‌తో ముంబై రాకెట్స్ తలపడతాయి. -
గచ్చిబౌలి స్టేడియంలో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
-
సింధు ఓడినా... హంటర్స్ నెగ్గింది
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో హైదరాబాద్ హంటర్స్ జట్టు సొంతగడ్డపై శుభారంభం చేసింది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన పోరులో హంటర్స్ 2–1 తేడాతో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌ను ఓడించింది. అయితే వరల్డ్ చాంపియన్ పీవీ సింధు మాత్రం తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయింది. అభిమానుల సమక్షంలో ఆడిన తొలి మ్యాచ్‌లో తడబడి ఓటమితో నిరాశపర్చింది. తుది ఫలితం హంటర్స్‌కు అనుకూలంగా రావడం మాత్రం ఊరట.మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 8–15, 9–15 స్కోరుతో మిషెల్లీ లీ (నార్త్ ఈస్టర్స్ వారియర్స్) చేతిలో పరాజయంపాలైంది. ముందుగా జరిగిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–ఇవనోవ్ జోడి 15–12, 8–15, 15–12తో కృష్ణ ప్రసాద్–కిమ్ హా నా పై గెలిచి శుభారంభం చేసింది. అయితే ట్రంప్ మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 14–15, 14–15తో సేన్‌సోమ్‌బూన్‌సుక్ చేతిలో ఓడటంతో హంటర్స్ పాయింట్ కోల్పోవాల్సి వచ్చింది. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ జంట బెన్ లేన్–ఇవనోవ్ 15–7, 15–10తో బోదిన్ ఇసారా–లీ యంగ్ డేపై సంచలన విజయం సాధించింది. ఇది నార్త్ ఈస్టర్న్‌కు ట్రంప్ మ్యాచ్ కావడంతో స్కోరు 1–1తో సమమైంది. ఈ దశలో జరిగిన రెండో పురుషుల సింగిల్స్‌లో హంటర్స్ ప్లేయర్ డారెన్ ల్యూ 15–9, 15–10తో లీ చెక్ యు ను ఓడించి హైదరాబాద్ శిబిరంలో ఆనందం నింపాడు. నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌స్టార్స్‌తో పుణే సెవెన్ ఏసెస్ జట్టు తలపడుతుంది. -
అవధ్ వారియర్స్ రెండో గెలుపు
లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో అవధ్ వారియర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ 5–0తో ముంబై రాకెట్స్‌ను చిత్తు చేసింది. తొలుత జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో కొ సుంగ్ హ్యూన్–క్రిస్టినా పెడర్సెన్ (అవధ్ వారియర్స్) 9–15, 14–15తో కిమ్ స రంగ్–పియా జెబదియా (ముంబై) జంట చేతిలో ఓడింది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో ఆడిన అవధ్ వారియర్స్ ప్లేయర్ బీవెన్ జాంగ్ 15–3, 15–4తో కుహూ గార్గ్ (ముంబై)పై గెలిచి జట్టుకు 2–1 ఆధిక్యాన్నిచ్చింది. పురుషుల తొలి సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో బరిలో దిగిన పారుపల్లి కశ్యప్ (ముంబై) 8–15, 10–15తో విన్సెంట్ (అవధ్ వారియర్స్) చేతిలో ఓడటంతో... ముంబై జట్టుకు ఒక పాయింట్ పెనాల్టీ పడింది. దాంతో అవధ్ వారియర్స్ 3–0తో ఆధిక్యంలో నిలిచింది.తర్వాత జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో అజయ్ జయరామ్ (అవధ్ వారియర్స్) 12–15, 15–6, 15–7తో లీ డాంగ్ కెయున్ (ముంబై)పై గెలిచాడు. ఇక చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌లో కొ సుంగ్ హ్యూన్– షిన్ బేక్ (అవధ్ వారియర్స్) జంట 14–15, 15–10, 15–14తో కిమ్ జి జుంగ్–కిమ్ స రంగ్ (ముంబై) జోడీపై గెలిచింది. నేటి నుంచి హైదరాబాద్ అంచె పోటీలు ప్రారంభమవుతాయి. జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది. -
హంటర్స్ ఖాతాలో తొలి గెలుపు
లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో హైదరాబాద్ హంటర్స్‌కు తొలి విజయం లభించింది. ఆదివారం ఇక్కడ జరిగిన పోరులో హైదరాబాద్ హంటర్స్ 2–1తో అవధ్ వారియర్స్‌పై గెలుపొందింది. పురుషుల తొలి సింగిల్స్‌లో సౌరభ్ వర్మ (హైదరాబాద్) 14–15, 15–12, 15–10తో శుభాంకర్ డే (అవ«ద్)పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ఇవనోవ్–సిక్కి రెడ్డి (హైదరాబాద్) ద్వయం 15–12, 15–14తో షిన్ బేక్–క్రిస్టీనా (అవధ్) జోడీపై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ‘ట్రంప్ కార్డు’తో ఆడిన అవధ్ వారియర్స్ ఓడిపోవడంతో... పీబీఎల్ నిబంధనల ప్రకారం వారి స్కోరుకు ఒక పాయింట్ పెనాల్టీ విధించారు. దాంతో హైదరాబాద్ 2–(–1)తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (హైదరాబాద్) 15–8, 15–8తో తన్వీ లాడ్ (అవధ్)పై విజయం సాధించడంతో హైదరాబాద్ 3–(–1)తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దాంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే హైదరాబాద్ విజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల రెండో సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డుతో బరిలో దిగిన హైదరాబాద్ ప్లేయర్ డారెన్ లీయూ 14–15, 9–15తో విన్సెంట్ (అవధ్ వారియర్స్) చేతిలో ఓడిపోవడంతో... ఈసారి హైదరాబాద్‌కు పెనాల్టీ ఎదురైంది. దాంతో హైదరాబాద్ ఆధిక్యం 2–0కు తగ్గింది. చివరి మ్యాచ్ అయిన పురుషుల డబుల్స్‌లో ఇవనోవ్–బెన్ లేన్ (హైదరాబాద్) జోడీ 12–15, 8–15తో కో సుంగ్ హ్యూన్–íÙన్ బేక్ (అవధ్ వారియర్స్) చేతిలో ఓడింది. నేటి మ్యాచ్‌లో పుణే 7 ఏసెస్‌తో బెంగళూరు రాప్టర్స్ తలపడుతుంది. -
పీబీఎల్‌లో పుణే బోణీ
లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) సీజన్–5లో పుణే సెవెన్ ఏసెస్ జట్టు బోణీ కొట్టింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పుణే 5–2తో ముంబై రాకెట్స్‌పై గెలిచింది. తొలుత జరిగిన పరుషుల డబుల్స్ పోరులో చిరాగ్ శెట్టి–హెండ్రా సెటియావన్ (పుణే) ద్వయం 14–15, 15–5, 15–6తో కిమ్ జుంగ్– కిమ్ స రంగ్ (ముంబై) జంటపై గెలిచింది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో బరిలో దిగిన పుణే ప్లేయర్ రితుపర్ణ దాస్ 11–15, 15–9, 15–9తో శ్రేయాన్షి పర్దేశి (ముంబై)పై గెలవడంతో... పుణే 3–0తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత జరిగిన పురుషుల మొదటి సింగిల్స్‌లో లోహ్ కియాన్ య్యూ (పుణే) 15–7, 15–14తో పారుపల్లి కశ్యప్ (ముంబై)పై నెగ్గడంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే పుణే విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇక నామమాత్రంగా జరిగిన పురుషుల రెండో సింగిల్స్ మ్యాచ్‌లో సకాయ్ (పుణే) 7–15, 13–15తో లీ డాంగ్ కెయున్ (ముంబై) చేతిలో ఓడాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ‘ట్రంప్ కార్డు’తో ఆడటంతో... ఆ జట్టుకు రెండు పాయింట్లు లభించాయి. చివరి మ్యాచ్ అయిన మిక్స్డ్ డబుల్స్‌లో క్రిస్–గ్యాబీ (పుణే) ద్వయం 15–12, 10–15, 15–6తో కిమ్ జి జుంగ్–పియా జెబిదియా (ముంబై) జంటపై గెలిచింది. నేటి మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది. -
అవధ్ వారియర్స్‌ను గెలిపించిన శుభాంకర్ డే
చెన్నై: ఉత్కంఠ పోరులో అవధ్ వారియర్స్ ఆటగాడు శుభాంకర్ డే సత్తా చాటాడు. విజేతను నిర్ణయించే చివరి మ్యాచ్ బరిలో దిగిన అతను అద్భుతమైన ఆట తీరుతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) సీజన్–5లో గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ 4–3తో నార్త్ ఈస్టర్న్‌పై గెలిచింది. తొలుత మిక్స్డ్ డబుల్స్‌లో బొదిన్ ఇసారా–కిమ్ హన (నార్త్ ఈస్టర్న్) ద్వయం 15–8, 11–15, 14–15తో కొ సుంగ్ హ్యూన్–క్రిస్టీనా (అవధ్ వారియర్స్) జోడీ చేతిలో ఓడింది. అనంతరం జరిగిన పురుషుల తొలి సింగిల్స్ పోరులో లే చెయుక్ యు (నార్త్ ఈస్టర్న్) 13–15, 15–10, 15–11తో విన్సెంట్ (అవధ్ వారియర్స్)పై గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ ‘ట్రంప్ కార్డు’తో ఆడటంతో ఆ జట్టుకు రెండు పాయింట్లు వచ్చాయి. దాంతో నార్త్ ఈస్టర్న్ 2–1తో ఆధిక్యంలో నిలిచింది. మూడో మ్యాచ్ అయిన మహిళల సింగిల్స్‌లో మిచెల్లె లీ (నార్త్ ఈస్టర్న్) 15–13, 15–14తో బీవెన్ జాంగ్ (అవధ్ వారియర్స్)ను కంగుతినిపించింది. పురుషుల డబుల్స్‌లో ‘ట్రంప్’ కార్డుతో బరిలో దిగిన అవధ్ వారియర్స్ జంట కొ సుంగ్ హ్యూన్– షిన్ బేక్ 8–15, 15–14, 15–12తో కృష్ణ ప్రసాద్– లీ యాంగ్ డే (నార్త్ ఈస్టర్న్) ద్వయంపై గెలువడంతో... ఇరు జట్ల స్కోర్లు 3–3తో సమం అయ్యాయి. ఇక విజేతను నిర్ణయించే చివరి పోరులో సెన్సోమ్బూన్సుక్ (నార్త్ ఈస్టర్న్) 9–15, 13–15తో శుభాంకర్ డే చేతిలో ఓడటంతో... మ్యాచ్ అవధ్ వారియర్స్ వశం అయింది. నేటి మ్యాచ్‌లో బెంగళూరు రాప్టర్స్‌తో చెన్నై సూపర్‌స్టార్స్ తలపడుతుంది. -
బెంగళూరుకు చుక్కెదురు
చెన్నై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్‌కు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 3–4తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ చేతిలో ఓడింది. ఒకదశలో 1–3తో ఆధిక్యంలో నిలిచిన బెంగళూరు... అనంతరం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి పరాజయాన్ని మూట గట్టుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో చాన్ పెంగ్–యోమ్ హే వోన్ (బెంగళూరు) ద్వయం 15–8, 15–11తో లీ యంగ్ డే–కిమ్ హన (నార్త్ ఈస్టర్న్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ (బెంగళూరు) 14–15, 9–15తో లే చియుక్ యు (నార్త్ ఈస్టర్న్) చేతిలో ఓడటంతో... ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (బెంగళూరు) 15–7, 15–5తో అస్మిత (నార్త్ ఈస్టర్న్)పై గెలుపొందింది. ఈ పోరులో బెంగళూరు ‘ట్రంప్ కార్డు’ ఉపయోగించడంతో రెండు పాయింట్లు లభించాయి. దాంతో బెంగళూరు 3–1తో ఆధిక్యంలోకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో బరిలో దిగిన నార్త్ ఈస్టర్న్ జోడీ బొదిన్ ఇసారా–లీ యంగ్ డే ద్వయం 15–12, 15–6తో అరుణ్ జార్జ్–రియాన్ అగుంగ్ సపుర్తో (బెంగళూరు) జంటను చిత్తు చేసింది. దీంతో మరోసారి ఇరు జట్ల స్కోర్లు 3–3తో సమం అయ్యాయి. ఇక విజేతను నిర్ణయించే చివరి మ్యాచ్ అయిన పురుషుల రెండో సింగిల్స్‌లో సెన్సోమ్బూన్సుక్ (నార్త్ ఈస్టర్న్) 15–7, 15–8తో లెవెర్డెజ్పై గెలుపొందడంతో నార్త్ ఈస్టర్న్ విజయం ఖాయమైంది. -
పీబీఎల్‌కు వేళాయె...
చెన్నై: భారత స్టార్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ గైర్హాజరీలో... ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్‌కు సోమవారం తెర లేవనుంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు సభ్యురాలిగా ఉన్న హైదరాబాద్ హంటర్స్‌తో మాజీ చాంపియన్ చెన్నై సూపర్‌స్టార్స్ జట్టు తలపడుతుంది. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూతురు గాయత్రితో పీవీ సింధు తలపడుతుంది. మొత్తం రూ. ఆరు కోట్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో అవధ్ వారియర్స్, బెంగళూరు రాప్టర్స్, ముంబై రాకెట్స్, హైదరాబాద్ హంటర్స్, చెన్నై సూపర్‌స్టార్స్, నార్త్ ఈస్టర్న్ వారియర్స్, పుణే సెవెన్ ఏసెస్ జట్లు టైటిల్ కోసం బరిలో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ తరఫున హైదరాబాద్ ప్లేయర్, ప్రపంచ చాంపియన్íÙప్ పురుషుల సింగిల్స్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ పోటీపడుతున్నాడు. ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో జరిగే ఫైనల్‌తో లీగ్ ముగుస్తుంది. మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. -
హంటర్స్‌కే సింధు
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ వేలంలో మరోసారి ఇద్దరు అగ్రశ్రేణి షట్లర్ల హవా కొనసాగింది. పీవీ సింధు, తై జు యింగ్‌లను లీగ్ అనుమతించిన గరిష్ట మొత్తం రూ. 77 లక్షలకు వరుసగా హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు రాప్టర్స్ జట్లు సొంతం చేసుకున్నాయి. ఐదో సీజన్ కోసం మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన వేలంలో మొత్తం 154 మంది షట్లర్లు పాల్గొన్నారు. ఏడు జట్లు ఒక్కో ఆటగాడిని కొనసాగించాయి. వేలానికి ముందే ఇద్దరు స్టార్లు సైనా నెహా్వల్, కిడాంబి శ్రీకాంత్ టోరీ్నకి దూరం కాగా... రెండు జట్లు ఢిల్లీ డాషర్స్, అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ కూడా ఆరి్థకపరమైన కారణాలతో పీబీఎల్ నుంచి తప్పుకోవడంతో లీగ్ 9 జట్ల నుంచి 7కు తగ్గింది. చెన్నై స్మాషర్స్ జట్టు పేరు మార్చుకొని ఈసారి చెన్నై సూపర్‌స్టార్స్‌గా బరిలోకి దిగనుంది. న్యూఢిల్లీ: వరల్డ్ చాంపియన్ పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో మరోసారి సొంత జట్టుకే ప్రాతినిధ్యం వహించనుంది. మంగళవారం జరిగిన వేలంలో హైదరాబాద్ హంటర్స్ రూ. 77 లక్షలతో సింధును కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. పీబీఎల్ నిబంధనల ప్రకారం గత ఏడాది ఒక ప్లేయర్‌కు గరిష్టంగా రూ. 70 లక్షలు చెల్లించారు. సింధుకు కూడా అదే మొత్తం దక్కింది. ఈ ఏడాది వారిని కొనసాగించాలంటే రూ. 70 లక్షలు గానీ లేదంటే అదనంగా 10 శాతం మించకుండా ఇవ్వవచ్చు. దాంతో హంటర్స్ రూ. 77 లక్షలతో సింధును సొంతం చేసుకుంది. వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)కి కూడా వేలంలో రూ. 77 లక్షలు దక్కాయి. గత సీజన్లో తై జు యింగ్ అహ్మదాబాద్ టీమ్‌కు ఆడింది. అయితే ఈసారి ఆ జట్టు లేకపోవడంతో వేలంలో పాల్గొనాల్సి వచ్చింది. కనీస విలువ రూ. 70 లక్షలతోనే తై జు వేలం ప్రారంభమైంది. బెంగళూరు, పుణే ఆమె కోసం పోటీపడి రూ. 77 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. దాంతో నిబంధనల ప్రకారం ‘డ్రా’ తీశారు. ఇందులో ఆమె డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ జట్టుకు ఎంపికైంది. ఇటీవల అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న డబుల్స్ స్పెషలిస్ట్ సాత్విక్ సాయిరాజ్ వేలం ఆసక్తికరంగా సాగింది. కనీస ధర రూ. 25 లక్షలతో అతని వేలం మొదలు కాగా... హైదరాబాద్, అవ«ద్‌లతో పోటీ పడి చివరకు రూ. 62 లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది. వరల్డ్ చాంపియన్íÙప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్‌ను రూ. 32 లక్షలకు బెంగళూరు అట్టి పెట్టుకుంది. వేలంలో చెప్పుకోదగ్గ విలువ పలికిన కీలక ఆటగాళ్లలో పారుపల్లి కశ్యప్ (రూ. 43 లక్షలు–ముంబై), సౌరభ్ వర్మ (రూ. 41 లక్షలు–హైదరాబాద్) ఉన్నారు. యువ సంచలనం లక్ష్య సేన్‌ను చెన్నై రూ. 36 లక్షలకు తీసుకుంది. స్టార్స్ దూరం... గత సీజన్లో ఆడిన ప్రపంచ మాజీ చాంపియన్ అక్సెల్సన్ (డెన్మార్క్), ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఆంటోన్సెన్ (డెన్మార్క్), రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) ఈసారి బరిలోకి దిగడం లేదు. భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సైనా, శ్రీకాంత్, సమీర్ వర్మ, ప్రణయ్ కూడా ఆడటంలేదు. వేలంలో పేరు నమోదు చేసుకున్నా భారత డబుల్స్ స్పెషలిస్ట్ అశ్విని పొన్నప్పను ఏ జట్టూ తీసుకోలేదు. ►10 పీబీఎల్–5లో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉన్న క్రీడాకారుల సంఖ్య. సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సుమీత్ రెడ్డి, పుల్లెల గాయత్రి, రుత్విక శివాని, సిక్కి రెడ్డి, రితూపర్ణ దాస్ (తెలంగాణ); పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, గారగ కృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్). -
పీబీఎల్ నుంచి వైదొలిగిన సైనా
న్యూఢిల్లీ: కొంత కాలంగా పేలవమైన ఫామ్‌తో నిరాశ పరుస్తున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వచ్చే ఏడాది జనవరిలో ఆరంభమయ్యే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్ నుంచి వైదొలిగింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘నేను పీబీఎల్ ఐదో సీజన్ ఆడటం లేదు. గాయాలు, అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది నేను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాను. అందుకే పీబీఎల్ సీజన్ సమయాన్ని నా ఆట మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు వెచ్చించాలని నిర్ణయించుకున్నాను. తర్వాతి సీజన్లో ఆడేందుకు ప్రయతి్నస్తాను’ అని ట్విట్టర్లో తెలిపింది. పీబీఎల్‌లో సైనా హైదరాబాద్, అవ«ద్, నార్త్ ఈస్టర్న్ తరఫున సైనా బరిలో దిగింది. -
రాప్టర్స్ రాకింగ్
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–4) నాలుగో సీజన్లో బెంగళూరు రాప్టర్స్ రాకింగ్ ప్రదర్శనతో టైటిల్ పట్టేసింది. ఆదివారం జరిగిన రసవత్తర టైటిల్ పోరాటంలో బెంగళూరు 4–3తో ముంబై రాకెట్స్‌ను కంగుతినిపించింది. మొదట జరిగిన మిక్స్డ్ డబుల్స్‌ను ‘ట్రంప్’గా ఎంచుకున్న ముంబై రాకెట్స్ ఇందులో గెలిచి శుభారంభం చేసింది. కిమ్ జీ జాంగ్–బెర్నడెత్ (ముంబై) జంట 15–8, 15–14తో మార్కస్ ఎలిస్–లారెన్ స్మిత్ (బెంగళూరు) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ (బెంగళూరు) 15–7, 15–10తో అంటోన్సెన్ (ముంబై)పై నెగ్గి 1–2తో రాకెట్స్ ఆధిక్యాన్ని తగ్గించాడు. బెంగళూరుకు ‘ట్రంప్’ అయిన మహిళల సింగిల్స్‌లో తి ట్రంగ్ వు 15–8, 15–9తో శ్రియాన్షి పరదేశి (ముంబై)ని ఓడించింది. దీంతో 3–2తో బెంగళూరు పైచేయి సాధించింది. అయితే రెండో పురుషుల సింగిల్స్‌లో తెలుగు షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ (బెంగళూరు) 15–7, 12–15, 3–15తో సమీర్ వర్మ (ముంబై) చేతిలో కంగుతిన్నాడు. దీంతో ఇరు జట్లు 3–3తో సమవుజ్జీగా నిలిచాయి. నిర్ణాయక పురుషుల డబుల్స్‌లో మొహమ్మద్ అహ్సాన్–హెండ్ర సెతియవాన్ (బెంగళూరు) ద్వయం 15–13, 15–10తో కిమ్ జీ జాంగ్–లీ యంగ్ డే (ముంబై) జంటపై గెలువడంతో రాప్టర్ నాలుగో సీజన్ విజేతగా అవతరించింది. విజేతగా నిలిచిన బెంగళూరు రాప్టర్స్‌కు రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. -
హంటర్స్ ఆట ముగిసింది
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ హంటర్స్ ఆట ముగిసింది. పీవీ సింధు తనదైన జోరుతో రాణించినా... సహచరులంతా నిరాశపర్చడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ముంబై రాకెట్స్ 4–2తో హైదరాబాద్‌పై జయభేరి మోగించింది. నేడు జరిగే ఫైనల్లో బెంగళూరు రాప్టర్స్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. మొదట జరిగిన పురుషుల డబుల్స్‌లో బొదిన్ ఇసారా–కిమ్ స రంగ్ (హైదరాబాద్) జోడీ 14–15, 12–15తో కిమ్ జీ జంగ్– లీ యంగ్ డే ద్వయం చేతిలో ఓడింది. తర్వాత పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌ను ముంబై ‘ట్రంప్’గా ఎంచుకోగా ఇందులో సమీర్ వర్మ 15–8, 15–7తో మార్క్ కాల్జౌ (హైదరాబాద్)ను ఓడించాడు. దీంతో హంటర్స్ 0–3తో వెనుకబడింది. పీకల్లోతు ఒత్తిడిలో కూరుకుపోయిన ఈ దశలో... హైదరాబాద్ ఆశల్ని సింధు నిలబెట్టింది. హంటర్స్ ‘ట్రంప్’ అయిన మహిళ సింగిల్స్‌లో ఆమె 15–6, 15–5తో శ్రేయాన్షి పరదేశి (ముంబై)పై అలవోక విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ 2–3తో టచ్‌లోకి వచ్చింది. కానీ అనంతరం రెండో పురుషుల సింగిల్స్‌లో లీ హ్యున్ (హైదరాబాద్) 13–15, 6–15తో అండర్స్ అంటోన్సెన్ (ముంబై) చేతిలో కంగుతినడంతో హంటర్స్ ఖేల్ ఖతమైంది. ఫలితం తేలడంతో అప్రధానమైన మిక్స్డ్ డబుల్స్‌ను ఆడించలేదు. ఈ పోరులో సింధు బాధ్యత కనబరిస్తే మిగతా షట్లర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఏ ఒక్కరూ ఒక్క గేమైనా గెలవకుండా... వరుస గేముల్లో ప్రత్యర్థికి తలవంచారు. -
హైదరాబాద్ ఓటమి
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్‌కు 3–4తో ఢిల్లీ డాషర్స్ చేతిలో ఓటమి ఎదురైంది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ప్రణయ్ (ఢిల్లీ) 15–10, 9–15, 15–12తో రాహుల్ యాదవ్‌పై గెలుపొందగా, డాషర్స్ ‘ట్రంప్’ అయిన పురుషుల డబుల్స్‌లో చయ్ బియావో–జొంగ్జిత్ ద్వయం 8–15, 15–9, 15–8తో అరుణ్–ఇసారా (హైదరాబాద్) జంటపై నెగ్గింది. దీంతో ఢిల్లీ 3–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత మహిళల సింగిల్స్‌ను హంటర్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంచుకోగా సింధు 15–11, 15–9తో కొసెట్స్కయా (ఢిల్లీ)పై విజయం సాధించింది. రెండో పురుషుల సింగిల్స్‌లో సుగియార్తో (ఢిల్లీ) 15–6, 15–11తో గాల్జౌను ఓడించడంతో 4–2తో డాషర్స్ విజయం ఖాయమైంది. మిక్స్డ్ డబుల్స్‌లో కిమ్ స రంగ్–ఇయోమ్ (హైదరాబాద్) జంట 15–7, 15–12తో వాంగ్ సిజి– చియా సిన్ లీ జోడీపై గెలిచింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ 5–0తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌పై జయభేరి మోగించింది. 25 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు రాప్టర్స్‌తో చెన్నై స్మాషర్స్ ఆడుతుంది. -
సెమీస్‌లో అవధ్ వారియర్స్
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్– 4)లో అవధ్ వారియర్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన పోరులో వారియర్స్ 4–3తో చెన్నై స్మాషర్స్‌పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో లీ యంగ్–క్రిస్టియన్సెన్ ద్వయం 15–8, 15–6తో క్రిస్ అడ్కాక్–సుమిత్ రెడ్డి (చెన్నై) జంటపై అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్ అవధ్‌కు ‘ట్రంప్’ కావడంతో 2–0 ఆధిక్యంలోకి వెళ్లింది. పురుషుల సింగిల్స్ తొలి పోరులో లీ డాంగ్ క్యున్ (వారియర్స్) 15–7, 15–13తో వీ ఫెంగ్ చోంగ్ (చెన్నై)పై గెలుపొందగా, చెన్నైకి ‘ట్రంప్’ అయిన మహిళల సింగిల్స్‌లో సుంగ్ జీ హ్యున్ 15–13, 15–8తో బీవెన్ జాంగ్ (వారియర్స్)ను ఓడించింది. దీంతో అవధ్ ఆధిక్యం 3–2కు తగ్గింది. మిక్స్డ్ డబుల్స్‌లో క్రిస్ అడ్కాక్–గ్యాబ్రియెల్ అడ్కాక్ (చెన్నై)జోడీ 15–13, 9–15, 15–14తో క్రిస్టియన్సెన్–అశ్విని పొన్నప్ప (వారియర్స్) జంటపై నెగ్గడంతో స్కోరు 3–3తో సమమైంది. నిర్ణాయక పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో సన్ వాన్ హో (వారియర్స్) 15–6, 15–6తో రాజీవ్ ఉసెఫ్ (చెన్నై)పై గెలిచి అవధ్‌కు విజయాన్నందించాడు. ఇప్పటికే ముంబై రాకెట్స్, హైదరాబాద్ హంటర్స్ సెమీస్ బెర్తులు సాధించాయి. నేడు బెంగళూరు రాప్టర్స్‌తో ముంబై రాకెట్స్ తలపడుతుంది. -
సెమీస్‌లో హైదరాబాద్
అహ్మదాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో హైదరాబాద్ హంటర్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 4–3తో అహ్మదాబాద్ స్మాష్‌మాస్టర్స్‌పై విజయం సాధించింది. దీంతో 21 పాయింట్లతో అగ్రస్థానంలోకి వెళ్లింది. మొదట మిక్స్డ్ డబుల్స్‌లో బొదిన్ ఇసారా–ఇయోమ్ హ్యే వోన్ జోడీ 15–14, 15–9తో సాత్విక్ సాయిరాజ్–సిక్కి రెడ్డి జంటపై గెలిచి శుభారంభం చేసింది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్ అహ్మదాబాద్‌కు ట్రంప్ మ్యాచ్ కాగా... ఇందులో డారెన్ ల్యూ 15–13, 15–9తో రాహుల్ యాదవ్ (హైదరాబాద్)పై గెలుపొందాడు. రెండో సింగిల్స్‌లో విక్టర్ అక్సెల్సన్ 15–11, 13–15, 15–8తో మార్క్ కాల్జౌ (హైదరాబాద్)పై నెగ్గడంతో అహ్మదాబాద్ ఆధిక్యం 3–1కు చేరింది. తర్వాత మహిళల సింగిల్స్ బరిలో సింధు ఉండటంతో హైదరాబాద్ ట్రంప్‌గా ఎంచుకుంది. సింధు 15–14, 12–15, 15–14తో కిర్స్టీ గిల్మోర్ (అహ్మదాబాద్)పై చెమటోడ్చి నెగ్గడంతో స్కోరు 3–3తో సమమైంది. ఇక నిర్ణాయక పురుషల డబుల్స్‌లో బొదిన్ ఇసారా–కిమ్ సా రంగ్ (హైదరాబాద్) జోడీ 15–10, 11–15, 15–14తో సాత్విక్ –రెగినాల్డ్ ద్వయంపై నెగ్గడంతో హైదరాబాద్ విజయం ఖాయమైంది. మరోవైపు ఢిల్లీ డాషర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఐదో మ్యాచ్‌లోనూ ఢిల్లీ 0–6తో పుణే సెవెన్ ఏసెస్ చేతిలో చిత్తుగా ఓడింది. నేటి మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌తో చెన్నై స్మాషర్స్ తలపడుతుంది. -
అవధ్ వారియర్స్ జోరు
అహ్మదాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో అవధ్ వారియర్స్ 6–(–1)తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌ను చిత్తుచేసింది. అవధ్ ‘ట్రంప్’ అయిన మహిళల సింగిల్స్‌లో బీవెన్ జాంగ్ 10–15, 15–11, 15–11తో కిర్స్టీ గిల్మోర్ (అహ్మదాబాద్)పై గెలుపొందగా, పురుషుల డబుల్స్‌లో లీ యంగ్–క్రిస్టియాన్సన్ (అవధ్) జంట 15–12, 10–15, 15–6తో నందగోపాల్–సాత్విక్ సాయిరాజ్ ద్వయంపై నెగ్గింది.పురుషుల సింగిల్స్‌లో సన్ వాన్ హో (అవధ్) 15–7, 8–15, 15–10తో అక్సెల్సన్ను ఓడించడంతో 4–0తో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే వారియర్స్ విజయం ఖాయమైంది. రెండో పురుషుల సింగిల్స్‌ను అహ్మదాబాద్ ‘ట్రంప్’గా ఎంచుకోగా... సౌరభ్ వర్మ 8–15, 12–15తో లీ డాంగ్ క్యున్ (అవధ్) చేతిలో చిత్తుగా ఓడాడు. చివరగా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–సిక్కి రెడ్డి జోడీ 15–13, 10–15, 12–15తో క్రిస్టియాన్సన్–అశ్విని పొన్నప్ప జంట చేతిలో ఓడింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో ముంబై రాకెట్స్‌తో చెన్నై స్మాషర్స్, బెంగళూరు రాప్టర్స్‌తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ తలపడతాయి. -
మళ్లీ ఓడిన ఢిల్లీ డాషర్స్
అహ్మదాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ఢిల్లీ డాషర్స్ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడింది. బుధవారం జరిగిన పోరులో బెంగళూరు రాప్టర్స్ 2–1తో ఢిల్లీ డాషర్స్‌పై నెగ్గింది. ముందుగా ఒకరి ట్రంప్ మ్యాచ్‌ను మరొకరు గెలవడంతో ఈ పోటీలో రెండు మ్యాచ్‌లు ముగిసినా కూడా స్కోరు 0–0గానే ఉండిపోయింది. ఢిల్లీ ‘ట్రంప్’ మ్యాచ్‌లో ప్రణయ్ 12–15, 15–14, 13–15తో సాయిప్రణీత్ (బెంగళూరు) చేతిలో కంగుతినగా... బెంగళూరు ‘ట్రంప్’ మిక్స్డ్ డబుల్స్‌లో ఎలిస్–లారెన్ స్మిత్ జంట 13–15, 9–15తో జొంగ్జిత్–కొసెట్స్కయా (ఢిల్లీ) ద్వయం ముందు తలవంచింది. తర్వాత రెండో పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ (బెంగళూరు) 15–6, 12–15, 15–10తో సుగియార్తో (ఢిల్లీ)పై... మహిళల సింగిల్స్‌లో తి త్రంగ్ వు 12–15, 15–3, 15–8తో చియా సిన్ లీపై నెగ్గడంతో రాప్టర్స్ విజయం ఖాయమైంది. చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌లో బియావో–జొంగ్జిత్ (ఢిల్లీ)15–7, 11–15, 15–14తో అహ్సాన్–సెతియవాన్ (బెంగళూరు)పై నెగ్గారు. -
సైనాపై సింధు విజయం
పుణే: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త ఏడాదిని గొప్ప విజయంతో ప్రారంభించింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భాగంగా సైనా నెహ్వాల్ ప్రాతినిధ్యం వహించిన నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌పై సింధు నేతృత్వంలోని హైదరాబాద్ హంటర్స్ 5–0తో ఘనవిజయం సాధించింది. నార్త్ ఈస్టర్న్ వారియర్స్ ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన సైనా ఈసారి బరిలోకి దిగింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు 11–15, 15–9, 15–5తో సైనాను ఓడిం చింది. అంతకుముందు తొలి మ్యాచ్ మిక్స్డ్ డబుల్స్‌లో కిమ్ హా నా–లియావో మిన్ చున్ (వారియర్స్) ద్వయం 15–8, 15–14తో కిమ్ సా రంగ్– హై వన్ జోడీపై నెగ్గి 1–0తో ముందంజ వేసింది. వారియర్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో లీ హున్ 10–15, 15–13, 15–9తో సెన్సోమ్ బున్సుక్ను ఓడించడం తో హైదరాబాద్ 1–0తో ఆధిక్యంలోకి వచ్చింది. మూడో మ్యాచ్‌లో సైనాపై సింధు నెగ్గడంతో హైదరాబాద్ ఆధిక్యం 2–0కు పెరిగింది. తర్వాత తమ ‘ట్రంప్’ మ్యాచ్‌లో మార్క్ కల్జూ 15–11, 15–14తో తియన్ హువె (వారియర్స్)పై గెలవడంతో హైదరాబాద్ ఆధిక్యం 4–0కు చేరింది. ఐదో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో ఇసారా–కిమ్ సా రంగ్ ద్వయం 15–10, 12–15, 15–14తో లియావో మిన్ చున్–యోన్ సెంగ్ యూ (వారియర్స్) జోడీని ఓడించడంతో హైదరాబాద్ 5–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డాషర్స్‌తో బెంగళూరు రాప్టర్స్ ఆడుతుంది. -
ముంబై రాకెట్స్ దూకుడు
పుణే: ఉత్కంఠగా సాగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో సత్తా చాటిన ముంబై రాకెట్స్ 5–2తో అవధ్ వారియర్స్‌పై గెలిచింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్లో తమ ఖాతాలో రెండో విజయం నమోదు చేసుకుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లనే ‘ట్రంప్’గా ఎంచుకున్నాయి. మహిళల సింగిల్స్‌లో బీవెన్ జాంగ్ (అవధ్) 15–10, 15–10 తేడాతో శ్రేయాన్షి పరదేశి (ముంబై)పై నెగ్గి జట్టును 2–0 ఆధిక్యంలో నిలిపింది. అనంతరం పురుషుల డబుల్స్‌ను ముంబై ‘ట్రంప్’గా ఎంచుకుంది. లియాంగ్ డె–కిమ్ జి జంగ్ జోడీ 15–7, 15–9తో లి చాంగ్ వి–ఎంఆర్ అర్జున్ జంటపై గెలుపొందింది. స్కోర్లు 2–2తో సమంగా నిలిచిన ఈ స్థితిలో పురుషుల సింగిల్స్ హోరాహోరీగా సాగాయి. తొలి మ్యాచ్‌లో ఆండర్స్ ఆంటోన్సెన్ (ముంబై) 6–15, 15–11, 15–14తో సన్ వాన్ హోపై, రెండో మ్యాచ్‌లో సమీర్ వర్మ (ముంబై) 15–11, 8–15, 15–11తో లీ డాంగ్ కుయెన్‌పై శ్రమించి నెగ్గారు. దీంతో 4–2తో ఫలితం తేలిపోయింది. నామమాత్రంగా మారిన మిక్స్డ్ డబుల్స్‌లోనూ ముంబై పట్టు విడవలేదు. కిమ్ జి జంగ్–పియా బెర్నాడెత్ జంట 15–10, 7–15, 15–13తో అశ్విని పొన్నప్ప–మథియాస్ క్రిస్టియన్‌సెన్‌లపై జయభేరి మోగించింది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్‌తో నార్త్ ఈస్ట్రన్ వారియర్స్ తలపడుతుంది. -
పుణే ఖాతా తెరిచింది
పుణే: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో పుణే సెవెన్ ఏసెస్ ఎట్టకేలకు ఓ విజయాన్ని నమోదు చేసింది. సినీ నటి తాప్సి యాజమానిగా ఉన్న పుణే తమ మూడో మ్యాచ్‌లో 4–3తో ముంబై రాకెట్స్‌ను కంగుతినిపించింది. పుణే ట్రంప్ మ్యాచ్ అయిన మహిళల సింగిల్స్‌లో లిన్ జాయెర్స్‌ఫెల్డ్ 15–11, 15–7తో శ్రియాన్షి (ముంబై)పై గెలుపొందగా, పురుషుల డబుల్స్‌లో ఇవనోవ్–చిరాగ్ శెట్టి (పుణే) ద్వయం 15–14, 15–7తో కిమ్ జి జంగ్–లి యంగ్ డే (ముంబై)ను ఓడించింది. వరుస విజయాలతో 3–0 ఆధిక్యంలో ఉన్న పుణేకు పురుషుల సింగిల్స్‌లో పరాజయాలు ఎదురయ్యాయి. ముంబై ట్రంప్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ (పుణే) 13–15, 15–7, 6–15తో అంటోన్సెన్ చేతిలో, రెండో మ్యాచ్‌లో హర్షిల్ (పుణే) 7–15, 10–15తో సమీర్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో 3–3తో స్కోరు సమం కాగా... నిర్ణాయక మిక్స్డ్ డబుల్స్‌లో ఇవనోవ్–జాయెర్స్‌ఫెల్డ్ (పుణే) జంట 15–13, 11–15, 15–12తో కిమ్ జి జంగ్–పియా జెబాదియ జోడీపై గెలిచింది. నార్త్ ఈస్టర్న్‌కు రెండో గెలుపు మరో మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ 3–0తో ఢిల్లీ డాషర్స్‌పై నెగ్గింది. మహిళల సింగిల్స్‌లో రీతుపర్ణ (వారియర్స్) 15–13, 15–9తో కొసెట్స్‌కయాపై నెగ్గగా... పురుషుల డబుల్స్‌లో లియావో మిన్ చన్–సియాంగ్ (వారియర్స్) ద్వయం 15–9, 15–6తో చయ్ బియావో–సిజీ వాంగ్ జంటపై గెలిచింది. ఢిల్లీ ట్రంప్‌గా ఎంచుకున్న పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో సెన్సోబూన్సుక్ (వారియర్స్) 15–5, 15–12తో సుగియార్తోను, రెండో పోరులో టియాన్ హౌవీ (వారియర్స్) 12–15, 15–7, 15–14తో ప్రణయ్‌ను ఓడించారు. చివరగా జరిగిన మిక్స్డ్ డబుల్స్ వారియర్స్ ట్రంప్ మ్యాచ్ కాగా... ఇందులో లియావో మిన్–కిమ్ హ న జంట 15–12, 7–15, 14–15తో జొంగ్జిత్–కొసెట్స్కయ (ఢిల్లీ) జోడీ చేతిలో ఓడిపోయింది. నేటి మ్యాచ్‌ల్లో చెన్నైతో అహ్మదాబాద్, బెంగళూరుతో పుణే తలపడతాయి. -
అహ్మదాబాద్‌కు రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన పోరులో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ 4–1తో ఢిల్లీ డాషర్స్‌ను ఓడించింది. ఢిల్లీకిది రెండో పరాజయం. మిక్స్డ్ డబుల్స్‌తో ఈ పోరు మొదలైంది. తెలంగాణ క్రీడాకారిణి నేలకుర్తి సిక్కి రెడ్డి–ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ (అహ్మదాబాద్) జోడీ 15–11, 15–10తో మనిపాంగ్ జొంగ్జిత్–చియ సిన్ లీ (ఢిల్లీ) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌ను ఢిల్లీ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. హెచ్ఎస్ ప్రణయ్ 12–15, 13–15తో డారెన్ ల్యూ (అహ్మదాబాద్) చేతిలో కంగుతినడంతో... ఢిల్లీ(–1)–2కు పడిపోయింది. పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (అహ్మదాబాద్)కు 12–15, 15–10, 8–15తో టామీ సుగియార్తో (ఢిల్లీ) చేతిలో పరాజయం ఎదురైంది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌ను ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకున్న అహ్మదాబాద్ కిర్స్టీ గిల్మోర్ను బరిలోకి దించింది. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ గిల్మోర్ 12–15, 15–12, 15–7తో ఎవ్‌జినియా కొసెట్స్కయా (ఢిల్లీ)పై గెలుపొందింది. చివరగా పురుషుల డబుల్స్‌లో వాంగ్ సిజీ–చయ్ బియావో (ఢిల్లీ) 15–9, 9–15, 15–13తో లీ చెన్ రెగినాల్డ్–సాత్విక్ సాయిరాజ్ (అహ్మదాబాద్) జంటపై గెలిచి ఒక పాయింట్‌ను సాధించింది. ►నేడు జరిగే పోరులో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో ముంబై రాకెట్స్ తలపడుతుంది. -
సింధు ఓడినా... హైదరాబాద్ గెలిచింది
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో హైదరాబాద్ హంటర్స్ వరుసగా రెండో విజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మంగళవారం జరిగిన పోరులో హైదరాబాద్ హంటర్స్ 5–0తో చెన్నై స్మాషర్స్‌ను చిత్తు చేసింది. కానీ ఈ మ్యాచ్‌లో తెలుగుతేజం పీవీ సింధు నిరాశపరిచింది. మూడో ర్యాంకర్ సింధుకు చెన్నైకు ప్రాతినిధ్యం వహిస్తున్న 11వ ర్యాంకర్ సుంగ్ జీ హున్ (కొరియా) షాకిచ్చింది. అయితే రెండు ట్రంప్ మ్యాచ్‌ల్ని హంటర్సే గెలవడంతో హ్యున్ విజయం ‘జీరో’ అయింది. ముందుగా పురుషుల డబుల్స్ ట్రంప్ మ్యాచ్‌తో హైదరాబాద్ వేట మొదలుపెట్టింది. బుయిన్ ఇసారా–కిమ్ స రంగ్ ద్వయం 13–15, 15–12, 15–10తో ఒర్ చిన్ చంగ్–సుమీత్ రెడ్డి (చెన్నై) జోడీపై గెలిచి 2–0తో ముందంజ వేసింది. తర్వాత పురుషుల సింగిల్స్‌లోనూ హైదరాబాద్ షట్లర్ లీ హ్యున్ ఇల్ 15–11, 15–13తో వరుస గేముల్లో వీ ఫెంగ్ చోంగ్ (చెన్నై)ను ఓడించాడు. తర్వాత మహిళల సింగిల్స్ బరిలోకి సింధు దిగింది. కానీ సొంత ప్రేక్షకుల మధ్య ఆమె 13–15, 15–14, 7–15తో సుంగ్ జీ హున్ (చెన్నై) చేతిలో పోరాడి ఓడింది. దీంతో హంటర్స్ ఆధిక్యం 3–1కు తగ్గింది. రెండో పురుషుల సింగిల్స్‌ను చెన్నై స్మాషర్స్ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకోగా... పారుపల్లి కశ్యప్ ఓటమితో చెన్నై గెలిచిన పాయింట్‌ను కోల్పోయింది. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో మార్క్ కాల్జౌ (హైదరాబాద్) 15–11, 14–15, 15–13తో కశ్యప్‌ను ఓడించాడు. దీంతో మరో మ్యాచ్ ఉండగానే హంటర్స్ 4–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. చివరగా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో కిమ్ స రంగ్–ఇయోమ్ హె వోన్ (హైదరాబాద్) జంట 14–15, 15–13, 15–14తో క్రిస్ అడ్కాక్–గాబ్రియేలా అడ్కాక్ (చెన్నై) జంటపై నెగ్గింది. నేడు జరిగే పోరులో ఢిల్లీ డాషర్స్‌తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ తలపడుతుంది. -
అవధ్ వారియర్స్ విజయం
ముంబై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్లో రసవత్తర పోరుకు పుణే సెవెన్ ఏసెస్, అవధ్ వారియర్స్ జట్లు తెరతీశాయి. విజేతగా నిలిచేందుకు ఇరు జట్లు ఆఖరి మ్యాచ్ దాకా పోరాడాల్సి వచ్చింది. చివరకు మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌తో అవధ్ వారియర్స్ 4–3తో పుణేపై గెలిచింది. అవధ్ వారియర్స్ ‘ట్రంప్’ మ్యాచ్ అయిన పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హో 15–14, 15–7తో లెవెర్డెజ్ (పుణే)పై గెలుపొందాడు. దీంతో 2–0తో అవధ్ ఆధిక్యంలోకి రాగా, పురుషుల డబుల్స్‌లోనూ అవధ్ ద్వయం క్రిస్టియన్సెన్–లీ యంగ్ 15–12, 15–14తో మథియస్ బో–ఇవనోవ్ (పుణే) జంటను ఓడించింది. దీంతో 3–0తో వారియర్స్ విజయానికి దగ్గరైందనిపించింది. కానీ ఆ తర్వాతే అసలు ఆట మొదలైంది. రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ బరిలోకి దించిన పుణే... మహిళల సింగిల్స్‌ను ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఇందులో మాజీ ప్రపంచ నంబర్‌వన్ 15–13, 15–9తో బీవెన్ జాంగ్ (అవధ్)పై అలవోక విజయం సాధించింది. అవధ్ ఆధిక్యం 3–2కు తగ్గింది. రెండో పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ (పుణే) 15–11, 15–8తో లీ డాంగ్ క్యున్ (అవధ్)కు షాకిచ్చాడు. దీంతో ఇరుజట్లు 3–3తో సమ ఉజ్జీగా నిలిచాయి. నిర్ణాయక మిక్స్డ్ డబుల్స్‌లో క్రిస్టియన్సెన్–అశ్విని పొన్నప్ప 15–8, 11–15, 15–12తో ఇవనోవ్–జాయెర్స్‌ఫెల్డ్ (పుణే) జంటపై గెలవడంతో అవ«ద్ వారియర్స్ బోణీ కొట్టింది. నేటి నుంచి హైదరాబాద్‌లో... హైదరాబాద్‌లో నేటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు పీబీఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లను నిర్వహిస్తారు. మంగళ, బుధ, గురువారాల్లో రోజుకో మ్యాచ్ (రాత్రి 7 గంటల నుంచి), శుక్రవారం రెండు మ్యాచ్‌లు (సాయంత్రం 4 నుంచి; రాత్రి 7 నుంచి) జరుగుతాయి. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ ఆడుతుంది. స్టార్ ప్లేయర్ సింధు ఇపుడు సొంత ప్రేక్షకుల మధ్య హైదరాబాద్ తరఫున బరిలోకి దిగడంతో ప్రేక్షకుల జేజేలతో స్టేడియం హోరెత్తనుంది. ఆసక్తిగలవారు గచ్చిబౌలి స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లో లేదా ఆన్లైన్లో (https:// insider.in/badminton&in&hyderabad) టికెట్లు లభిస్తాయి. డిసెంబర్ 25: హైదరాబాద్(vs) చెన్నై డిసెంబర్ 26: ఢిల్లీ(vs)అహ్మదాబాద్ డిసెంబర్ 27: నార్త్ ఈస్టర్న్(vs)ముంబై డిసెంబర్ 28: అహ్మదాబాద్(vs)బెంగళూరు హైదరాబాద్(vs) అవధ్ -
పీబీఎల్‌కు వేళాయె...
అభిమానులను అలరించేందుకు... ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ వచ్చేసింది. ప్రపంచ దిగ్గజాలనదగ్గ ఆటగాళ్ల మధ్య హోరాహోరీ సమరాలతో ఆద్యంతం కట్టిపడేయనుంది. జోరుమీదున్న పీవీ సింధు... కొరకరాని కొయ్యల్లాంటి కరోలినా మారిన్ మధ్య పోరాటంతో టోర్నీ తొలి రోజే రక్తికట్టనుంది. చాంపియన్ల మధ్య నేటి నుంచి 23 రోజుల పాటు రాకెట్ల పోరు హోరెత్తనుంది. ముంబై: ఏటేటా ఆదరణ పెంచుకుంటూ... ఆకర్షణ జోడించుకుంటూ వస్తోన్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్లోకి అడుగుపెట్టింది. ముంబై వేదికగా శనివారం లీగ్ నగారా మోగనుంది. పుణే సెవెన్ ఏసెస్, హైదరాబాద్ హంటర్స్ మధ్య ఇక్కడి వర్లిలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్సీఐ)లో ప్రారంభ మ్యాచ్ జరుగనుంది. టోర్నీ ఫార్మాట్ ప్రకారం ఇరు జట్ల మధ్య పోరులో రెండు పురుషుల సింగిల్స్, ఒక మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ విభాగాల్లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో మ్యాచ్ మూడు గేమ్‌ల పాటు సాగుతుంది. ప్రతి గేమ్‌కు గరిష్టంగా 15 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. గతేడాది 8 జట్లుండగా, ఈసారి వాటికి పుణె సెవెన్ ఏసెస్ జతయింది. మొత్తం 23 రోజుల పాటు ఐదు వేదికల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో అహ్మదాబాద్, పుణే తొలిసారి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన 8 మంది ఆటగాళ్లు లీగ్ బరిలో ఉండటం విశేషం. బెంగళూరులో జనవరి 13న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. సింధు నిలబెడుతుందా? గతేడాది వరకు చెన్నైకు ఆడిన తెలుగమ్మాయి, సంచలనాల పూసర్ల వెంకట సింధు ప్రస్తుతం హైదరాబాద్ హంటర్స్ సారథిగా బరిలో దిగుతోంది. ఈ నేపథ్యంలో సొంత నగరం, లీగ్ డిఫెండింగ్ చాంపియన్ అయిన హైదరాబాద్‌ను మరోసారి విజేతగా నిలపాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. ఇటీవలే వరల్డ్ టూర్ ఫైనల్స్ నెగ్గి చరిత్ర సృష్టించిన సింధు... ఆ జోరును కొనసాగిస్తే ఇదేమంత కష్టం కాదు. అయితే, జట్టులోని మిగతా సభ్యులూ ఇందుకు తగినట్లుగా ఆడాలి. ‘నాలుగో సీజన్లో హైదరాబాద్‌కు ఆడుతున్నాను. నా శక్తి మేర ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇలాగే జట్టు సభ్యులు రాణిస్తారని ఆశిస్తున్నా’ అని సింధు పేర్కొంది. బలంగా పుణే ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ ప్రాతినిధ్యంతో పుణే ఫ్రాంచైజీ అరంగేట్రంలోనే బలంగా కనిపిస్తోంది. ఆమెకు తోడు ఆసియా జూ.బాలుర చాంపియన్‌షిప్ విజేత లక్ష్య సేన్, డబుల్స్ నిపుణుడు మథియాస్ బొ, అజయ్ జయరాం, ప్రజక్తా సావంత్‌లతో పుణే అవకాశాలు మెరుగయ్యాయి. మారిన్ 2016, 2017 ఎడిషన్లలో హైదరాబాద్‌కు ఆడింది. ఈ పోరు ఆసక్తికరం... మంచి ఫామ్‌లో ఉన్న సింధు.. ఆమెకు దీటైన కరోలినా మారిన్ శనివారం తలపడనున్నారు. ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. బెంగళూరు రాప్టర్స్‌కు కిడాంబి శ్రీకాంత్, ఢిల్లీ డాషర్స్‌కు హెచ్ఎస్ ప్రణయ్, నార్త్ ఈస్ట్రన్ వారియర్స్‌కు సైనా నెహ్వాల్ కెప్టెన్లుగా తమతమ జట్లను నడిపించనున్నారు. ►8 బ్యాడ్మింటన్ ప్రపంచ టాప్–10 ర్యాంకుల్లోని 8 మంది ఈ లీగ్‌లో ఆడనున్నారు ►90 పాల్గొననున్న మొత్తం ఆటగాళ్ల సంఖ్య ►17 దేశాల ఆటగాళ్లు లీగ్‌లో ప్రాతినిధ్యం వహించనున్నారు ► మొత్తం జట్లు : 9 హైదరాబాద్ హంటర్స్, ముంబై రాకెట్స్, నార్త్ ఈస్ట్రన్ వారియర్స్, పుణే 7 ఏసెస్, చెన్నై స్మాషర్స్, అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్, అవధ్ వారియర్స్, బెంగళూరు రాప్టర్స్, ఢిల్లీ డాషర్స్ హైదరాబాద్ హంటర్స్ జట్టు ►కెప్టెన్: పీవీ సింధు ►పురుషుల సింగిల్స్: లీ హ్యున్ ఇ, చిట్టబోయిన రాహుల్ యాదవ్, మార్క్ కాల్జౌ ►మహిళల సింగిల్స్: పీవీ సింధు, సాయి ఉత్తేజిత రావు ►పురుషుల డబుల్స్: కిమ్ సా రాంగ్, అరుణ్ జార్జ్, బోదిన్ ఇస్సారా ► మిక్స్డ్ డబుల్స్: ఇయొం హె వాన్, జక్కంపూడి మేఘన ►రూ. 6 కోట్లు మొత్తం ప్రైజ్‌మనీ ►రూ. 3 కోట్లు విజేత జట్టుకు ►రూ.1.5 కోట్లు రన్నరప్‌కు ►మూడు, నాలుగు స్థానాలకు: రూ.75 లక్షల చొప్పున ► సాయంత్రం గం‘‘ 7నుంచి స్టార్‌స్పోర్ట్స్–1లో ప్రత్యక్షప్రసారం -
సొంత జట్టు తరఫున గెలుస్తా!
సాక్షి, హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నాయకత్వంలో చెన్నై స్మాషర్స్ జట్టు గతంలో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) విజేతగా నిలిచింది. ఇప్పుడు అదే ప్రదర్శనను పునరావృతం చేసి జట్టును విజేతగా నిలపాలని సింధు భావిస్తోంది. అయితే ఈసారి ఆమె సొంత నగరానికి చెందిన ‘హైదరాబాద్ హంటర్స్’ తరఫున బరిలోకి దిగనుంది. డిఫెండింగ్ చాంపియన్ కూడా అయిన హంటర్స్ టైటిల్ నిలబెట్టుకునేందుకు శక్తిమేర కృషి చేస్తానని సింధు చెప్పింది. జట్టు సహచరులు మేఘన, రాహుల్ యాదవ్, అరుణ్ జార్జ్‌లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడింది. ‘పీబీఎల్‌లో తొలిసారి హైదరాబాద్ తరఫున ఆడబోతుండటం పట్ల చాలా ఉద్వేగానికి లోనవుతున్నాను. గతంలో వేరే జట్టు తరఫున బరిలోకి దిగినా సరే నాకు స్టేడియంలో అభిమానులు బ్రహ్మాండంగా మద్దతునిచ్చారు. ఈసారి మన టీమ్‌కే ఆడుతున్నాను కాబట్టి అలాంటి మద్దతునే ఆశిస్తున్నాను’ అని సింధు వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లయిన లీ హ్యూన్ (కొరియా), ఇసారా (థాయిలాండ్)లాంటి ఆటగాళ్లు తమ జట్టులో ఉండటం వల్ల విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆమె అభిప్రాయపడింది. మీడియా సమావేశంలో హంటర్స్ జట్టు యజమాని వీఆర్కే రావు తదితరులు పాల్గొన్నారు. పీబీఎల్ డిసెంబర్ 22న ప్రారంభం కానుండగా... 25 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. -
ఎనిమిది మంది 80 లక్షలు
హైదరాబాద్ స్టార్ పూసర్ల వెంకట సింధు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో తొలిసారి సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతోంది. వేలంతో పాటు లాటరీలో అదృష్టం కూడా కలిసొచ్చి హంటర్స్ జట్టు ఆమెను సొంతం చేసుకుం ది. మరో టాప్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఈ సారి బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నాడు. అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను అనూహ్యంగా ప్రారంభ వేలంలో ఎవరూ పట్టించుకోకపోయినా... చివరకు ఆమె నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టుతో చేరింది. వేలంలో మొత్తం 145 మంది షట్లర్లు అందుబాటులో ఉండగా, తొమ్మిది జట్లు కలిపి 90 మందిని తీసుకున్నాయి. 9 మంది ఐకాన్ ప్లేయర్లలో ఎనిమిది మందికి గరిష్ట విలువ రూ. 80 లక్షల చొప్పున దక్కగా... తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్‌కు రూ. 52 లక్షలు లభించడం వేలంలో అతి పెద్ద సంచలనం. న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్ వేలం ఆసక్తికరంగా సాగింది. సోమవారం ఇక్కడ జరిగిన వేలంలో ఎనిమిది మంది టాప్ ప్లేయర్లను గరిష్టంగా అనుమతించిన రూ. 80 లక్షల మొత్తానికి వివిధ జట్లు సొంతం చేసుకున్నాయి. మొత్తం తొమ్మిది జట్లు లీగ్‌లో పాల్గొంటుండగా 9 మందిని ఐకాన్ ఆటగాళ్లుగా గుర్తించారు. భారత్ తరఫున పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్‌లకు తలా రూ. 80 లక్షలు దక్కాయి. విదేశీ ఆటగాళ్లలో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), కరోలినా మారిన్ (స్పెయిన్), సుంగ్ జి హ్యూన్ (కొరియా), లీ యోంగ్ డే (కొరియా)లకు కూడా వేలంలో రూ. 80 లక్షలు దక్కాయి. అయితే పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్న సోన్ వాన్ హో (కొరియా)కు మాత్రం వేలంలో గరిష్టంగా రూ.70 లక్షలు మాత్రమే లభించాయి. డిసెంబర్ 22నుంచి జనవరి 13 వరకు పీబీఎల్ జరుగుతుంది. కొత్త నిబంధనలతో... పీబీఎల్ మూడు సీజన్ల తర్వాత ఈ సారి ఆటగాళ్లను అట్టి పెట్టుకునే, మ్యాచ్ టు కార్డ్ పద్ధతికి నిర్వాహకులు స్వస్తి చెప్పారు. దాంతో ఆటగాళ్లందరూ వేలంలోకి వచ్చారు. అయితే గతంలోలాగా అపరిమిత మొత్తానికి వేలం సాగకుండా నిబంధన విధించారు. ఐకాన్ క్రీడాకారులకు బేస్ ప్రైస్‌ను రూ. 70 లక్షలుగా ఉంచి గరిష్టంగా ఒక్కో ఆటగాడికి రూ. 80 లక్షలు మాత్రమే చెల్లించాలని చేర్చారు. దాంతో చివరకు వచ్చే సరికి ఒక్కో షట్లర్ కోసం ఒకటికంటే ఎక్కువ జట్లు పోటీ పడాల్సి వచ్చింది. ఫలితంగా ‘డ్రా’ ద్వారా ఆ ప్లేయర్ ఏ జట్టుకు చెందాలో నిర్ణయించారు. సింధును కూడా ‘డ్రా’లో హైదరాబాద్ హంటర్స్ సొంతం చేసుకుంది. వేలంలో మొదటి సారి సైనా నెహ్వాల్ పేరు వచ్చినప్పుడు ఏ జట్టు కూడా ఆమె కోసం ముందుకు రాకపోవడం విశేషం! ఆమె స్థాయి ప్లేయర్ కోసం ఫ్రాంచైజీలు వెనకడుగు వేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. తర్వాత రెండో సారి ఆమె కోసం వేలం జరగ్గా ఫ్రాంచైజీల మధ్య పోటీ సాగింది. ఆఖరికి నార్త్ ఈస్టర్న్ వారియర్స్ సైనాను ఎంచుకుంది. మారిన్‌ను ‘డ్రా’ ద్వారానే కొత్త ఫ్రాంచైజీ పుణే ఏసెస్ గెలుచుకుంది. సాయిరాజ్ జాక్‌పాట్... గత ఏడాది పీబీఎల్‌లో విశేషంగా రాణించి హంటర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగబ్బాయి, డబుల్స్ స్పెషలిస్ట్ సాత్విక్ సాయిరాజ్‌పై ఈ సారి కనకవర్షం కురిసింది. రూ. 15 లక్షల కనీస ధరతో వేలంలో వచ్చిన అతనికి ఏకంగా రూ. 52 లక్షలు (అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్) దక్కాయి. దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో లేని ఆటగాళ్లలో సాత్విక్‌కు దక్కింది రెండో గరిష్ట మొత్తం కాగా వరల్డ్ నంబర్ 11 టామీ సుగియార్తో (ఇండోనేసియా) అగ్రస్థానంలో నిలిచాడు. అతడిని ఢిల్లీ డాషర్స్ రూ. 70 లక్షలకు సొంతం చేసుకుంది. సిక్కిరెడ్డికి రూ. 29 లక్షలు... సింగిల్స్ ఆటగాడు సమీర్ వర్మ (రూ. 42 లక్షలు – ముంబై)కు పెద్ద మొత్తం లభించగా, ఇటీవలే ‘అర్జున’ అవార్డు గెలుచుకున్న డబుల్స్ స్టార్ ఎన్.సిక్కిరెడ్డిని అహ్మదాబాద్ రూ. 29 లక్షలకు తీసుకుంది. మరో డబుల్స్ స్పెషలిస్ట్ అశ్విని పొన్నప్పకు రూ. 32 లక్షలు (అవధ్) దక్కగా, సాయిప్రణీత్ (రూ.32 లక్షలు – బెంగళూరు)కు మంచి విలువ లభించింది. ప్రముఖ భార్యాభర్తల జోడి క్రిస్ అడ్కాక్ (రూ. 56 లక్షలు) – గాబ్రియెల్ అడ్కాక్ (రూ. 36 లక్షలు)లను భారీ మొత్తానికి చెన్నై తీసుకుంది. పారుపల్లి కశ్యప్‌కు రూ. 5 లక్షలు (చెన్నై) మాత్రమే లభించగా... హీరోయిన్ తాప్సికి చిరకాల స్నేహితుడిగా ప్రచారంలో ఉన్న డెన్మార్క్ ఆటగాడు మథియాస్ బోను పుణే రూ. 50 లక్షలకు తీసుకోవడం మరో విశేషం. -
పీబీఎల్‌లో మరో కొత్త జట్టు
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్త జట్టు దర్శనమివ్వనుంది. గత సీజన్లో 8 ఫ్రాంచైజీలు పాల్గొన్న ఈ లీగ్‌లో ఈసారి పుణే సెవెన్ ఏసెస్ కొత్తగా చేరింది. దీంతో మొత్తం జట్ల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ఈ జట్టుకు ప్రముఖ కథానాయిక తాప్సి పన్ను సహ యజమాని కావడం విశేషం. మూడేళ్ల క్రితం కేవలం ఆరు జట్లతో ప్రారంభమైన పీబీఎల్ సీజన్–1 అనతి కాలంలోనే ప్రజాదరణ పొందింది. ‘దేశంలో బ్యాడ్మింటన్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు పీబీఎల్ చక్కగా ఉపయోగపడుతోంది. దీని వల్ల ఆటపై మక్కువ ఇంకా పెరుగుతోంది’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు హిమంత బిస్వ శర్మ తెలిపారు. నాలుగో సీజన్ ఈ ఏడాది డిసెంబర్ 22 నుంచి జనవరి 13 వరకు దేశంలోని ఐదు నగరాల్లో జరుగనుంది. ‘చిన్నతనం నుంచి నాకు బ్యాడ్మింటన్ ఆటతో సంబంధం ఉంది. ఎప్పటి నుంచో ఆటతో మమేకం అవడానికి ఎదురుచూస్తున్నా. అలాంటి సమయంలో పీబీఎల్ నాకు సరైన వేదిక అనిపించింది. ఈ సీజన్లో పుణే సెవెన్ ఏసెస్ దూసుకెళ్తుందనే నమ్మకం ఉంది’ అని పుణే సెవెన్ ఏసెస్ సహ యజమాని తాప్సి తెలిపింది. -
పీబీఎల్ చాంప్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై, సొంత ప్రేక్షకుల మధ్య హైదరాబాద్ హంటర్స్ గర్జించింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్లో విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో హైదరాబాద్ 4–3 స్కోరుతో బెంగళూరు బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. మొదట పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో మార్కిస్ కిడో– యూ ఇయాన్ సియాంగ్ (హంటర్స్) 9–15, 10–15తో మథియాస్ బోయె– కిమ్ సా రంగ్ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్ హంటర్స్‌కు ట్రంప్ మ్యాచ్ కాగా లీ హ్యూన్ ఇల్ 15–7, 15–13తో శుభాంకర్ డేపై గెలుపొందడంతో హైదరాబాద్ 2–1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది అయితే తర్వాత రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ను బెంగళూరు ట్రంప్‌గా ఎంచుకుంది. ఈ పోరులో సాయిప్రణీత్ (హంటర్స్) 8–15, 10–15తో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో హైదరాబాద్ 2–3తో వెనుకబడింది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌లో ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ (హంటర్స్) 15–8, 15–14తో గిల్మోర్‌పై గెలుపొందడంతో స్కోరు 3–3తో సమమైంది. ఈ దశలో కీలకమైన మిక్స్డ్ డబుల్స్‌లో పియా జెబదియా–సాత్విక్ సాయిరాజ్ (హంటర్స్) 15–11, 15–12తో సిక్కిరెడ్డి–కిమ్ సా రంగ్‌పై విజయం సాధించడంతో హైదరాబాద్ పీబీఎల్‌లో తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. -
ఫైనల్లో బెంగళూరు బ్లాస్టర్స్
సాక్షి, హైదరాబాద్: ఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ మిక్స్డ్ డబుల్స్ జంట సిక్కి రెడ్డి–కిమ్ సా రంగ్ అద్భుత ఆటతీరును కనబరిచింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–కిమ్ సా రంగ్ ద్వయం 15–12, 13–15, 15–9తో కామిల్లా రైటర్ జుల్–లా చెయుక్ హిమ్ జోడీని ఓడించింది. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యజమానిగా ఉన్న బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్లో బెంగళూరు బ్లాస్టర్స్ 4–3తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో హైదరాబాద్ హంటర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్ అమీతుమీ తేల్చుకుంటుంది. అంతకుముందు అహ్మదాబాద్ తరఫున పురుషుల తొలి సింగిల్స్‌లో సౌరభ్ వర్మ... మహిళల ఏకైక సింగిల్స్‌లో తై జు యింగ్ గెలిచారు. బెంగళూరు తరఫున పురుషుల డబుల్స్‌లో మథియాస్ బో–కిమ్ సా రంగ్ జంట... పురుషుల రెండో సింగిల్స్‌లో అక్సెల్సన్ నెగ్గారు. -
వారెవ్వా హంటర్స్
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో హైదరాబాద్ హంటర్స్ జైత్రయాత్ర కొనసాగింది. తొలిసారి ఈ లీగ్‌లో సెమీస్ చేరిన హంటర్స్ అదే ఊపులో ఫైనల్లోకీ అడుగు పెట్టింది. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో హైదరాబాద్ 3–0తో ఢిల్లీ డాషర్స్‌ను చిత్తు చేసింది. ముందుగా మిక్స్డ్ డబుల్స్‌లో హైదరాబాద్ జోడి ఓడినా... తర్వాతి రెండు సింగిల్స్ మ్యాచ్‌లలో హంటర్స్ జయకేతనం ఎగురవేసింది. మిక్స్డ్ డబుల్స్‌లో డాషర్స్ జంట అశ్విని పొన్నప్ప–ఇవనోవ్ 13–15, 15–10, 15–10 తేడాతో పియా జెబాదియా–సాత్విక్ సాయిరాజ్‌ను ఓడించి 1–0తో ముందంజ వేసింది. అయితే తర్వాత జరిగిన తొలి పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్ 15–9, 15–8 పాయింట్ల తేడాతో తియాన్ హోవీని చిత్తు చేశాడు. ఇది ఢిల్లీకి ట్రంప్ మ్యాచ్ కావడంతో ఆ జట్టు పాయింట్ కోల్పోయింది. ఫలితంగా స్కోరు 1–0తో హైదరాబాద్ పక్షాన నిలిచింది. అనంతరం మహిళల సింగిల్స్‌లో కరోలినా మారిన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో హైదరాబాద్‌ను గెలిపించింది. ఈ హంటర్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో మారిన్ 12–15, 15–10, 15–9తో సుంగ్ జీ హున్‌పై విజయం సాధించింది. దాంతో రెండు పాయింట్లు సొంతం చేసుకొని హైదరాబాద్ 3–0తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఢిల్లీ గెలిచినా రెండు పాయింట్లే సాధించే అవకాశం ఉండటంతో తుది ఫలితం తేలిపోయింది. ఇది నాకౌట్ మ్యాచ్ కావడంతో తర్వాతి రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు. నేడు రాత్రి 7 గంటల నుంచి జరిగే రెండో సెమీఫైనల్లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్ తలపడుతుంది. లీగ్ దశలో ఒకరితో మరొకరు తలపడే అవకాశం రాని ఈ రెండు జట్లలో పురుషుల, మహిళల వరల్డ్ నంబర్‌వన్ షట్లర్లు ఉండటం విశేషం. -
హైదరాబాద్ సెమీస్ ప్రత్యర్థి ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–3)లో హైదరాబాద్ హంటర్స్ తమ చివరి మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్‌ను తుడిచిపెట్టేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన పోరులో హంటర్స్ 6–(–1) తో బెంగళూరుపై ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో పియా జెబదియా – సాత్విక్ సాయిరాజ్ (హైదరాబాద్) జోడి 15–6, 14–15, 15–9తో సిక్కి రెడ్డి– మను అత్రి (బెంగళూరు)జంటపై గెలిచి హంటర్స్‌కు శుభారంభాన్నిచ్చింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 10–15, 15–7, 15–14తో చోంగ్ వీ ఫెంగ్ (బెంగళూరు)పై, మహిళల సింగిల్స్‌లో కరోలినా మారిన్ 15–9, 15–7తో కిర్స్టీ గిల్మోర్ (బెంగళూరు)పై గెలుపొందారు. తర్వాత జరిగిన రెండో పురుషుల సింగిల్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో లీ హ్యూన్ ఇల్ 15–11, 11–15, 15–11తో శుభాంకర్ డే (బెంగళూరు)పై విజయం సాధించడంతో మరో మ్యాచ్ ఉండగానే హైదరాబాద్ 5–0తో జయభేరి మోగించింది. చివరగా జరిగిన పురుషుల డబుల్స్ బెంగళూరుకు ‘ట్రంప్’ కాగా... మార్కిస్ కిడో–సియాంగ్ (హైదరాబాద్) జోడి 15–10, 11–15, 15–7తో కిమ్ స రంగ్–మథియాస్ బోయె (బెంగళూరు) జంటపై గెలిచింది. నేటి రాత్రి 7 గంటలకు జరిగే సెమీస్‌లో ఢిల్లీతో హైదరాబాద్ తలపడుతుంది. -
సెమీస్‌లో ఢిల్లీ డాషర్స్
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ఢిల్లీ డాషర్స్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తమ చివరి లీగ్ పోరులో ఢిల్లీ 4–1 తేడాతో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌ను ఓడించింది. తాజా ఫలితంతో స్టార్ ప్లేయర్స్ సైనా నెహ్వాల్, శ్రీకాంత్, కశ్యప్‌లతో కూడిన అవ«ద్ వారియర్స్ జట్టు లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇప్పటికే హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, అహ్మదాబాద్ రాకెట్స్ సెమీస్‌కు చేరుకున్నాయి. సెమీస్‌లో ఎవరితో ఎవరు తలపడతారనేది గురువారం హైదరాబాద్, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో తేలుతుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి పోరు దాదాపు ఏకపక్షంగా సాగింది. ముందుగా జరిగిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ జంట మిషెల్ లీ–షిన్ బాక్ చెల్ 15–13, 15–11తో అశ్విని పొన్నప్ప–వ్లదీమర్ ఇవనోవ్ (ఢిల్లీ)ను ఓడించింది. తొలి పురుషుల సింగిల్స్‌లో నార్త్ ఈస్టర్న్ ప్రధాన ఆటగాడు అజయ్ జయరామ్ 13–15, 15–10, 12–15తో ఢిల్లీ ప్లేయర్ వింగ్ కీ వాంగ్ విన్సెంట్ చేతిలో ఓడిపోయాడు. దాంతో స్కోరు 1–1తో సమంగా నిలిచింది. రెండో పురుషుల సింగిల్స్‌ను ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకున్న వారియర్స్ భంగపడింది. వారియర్స్ ఆటగాడు జు వీ వాంగ్ 10–15, 15–8, 11–15 తేడాతో తియాన్ హువీ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఈ ఫలితంతో నార్త్ ఈస్టర్న్ పాయింట్ కోల్పోగా... డాషర్స్ 2–0తో ముందంజలో నిలిచింది. ఆ తర్వాత మహిళల సింగిల్స్ మ్యాచ్‌ను ఢిల్లీ ట్రంప్‌గా ఎంచుకుంది. ఇందులో సత్తా చాటిన సుంగ్ జీ హున్ 13–15, 15–11, 15–13తో మిచెల్లి లీని ఓడించి తమ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు చేర్చింది. దాంతో డాషర్స్ ఆధిక్యం 4–0కు పెరిగి జట్టు సెమీస్ చేరడం ఖాయమైపోయింది. ప్రాధాన్యత లేని చివరి పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో వారియర్స్ తరఫున కిమ్ జి జంగ్–షిన్ బేక్ చెల్... ఢిల్లీ తరఫున ఇవనోవ్–సొజొనొవ్ తలపడ్డారు. ఇందులో వారియర్స్ జోడీ 9–15, 15–10, 15–9తో -
రాకెట్ సూపర్‌హిట్...
పురుషులు, మహిళల విభాగాల్లో వరల్డ్ నంబర్‌వన్ షట్లర్లు... తొమ్మిది మంది ఒలింపిక్ పతక విజేతలు... ఎనిమిది మంది ప్రపంచ చాంపియన్ షిప్ పతక విజేతలు.. రూ. 6 కోట్ల ప్రైజ్‌మనీ... ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 2018కు సంబంధించిన కొన్ని విశేషాలు ఇవి. తొలి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఆదరణపరంగా కూడా లీగ్ మరో మెట్టు పైకెక్కింది. డిసెంబర్ 23న గువాహటిలో తొలి మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని నగరాల్లో ప్రేక్షకులు లీగ్‌కు బ్రహ్మరథం పట్టారు. అదనంగా వచ్చిన రెండు కొత్త జట్లను కూడా ఫ్యాన్స్ అక్కున చేర్చుకోగా... కొన్ని అద్భుత మ్యాచ్‌లు లీగ్ విలువను పెంచాయి. పైగా పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు ఈసారి లీగ్‌లో భాగం కావడం పీబీఎల్ స్థాయిని చూపిస్తోంది. సాక్షి క్రీడా ప్రతినిధి: ‘పీబీఎల్ ప్రారంభంలో కుర్రాడు సాత్విక్ సాయిరాజ్‌ను అతి తక్కువ మొత్తానికి ఒక జట్టులోకి తీసుకుంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. అతనికి అసలు సీనియర్ విభాగంలో ఆడే స్థాయి కూడా లేదన్నారు. అయితే గత రెండు సీజన్లలో సాత్విక్ ఆడిన కొన్ని మ్యాచ్‌లు, ఓడించిన ప్రత్యర్థులను చూస్తే అతను ఎంత అద్భుతంగా దూసుకుపోయాడో అర్థమవుతోంది. ఆ విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసం అతను అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ఫలితాలు సాధించేందుకు దోహదం చేసింది. నా దృష్టిలో ఇదంతా కచ్చితంగా పీబీఎల్ ఘనతే. ఇలాంటి ప్రతిభ గల ఆటగాళ్లను అందించడమే ఈ లీగ్ సాధించిన విజయమని చెప్పగలను’... భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేసిన వ్యాఖ్య ఇది. మూడు సీజన్ల తర్వాత అభిమానుల స్పందనలో గానీ ఆటపై ఇతర వర్గాల్లో ఆసక్తి పెంచడంలో గానీ పీబీఎల్ కూడా విజయవంతమైందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. వేర్వేరు క్రీడాంశాల్లో వరుసగా దూసుకొచ్చిన లీగ్‌ల జాబితాలో పీబీఎల్ తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడం విశేషం. సీన్ మారిపోయింది... నాలుగేళ్ల క్రితం ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) పేరుతో తొలిసారి ఈ తరహా లీగ్ జరిగింది. అయితే వేర్వేరు కారణాలతో ఒక్క ఏడాదికే అది పరిమితమైంది. ఆ తర్వాత కొన్ని మార్పులతో మళ్లీ తీసుకొచ్చిన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)ను నిర్వాహకులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దానికి తోడు అంతర్జాతీయ స్థాయిలో భారత స్టార్లు సైనా, సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్ సాధించిన వరుస విజయాలు తటస్థ అభిమానులను ఈ ఆట వైపు లాక్కొచ్చాయి. ఫలితంగా పీబీఎల్ కూడా ప్రధాన లీగ్‌గా ఎదిగింది. ముఖ్యంగా రియో ఒలింపిక్స్‌లో సింధు ప్రదర్శన తర్వాత లీగ్‌పై పెద్ద ఎత్తున ఆసక్తి కనిపించింది. గత ఏడాదిలాగే ఇప్పుడు కూడా ప్రధాన స్పాన్సర్‌గా వొడాఫోన్‌ను కొనసాగించగలగడంలో పీబీఎల్ విజయవంతమైంది. దీనికి తోడు మరో ప్రధాన స్పాన్సర్‌గా ఈసారి ఇండియన్ ఆయిల్ కూడా వచ్చి చేరింది. బజాజ్ ఎలక్ట్రానిక్స్, బిస్లెరివంటి సంస్థలు కూడా కొత్తగా జత చేరాయి. ఇక వివిధ టీమ్‌లకు ఉండే వ్యక్తిగత స్పాన్సర్లు వేరు. హైదరాబాద్ హంటర్స్ టీమ్‌తో బూస్ట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం ఈ సీజన్లో మరో పరిణామం. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజం (బెంగళూరు బ్లాస్టర్స్ టీమ్) లీగ్‌లో భాగం కావడం కూడా స్పాన్సర్లను ఆకర్షించేందుకు కారణమైంది. ఇప్పటికిప్పుడే లాభాలు రాకపోయినా... లీగ్‌లో కొనసాగేందుకు ఒక్కో ఫ్రాంచైజీ ఏడాదికి దాదాపు రూ. 6.5 కోట్ల వరకు ఖర్చు చేస్తుండటం బ్యాడ్మింటన్‌పై వారి ఆసక్తికి నిదర్శనం. టాప్ ఆటగాళ్లూ సై... తొలి పీబీఎల్ సమయంలో అగ్రశ్రేణి విదేశీ ఆటగాళ్లు ఇందులో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత రెండో సీజన్లో అప్పటి వరల్డ్ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) వచ్చింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)కు కూడా ఇదో రెండో సీజన్. ప్రస్తుత మహిళల వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) ఇప్పుడు జరుగుతున్న పోటీలతో లీగ్‌లోకి అడుగు పెట్టింది. చైనా ఆటగాళ్లు కూడా లీగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. 2016 బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన తియాన్ హువీకి ఈ సారి వేలంలో రెండో అత్యధిక మొత్తం రూ. 58 లక్షలు లభించాయి. అన్ని వైపుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈసారి మరో రెండు కొత్త జట్లను చేర్చి టోర్నీని నిర్వహించారు. ఇక భారత యువ షట్లర్లు అనేక మందికి పీబీఎల్ కొత్త దారులు తెరిచింది. సూపర్ సిరీస్ టోర్నీ స్థాయికి చేరితే మాత్రమే తలపడే అవకాశం ఉన్న అనేక మంది టాప్ ప్లేయర్లతో ఆడే అవకాశం రావడం, జట్టులో సభ్యులుగా వారి నుంచి నేర్చుకునే చాన్స్ కూడా దక్కడం స్ఫూర్తి పెంచుతుందనడంలో సందేహం లేదు. ‘ఇంత తొందరగా నా జీవితంలో వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్‌ను కోర్టులో ఎదుర్కోగలనని అస్సలు ఊహించలేదు. మ్యాచ్ ఓడినా నేర్చుకున్న పాఠాలు కూడా గొప్పవి. పీబీఎల్ నాకిచ్చిన అవకాశం ఇది’ అని మహిళల సింగిల్స్ ప్లేయర్ రసిక రాజే ఆనందంగా చెప్పింది. ఇక హైదరాబాద్ అమ్మాయి సిక్కి రెడ్డి, శుభాంకర్ డే లాంటి వారికైతే తమ సత్తాను చూపించేందుకు పీబీఎల్ రూపంలో సరైన వేదిక లభించింది. ప్రతి మ్యాచ్‌లో రాణించిన ఆటగాళ్లకు అవార్డుల రూపంలో ఆకర్షణీయమైన మొత్తంలో నగదు దక్కుతోంది. ‘సూపర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు పొందిన వారికి రూ. 50 వేలు... ‘ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద డే’కు రూ. 25 వేలు... ‘ఫాస్టెస్ట్ స్మాష్ ఆఫ్ ద డే’ కొట్టిన వారికి రూ. 25 వేలు అందజేస్తున్నారు. స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతున్న పీబీఎల్ ఎదుగుతున్న తీరు చూస్తే మున్ముందు మరింత పురోగతిని ఆశించవచ్చు. మన దేశంలో క్రికెటర్లు తప్పిస్తే ఇతర క్రీడాకారులు డబ్బు సంపాదించడం చాలా కష్టం. కానీ పీబీఎల్ చాలా విషయాలు మార్చేసింది. షట్లర్లకు లీగ్ ద్వారా ఆర్థికపరంగా కూడా మంచి ప్రయోజనం కలిగింది. మన దేశంలో ఒక లీగ్ ఇంతగా విజయవంతమవుతుందని కొన్నేళ్ల క్రితం కనీసం నేను ఊహించలేదు. అది ఇప్పుడు జరగడం సంతోషకరం. ఒకప్పుడు మనం చైనా, కొరియా ఆటగాళ్లను ఓడించడం కష్టమనే భావన ఉండేది. కానీ పీబీఎల్ వచ్చాక అలాంటి ఆలోచనలు మారిపోయాయి. ఈ లీగ్‌లో మా షట్లర్ల ఆటను చూడండి. వారు మరింత ప్రొఫెషనల్‌గా కనిపిస్తున్నారు. – పీబీఎల్‌పై సైనా నెహ్వాల్ వ్యాఖ్య -
సెమీస్‌లో అహ్మదాబాద్
చెన్నై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–3)లో కొత్తగా బరిలోకి దిగిన అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ జట్టు అందరికంటే ముందుగా సెమీస్ బెర్త్ సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన లీగ్ పోరులో అహ్మదాబాద్ 5–0తో ముంబై రాకెట్స్‌పై ఘనవిజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో లా చెక్ హిమ్–కమిల్లా రైటర్ (అహ్మదాబాద్) జోడి 15–11, 15–7తో లీ యంగ్ డే–స్టోయెవా జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ (అహ్మదాబాద్) 15–12, 15–12తో సన్ వాన్ హోపై, మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (అహ్మదాబాద్) 15–9, 15–12తో బీవెన్ జాంగ్‌పై నెగ్గారు. రెండో పురుషుల సింగిల్స్ ఇరు జట్లకు ‘ట్రంప్’ మ్యాచ్ కాగా... ఇందులో సౌరభ్ వర్మ (అహ్మదాబాద్) 15–14, 15–11తో సోదరుడు సమీర్ వర్మపై గెలిచాడు. చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌లో రెగినాల్డ్–నందగోపాల్ (అహ్మదాబాద్) ద్వయం 10–15 12–15తో లీ యంగ్ డే–బూన్ హియాంగ్ తన్ జంట చేతిలో ఓడింది. ఐదు మ్యాచ్‌లాడిన అహ్మదాబాద్ మూడు విజయాలు సాధించి 17 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. తాజా ఓటమితో నిర్ణీత ఐదు లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ముంబై రాకెట్స్‌తోపాటు డిఫెండింగ్ చాంపియన్... పీవీ సింధు ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై స్మాషర్స్ (12 పాయింట్లు) లీగ్ దశలోనే నిష్క్రమించాయి. నేటి నుంచి హైదరాబాద్ అంచె పోటీలు ప్రారంభమవుతాయి. -
‘షటిల్’ సంబరం
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ అభిమానులను గత కొద్ది రోజులుగా అలరిస్తూ వచ్చిన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) చివరి అంచెకు చేరుకుంది. లీగ్ దశలో ఆఖరి రెండు మ్యాచ్‌లు నేడు, రేపు హైదరాబాద్‌లో జరగనున్నాయి. దాంతో పాటు నాకౌట్ మ్యాచ్‌లకు కూడా నగరమే వేదిక కానుంది. రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లతో పాటు జనవరి 14న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ కూడా జరుగుతుంది. షటిల్‌కు ఇప్పటికే అడ్డాగా ఉన్న హైదరాబాద్‌లో పీబీఎల్ గత రెండు సీజన్లలో జరిగిన మ్యాచ్‌లకు కూడా మంచి స్పందన లభించింది. ఇప్పుడు కూడా పండగ సమయంలో బ్యాడ్మింటన్ అభిమానుల సంబరానికి మరో అవకాశం లభించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికను చూస్తే లోకల్ టీమ్ హైదరాబాద్ హంటర్స్ దాదాపుగా సెమీస్ స్థానం ఖాయం చేసుకోవడంతో హైదరాబాద్ అంచె మ్యాచ్‌లపై మరింత ఆసక్తి పెరగడం ఖాయం. బుధవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డాషర్స్‌తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ తలపడుతుంది. ఢిల్లీ జట్టులో మహిళల సింగిల్స్ ప్రపంచ మూడో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (కొరియా)... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ తియాన్ హువీ (చైనా)... నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్టులో పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)... ప్రపంచ 20వ ర్యాంకర్ అజయ్ జయరామ్ (భారత్)... బెంగళూరు బ్లాస్టర్స్ తరఫున పురుషుల సింగిల్స్ ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్... మహిళల డబుల్స్‌లో స్థానిక క్రీడాకారిణి సిక్కి రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. డిసెంబర్ 23 నుంచి జరుగుతున్న ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గువాహటి, ఢిల్లీ, లక్నో, చెన్నై నగరాలు ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లకు వేదికలుగా నిలిచాయి. bookmyshowలో ఆన్లైన్ ద్వారా లేదా మ్యాచ్ రోజుల్లో గచ్చిబౌలి స్టేడియం వద్ద కౌంటర్లలో కూడా టికెట్లు లభిస్తాయి. లీగ్ మ్యాచ్‌లకు రూ.500గా టికెట్ ధర నిర్ణయించగా... సెమీస్ కోసం రూ.700, ఫైనల్‌కు రూ.900కు టికెట్లు లభిస్తాయి. హైదరాబాద్ మ్యాచ్‌ల షెడ్యూల్ అన్ని మ్యాచ్‌లు రా.గం. 7.00 నుంచి జనవరి 10 : ఢిల్లీ డాషర్స్ గీ నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జనవరి 11 : హైదరాబాద్ హంటర్స్ గీ బెంగళూరు బ్లాస్టర్స్ జనవరి 12 : తొలి సెమీఫైనల్ జనవరి 13 : రెండో సెమీఫైనల్ జనవరి 14 : ఫైనల్ -
చెన్నై స్మాషర్స్‌కు మూడో విజయం
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్ జట్టు మూడో విజయం సాధించి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో తమ సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. బెంగళూరు బ్లాస్టర్స్‌తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్ 3–2తో గెలుపొందింది. రెండు ‘ట్రంప్’ మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఆటగాళ్లే నెగ్గడం విశేషం. బెంగళూరు ‘ట్రంప్’ మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–లీ యాంగ్ (చెన్నై) జంట 8–15, 15–14, 15–13తో బో మథియాస్–కిమ్ సా రంగ్ జోడీపై గెలిచింది. ఆ తర్వాత చెన్నై ‘ట్రంప్’ మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 15–9, 15–14తో కిర్స్టీ గిల్మోర్ (బెంగళూరు)పై గెలిచింది. దాంతో చెన్నై 3–(–1)తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో అక్సెల్సన్ (బెంగళూరు) 15–11, 6–15, 15–9తో సెన్‌సోమ్‌బున్‌సుక్‌పై... శుభాంకర్ (బెంగళూరు) 15–12, 15–12తో లెవెర్డెజ్పై... మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–కిమ్ సా రంగ్ (బెంగళూరు) 15–14, 15–11తో సింధు–క్రిస్ అడ్‌కాక్‌లపై గెలిచినా ఫలితం లేకపోయింది. -
చెన్నైకు షాక్
లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్ జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. ఢిల్లీ డాషర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్ 0–3తో ఓడింది. ఢిల్లీ ‘ట్రంప్’ మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి–యాంగ్ లీ (చెన్నై) జంట 15–13, 15–11తో ఇవనోవ్–సొజోనోవ్ జోడీపై నెగ్గింది. దాంతో చెన్నై ఖాతాలో పాయింట్ చేరగా... ఢిల్లీ స్కోరు –1గా నిలిచింది. అయితే తొలి పురుషుల సింగిల్స్‌లో విన్సెంట్ (ఢిల్లీ) 15–10, 15–13తో లెవెర్డెజ్ (చెన్నై)ను ఓడించడంతో ఢిల్లీ స్కోరు 0–1గా మారింది. రెండో పురుషుల సింగిల్స్‌లో తియాన్ హువీ 15–14, 15–10తో సెన్సోమ్బున్సుక్ (చెన్నై)పై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. మహిళల సింగిల్స్‌లో సుంగ్ జీ హున్ (ఢిల్లీ) 11–15, 15–13, 15–14తో పీవీ సింధు (చెన్నై)పై నెగ్గడంతో ఢిల్లీ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చెన్నై ఎంచుకున్న మిక్స్డ్ డబుల్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో గాయంతో క్రిస్ అడ్కాక్–గాబ్రియేలా (చెన్నై) జంట వైదొలిగింది. దాంతో అశ్విని పొన్నప్ప–ఇవనోవ్ (ఢిల్లీ) జంటను విజేతగా ప్రకటించారు. ‘ట్రంప్’ మ్యాచ్‌లో ఓడటంతో చెన్నై పాయింట్ చేజార్చుకోగా... ఢిల్లీ ఖాతాలో పాయింట్ చేరింది. -
శ్రీకాంత్, సైనా ఓడినా...
లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో అవధ్ వారియర్స్ జట్టు వరుసగా రెండు పరాజయాల తర్వాత తమ ఖాతాలో మరో విజయాన్ని జమ చేసుకుంది. అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అవధ్ 4–3తో గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ తొలి మ్యాచ్‌లో క్రిస్టినా–తాంగ్ చున్ మాన్ 14–15, 15–12, 15–14తో కామిల్లా–లా చుక్ హిమ్ జంటపై గెలిచి అవధ్‌కు 1–0 ఆధిక్యం అందించారు. పురుషుల సింగిల్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో కశ్యప్ 11–15, 15–13, 15–14తో సౌరభ్ వర్మను ఓడించడంతో అవధ్ ఆధిక్యం 3–0కు పెరిగింది. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్ మరో మ్యాచ్‌లో ప్రణయ్ 15–8, 15–11తో శ్రీకాంత్‌ను ఓడించడంతో అహ్మదాబాద్ ఖాతా లో తొలి పాయింట్ చేరింది. మహిళల సింగిల్స్ తమ ‘ట్రంప్’ మ్యాచ్‌లో తై జు యింగ్ 15–5, 15–14తో సైనాపై నెగ్గడంతో అహ్మదాబాద్ స్కోరును 3–3తో సమం చేసింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో సెతియవాన్–తాంగ్ చున్ మాన్ ద్వయం 15–14, 15–10తో నందగోపాల్–రెగినాల్డ్ (అహ్మదాబాద్) జంటను ఓడించి అవధ్‌కు 4–3తో విజయాన్ని ఖాయం చేసింది. -
బెంగళూర్ 6, ముంబై మైనస్ 1
లక్నో: బెంగళూరు ‘బ్లాస్టింగ్’కు ముంబై రాకెట్స్ తేలిపోయాయి. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మైనస్ పాయింట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. ఇక్కడి బాబు బనారసి దాస్ బ్యాడ్మింటన్ అకాడమీలో సోమవారం జరిగిన పోరులో బెంగళూరు బ్లాస్టర్స్ 6– (–1) తేడాతో ముంబైపై అసాధారణ విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్, సింగిల్స్ ఇలా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు క్రీడాకారులే సత్తాచాటారు. ప్రత్యర్థి ఆటగాళ్లను వరుసబెట్టి ఓడించారు. మొదట జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–కిమ్ సా రంగ్ జోడి 15–8, 10–15, 15–10తో ఎం.ఆర్.అర్జున్–గ్యాబ్రియెలా స్టొయెవా (ముంబై)పై గెలుపొందింది. మహిళల సింగిల్స్‌లో కిర్స్టీ గిల్మోర్ 15–14, 15–8తో బీవెన్ జంగ్ (ముంబై)ను కంగుతినిపించింది. పురుషుల సింగిల్స్‌ను బెంగళూరు ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఇందులో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ 15–6, 15–13తో సన్ వాన్ హో (ముంబై)పై గెలవడంతోనే బెంగళూరు బ్లాస్టర్స్ 4–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తర్వాత మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు ప్లేయర్లు పట్టు సడలించకపోవడంతో ముంబైకి కష్టాలు తప్పలేదు. రెండో పురుషుల సింగిల్స్ ముంబైకి ట్రంప్ కాగా ఇందులోనూ సమీర్ వర్మ 15–9, 8–15, 6–15తో చోంగ్ వీ ఫెంగ్ (బెంగళూరు) చేతిలో కంగుతిన్నాడు. చివరి పురుషుల డబుల్స్‌లో మథియాస్ బోయె–కిమ్ సా రంగ్ ద్వయం 9–15, 15–10, 15–14తో లీ యంగ్ డే–బూన్ హియోంగ్ తన్ (ముంబై) జంటపై గెలిచింది. నేడు (మంగళవారం) జరిగే పోరులో అవధ్ వారియర్స్‌తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ తలపడనుంది. -
హైదరాబాద్ హంటర్స్ ఓటమి
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో హైదరాబాద్ హంటర్స్ జట్టు వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. ఢిల్లీ డాషర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ 0–5తో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో ఇవనోవ్–సొజోనోవ్ (ఢిల్లీ) జంట 15–9, 15–11తో మార్కిస్ కిడో–యో యోన్ సెయోంగ్ జోడీని ఓడించింది. హైదరాబాద్ హంటర్స్ పురుషుల సింగిల్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో లీ హున్ ఇల్ 15–13, 11–15, 4–15తో విన్సెంట్ (ఢిల్లీ) చేతిలో పరాజయం పొందాడు. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో కరోలినా మారిన్ 15–10, 15–12తో సుంగ్ జీ హున్ (ఢిల్లీ)పై గెలుపొందింది. ఢిల్లీ డాషర్స్ పురుషుల సింగిల్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో తియాన్ హువీ 15–14, 14–15, 15–10తో సాయిప్రణీత్ (హంటర్స్)పై నెగ్గాడు. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్–పియా జెబాదియా (హంటర్స్) జంట 11–15, 12–15తో ఇవనోవ్–అశ్విని పొన్నప్ప (ఢిల్లీ) జోడీ చేతిలో ఓడింది. -
బెంగళూరు బ్లాస్టర్స్ బోణీ
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్లో తొలి మ్యాచ్‌తోనే బెంగళూరు బ్లాస్టర్స్ బోణీ కొట్టింది. గురువారం ఇక్కడి సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన పోరులో బెంగళూరు 5–2తో ఢిల్లీ డాషర్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్లో ఢిల్లీకిది వరుసగా రెండో పరాజయం. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్ పోరులో సిక్కిరెడ్డి– కిమ్ స రంగ్ (బెంగళూరు) జోడి 15–10, 12–15, 15–11తో అశ్విని పొన్నప్ప– వ్లాదిమిర్ ఇవనోవ్ (ఢిల్లీ) జంటపై గెలిచి బ్లాస్టర్స్‌కు శుభారంభం అందించింది. తర్వాత పురుషుల సింగిల్స్‌లో చోంగ్ వి ఫెంగ్ (బెంగళూరు) 10–15, 15–13, 15–8తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (ఢిల్లీ)పై విజయం సాధించాడు. దీంతో బెంగళూరు వరుస విజయాలతో 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం మహిళల సింగిల్స్‌ను ఢిల్లీ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఇందులో సుంగ్ జి హ్యూన్ జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. సుంగ్ జి 15–10, 8–15, 15–5తో కిర్స్టి గొల్మోర్ (బెంగళూరు)పై గెలుపొందడంతో స్కోరు 2–2గా సమమైంది. తర్వాత జరిగిన రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ను బెంగళూరు ట్రంప్‌గా ఎంచుకోవడంతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఫలితం తేలిపోయింది. ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (బెంగళూరు) 15–11, 15–11తో వరుస గేముల్లోనే తియాన్ హువే (ఢిల్లీ)పై గెలుపొందాడు. దీంతో బ్లాస్టర్స్ జట్టు 4–2తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ప్రాధాన్యత లేని పురుషుల డబుల్స్ మ్యాచ్‌లోనూ బెంగళూరు జంట మథియాస్ బో–కిమ్ స రంగ్ 15–9, 15–12తో వ్లాదిమిర్ ఇవనోవ్–ఇవాన్ సొజొనోవ్ (ఢిల్లీ) జోడిపై నెగ్గింది. నేడు ఇక్కడే జరిగే పోరులో హైదరాబాద్ హంటర్స్... అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో తలపడనుంది. -
చెన్నై స్మాషర్స్ గెలుపు
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–3)లో చెన్నై స్మాషర్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఇక్కడి సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బుధవారం జరిగిన ఈ పోరులో చెన్నై 4–3తో ముంబై రాకెట్స్‌పై గెలిచింది. చెన్నై తరఫున స్టార్ షట్లర్ పీవీ సింధు 12–15, 15–7, 15–9తో బీవెన్ జంగ్ (ముంబై)పై గెలుపొందగా, అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్ పురుషుల డబుల్స్‌లో యంగ్ లీ–సుమిత్ రెడ్డి జంట 9–15, 6–15తో లీ యంగ్ డే– బూన్ హియోంగ్ తన్ (ముంబై) జోడీ చేతిలో కంగుతింది. తర్వాత పురుషుల సింగిల్స్‌లో బ్రిస్ లెవెర్డెజ్ 15–14, 10–15, 15–14తో సమీర్ వర్మ (ముంబై)పై చెమటోడ్చి నెగ్గాడు. రెండో పురుషుల సింగిల్స్ పోరును ముంబై ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఇందులో సన్ వాన్ హో (ముంబై) 15–11, 15–5తో తనోంగ్సక్ సాన్సొంబున్సుక్‌పై గెలుపొందడంతో ముంబై 3–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. తదుపరి మిక్స్డ్ డబుల్స్ చెన్నైకి ట్రంప్ మ్యాచ్ కాగా... కీలకమైన ఈ పోరులో గ్యాబ్రియెల్ల అడ్కాక్– క్రిస్ అడ్కాక్ జంట 15–9, 13–15, 15–9తో అర్జున్– గ్యాబ్రియెల్ల స్టొయెవా జోడీపై నెగ్గి చెన్నైని గెలిపించింది. నేడు (గురువారం) జరిగే పోరులో ఢిల్లీ డాషర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్ తలపడుతుంది. -
ముంబై రాకెట్స్ బోణీ
గువాహటి: రెండు ‘ట్రంప్’ మ్యాచ్‌ల్లో గెలిచిన ముంబై రాకెట్స్ జట్టు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో శుభారంభం చేసింది. ఢిల్లీ డాషర్స్‌తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై రాకెట్స్ 4–1 పాయింట్ల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో లీ యోంగ్ డే–తాన్ బూన్ హెంగ్ (ముంబై) ద్వయం 14–15, 15–14, 15–10తో వ్లాదిమిర్ ఇవనోవ్–సొజోనోవ్ (ఢిల్లీ) జంటపై గెలిచి 1–0తో ముందంజ వేసింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ సమీర్ వర్మ 15–11, 15–12తో ప్రపంచ 15వ ర్యాంకర్, హాంకాంగ్ ప్లేయర్ వింగ్ కీ వోంగ్ విన్సెంట్ (ఢిల్లీ)పై గెలిచాడు. ఇది ఢిల్లీకి ‘ట్రంప్’ మ్యాచ్ కావడంతో ఆ జట్టు స్కోరు –1గా మారగా... ఒక పాయింట్ పొందిన ముంబై 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సుంగ్ జీ హున్ 12–15, 15–14, 15–9తో బీవెన్ జాంగ్ (ముంబై)ను ఓడించింది. దాంతో ఢిల్లీ స్కోరు 0–2గా మారింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మరో పురుషుల సింగిల్స్‌లో తియాన్ హువె (ఢిల్లీ) 13–15, 15–13, 15–9తో సన్ వాన్ హో (ముంబై) గెలుపొందడంతో ఢిల్లీ ప్రత్యర్థి జట్టు ఆధిక్యాన్ని 1–2కి తగ్గించింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో గాబ్రియేలా స్టొఇవా–లీ యోంగ్ డే (ముంబై) జంట 15–11, 15–9తో ప్రణవ్ చోప్రా–ఆరతి సారా (ఢిల్లీ) జోడీపై గెలిచింది. ఇది ముంబై ‘ట్రంప్’ మ్యాచ్ కావడం, ఆ జట్టే నెగ్గడంతో వారికి రెండు పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా ముంబై 4–1తో ఢిల్లీని ఓడించింది. ఒకవేళ ‘ట్రంప్’ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచి ఉంటే 2–1తో విజయాన్ని ఖాయం చేసుకునేది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ తలపడుతుంది. -
హైదరాబాద్ హంటర్స్ శుభారంభం
గువాహటి: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో హైదరాబాద్ హంటర్స్ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించింది. కొత్త జట్టు నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ 5–2తో గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో మార్కిస్ కిడో–యు యోన్ సియోంగ్ (హంటర్స్) ద్వయం 15–10, 13–15, 15–13తో కిమ్ జి జంగ్–షిన్ బేక్ జోడీపై నెగ్గింది. రెండో మ్యాచ్‌లో లీ హున్ ఇల్ (హంటర్స్) 15–13, 11–15, 15–6తో అజయ్ జయరామ్‌ను ఓడించాడు. ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంచుకున్న మూడో మ్యాచ్‌లో కరోలినా మారిన్ 15–9, 15–11తో మిచెల్లి లీపై గెలిచింది. దాంతో హంటర్స్ 4–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంచుకున్న నాలుగో మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ ప్లేయర్ జు వీ వాంగ్ 11–15, 15–6, 15–6తో సాయిప్రణీత్‌ను ఓడించడంతో వారియర్స్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. చివరిదైన ఐదో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–పియా జెబాదియా ద్వయం 15–8, 15–11తో ప్రాజక్తా సావంత్–షిన్ బేక్ జంటపై నెగ్గడంతో హంటర్స్ జట్టు ఓవరాల్‌గా 5–2తో విజయం దక్కించుకుంది. సోమవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డాషర్స్‌తో ముంబై రాకెట్స్ తలపడుతుంది. -
చెన్నై స్మాషర్స్‌కు షాక్
గువాహటి: పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్... మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో టాంగ్ చున్ మన్–క్రిస్టినా పెడర్సన్ ద్వయం అదరగొట్టడంతో... ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్లో అవధ్ వారియర్స్ శుభారంభం చేసింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ 4–3 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో టాంగ్ చున్ మన్–క్రిస్టినా పెడర్సన్ (అవధ్) జంట 10–15, 15–5, 15–12తో క్రిస్ అడ్కాక్–గాబ్రియేలా అడ్కాక్ జోడీపై గెలిచి ఒక పాయింట్ సాధించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ (అవధ్) 15–12, 15–8తో డానియల్ ఫరీద్‌ను ఓడించాడు. దీనిని అవధ్ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకోవడంతో అవధ్‌కు రెండు పాయింట్లు లభించాయి. దాంతో ఆ జట్టు 3–0తో ముందంజ వేసింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మరో పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (అవధ్) 15–12, 15–13తో లెవెర్డెజ్పై గెలవడంతో అవధ్ జట్టు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 4–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో క్రిస్ అడ్కాక్–యోంగ్ లీ జంట 15–11, 10–15, 15–11తో హెండ్రా సెతియవన్–చిన్ చుంగ్ (అవధ్) జోడీపై గెలిచింది. దాంతో చెన్నై ఖాతాలో తొలి పాయింట్ చేరింది. చెన్నై స్టార్ ప్లేయర్ పీవీ సింధుతో మహిళల సింగిల్స్‌లో అవధ్ వారియర్స్ తరఫున తలపడాల్సిన సైనా నెహ్వాల్ చీలమండ గాయంతో వైదొలిగింది. సైనా స్థానంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు బరిలోకి దిగింది. సింధు 15–10, 15–9తో ఉత్తేజితపై గెలిచింది. ట్రంప్ మ్యాచ్‌లో నెగ్గినందుకు చెన్నైకు రెండు పాయింట్లు లభించాయి. దాంతో ఓవరాల్‌గా అవధ్ 4–3తో చెన్నైను ఓడించింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది. -
మా జట్టు పటిష్టంగా మారింది
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ మూడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి జరిగే ఈ టోర్నీలో హైదరాబాద్ హంటర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హంటర్స్ టీమ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. గత ఏడాది లీగ్ దశలో నిలకడగానే ఆడినా చివర్లో విఫలమైన హంటర్స్ సెమీఫైనల్ అవకాశం కోల్పోయింది. అయితే ఈసారి తమ జట్టు మరింత పటిష్టంగా మారిందని, జట్టుకు మంచి విజయావకాశాలు ఉన్నాయని కీలక ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్ అన్నాడు. ముఖ్యంగా పురుషుల సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాడు లీ హ్యున్ ఇల్ (దక్షిణ కొరియా), డబుల్స్‌లో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత, ప్రపంచ చాంపియన్ మార్కిస్ కిడో (ఇండోనేసియా) రావడం జట్టు బలాన్ని పెంచింది. ‘లీ హ్యున్, కిడో జట్టుకు అదనపు బలం. కరోలినా మారిన్లాంటి స్టార్ కూడా జట్టుతో ఉంది. ఈసారి మా రాత మారుతుందని గట్టిగా నమ్ముతున్నా. ముందుగా సెమీఫైనల్ చేరుకోవడంపైనే దృష్టి పెట్టాం. ఆ తర్వాత ఫైనల్, ఆపై టైటిల్’ అని ఈ ఏడాది సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సాయిప్రణీత్ వ్యాఖ్యానించాడు. వరుసగా రెండో ఏడాది హంటర్స్ జట్టుతో కొనసాగడం సంతోషంగా ఉందని... హైదరాబాద్ అభిమానులు సొంతగడ్డపై తమ జట్టు సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు చూసేలా తమ శాయశక్తులా ప్రయత్నిస్తామని అతను చెప్పాడు. డబుల్స్‌లో బలమైన జట్టు ఉండటం తమకు ఇతర జట్లతో పోలిస్తే మెరుగైన అవకాశాన్ని కల్పిస్తోందని హంటర్స్ కోచ్ రాజేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జట్టు సభ్యులు సాత్విక్ సాయిరాజ్, రాహుల్ యాదవ్‌లతో పాటు టీమ్ యజమాని డాక్టర్ వీఆర్కే రావు, సీఈఓ శ్యామ్ గోపు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జట్లతో మరింత ఆదరణ
దుబాయ్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్తగా మరో రెండు జట్లు అదనంగా రావడంతో ఆటకు మరింత ప్రచారం లభిస్తుందని భారత్ స్టార్ షట్లర్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు అభిప్రాయపడింది. గత రెండు సీజన్లలో లీగ్‌కు మంచి ఆదరణ లభించిందని, ఈసారి కూడా టోర్నీ మరింత ఆకర్షణీయంగా జరుగుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 14 వరకు భారత్‌లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. తొలి రెండు సీజన్ల పాటు ఈ లీగ్‌లో ఆరు జట్లు ఉండగా, ఇప్పుడు అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్, నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్లు కూడా వచ్చాయి. సింధు నాయకత్వంలోని చెన్నై స్మాషర్స్ జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ‘మేం టైటిల్ నిలబెట్టుకుంటామనే నమ్మకం ఉంది. ఈసారి స్మాషర్స్ అభిమానుల కోసం చెన్నైలో కూడా మ్యాచ్‌లు ఉన్నాయి. గత ఏడాది అక్కడ మేం ఆడలేకపోయాం. ఇప్పుడు అక్కడ కూడా ఆటపై ఆసక్తి పెరుగుతుంది. పైగా గువాహటిలాంటి చోటికి కూడా పీబీఎల్ వెళుతోంది. గతంలో ఏ స్థాయిలో కూడా అక్కడ ఆడని మాకు అదో కొత్త అనుభవం అవుతుంది. సహజంగానే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఆదరణ పెరిగి చివరకు బ్యాడ్మింటన్‌కే మేలు చేస్తుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. ఒక్కడి ప్రదర్శన సరిపోదు... పీబీఎల్ గత సీజన్లో తమ జట్టు బాగానే ఆడిందని, అయితే కీలక సమయంలో ఎదురైన పరాజయాలతో టోర్నీలో సెమీఫైనల్‌కే పరిమితమయ్యామని అవధ్ వారియర్స్ కెప్టెన్, ప్రపంచ మూడో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ అన్నాడు. ‘బ్యాడ్మింటన్ వ్యక్తిగత ఆటే అయినా పీబీఎల్ వద్దకు వచ్చేసరికి అది టీమ్ గేమ్‌గా మారిపోయింది. నా ఒక్కడి ప్రదర్శనపైనే ఆధారపడి జట్టు ముందుకు వెళ్ళలేదు. ఈసారి జట్టు మరింత బలంగా ఉంది కాబట్టి తొలిసారి టైటిల్‌ను గెలుచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తాం’ అని శ్రీకాంత్ అన్నాడు. -
నేడు పీబీఎల్ వేలం
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్ కోసం ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ పీవీ సింధుపై అన్నీ ఫ్రాంచైజీలు దృష్టిపెట్టాయి. మెగా టోర్నీల్లో దూసుకెళ్తున్న తెలుగు తేజంపై రూ. లక్షలు వెచ్చించేందుకు ఎనిమిది ఫ్రాంచైజీలు సై అంటున్నాయి. ఆమెతో పాటు ఒలింపిక్స్ విజేత కరోలినా మారిన్ (స్పెయిన్), ప్రపంచ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్, మహిళల నంబర్‌వన్ తై జు యింగ్ (తైవాన్), భారత స్టార్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లపై ఫ్రాంచైజీలు కన్నేశాయి. సోమవారం ఈ వేలం ప్రక్రియ జరగనుంది. ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల కొనుగోలు కోసం గరిష్టంగా రూ. 2.12 కోట్లు ఖర్చు చేయవచ్చు. ఒక ప్లేయర్‌పై రూ. 72 లక్షలకు మించరాదు. కొరియా, తైవాన్, థాయ్‌లాండ్, జర్మనీ, హాంకాంగ్, చైనా, స్పెయిన్ తదితర మొత్తం 11 దేశాలకు చెందిన 133 మంది ప్లేయర్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. ఇందులో సింహభాగం 82 మంది భారత ఆటగాళ్లే ఉన్నారు. ఆశ్చర్యకరంగా చైనా కూడా ఈ సారి తమ ఆటగాళ్లను బరిలోకి దించింది. ప్రపంచ 11వ ర్యాంకర్ తియాన్ హైవీ వేలంలో మంచి ధర పలకొచ్చు. పీబీఎల్ మూడో సీజన్లో కొత్తగా రెండు ఫ్రాంచైజీలకు చోటిచ్చారు. దీంతో మొత్తం 8 ఫ్రాంచైజీలు టైటిల్ కోసం తలపడతాయి. డిసెంబర్ 22 నుంచి జనవరి 14 వరకు 24 రోజుల పాటు మ్యాచ్‌లు జరుగుతాయి. హైదరాబాద్ సహా ముంబై, లక్నో, చెన్నై, గువాహటిలో పోటీలు నిర్వహిస్తారు. -
పీబీఎల్–3లో మరో రెండు కొత్త జట్లు
చెన్నై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్లోకి మరో రెండు కొత్త జట్లు రాబోతున్నాయి. డిసెంబర్ 22 నుంచి జనవరి 14 వరకు జరిగే పీబీఎల్–3లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్, గువాహటి ఈస్టర్న్ వారియర్స్ ఆడనున్నాయి. దీంతో పీబీఎల్‌లో జట్ల సంఖ్య ఆరు నుంచి ఎనిమిదికి చేరింది. ‘బాయ్’ ఆధ్వర్యంలో ఈసారి నాలుగు నగరాల్లో మ్యాచ్‌లు జరుగనుండగా ఫైనల్‌కు చెన్నై వేదిక కానుంది. ఈ ఏడాది జనవరిలో ముగిసిన రెండో సీజన్‌ను పీవీ సింధు నేతృత్వంలోని చెన్నై స్మాషర్స్ జట్టు గెలుచుకుంది. -
వచ్చే ఏడాది ఎనిమిది జట్లు!
సాక్షి, హైదరాబాద్: క్రీడాభిమానులను ఈ సీజన్లో విశేషంగా ఆకట్టుకున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)ను మరింత విస్తరించాలని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్), పీబీఎల్ నిర్వాహకులు స్పోర్‌ట్సలైవ్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జట్ల సంఖ్యను ఆరునుంచి ఎనిమిదికి పెంచనున్నారు. రెండు నగరాల కోసం ప్రస్తుతం కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్‌ల మధ్య పోటీ నెలకొంది. టోర్నమెంట్‌ను ఈ సంవత్సరం పక్షం రోజులపాటు నిర్వహించగా, దానికి అదనంగా మరో పది రోజులు పెంచాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. అదే జరిగితే డిసెంబర్ 20 నుంచి పీబీఎల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇటీవలే జనవరి 1నుంచి 15 వరకు జరిగిన పీబీఎల్ 2కు అద్భుత ఆదరణ లభించిందని స్పోర్ట్స లైవ్ డెరైక్టర్ ప్రసాద్ మంగిపూడి ప్రకటించారు. ఇదే కారణంగా దేశవ్యాప్తంగా వివిధ నగరాలనుంచి పలువురు ప్రముఖులు లీగ్‌లో భాగం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. తమ టోర్నీ విజయవంతం కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఐదు వేదికల్లోనూ స్టేడియంలకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స తరలి రాగా, టెలివిజన్‌లో ఈ టోర్నీని 3.2 కోట్ల మంది వీక్షించినట్లు ప్రసాద్ వెల్లడించారు. మరో వైపు ఈ ఏడాది పీబీఎల్ అనేక మంది ప్రతిభావంతులను వెలుగులోకి తెచ్చిందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా సాత్విక్ సారుురాజ్, చిరాగ్ శెట్టిలాంటి కుర్రాళ్ల ఆట ప్రపంచానికి తెలిసిందని ఆయన అభిప్రాయపడ్డారు. రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ రావడం వల్ల ఈ టోర్నీకి కళ పెరిగిందనే విషయాన్ని ఆయన అంగీకరించారు. కొంత మంది చైనా షట్లర్లు కూడా ఆసక్తి చూపించినా వేర్వేరు కారణాలతో వారు పాల్గొనలేదని, వచ్చే ఏడాది కచ్చితంగా పీబీఎల్‌లో భాగం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతా ఊహించినట్లే సింధు, సైనా మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగిందని, టోర్నీలో ఎక్కువ మంది ఇదే మ్యాచ్‌ను చూసేందుకు ఆసక్తిని కనబర్చారని గోపీ విశ్లేషించారు. -
సెమీస్‌లో అవధ్ వారియర్స్
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2) రెండో సీజన్లో అవధ్ వారియర్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ టోర్నీలో మూడో విజయంతో ప్రస్తుతం అవధ్ (18 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ల జోరుతో అవధ్ వారియర్స్ 4–3తో బెంగళూరు బ్లాస్టర్స్‌పై జయభేరి మోగించింది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో విన్సెంట్ వాంగ్ వింగ్ కి (వారియర్స్) 11–13, 7–11తో సౌరభ్ వర్మ (బ్లాస్టర్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. ఇక ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ వారియర్లే గెలిచారు. మిక్స్డ్ డబుల్స్‌లో సావిత్రి అమిత్రాపాయ్–బోదిన్ ఇసారా (వారియర్స్) జోడి 11–9, 4–11, 11–5తో సిక్కిరెడ్డి–కొ సంగ్ హ్యూన్ (బ్లాస్టర్స్) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో శ్రీకాంత్ (వారియర్స్) 11–9, 11–9తో విక్టర్ అక్సెల్సన్ (బ్లాస్టర్స్)పై విజయం సాధించాడు. అనంతరం మహిళల సింగిల్స్ పోరును అవధ్ తమ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఇందులో సైనా నెహ్వాల్ 9–11, 11–5, 11–5తో చెంగ్ ఎన్గన్ యి (బ్లాస్టర్స్)పై గెలిచి బోనస్ పాయింట్‌తో మరో మ్యాచ్ మిగిలుండగానే జట్టుకు విజయాన్ని ఖాయం చేసింది. పురుషుల డబుల్స్‌లో జరిగిన తమ ట్రంప్ మ్యాచ్‌లో బెంగళూరు జోడీ కొ సంగ్ హ్యూన్– యూ యిన్ సియెంగ్ జంట 6–11, 11–9, 11–6తో గో షెమ్–మార్కిస్ కిడో (వారియర్స్) జోడీపై గెలిచింది. ఆదివారం రాత్రి ఆలస్యంగా ముగిసిన మ్యాచ్‌లో ముంబై రాకెట్స్ 4–1తో బెంగళూరు బ్లాస్టర్స్‌ను ఓడించింది. మంగళవారం బెంగళూరులోనే జరిగే మ్యాచ్‌లో ముంబై రాకెట్స్‌తో చెన్నై స్మాషర్స్ తలపడుతుంది. -
ఢిల్లీ ఏసర్స్ జోరు
స్మాషర్స్‌పై 5–2తో గెలుపు చెన్నై పరువు నిలిపిన సింధు పీబీఎల్–2 బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2)లో డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ ఏసర్స్ ధాటికి చెన్నై స్మాషర్స్ తలవంచింది. ఆదివారం జరిగిన పోరులో ఢిల్లీ 5–2తో చెన్నైపై జయభేరి మోగించింది. ఒక్క చివరి మ్యాచ్ మినహా ఆరంభం నుంచి జరిగిన సింగిల్స్, మిక్స్డ్, పురుషుల డబుల్స్ మ్యాచ్‌లన్నీ ఏసర్స్ ఆటగాళ్లే గెలిచారు. ఢిల్లీ 5–0తో తిరుగులేని ఆధిక్యంలో ఉన్న దశలో బరిలోకి దిగిన సింధు తమ ట్రంప్ మ్యాచ్‌లో గెలిచి చెన్నై స్మాషర్స్ పరువు నిలిపింది. ముందుగా జరిగిన పురుషుల సింగిల్స్‌లో జాన్ ఒ జోర్గెన్సన్ (ఢిల్లీ) 10–12, 11–4, 11–6తో టామీ సుగియార్తో (చెన్నై)పై గెలిచాడు. అనంతరం జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో వ్లాదిమిర్ ఇవనోవ్–గుత్తా జ్వాల (ఢిల్లీ) జోడీ 7–11, 11–4, 11–9తో క్రిస్ అడ్కాక్–సింధు (చెన్నై) జంటను కంగుతినిపించింది. పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లోనూ సన్ వాన్ హో (ఢిల్లీ) 12–10, 11–4తో పారుపల్లి కశ్యప్ (చెన్నై)పై గెలుపొందడంతో ఏసర్స్ ఆధిక్యం 3–0కు పెరిగింది. తర్వాత తమ ట్రంప్ మ్యాచ్‌లో ఢిల్లీ పురుషుల డబుల్స్ జంట ఇవనోవ్–సొజోనోవ్ జంట 11–6, 11–6తో క్రిస్ అడ్కాక్–మడ్స్ కోల్డింగ్ (చెన్నై) జోడీని ఓడించింది. దీంతో మరో 2 పాయింట్లు ఏసర్స్ ఖాతాలో చేరాయి. చివరగా జరిగిన చెన్నై ట్రంప్ మ్యాచ్‌లో సింధు 11–6, 11–7తో తన్వీ లాడ్ (ఢిల్లీ)పై గెలిచి చెన్నైకి ఊరటనిచ్చింది. సోమవారం జరిగే మ్యాచ్‌లో అవ«ద్ వారియర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్ తలపడుతుంది. -
ముంబై రాకెట్స్ జోరు
లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2) రెండో సీజన్లో ముంబై రాకెట్స్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. అవధ్ వారియర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై రాకెట్స్ 3–2 పాయింట్ల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో లీ యోంగ్ డే–నిపిత్పోన్ జోడీ 11–7, 3–11, 13–11తో గో వి షెమ్–మార్కిస్ కిడో (వారియర్స్) జంటపై నెగ్గడంతో ముంబై 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ 5–11, 15–14, 11–5తో కిడాంబి శ్రీకాంత్ (వారియర్స్)పై సంచలన విజయం సాధించడంతో ముంబై 2–0తో ముందంజ వేసింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 12–10, 4–11, 11–5తో సుంగ్ జీ హున్ (ముంబై)ను ఓడిం చడంతో వారియర్స్ ఖాతాలో తొలి పాయింట్ చేరింది. నాలుగో మ్యాచ్ గా జరిగిన పురుషుల సింగిల్స్ ముంబై ‘ట్రంప్’ మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 14–12, 9–11, 11–8తో విన్సెంట్ వోంగ్ వింగ్ కీ (వారియర్స్) గెలిచాడు. దాంతో ముంబై రాకెట్స్ 4–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఐదో మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్ వారియర్స్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో సావిత్రి–బొదిన్ ఇసారా ద్వయం 11–8, 11–4తో నిపిత్పోన్–జీబా జంటపై గెలిచినా తుదకు అవధ్ వారియర్స్ 3–4తో ఓటమిని మూటగట్టుకుంది. శనివారం జరిగే బెంగళూరు బ్లాస్టర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది. -
సైనా, శ్రీకాంత్ గెలుపు
అవధ్ చేతిలో ఢిల్లీ ‘మైనస్’ ఓటమి ∙పీబీఎల్–2 లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో అవధ్ వారియర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో వారియర్స్ 6–(–1)తో ఢిల్లీ ఏసర్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. అవధ్ తరఫున సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు అదరగొట్టారు. పురుషుల డబుల్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో విషెమ్ గో–మార్కిస్ కిడో (అవధ్) జోడి 11–4, 11–4తో వ్లాదిమిర్ ఇవనోవ్–అక్షయ్ దివాల్కర్ (ఢిల్లీ) జంటపై గెలిచింది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌ను అవధ్ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఇందులో సైనా నెహ్వాల్ (అవధ్) 14–12, 11–7తో నిచావోన్ జిందాపొల్ (ఢిల్లీ)పై అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సైనా జోరు పెంచింది. దీంతో ప్రత్యర్థి జిందాపొల్ ఏ దశలోనూ ఆమెకు పోటీనివ్వలేకపోయింది. ట్రంప్ విజయంతో బోనస్ పాయింట్ సాధించిన వారియర్స్ 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (అవధ్) 11–9, 11–13, 11–9తో జానొ జోర్గెన్సెన్ (ఢిల్లీ)పై చెమటోడ్చి నెగ్గాడు. తర్వాత జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో బోదిన్ ఇసారా–సావిత్రి అమిత్రాపాయ్ (అవధ్) జోడి 12–10, 11–5తో వ్లాదిమిర్ ఇవనోవ్–గుత్తాజ్వాల (ఢిల్లీ) జంటపై నెగ్గింది. అనంతరం జరిగిన పురుషుల సింగిల్స్ పోరు ఢిల్లీకి ట్రంప్ మ్యాచ్ కాగా ఇందులోనూ పరాజయాన్నే చవిచూడటంతో మైనస్ 1 తో చిత్తయింది. వాంగ్ వింగ్ కి విన్సెంట్ (అవధ్) 11–8, 11–6తో సొన్ వాన్ హో (ఢిల్లీ)పై గెలిచి వారియర్స్‌కు పరిపూర్ణ విజయాన్ని అందించాడు. -
ముంబై చేతిలో హంటర్స్‌కు షాక్
ముంబై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2)లో ముంబై రాకెట్స్ జోరుకు హైదరాబాద్ హంటర్స్ తలవంచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాకెట్స్ 2–1తో హంటర్స్పై విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో కరోలినా మారిన్ పరాజయం హంటర్స్‌ను నిరాశపరిచింది. మొదట పురుషుల డబుల్స్‌లో లి యోంగ్ డే–నిపిత్‌ఫోన్ ఫుంగ్ఫపెట్ (ముంబై) జోడి 11–9, 11–5తో తన్ బూన్ హ్యంగ్–తన్ వీ కియోంగ్ (హైదరాబాద్) జంటపై గెలిచింది. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో మారిన్ (హైదరాబాద్) 7–11, 11–7, 12–14తో జీ హ్యూన్ సంగ్ (ముంబై) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో రాజీవ్ ఉసెఫ్ (హైదరాబాద్) 11–7, 11–8తో అజయ్ జయరామ్ (ముంబై)పై గెలిచాడు. అనంతరం ముంబై తమ ‘ట్రంప్’ మ్యాచ్‌గా బరిలోకి దిగిన మిక్స్డ్ డబుల్స్‌లో ఓడింది. సాత్విక్ సాయిరాజ్–చౌ హో వా (హైదరాబాద్) జంట 11–13, 12–10, 15–14తో లీయోంగ్ డే– జియెబా (ముంబై) జోడిపై నెగ్గింది. చివరగా జరిగిన హైదరాబాద్ ‘ట్రంప్’ మ్యాచ్‌లో ప్రణయ్ (ముంబై) 11–6, 11–7తో సమీర్ వర్మ (హైదరాబాద్)ను ఓడించడంతో ముంబై 2–1తో గెలుపొందింది. గురువారం జరిగే మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌తో ఢిల్లీ ఏసర్స్ తలపడుతుంది. -
హంటర్స్‌కు వారియర్స్ షాక్
5–0తో హైదరాబాద్‌పై గెలుపు మారిన్ చేతిలో సైనా ఓటమి హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్లో హైదరాబాద్ హంటర్స్ జట్టుకు అవధ్ వారియర్స్ చేతిలో పరాభవం ఎదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ 0–5తో పరాజయం చవిచూసింది. ఈ పోరులో కరోలినా మారిన్ (హైదరాబాద్) ఒక్కరే గెలిచినప్పటికీ... హంటర్స్ జట్టు ‘ట్రంప్’ మ్యాచ్ ఓడిపోవడం ద్వారా సాధించిన ఆ ఒక్క పాయింట్ కూడా కోల్పోవాల్సివచ్చింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో వాంగ్ వింగ్‌కి విన్సెంట్ (వారియర్స్) 11–13, 11–6, 13–11తో సాయి ప్రణీత్ (హంటర్స్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో రియో ఒలింపిక్స్ చాంపియన్ మారిన్ (హంటర్స్) 15–14, 11–5తో సైనా నెహ్వాల్ (వారియర్స్)ను కంగుతినిపించింది. మిక్స్డ్ డబుల్స్‌ను అవధ్ వారియర్స్ జట్టు తమ ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంచుకోగా... బొదిన్ ఇసారా–సావిత్రి (వారియర్స్) 11–9, 12–10తో చౌ వా– సాత్విక్ సాయిరాజ్ (హంటర్స్)లపై గెలిచారు. దీంతో రెండు పాయింట్లు లభించాయి. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (వారియర్స్) 11–13, 11–7, 13–11తో రాజీవ్ ఉసెఫ్ (హంటర్స్)పై గెలిచాడు. చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌ను హైదరాబాద్ తమ ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంచుకుంది. కానీ ఇందులో కూడా గో వి షెమ్–మార్క్స్ కిడో (వారియర్స్) 7–11, 11–8, 13–11తో టాన్ బూన్–టాన్ వీ (హంటర్స్)లను ఓడించారు. సోమవారంతో హైదరాబాద్ అంచె లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. మంగళవారం ముంబైలో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్‌తో చెన్నై స్మాషర్స్ తలపడుతుంది. -
సింధు పైచేయి సాధించేనా!
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాది తొలి రోజే క్రీడాభిమానులను ఆకట్టుకునేందుకు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్ సిద్ధమైంది. నేటి (ఆదివారం) నుంచి గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్, చెన్నై స్మాషర్స్ తలపడనున్నాయి. రియో ఒలింపిక్స్ ఫైనల్లో తలపడిన పీవీ సింధు, కరోలినా మారిన్ ఈసారీ ప్రత్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు. అయితే తెలుగు తేజం సింధు చెన్నై తరఫున ఆడుతోంది. ఒలింపిక్స్ స్వర్ణాన్ని అందకుండా చేసిన మారిన్‌పై ‘సొంత’ ప్రేక్షకుల మద్దతుతో ఈసారి పైచేయి సాధిస్తుందా? అనేది వేచి చూడాలి. కానీ తెలుగు అభిమానులు తమ నగరం పేరుతో ఉన్న హైదరాబాద్‌కు మద్దతిస్తారా.. లేక సింధు జట్టు చెన్నైకి అనుకూలంగా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక పురుషుల సింగిల్స్‌లో టామీ సుగియార్తో, పారుపల్లి కశ్యప్ కూడా చెన్నైలో ఉన్నారు. మిక్స్డ్ డబుల్స్‌లో క్రిస్ అడ్కాక్, గాబ్రియెలా అడ్కాక్ (ఇంగ్లండ్) జంట కీలకం కానుంది. మరోవైపు హంటర్స్ జట్టులో సాయి ప్రణీత్, సమీర్ వర్మ తమ సత్తాను చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫామ్‌లో ఉన్న రాజీవ్ ఉసెఫ్ రూపంలో ఈ జట్టు చక్కటి అంతర్జాతీయ ఆటగాడిని కలిగి ఉంది. ఇక రెండోమ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్, డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ ఏసర్స్ తలపడతాయి. బెంగళూరు తరఫున రియో రజత పతక విజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), బూన్సాక్ పొన్సానా (థాయ్‌లాండ్), సౌరభ్ వర్మ పురుషుల సింగిల్స్‌లో కీలకం. రుత్విక శివాని, అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి కూడా ఈ జట్టుకు ఆడనున్నారు. ఢిల్లీలో డేన్ జాన్, సన్ వాన్ వో రూపంలో గట్టి సింగిల్స్ ఆటగాళ్లున్నారు. -
బ్యాడ్మింటన్ బ్రహ్మోత్సవం
► రేపటి నుంచి పీబీఎల్–2 ► బరిలో 6 జట్లు ► మొత్తం ప్రైజ్‌మనీ రూ. 6 కోట్లు ► తొలి రోజే మారిన్‌తో సింధు ‘ఢీ’ బ్యాడ్మింటన్‌లో మళ్లీ వినోదాల పండగొచ్చింది. ఒలింపిక్స్‌లో సింధు రజత పతకంతో షటిల్‌పై ఉవ్వెత్తున ఎగసిన అభిమానానికి తోడుగా వేర్వేరు వేదికల్లో భారత ఆటగాళ్లు సాధించిన వరుస విజయాలు మరింత ఊపునిచ్చాయి. దాంతో సరిగ్గా ఏడాది వ్యవధిలోనే మరోసారి అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) సన్నద్ధమైంది. పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లతో కళకళలాడుతున్న సీజన్–2 పీబీఎల్‌తో కొత్త సంవత్సరం ప్రారంభంలోనే రెండు వారాల పాటు ‘బ్యాడీస్’ వినోదం అందించడం ఖాయం. ఇక సింధు, మారిన్ మధ్య జరిగిన రియో ఒలింపిక్స్‌లో ఫైనల్ మ్యాచ్‌ను టీవీల్లో వీక్షించిన ప్రేక్షకులకు ఇప్పుడు వారిద్దరి ప్రత్యక్ష పోరును తిలకించే అవకాశం టోర్నీ తొలి రోజే వచ్చింది. హైదరాబాద్‌లో రెండు రోజుల ‘షో’ తర్వాత మరో నాలుగు నగరాలు ముంబై, లక్నో, బెంగళూరు, న్యూఢిల్లీలలో పీబీఎల్ సందడి చేయనుంది. హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో అంచె పోటీలకు రంగం సిద్ధమైంది. రేపు (ఆదివారం) నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో టోర్నీ ప్రారంభమవుతుంది. అనంతరం తొలి రోజు రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. జనవరి 14 వరకు జరిగే ఈ టోర్నీలో ఫైనల్‌ను న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. భారత టాప్ షట్లర్లతో పాటు ప్రపంచంలో పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో సింధు చెన్నై స్మాషర్స్‌కు... సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ అవధ్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, రియో ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ హైదరాబాద్ హంటర్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతోంది. మొత్తం 6 జట్లు తలపడుతుండగా, ఐదు వేదికల్లో పోటీలు జరుగుతాయి. 2016 జనవరిలో జరిగిన గత పీబీఎల్‌లో ఢిల్లీ ఏసర్స్ విజేతగా నిలిచింది. అనివార్య కారణాలతో ఈసారి చెన్నై వేదికగా జరగాల్సిన మ్యాచ్‌లను బెంగళూరుకు తరలించారు. మారిన ఫార్మాట్... టోర్నమెంట్లో ఇరు జట్ల మధ్య జరిగే ఒక ‘టై’లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషుల విభాగంలో రెండు సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లలో ఆటగాళ్లు తలపడతారు. గత ఏడాది మూడు గేమ్‌ల పోరులో మూడో గేమ్ మాత్రమే 11 పాయింట్లుగా ఉంది. అయితే ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన 11 పాయింట్ల పద్ధతిని పీబీఎల్‌లో వాడుతున్నారు. ప్రసారకర్తల పరిమితుల వల్ల కూడా ఈసారి మూడు గేమ్‌లను కూడా 11 పాయింట్లతోనే నిర్వహిస్తారు. విజేతను తేల్చేందుకు చివర్లో ప్రత్యర్థుల మధ్య కనీసం 2 పాయింట్ల తేడా ఉండాలి. అది 14–14 వరకు సాగుతుంది. అప్పుడు మాత్రం ‘సడెన్ డెత్’గా ముందు ఎవరు స్కోర్ చేస్తే వారిదే గేమ్ అవుతుంది. వేలంలో మారిన్ టాపర్... ఈ టోర్నీ కోసం నవంబర్‌లో వేలం నిర్వహించారు. అందులో అత్యధికంగా రూ. 61.5 లక్షల మొత్తానికి కరోలినా మారిన్‌ను హైదరాబాద్ జట్టు సొంతం చేసుకుంది. సుంగ్ జీ హున్ (ముంబై)కి రూ. 60 లక్షలు దక్కాయి. శ్రీకాంత్ (రూ. 51 లక్షలు), సింధు (రూ. 39 లక్షలు), సైనా నెహ్వాల్ (రూ. 33 లక్షలు) ఎక్కువ మొత్తం పొందిన భారత షట్లర్లుగా నిలిచారు. అయితే ఇటీవలే గాయం నుంచి కోలుకుంటున్న మారిన్, సైనా అంచనాలకు అనుగుణంగా తమ పూర్తి సత్తాను ప్రదర్శించగలరా చూడాలి. భారీ ప్రైజ్‌మనీ... పీబీఎల్‌లో మొత్తం ప్రైజ్‌మనీని రూ. 6 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 3 కోట్లు లభిస్తాయి. రన్నరప్ జట్టుకు రూ. కోటీ 50 లక్షలు... సెమీస్ చేరిన రెండు జట్లకు చెరో రూ. 75 లక్షల చొప్పున అందజేస్తారు. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి పెద్ద సంఖ్యలో పలు సంస్థలు పీబీఎల్‌తో జత కట్టడానికి ఆసక్తి చూపించడం బ్యాడ్మింటన్‌కు పెరిగిన ఆదరణను చూపిస్తుంది. పలు కార్పొరేట్ సంస్థలు టోర్నీకి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ‘బెంగళూరు బ్లాస్టర్స్’ జట్టును సొంతం చేసుకొని తొలిసారి ఈ లీగ్‌లోకి అడుగు పెట్టడం విశేషం. జట్ల వివరాలు హైదరాబాద్ హంటర్స్: కరోలినా మారిన్, రాజీవ్ ఉసెఫ్, టాన్ బూన్ హెంగ్, టాన్ వీ కోంగ్, చౌ హో వా, సాయిప్రణీత్, సమీర్ వర్మ, సాత్విక్ సాయిరాజ్, శ్రీకృష్ణప్రియ, జె.మేఘన. ముంబై రాకెట్స్: సుంగ్ జీ హున్, లీ యోంగ్ డే, నిపిత్ఫాన్, నదీనా జీబా, అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్, శ్రేయాన్‡్ష జైస్వాల్, చిరాగ్ శెట్టి, మోహితా సహదేవ్, వృశాలి. ఢిల్లీ ఏసర్స్: జాన్ జొర్గెన్సన్, సన్ వాన్ హో, జిందపాన్, ఇవాన్ సొజొనోవ్, వ్లదీమర్ ఇవనోవ్, గుత్తా జ్వాల, కె. మనీషా, అక్షయ్ దివాల్కర్, ఆకర్షి కశ్యప్, సిరిల్ వర్మ. అవధ్ వారియర్స్: సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, మార్కిస్ కిడో, గో షెమ్, బోడిన్ ఇసారా, విన్సెంట్ వాంగ్ వింగ్ కి, ఆదిత్య జోషి, రితూపర్ణ దాస్, ప్రజక్తా సావంత్, సావిత్రీ అమిత్రపాయ్. బెంగళూరు బ్లాస్టర్స్: బూన్సాక్ పొన్సానా, విక్టర్ అక్సెల్సన్, కో సుంగ్ హ్యూన్, యూ యోన్ సోంగ్, చెంగ్ గాన్ యి, సౌరభ్ వర్మ, రుత్విక శివాని, ప్రణవ్ చోప్రా, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి. చెన్నై స్మాషర్స్: పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, తనోంగ్సక్ సాన్సోమ్బూన్సక్, టామీ సుగియార్తో, క్రిస్ అడ్కాక్, మ్యాడ్స్ కోల్డింగ్, గాబ్రియెల్ అడ్కాక్, రమ్య తులసి, అరుంధతి పంతవానే, సుమీత్ రెడ్డి. ► హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు టికెట్ ధరను రూ. 500గా నిర్ణయించారు. బుక్ మై షో ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ► పీబీఎల్ తొలి సీజన్ అభిమానులను ఆకట్టుకోగా రెండో సీజన్‌కు అన్ని వైపుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పదేళ్ల కాలానికి టోర్నీ నిర్వహణ కోసం మేం ‘బాయ్’తో ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటికిప్పుడు ఆర్థికంగా లాభాలు ఆశించడం లేదు. బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరిగినట్లే ఈ లీగ్‌ను కూడా పెద్ద స్థాయికి చేర్చాలనేదే మా లక్ష్యం. సచిన్‌లాంటి వ్యక్తి లీగ్‌తో జత కలవడం మా నమ్మకాన్ని పెంచింది. ఈ సీజన్లో అద్భుతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశాం. –స్పోర్ట్స్ లైవ్ ప్రతినిధి ఎం. ప్రసాద్ ► భారత్‌కు రావడం చాలా బాగుంది. హంటర్స్ అభిమానులు నాకు మద్దతు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటున్నా. సింధు కఠిన ప్రత్యర్థి. ఆమె సొంత నగరంలో ఆమెతో తలపడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. –కరోలినా మారిన్ ► లీగ్‌లో అన్ని జట్లూ బలంగానే ఉన్నాయి. 11 పాయింట్ల ఫార్మాట్‌తో సమస్య లేదు. ప్రతీ పాయింట్ కీలకమే. – పీవీ సింధు -
కొత్త స్కోరింగ్ విధానంతో మరింత ఆదరణ: ప్రకాశ్ పదుకొనె
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కోరింగ్ పద్ధతి వల్ల ఈ ఆటకు మరింత ప్రేక్షకాదరణ లభిస్తుందని భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనె అభిఫ్రాయపడ్డారు. జనవరి 1న మొదలయ్యే పీబీఎల్–2లో 11 పాయింట్ల స్కోరింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. తక్కువ పాయింట్ల కారణంగా మ్యాచ్‌లో కచ్చితమైన ఫేవరెట్లు ఉండరని... ఎవరికైనా విజయావకాశాలు ఉంటాయని... దీంతో ఆట చూసేవారిలో ఆసక్తి అంతకంతకూ పెరుగుతుందని ఆయన అన్నారు. -
‘పీబీఎల్’ టైటిల్ గెలుస్తాం: పీవీ సింధు
-
‘పీబీఎల్’ టైటిల్ గెలుస్తాం: పీవీ సింధు
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్లో సత్తా చాటేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని, ఈసారి టైటిల్ సొంతం చేసుకుంటామని భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. పీబీఎల్‌లో సింధు చెన్నై స్మాషర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘గత సీజన్లో కూడా మెరుగైన ప్రదర్శనతో సెమీస్ చేరాం. మా జట్టులో అనేక మంది అత్యుత్తమ షట్లర్లు ఉన్నారు. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం’ అని సింధు పేర్కొంది. మరోవైపు రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ కూడా సింధుతో పోరుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ‘మా మధ్య రియోలో ఫైనల్ చాలా బాగా జరిగింది. ఈసారి కూడా అలాంటి హోరాహోరీ ఆటను ఆశిస్తున్నాం. ఆమెతో మ్యాచ్ అంటే నాకు సవాలే. ఆటలో తలపడి ఆ తర్వాత హైదరాబాద్‌లో సింధు ఆతిథ్యం కూడా స్వీకరిస్తా’ అని మాడ్రిడ్ నుంచి లైవ్ చాట్‌లో మారిన్ వ్యాఖ్యానించింది. హైదరాబాద్ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్న మారిన్, లీగ్‌లో అత్యధికంగా రూ. 61.5 లక్షలు అందుకుంటోంది. ఆరు జట్లు తలపడుతున్న పీబీఎల్ రెండో సీజన్ పోటీలు జనవరి 1 నుంచి 14 వరకు జరుగుతాయని లీగ్ నిర్వాహకులు ‘స్పోర్‌ట్సలైవ్’ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రసాద్ మంగినపూడి వెల్లడించారు. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి ఫార్మాట్‌ను కాస్త మారుస్తూ మూడు గేమ్‌లను కూడా 11 పారుుంట్లకు పరిమితం చేశారు. 11 పాయింట్ల మ్యాచ్‌ల వల్ల ఆటలో మరింత వేగం పెరుగుతుందని, ఒక్కసారి వెనుకబడితే కోలుకునే అవకాశం ఉండదని అవధ్ వారియర్స్ తరఫున బరిలోకి దిగనున్న తెలుగు ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. -
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో సచిన ఎంట్రీ
-
పీబీఎల్-2 వేలం నేడు
అందరి దృష్టి సింధు, మారిన్, సైనాలపైనే బరిలో 16 మంది ఒలింపిక్ పతక విజేతలు న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్‌కు సన్నాహాలు మొదలయయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 14 వరకు భారత్‌లోని పలు ప్రధాన నగరాల్లో జరిగే ఈ లీగ్‌కు సంబంధించి క్రీడాకారుల వేలం బుధవారం జరగనుంది. రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)... రజత పతక విజేత పీవీ సింధు (భారత్), మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ (భారత్)తోపాటు రియో ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో కాంస్యం నెగ్గిన విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) వేలంపాటలో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. అన్ని విభాగాల్లో కలిపి 16 మంది ఒలింపిక్ పతక విజేతలు వేలంపాటలో ఉన్నారు. ఒక్కో జట్టుకు ముగ్గురు ఆటగాళ్లను తమ వద్దే ఉంచుకోవడానికి వెసులుబాటు ఉంది. రెండు వారాలపాటు జరిగే ఈ లీగ్ ప్రైజ్‌మనీ రూ. 6 కోట్లు కావడం విశేషం. మొత్తం ఆరు జట్లు ఢిల్లీ ఏసర్స్, ముంబై రాకెట్స్, చెన్నై స్మాషర్స్, హైదరాబాద్ హంటర్స్, అవధ్ వారియర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ టైటిల్ కోసం తలపడతాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన పీబీఎల్ తొలి సీజన్లో ఢిల్లీ ఏసర్స్ విజేతగా నిలిచింది. పీవీ సింధు చెన్నై స్మాషర్స్ జట్టుకు, సైనా అవధ్ వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. -
కొత్త సీజన్‌కు సిద్ధం
నేటి నుంచి మలేసియా మాస్టర్స్ టోర్నీ బరిలో శ్రీకాంత్, సింధు పెనాంగ్ (మలేసియా): రెండు వారాలపాటు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో సందడి చేసిన భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, సమీర్ వర్మ కొత్త సీజన్‌కు సిద్ధమయ్యారు. బుధవారం మొదలయ్యే మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’లో పలువురు భారత ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో నందగోపాల్-శ్లోక్ రామచంద్రన్ (భారత్) జోడీ, శైలి రాణే (భారత్) ఓడిపోయారు. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో టకూమా ఉయెదా (జపాన్)తో జయరామ్; షో ససాకి (జపాన్)తో సమీర్ వర్మ; వీ ఫెంగ్ చాంగ్ (మలేసియా)తో శ్రీకాంత్; షాజాన్ షా (మలేసియా) సాయిప్రణీత్ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సబ్రీనా జాక్వెట్ (స్విట్జర్లాండ్)తో సింధు ఆడనుండగా... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మీ కువాన్ చూ-లీ మెంగ్ యిన్ (మలేసియా) జంటతో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ తలపడుతుంది. -
పీబీఎల్ చాంప్ ఢిల్లీ ఏసర్స్
ఫైనల్లో ముంబై రాకెట్స్‌పై గెలుపు న్యూఢిల్లీ: సొంతగడ్డపై మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ ఏసర్స్ జట్టు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ ఏసర్స్ 4-3 పాయింట్ల తేడాతో ముంబై రాకెట్స్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో తాము ఎంచుకున్న ‘ట్రంప్ మ్యాచ్’ల్లో ఓడిపోని ఢిల్లీ ఏసర్స్ ఫైనల్లోనూ ఇదే ఆనవాయితీని కొనసాగించి విజయాన్ని దక్కించుకుంది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో అక్షయ్ దేవాల్కర్-గాబ్రియెలా అడ్కాక్ (ఢిల్లీ) ద్వయం 6-15, 12-15తో కామిల్లా జుల్-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై) జోడీ చేతిలో ఓడిపోయింది. దాంతో ఆ జట్టు 0-1తో వెనుకబడింది. అయితే రెండో మ్యాచ్‌గా జరిగిన తొలి పురుషుల సింగిల్స్‌లో టామీ సుగియార్తో (ఢిల్లీ) 13-15, 15-9, 15-9తో హెచ్ఎస్ ప్రణయ్ (ముంబై)ను ఓడించాడు. ఫలితంగా స్కోరు 1-1తో సమమైంది. మూడో మ్యాచ్‌గా నిర్వహించిన పురుషుల డబుల్స్‌లో కూ కీట్ కీన్-తాన్ బూన్ హెంగ్ (ఢిల్లీ) జోడీ 14-15, 15-10, 15-14తో మథియాస్ బో-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై) జంటను ఓడించింది. దాంతో ఢిల్లీ 2-1 పాయింట్లతో ముందంజ వేసింది. అయితే నాలుగో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్ పోటీని ముంబై రాకెట్స్ తమ ‘ట్రంప్ మ్యాచ్’గా ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో హాన్ లీ (ముంబై) 12-15, 15-8, 15-8తో పీసీ తులసీ (ఢిల్లీ)పై గెలిచింది. ‘ట్రంప్ మ్యాచ్’ నెగ్గినందుకు ముంబై ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. దాంతో ముంబై 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక చివరి మ్యాచ్‌గా జరిగిన రెండో పురుషుల సింగిల్స్‌ను ఢిల్లీ ఏసర్స్ జట్టు ‘ట్రంప్ మ్యాచ్’గా ఎంపిక చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రాజీవ్ ఉసెఫ్ 15-11, 15-6తో గురుసాయిదత్ (ముంబై)పై గెలుపొందాడు. దాంతో ఢిల్లీ ఏసర్స్ జట్టుకు రెండు పాయింట్లు వచ్చాయి. ఫలితంగా ఓవరాల్‌గా ఢిల్లీ 4-3 పాయింట్ల తేడాతో ముంబై రాకెట్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఫైనల్‌కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్‌లు కాసేపు రాకెట్స్ పట్టారు. భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పీవీ సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలతో కలిసి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. -
ఫైనల్లో ఢిల్లీ ఏసర్స్
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ఢిల్లీ ఏసర్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడ జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఢిల్లీ 4-3 తేడాతో చెన్నై స్మాషర్స్‌ను ఓడించింది. ముందుగా జరిగిన పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ జోడి కూన్ కీట్ కీన్-టాన్ బూన్ హెంగ్ 15-10, 15-14తో చెన్నై ద్వయం ప్రణవ్ చోప్రా-క్రిస్ అడ్కాక్ను ఓడించింది. ఆ తర్వాత హోరాహోరీగా సాగిన తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 14-15, 15-10, 15-7తో సోని డి కూంకురోపై గెలుపొందాడు. తొలి గేమ్ కోల్పోయినా అజయ్ పట్టుదలగా ఆడి ప్రత్యర్థిని చిత్తు చేయడంతో ఢిల్లీ ఆధిక్యం 2-0కు పెరిగింది. అయితే మిక్స్డ్ డబుల్స్‌లో చెన్నై జంట క్రిస్ అడ్కాక్-జెబదియన్ 15-9, 15-14తో కీట్ కీన్-గాబ్రియెల్ అడ్కాక్ను చిత్తు చేసింది. అనంతరం జరిగిన తమ ట్రంప్ మ్యాచ్‌లో పీవీ సింధు 15-6, 15-7తో పీసీ తులసిని చిత్తుగా ఓడించి స్కోరు సమం చేసింది. చివరగా జరిగిన రెండో పురుషుల సింగిల్స్‌లో సుగియార్తో (ఢిల్లీ ట్రంప్ మ్యాచ్)15-11, 15-14తో లెవెర్డెజ్పై గెలుపొంది ఢిల్లీని ఫైనల్ చేర్చాడు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగే రెండో సెమీస్‌లో అవధ్ వారియర్స్‌తో ముంబై రాకెట్స్ తలపడుతుంది. -
బెంగళూరు X చెన్నై
* గెలిచిన జట్టు సెమీస్‌కు * ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో సెమీస్ బెర్త్‌ను దక్కించుకోవాలంటే బెంగళూరు టాప్ గన్స్ నేడు (బుధవారం) చెన్నై స్మాషర్స్‌తో జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. ప్రస్తుతం 8 పాయింట్లతో జాబితాలో చివరన ఉన్న బెంగళూరు నాకౌట్ దశకు చేరుకోవాలంటే ఇంకా ఐదు పాయింట్లు అవసరం. కాబట్టి చెన్నైతో అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధిస్తేనే టాప్ గన్స్ ఆశలు సజీవంగా నిలుస్తాయి. మరోవైపు చెన్నై కూడా 13 పాయింట్లతోనే ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టాప్‌గన్స్ గెలిస్తే.. చెన్నై నాకౌట్ ఆశలు గల్లంతవుతాయి. ఎందుకంటే లీగ్ దశలో బెంగళూరు చేతిలో ఓడటం చెన్నై అవకాశాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి చెన్నై కూడా అన్ని ప్రణాళికలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇప్పటికే 13 పాయింట్లతో ఉన్న ముంబై రాకెట్స్... ఢిల్లీ ఏసర్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నా ముంబై నాకౌట్‌కు చేరుకుంటుంది. అవధ్ వారియర్స్ (17), ఢిల్లీ ఏసర్స్ (15) ఇప్పటికే సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. మ.గం 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
సాయి ప్రణీత్ సంచలనం
♦ హైదరాబాద్‌పై లక్నో విజయం ♦ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో సొంతగడ్డపై మ్యాచ్‌లను హైదరాబాద్ హంటర్స్ ఓటమితో ప్రారంభించింది. శనివారం ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన పోరులో అవధ్ వారియర్స్ 4-3 తేడాతో హైదరాబాద్ హంటర్స్పై విజయం సాధించింది. గోపీచంద్ అకాడమీ సహచరుల మధ్య జరిగిన మ్యాచ్‌లో సాయి ప్రణీత్... పారుపల్లి కశ్యప్‌ను చిత్తు చేయడం విశేషం. గాయంతో మరోసారి సైనా నెహ్వాల్ మ్యాచ్ ఆడకుండా తప్పుకుంది. కశ్యప్‌కు నిరాశ: సైనా గైర్హాజరీలో మహిళల సింగిల్స్ మ్యాచ్ ఆడిన జి.వృషాలి 15-7, 15-11 స్కోరుతో కె.సుపనిదను చిత్తు చేసి అవధ్‌కు 1-0 ఆధిక్యం అందించింది. పురుషుల డబుల్స్‌లో వారియర్స్ జోడి బోడిన్ ఇసారా-కై యున్ 15-10, 15-12తో హంటర్స్ జంట కార్స్టెన్ మోగెన్సన్-మార్కిస్ కిడోను ఓడించింది. ఇది ట్రంప్ మ్యాచ్ కావడంతో ఆ జట్టు ఖాతాలో అదనపు పాయింట్ చేరింది. దీంతో వారియర్స్ 3-0 ఆధిక్యంలోకి వచ్చారు. తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో సాయిప్రణీత్ 6-15, 15-8, 15-5తో కశ్యప్‌ను ఓడించాడు. 39 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ఆరంభంలో కశ్యప్ ఆధిక్యం కనబర్చాడు. అయితే రెండో గేమ్‌లో అనూహ్యంగా పుంజుకున్న సాయి కోలుకున్నాడు. కశ్యప్ డ్రాప్ షాట్లు వరుసగా విఫలం కావడం సాయికి కలిసొచ్చి సమంగా నిలిచాడు. మూడో గేమ్‌లో కూడా ప్రణీత్ జోరు కొనసాగింది. అద్భుతమైన స్మాష్‌లతో దూకుడు ప్రదర్శించిన అతను కశ్యప్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరకు కూడా మరో చక్కటి స్మాష్‌తో అవధ్ జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్ ముగిసేసరికి 4-0తో లక్నో స్పష్టమైన ఆధిక్యంతో మ్యాచ్ సొంతం చేసుకుంది. రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ లీ చోంగ్ వీ 15-8, 15-9తో తనోంగ్సక్పై గెలుపొందాడు. టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన లీ చోంగ్ వీ ఈసారి స్థాయికి తగ్గట్లుగా ఆడాడు. ఇది ట్రంప్ మ్యాచ్ కావడంతో హైదరాబాద్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. ఇక చివరిగా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో హంటర్స్ ద్వయం జ్వాల గుత్తా-మార్కిస్ కిడో 12-15, 15-14, 15-10తో బోడిన్ ఇసారా-క్రిస్టియానాను ఓడించి లక్నో ఆధిక్యాన్ని 4-3కు తగ్గించింది. -
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
-
వారెవ్వా... వారియర్స్
♦ సైనా జట్టుకు రెండో విజయం ♦ బెంగళూరుకు మూడో ఓటమి ♦ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లక్నో: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి... వెనుకబడిన దశలో అవధ్ వారియర్స్ జట్టు అద్భుత ఆటతీరుతో పుంజుకుంది. వరుసగా రెండు ‘ట్రంప్ మ్యాచ్’ల్లో నెగ్గి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో రెండో విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. బెంగళూరు టాప్‌గన్స్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ (లక్నో) జట్టు 4-1తో గెలుపొందింది. తొలి మ్యాచ్ మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-ఖిమ్ వా లిమ్ ద్వయం 15-13, 11-15, 15-13తో బోదిన్ ఇసారా-మనీషా జంట (అవధ్ వారియర్స్)ను ఓడించి బెంగళూరుకు 1-0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 46వ ర్యాంకర్ సమీర్ వర్మ 15-13, 15-14తో ప్రపంచ 34వ ర్యాంకర్ భమిడిపాటి సాయిప్రణీత్ (అవధ్ వారియర్స్)ను బోల్తా కొట్టించడంతో బెంగళూరు 2-0తో ముందంజ వేసింది. అవధ్ వారియర్స్‌కు విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో తనోంగ్సక్ సెన్సోమ్బూన్సుక్ అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. బెంగళూరు జట్టు‘ట్రంప్ మ్యాచ్’గా ఎంచుకున్న మ్యాచ్‌లో తనోంగ్సక్ (వారియర్స్) 15-11, 15-10తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ (బెంగళూరు)ను ఓడించాడు. ఫలితంగా వారియర్స్ ఖాతాలో ఒక పాయింట్ చేరగా... బెంగళూరు జట్టు ఒక పాయింట్‌ను చేజార్చుకుంది. దాంతో స్కోరు 1-1తో సమమైంది. ‘ట్రంప్ మ్యాచ్’గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 15-10, 13-15, 15-8తో సూ దీ (బెంగళూరు)పై గెలుపొందడంతో అవధ్ వారియర్స్ ఖాతాలో రెండు పాయింట్లు చేరడంతోపాటు 3-1తో విజయం ఖాయమైపోయింది. ఐదో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో బోదిన్ ఇసారా-కాయ్ యున్ (అవధ్ వారియర్స్) జంట 15-12, 15-6తో హూన్ థిన్ హౌ-ఖిమ్ వా లిమ్ (బెంగళూరు) జోడీని ఓడించడంతో వారియర్స్ ఓవరాల్‌గా 4-1తో విజయాన్ని దక్కించుకుంది. గురువారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ ఏసర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ జట్టు తలపడుతుంది. -
వారియర్స్ బోణీ
► ఢిల్లీ ఏసర్స్‌పై 4-3తో గెలుపు ► సైనా, సాయిప్రణీత్ విజయం ► ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లక్నో: తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన అవధ్ వారియర్స్ (లక్నో) జట్టు... స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ రాకతో రెండో మ్యాచ్‌లోనే పుంజుకుంది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ జట్టు 4-3 పాయింట్ల తేడాతో ఢిల్లీ ఏసర్స్ జట్టుపై విజయం సాధించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున ముంబై రాకెట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న సైనా నెహ్వాల్ తమ జట్టు సొంతగడ్డపై జరిగిన పోటీలో మాత్రం బరిలోకి దిగింది. ఈ పోటీలో ‘ట్రంప్ మ్యాచ్’ రెండు జట్లకు కలిసొచ్చింది. పురుషుల తొలి సింగిల్స్‌లో తనోంగ్సక్ సేన్‌సోమ్‌బున్‌సుక్ (అవధ్ వారియర్స్) 13-15, 11-15తో టామీ సుగియార్తో (ఢిల్లీ) చేతిలో ఓడిపోయాడు. దాంతో వారియర్స్ జట్టు 0-1తో వెనుకబడింది. రెండో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 15-9, 15-10తో పీసీ తులసీ (ఢిల్లీ)పై గెలిచింది. వారియర్స్ జట్టు ఈ మ్యాచ్‌ను ‘ట్రంప్ మ్యాచ్’గా పేర్కొంది. దాంతో సైనా నెగ్గడంతో వారియర్స్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో బోదిన్ ఇసారా-కాయ్ యున్ (వారియర్స్) ద్వయం 15-12, 15-14తో కీ కీట్ కీన్-తాన్ బూన్ హెయోంగ్ (ఢిల్లీ) జోడీపై గెలిచింది. దాంతో వారియర్స్ జట్టు ఆధిక్యం 3-1కి పెరిగింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ 15-12, 15-9తో ప్రపంచ 17వ ర్యాంకర్ రాజీవ్ ఉసెఫ్ (ఢిల్లీ ఏసర్స్)ను బోల్తా కొట్టించాడు. దాంతో వారియర్స్ జట్టు 4-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేసుకుంది. ఐదో మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో హెంద్రా గుణవాన్-మనీషా (వారియర్స్) జోడీ 14-15, 15-13, 5-15తో అక్షయ్ దివాల్కర్-గాబ్రియెల్లా అడ్కాక్ (ఢిల్లీ ఏసర్స్) జంట చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ను ఢిల్లీ ఏసర్స్ ‘ట్రంప్ మ్యాచ్’గా నిర్ణయించడంతో ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు చేరినా ఫలితం లేకపోయింది. తుదకు వారియర్స్ జట్టు 4-3తో విజయం దక్కించుకుంది. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో చెన్నై స్మాషర్స్‌తో ఢిల్లీ ఏసర్స్; ముంబై రాకెట్స్‌తో బెంగళూరు టాప్‌గన్స్ తలపడతాయి. -
ముంబై మెరిసె...
* తొలి మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌పై గెలుపు * సింగిల్స్‌లో గురుసాయిదత్, రుత్విక విజయం * గాయంతో బరిలోకి దిగని సైనా నెహ్వాల్ * ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ ముంబై: సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లోనే ముంబై రాకెట్స్ మెరిసింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన అవధ్ వారియర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో శుభారంభం చేసింది. స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ముంబై రాకెట్స్ జట్టు 2-1 పాయింట్ల తేడాతో అవధ్ వారియర్స్‌ను ఓడించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన ముంబై రాకెట్స్ విజయాన్ని ఖరారు చేసుకోగా... నామమాత్రమైన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో వారియర్స్ నెగ్గినా ఫలితం లేకపోయింది. కొత్త నిబంధన ‘ట్రంప్ మ్యాచ్’ రెండు జట్లకు కలసి రాలేదు. అవధ్ వారియర్స్ తొలుత పురుషుల డబుల్స్ మ్యాచ్‌ను ‘ట్రంప్ మ్యాచ్’గా ఎంచుకొని ఓడిపోగా... ముంబై రాకెట్స్ రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ను ‘ట్రంప్ మ్యాచ్’గా పేర్కొని ఓటమి పాలైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు టాప్‌గన్స్‌తో హైదరాబాద్ హంటర్స్; ముంబై రాకెట్స్‌తో చెన్నై స్మాషర్స్ తలపడతాయి. ఇద్దరు తెలుగు తేజాల మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ప్రపంచ 47వ ర్యాంకర్ గురుసాయిదత్ (ముంబై) 14-15, 15-10, 15-8తో ప్రపంచ 34వ ర్యాంకర్ సాయిప్రణీత్ (అవధ్ వారియర్స్)ను ఓడించాడు. పురుషుల డబుల్స్ పోటీలో మథియాస్ బో-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై రాకెట్స్) ద్వయం 15-11, 15-11తో కాయ్ యున్-హెంద్రా గుణవాన్ (అవధ్ వారియర్స్) జంటపై గెలిచింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో తెలుగు అమ్మాయి గద్దె రుత్విక శివాని (ముంబై) 15-13, 15-10తో మరో తెలుగు అమ్మాయి గుమ్మడి వృశాలి(వారియర్స్)ని ఓడించడంతో ముంబై విజయం ఖరారైంది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో వృశాలి బదులుగా సైనా నెహ్వాల్ ఆడాలి. అయితే గాయం కారణంగా సైనా తొలి లీగ్ మ్యాచ్‌కు దూరం కావడంతో ఆమె స్థానంలో వృశాలి బరిలోకి దిగింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మరో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్ తనోంగ్సక్ సెన్సోమ్బున్సుక్ (అవధ్ వారియర్స్) 15-12, 14-15, 15-14తో ప్రపంచ 20వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ (ముంబై రాకెట్స్)పై సంచలన విజయం సాధించడంతో అవధ్ వారియర్స్ ఖాతాలో తొలి విజయం చేరింది. చివరిదైన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో బోదిన్ ఇసారా-క్రిస్టినా (వారియర్స్) జంట 15-9, 14-15, 15-14తో కామిల్లా జుల్-ఇవనోవ్ (ముంబై) జోడీని ఓడించింది. వైభవంగా ఆరంభం కొత్త రూపుతో.. సరికొత్త ఆటతీరుతో అభిమానులను అలరించాలని చూస్తున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) శనివారం వైభవంగా ఆరంభమైంది. తారల నృత్యాలతో పాటు బాలీవుడ్ మధుర గీతాలతో ప్రారంభోత్సవ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రపంచ టాప్ స్టార్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా శ్రీలంక బ్యూటీ, హిందీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పలు హిట్ గీతాలకు స్టెప్పులేసి హుషారు తెచ్చింది. అనంతరం సంగీత ద్వయం సలీం, సులేమాన్ చక్‌దే ఇండియా, బాండ్ బాజా బరాత్ తదితర సినిమాల్లోని పాటలను మరోసారి ప్రేక్షకులకు వినిపించారు. వీరే స్వరపర్చిన పీబీఎల్ అధికారిక గీతం ‘హల్లా మచాదే’ను కూడా ఆలపించి అందరిలో ఉత్తేజాన్ని నింపారు. అయితే ఈ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్ కుమార్ తొలి రోజు హాజరుకాలేదు. రెండో రోజు ఆదివారం రానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ‘పీబీఎల్‌కు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఫ్రాం చైజీలకు, యజమానులకు, మద్దతుదారులకు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరం కలిసి లీగ్‌ను సక్సెస్ చేయాలి’ అని పీబీఎల్ చైర్మన్ అఖిలేశ్ దాస్‌గుప్తా కోరారు. -
షటిల్ సమరం
నేటి నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లీ చోంగ్ వీ విన్యాసాలు... సైనా నెహ్వాల్ స్మాష్‌లు... సింధు డ్రాప్ షాట్స్... మళ్లీ వచ్చేస్తున్నాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడాకారులంతా భారత అభిమానులను తమ బ్యాడ్మింటన్ విన్యాసాలతో అలరించబోతున్నారు. సైనాతో సింధు, శ్రీకాంత్‌తో లీ చోంగ్ వీ తలపడే అరుదైన సన్నివేశాలను భారత ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. 15 రోజుల పాటు క్రీడాభిమానులను అలరించేందుకు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ వచ్చేసింది. కొత్త సంవత్సరంలో భారత్‌లో క్రీడలు బ్యాడ్మింటన్ లీగ్‌తో ప్రారంభం కాబోతున్నాయి. భారీ అంచనాల మధ్య, అంతర్జాతీయ స్టార్ క్రీడాకారులు బరిలోకి దిగుతున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నేడు ముంబైలో ప్రారంభం కానుంది. తొలి లీగ్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అవధ్ వారియర్స్... ముంబై రాకెట్స్‌తో తలపడుతుంది. జనవరి 17న ఢిల్లీలో జరిగే ఫైనల్‌తో ముగిసే ఈ టోర్నీలో లీగ్ దశలో 15 టీమ్ మ్యాచ్‌లు జరుగుతాయి. హైదరాబాద్‌లో 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. అలాగే 15న రెండో సెమీఫైనల్ కూడా భాగ్యనగరంలోనే నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. మొత్తం ఆరు నగరాల నుంచి ఆరు జట్లు లీగ్‌లో బరిలోకి దిగుతున్నాయి. - సాక్షి క్రీడావిభాగం జాక్వెలిన్ డ్యాన్స్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నృత్య ప్రదర్శన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సలీమ్-సులేమాన్ ద్వయం కూడా తమ పాటలతో హోరెత్తించనున్నారు. పీబీఎల్ పాటను కూడా వీరే రూపొందించారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభోత్సవం మొదలవుతుంది. తొలి సీజన్ 2013 ఆగస్టులో జరిగింది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) పేరుతో దీనిని నిర్వహించారు. ఆ సీజన్లో సైనా నెహ్వాల్ ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ హాట్‌షాట్స్ విజేతగా నిలిచింది. అయితే నిర్వాహకులతో గొడవల కారణంగా ఈ లీగ్ తర్వాత రెండేళ్లు జరగలేదు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తిరిగి అనేక రకాల ప్రయత్నాలు, ప్రతిపాదనలు చేసి ఎట్టకేలకు దీనిని తిరిగి తెచ్చింది. అయితే ఐబీఎల్ అనే పేరు తమదేనంటూ పాత నిర్వాహకులు కోర్టుకు వెళ్లడంతో... ఈ సీజన్ నుంచి పీబీఎల్ పేరుతో నిర్వహించనున్నారు. హైదరాబాద్ హంటర్స్ యజమాని: ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆటగాళ్లు: లీ చోంగ్ వీ, కశ్యప్, సిరిల్ వర్మ (పురుషుల సింగిల్స్); సుపనిద (మహిళల సింగిల్స్); నందగోపాల్, సాయిసాత్విక్, మార్కిస్ కిడో, కార్స్టెన్, జ్వాల, మేఘన (డబుల్స్). కోచ్: రాజేంద్ర వేలానికి ముందే రూ.65 లక్షలు చెల్లించేందుకు సిద్ధమై డ్రాలో లీ చోంగ్ వీని దక్కించుకున్న హైదరాబాద్... డబుల్స్‌లోనూ బలంగానే ఉంది. మార్కిస్ కిడో, జ్వాల మిక్స్డ్ డబుల్స్‌లో ఆడితే... కిడో, కార్స్టెన్ లేదా నందగోపాల్‌తో డబుల్స్ ఆడతాడు. మహిళల సింగిల్స్‌లో సుపనిద... సైనా, సింధులను మినహా అన్ని మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థులను ఓడించొచ్చు. మొత్తం మీద జట్టు సమతూకంతోనే ఉంది. ఢిల్లీ ఏసర్స్ యజమాని: ఇన్ఫినిట్ కంప్యూటర్ సొల్యూషన్స్ ఆటగాళ్లు: అజయ్ జయరామ్, రాజీవ్ ఉసెఫ్, టామీ సుగియార్తో (పురుషుల సింగిల్స్); తులసి, శిఖా గౌతమ్ (మహిళల సింగిల్స్); అక్షయ్ దివాల్కర్, కూ కిట్ కీన్, టాన్ బూన్, అపర్ణా బాలన్, అడ్కాక్ (డబుల్స్). కోచ్: మధుమితా బిస్త్ అజయ్ జయరామ్, రాజీవ్ ఉసెఫ్ ఇద్దరూ గత ఏడాది నిలకడగా ఆడటం వల్ల పురుషుల సింగిల్స్‌పై ఈ జట్టు ఆశలు పెంచుకుంది. ఇండోనేసియా క్రీడాకారుడు సుగియార్తో కూడా అందుబాటులో ఉన్నాడు. మహిళల సింగిల్స్‌లో తులసి, శిఖా ఏమేరకు పెద్ద క్రీడాకారిణులను నిలువరిస్తారో చూడాలి. డబుల్స్‌లో మలేసియా జోడి కూ కిట్, టాన్బూన్ చెప్పుకోదగ్గ ఆటగాళ్లు. ఇంగ్లండ్‌కు చెందిన అడ్కాక్ మిక్స్డ్ డబుల్స్‌లో ప్రమాదకర క్రీడాకారిణి. ముంబై రాకెట్స్ యజమాని: దేవయాని లీజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆటగాళ్లు: ప్రణయ్, గురుసాయిదత్ (పురుషుల సింగిల్స్), రుత్విక శివాని, హన్ లీ, లియు డి (మహిళల సింగిల్స్), మను అత్రి, చాయుత్, ఇవనోవ్, మథియాస్ బో, కమిల్లా (డబుల్స్). కోచ్: రామ్ (కెనడా) పురుషుల సింగిల్స్‌లో భారత టాప్ క్రీడాకారులు ప్రణయ్, గురుసాయిదత్ ఇద్దరే ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో చైనా క్రీడాకారిణులు ఇద్దరు అందుబాటులో ఉన్నందున తెలుగమ్మాయి రుత్వికకు పెద్దగా అవకాశం రాకపోవచ్చు. డబుల్స్‌లో ఇవనోవ్, మథియాస్ బో ఈ జట్టుకు బలం. చెన్నై స్మాషర్స్ యజమాని: ద వోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆటగాళ్లు: సోని కుంకురో, సాంటోసో, లెవర్డెజ్ (పురుషుల సింగిల్స్), సింధు, కృష్ణ ప్రియ (మహిళల సింగిల్స్), ప్రణవ్ చోప్రా, క్రిస్ అడ్కాక్, టోబీ, జెబాదియా, సిక్కిరెడ్డి (డబుల్స్). కోచ్: గంగుల ప్రసాద్ పురుషుల సింగిల్స్‌లో ఇండోనేసియా స్టార్స్ సోని కుంకురో, సాంటోసోలతో పాటు ఫ్రాన్స్ ఆటగాడు లెవర్డెజ్ అందుబాటులో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో సింధు మీద ఈ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. పురుషుల సింగిల్స్‌లో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఆడుతున్నందున... డబుల్స్‌లో ప్రణవ్ చోప్రాను కచ్చితంగా ఆడించాల్సి రావచ్చు. సిక్కిరెడ్డి కూడా ఈ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తోంది. బెంగళూరు టాప్‌గన్స్ యజమాని: బ్రాండ్‌ప్రిక్స్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆటగాళ్లు: శ్రీకాంత్, సమీర్ వర్మ, ఆనంద్పవార్ (పురుషుల సింగిల్స్), సువో ది (మహిళల సింగిల్స్), సుమీత్ రెడ్డి, కిమ్ వా లిమ్, హూన్ తీన్, నెల్సీ, బ్లాయెర్, అశ్విని పొన్నప్ప (డబుల్స్). కోచ్: అరవింద్ భట్ బెంగళూరు జట్టుకు పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ రూపంలో ఒక విజయం సులభంగా లభించొచ్చు. అయితే రెండో సింగిల్స్‌లో సమీర్ వర్మ, ఆనంద్ పవార్లలో ఎవరు ఆడినా విజయం సాధించగలరా అనేది అనుమానమే. మహిళల సింగిల్స్‌లో ఇండోనేసియా క్రీడాకారిణి సువో దిని కూడా తక్కువ అంచనా వేయలేం. మలేసియా పురుషుల డబుల్స్ క్రీడాకారులు కిమ్ వా, హూన్తీన్ కూడా ప్రమాదరకమైన జోడి. అశ్విని పొన్నప్ప మిక్స్డ్ డబుల్స్‌లో ఎవరితో ఆడుతుందో స్పష్టత లేదు. అవధ్ వారియర్స్ (లక్నో) యజమాని: సహారా ఆటగాళ్లు: సాయి ప్రణీత్, సౌరభ్ వర్మ, తనోంగ్సక్ (పురుషుల సింగిల్స్), సైనా నెహ్వాల్, వృశాలి (మహిళల సింగిల్స్), కెయ్ యున్, హెండ్రా గుణవన్, బొడిన్ ఇసార, మనీషా, క్రిస్టినా (డబుల్స్). కోచ్: అనూప్ శ్రీధర్ లీగ్ ఆరంభానికి ముందే సైనా నెహ్వాల్‌ను జట్టులోకి తీసుకోవడం ద్వారా ఈ జట్టు అందరి దృష్టినీ ఆకర్షించింది. 65 లక్షల రూపాయలు భారత స్టార్ క్రీడాకారిణికి ఇస్తున్న ఈ జట్టు... పురుషుల సింగిల్స్‌లో ప్రధానంగా థాయ్‌లాండ్ క్రీడాకారుడు తనోంగ్సోక్పై ఆధారపడింది. మరో సింగిల్స్‌లో సాయిప్రణీత్, సౌరభ్ వర్మలలో ఒకరు ఆడొచ్చు. డబుల్స్ విభాగంలో మిగిలిన జట్లతో పోలిస్తే బలంగా లేకపోవడం ఈ జట్టుకు లోటు. ప్రైజ్ మనీ: విజేతకు రూ.65 లక్షలు ట్రంప్ మ్యాచ్ ప్రతి ప్రత్యర్థితోనూ పోరుకు ముందు తమ ఐదు మ్యాచ్‌లలో ఒక మ్యాచ్‌ను ఆ జట్టు ట్రంప్ మ్యాచ్‌గా ప్రకటించాలి. సాధారణంగా మ్యాచ్ గెలిస్తే ఒక పాయింట్ వస్తుంది. కానీ ట్రంప్ మ్యాచ్ గెలిస్తే రెండు పాయింట్లు సాధించవచ్చు. ఇదే సమయంలో ట్రంప్ మ్యాచ్‌లో ఓడిపోతే ఒక మైనస్ పాయింట్ వస్తుంది. అయితే ట్రంప్ మ్యాచ్ ప్రతిసారీ ఒక్క ప్లేయరే ఆడటానికి లేదు. అంటే ఉదాహరణకు లక్నో తరఫున అన్ని సైనా మ్యాచ్‌లనే ట్రంప్ మ్యాచ్‌లుగా ఎంచుకునే అవకాశం లేదు. ఒక్క ప్లేయర్ లీగ్ దశలో ఐదు మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే ట్రంప్ మ్యాచ్‌లు ఆడాలి. నాకౌట్ దశలో ఒక మ్యాచ్‌లోనే ఈ అవకాశముంటుంది. ఒక జట్టు ట్రంప్ మ్యాచ్‌గా ఒక మ్యాచ్‌ను ఎంచుకుంటే... ప్రత్యర్థి జట్టుకు అది మామూలు మ్యాచ్ మాత్రమే. అంటే ప్రత్యర్థి గెలిస్తే ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. ఒకవేళ రెండు జట్లు ఒకే మ్యాచ్‌ను ట్రంప్ మ్యాచ్‌గా ఎం చుకుంటే మాత్రం గెలిచిన వాళ్లకు రెండు పాయింట్లు, ఓడినవాళ్లకు మైనస్ పాయింట్ వస్తాయి. టోర్నీ నుంచి ఒక్క ఆటగాడు కూడా వైదొలగలేదు. అందరూ వస్తున్నారు. ప్రారంభోత్సవంతో పాటు ముంబై లెగ్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భారత బ్యాడ్మింటన్‌కు మేలు చేసే పీబీఎల్... ట్రంప్ మ్యాచ్ నిబంధన కచ్చితంగా ప్రేక్షకులకు ఆసక్తి పంచుతుందని భావిస్తున్నాం. దేశంలో బ్యాడ్మింటన్‌ను మరింత విస్తరించడానికి పీబీఎల్ ఉపయోగపడుతుంది. - ‘సాక్షి’తో పున్నయ్య చౌదరి (పీబీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ డెరైక్టర్) ఫార్మాట్ * ఒక్కో జట్టు ఒక్కో ప్రత్యర్థితో ఒక్కసారి ఆడుతుంది. ఒక్క పోరులో ఐదు మ్యాచ్‌లు ఉంటాయి. ఇందులో పురుషుల సింగిల్స్ రెండు, మహిళల సింగిల్స్ ఒకటి, పురుషుల డబుల్స్ ఒకటి, మిక్స్డ్ డబుల్స్ ఒక మ్యాచ్ ఉంటుంది. * ప్రతి మ్యాచ్ కూడా బెస్ట్ ఆఫ్ త్రీ గేమ్స్ పద్ధతిలో జరుగుతుంది. ఒక్కో గేమ్‌లో ముందుగా ఎవరు 15 పాయింట్లు సాధిస్తే వాళ్లు గెలిచినట్లు. రెండు పాయింట్లు తేడా ఉండాలనే నిబంధన లేదు. * ఒక్కో మ్యాచ్ గెలిస్తే ఒక్క పాయింట్. అయితే ‘ట్రంప్’ మ్యాచ్‌ల వల్ల ఒక్క ప్రతర్థిపై ఒకే జట్టు ఐదు మ్యాచ్‌ల ద్వారా ఆరు పాయింట్లు సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. * పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌కు చేరతాయి. ఒకటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌లో తలపడవు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లను ‘డ్రా’ తీయడం ద్వారా తొలి రెండు స్థానాల జట్లకు ప్రత్యర్థులను నిర్ణయిస్తారు. * ఒక వేళ లీగ్ దశలో పాయింట్ల పట్టికలో రెండు జట్లు సమంగా నిలిస్తే... ఆ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు ముందుకు వెళుతుంది. * ప్రతి జట్టూ తమ ఐదు మ్యాచ్‌లలో కనీసం రెండింటిలో భారత క్రీడాకారులు ఆడేలా చూసుకోవాలి. అలాగే ఏ ప్లేయర్ కూడా రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడకూడదు. పురుషుల సింగిల్స్‌లో రెండు మ్యాచ్‌లు వేర్వేరు క్రీడాకారులు ఆడాలి. -
ట్రంప్ మ్యాచ్‌తో ఆసక్తి పీబీఎల్‌పై గోపీచంద్
ముంబై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్తగా ప్రవేశపెట్టనున్న ట్రంప్ మ్యాచ్‌ల వల్ల మరింత ఉత్సాహం వస్తుందని జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ‘లీగ్‌కు ఇదో అదనపు ఆకర్షణ. ఈ మ్యాచ్‌ల వల్ల ఉత్సాహం పొంగిపొర్లుతుంది. ప్రతి జట్టు ఐదు మ్యాచ్‌ల్లో ఒకదాన్ని ట్రంప్ మ్యాచ్‌గా ప్రతిపాదిస్తుంది. కేవలం అర్ధగంట ముందు దీనికి సంబంధించిన లైనప్‌ను ప్రకటిస్తారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారికి అదనపు పాయింట్ లభిస్తే, ఓడిన వారికి ఓ పాయింట్ కోత పడుతుంది. రెండు జట్లు ఒకే మ్యాచ్‌ను ట్రంప్‌గా ప్రకటించొచ్చు. 3-0 ఆధిక్యం ఉన్నా చివరి రెండు మ్యాచ్‌లు కచ్చితంగా ఆడాల్సిందే. కాబట్టి అభిమానుల ఆసక్తిని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని గోపీచంద్ పేర్కొన్నారు. -
టైటిల్ గెలుచుకుంటాం...
► ‘హంటర్స్’ ఆటగాడు కశ్యప్ ధీమా ► ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో విజేతగా నిలుస్తామని ‘హైదరాబాద్ హంటర్స్’ జట్టు ఆటగాడు పారుపల్లి కశ్యప్ విశ్వాసం వ్యక్తం చేశాడు. లీ చోంగ్ వీలాంటి దిగ్గజం సభ్యుడిగా ఉన్న తమ జట్టు చాలా పటిష్టంగా ఉందని...సొంతగడ్డపై టైటిల్ సాధించాలని కోరుకుంటున్నట్లు అతను చెప్పాడు. గురువారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో హంటర్స్ జట్టు సభ్యులను టీమ్ యజమాని, ఎజైల్ గ్రూప్ సీఎండీ డాక్టర్ వీఆర్కే రావు పరిచయం చేశారు. రెండు దశాబ్దాలుగా సేవల రంగంలో తాము ఎంతో గుర్తింపు తెచ్చుకున్నామని, ఇప్పుడు బ్యాడ్మింటన్‌తో జత కూడటం గర్వంగా ఉందని రావు చెప్పారు. హైదరాబాద్ హంటర్స్ టీమ్‌లో గుత్తా జ్వాల, సిరిల్ వర్మ, నందగోపాల్, సాత్విక్ సాయిరాజ్, మేఘన, ఉత్తేజితా రావు ఉన్నారు. -
తొలి పోరులో అవధ్, ముంబై ఢీ
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ప్రారం భ మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అవధ్ వారియర్స్, ముంబై రాకెట్స్‌ను ఎదుర్కోనుంది. జనవరి 2 నుంచి 17 వరకు పీబీఎల్ జరుగుతుంది. మరోవైపు కొత్తగా ప్రవేశపెట్టిన ‘ట్రంప్ మ్యాచ్’ను ఈ రెండు జట్లు ఎలా ఉపయోగించుకుంటాయనేది ఇతర జట్లు ఆసక్తిగా పరిశీలించనున్నాయి. ఇటీవల సంభవించిన వరదల కారణంగా ఏర్పాట్లకు సరైన సమయం లేకపోవడంతో చెన్నై స్మాషర్స్ తమ సొంత మ్యాచ్‌లను లక్నో, హైదరాబాద్‌లలో ఆడుతుంది. జనవరి 9, 10, 11 తేదీలలో హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. 15 లీగ్ మ్యాచ్‌లు జరిగే ఈ టోర్నమెంట్లో ఫైనల్‌కు ఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది. -
పీబీఎల్‌లో ట్రంప్ మ్యాచ్ నిబంధన
న్యూఢిల్లీ: వచ్చే నెల 2 నుంచి ప్రారంభం కానున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్తగా ‘ట్రంప్ మ్యాచ్’ నిబంధనను అమలు చేయనున్నారు. ఆట స్వరూపాన్ని మార్చే ఈ నిబంధన కారణంగా లీగ్‌లో పోటీతత్వం పెరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఒక రోజులో ఇరు జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల్లో ఏదైనా ఒకదాన్ని ట్రంప్ మ్యాచ్‌గా పేర్కొనే అవకాశం జట్లకు ఉంటుంది. ఇలా పేర్కొన్న మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు బోనస్ పాయింట్‌ను ఇస్తారు. అయితే ఓడితే మాత్రం నెగటివ్ పాయింట్ (-1) పొందాల్సి ఉంటుంది. పోటీలకు గంట ముందు ఇరు జట్లు తమ ట్రంప్ మ్యాచ్ ను పేర్కొన డంతో పాటు అందులో ఆడే ఆటగాళ్ల పేర్లను నిర్వాహకులకు చెప్పాల్సి ఉంటుంది. రెండు జట్లు కూడా ఒకే మ్యాచ్‌ను ట్రంప్ మ్యాచ్‌గా పేర్కొనవచ్చు. రెండు పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. -
హైదరాబాద్‌కు లీ చోంగ్ వీ... లక్నోకు సైనా
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భారత స్టార్ సైనా నెహ్వాల్... మలేసియా మేటి క్రీడాకారుడు లీ చోంగ్ వీలకు అత్యధిక మొత్తం దక్కింది. లక్నోకు చెందిన అవధ్ వారియర్స్ సైనాను ... హైదరాబాద్ హంటర్స్ లీ చోంగ్ వీను చెరో లక్ష డాలర్లకు (రూ. 66 లక్షల 69 వేలు) సొంతం చేసుకున్నాయి. భారత్‌కే చెందిన మరో స్టార్ క్రీడాకారిణి పీవీ సింధును 95 వేల డాలర్లకు (రూ. 63 లక్షల 35 వేలు) చెన్నై స్మాషర్స్... శ్రీకాంత్‌ను 80 వేల డాలర్లకు (రూ. 53 లక్షల 35 వేలు) బెంగళూరు టాప్‌గన్స్ జట్లు తీసుకున్నాయి. సైనా నెహ్వాల్, లీ చోంగ్ వీలను కొనుగోలు చేసేందుకు అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి. దాంతో ఆదివారం రాత్రే లాటరీని నిర్వహించారు. లాటరీలో అవధ్ వారియర్స్‌కు సైనా... హైదరాబాద్ హంటర్స్‌కు లీ చోంగ్ వీ దక్కారు. సోమవారం మిగతా ఆటగాళ్లకు వేలం నిర్వహించారు. పీబీఎల్ జనవరి 2న ముంబైలో మొదలై 17న న్యూఢిల్లీలో ముగుస్తుంది. మిగతా ఆటగాళ్ల వివరాలు: పారుపల్లి కశ్యప్ (హైదరాబాద్ హంటర్స్-35 వేల డాలర్లు), సుమీత్ రెడ్డి (బెంగళూరు టాప్‌గన్స్-25 వేల డాలర్లు), మనూ అత్రి (ముంబై రాకెట్స్-25 వేల డాలర్లు), గుత్తా జ్వాల (హైదరాబాద్ హంటర్స్-30 వేల డాలర్లు), అశ్విని పొన్నప్ప (బెంగళూరు టాప్‌గన్స్-30 వేల డాలర్లు), హెచ్ఎస్ ప్రణయ్ (ముంబై రాకెట్స్-47 వేల డాలర్లు), వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా-ముంబై రాకెట్స్, 42 వేల డాలర్లు), రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్-ఢిల్లీ ఏసర్స్, 36 వేల డాలర్లు), టామీ సుగియార్తో (ఇండోనేసియా-ఢిల్లీ ఏసర్స్, 74 వేల డాలర్లు). -
నేడు పీబీఎల్ వేలం
- అందుబాటులో సైనాతో సహా 50 మంది షట్లర్లు - నాలుగు ఫ్రాంచైజీల పేర్లను ప్రకటించిన ‘బాయ్’ న్యూఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) వేలం నేడు (సోమవారం) జరగనుంది. స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, శ్రీకాంత్‌లతో సహా మొత్తం 50 మంది క్రీడాకారులు ఈ వేలానికి అందుబాటులో ఉండనున్నారు. అలాగే లక్నో, ఢిల్లీలతో పాటు మరో నాలుగు ఫ్రాంచైజీలను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. హైదరాబాద్ ఫ్రాంచైజీని అజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్; ముంబైని దేవయాని లీజర్స్ ప్రైవేట్ లిమిటెడ్; చెన్నైని ది వోనెస్ ప్రైవేట్ లిమిటెడ్; బెంగళూరును బ్రాండ్‌ప్రిక్స్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లు దక్కించుకున్నాయి. ఇప్పటికే టోర్నీలో ఉన్న అవధ్ వారియర్స్ (లక్నో); ఢిల్లీ ఏసర్స్ (ఢిల్లీ)లతో పాటు ఈ ఫ్రాంచైజీల తరఫున వరుసగా హైదరాబాద్ హంటర్స్; ముంబై రాకెట్స్; చెన్నై స్మాషర్స్; బెంగళూరు టాప్‌గన్స్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 2న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంతో ఈ టోర్నీకి తెరలేవనుంది. 17న ఫైనల్‌తో ముగస్తుంది. పీబీఎల్‌కు ఎంపికైన అన్ని ఫ్రాంచైజీలను స్వాగతిస్తున్నామని బాయ్ అధ్యక్షుడు, లీగ్ చైర్మన్ అఖిలేష్ దాస్‌గుప్తా అన్నారు. రాబోయే టోర్నీ అద్భుతంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) పేరుతో తొలిసారి 2013 టోర్నీని ఏర్పాటు చేసిన ‘బాయ్’ ఆ తర్వాత రెండేళ్ల పాటు పోటీలను నిర్వహించలేదు. దీంతో ఐబీఎల్ పేరు మార్చి పీబీఎల్ రూపంలో 2016లో లీగ్‌ను జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.