సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో హైదరాబాద్ హంటర్స్ వరుసగా రెండో విజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మంగళవారం జరిగిన పోరులో హైదరాబాద్ హంటర్స్ 5–0తో చెన్నై స్మాషర్స్‌ను చిత్తు చేసింది. కానీ ఈ మ్యాచ్‌లో తెలుగుతేజం పీవీ సింధు నిరాశపరిచింది. మూడో ర్యాంకర్ సింధుకు చెన్నైకు ప్రాతినిధ్యం వహిస్తున్న 11వ ర్యాంకర్ సుంగ్ జీ హున్ (కొరియా) షాకిచ్చింది. అయితే రెండు ట్రంప్ మ్యాచ్‌ల్ని హంటర్సే గెలవడంతో హ్యున్ విజయం ‘జీరో’ అయింది. ముందుగా పురుషుల డబుల్స్ ట్రంప్ మ్యాచ్‌తో హైదరాబాద్ వేట మొదలుపెట్టింది. బుయిన్ ఇసారా–కిమ్ స రంగ్ ద్వయం 13–15, 15–12, 15–10తో ఒర్ చిన్ చంగ్–సుమీత్ రెడ్డి (చెన్నై) జోడీపై గెలిచి 2–0తో ముందంజ వేసింది. తర్వాత పురుషుల సింగిల్స్‌లోనూ హైదరాబాద్ షట్లర్ లీ హ్యున్ ఇల్ 15–11, 15–13తో వరుస గేముల్లో వీ ఫెంగ్ చోంగ్ (చెన్నై)ను ఓడించాడు.
తర్వాత మహిళల సింగిల్స్ బరిలోకి సింధు దిగింది. కానీ సొంత ప్రేక్షకుల మధ్య ఆమె 13–15, 15–14, 7–15తో సుంగ్ జీ హున్ (చెన్నై) చేతిలో పోరాడి ఓడింది. దీంతో హంటర్స్ ఆధిక్యం 3–1కు తగ్గింది. రెండో పురుషుల సింగిల్స్‌ను చెన్నై స్మాషర్స్ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకోగా... పారుపల్లి కశ్యప్ ఓటమితో చెన్నై గెలిచిన పాయింట్‌ను కోల్పోయింది. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో మార్క్ కాల్జౌ (హైదరాబాద్) 15–11, 14–15, 15–13తో కశ్యప్‌ను ఓడించాడు. దీంతో మరో మ్యాచ్ ఉండగానే హంటర్స్ 4–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. చివరగా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో కిమ్ స రంగ్–ఇయోమ్ హె వోన్ (హైదరాబాద్) జంట 14–15, 15–13, 15–14తో క్రిస్ అడ్‌కాక్–గాబ్రియేలా అడ్‌కాక్ (చెన్నై) జంటపై నెగ్గింది. నేడు జరిగే పోరులో ఢిల్లీ డాషర్స్‌తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ తలపడుతుంది.
సింధు ఓడినా... హైదరాబాద్ గెలిచింది
Published Wed, Dec 26 2018 12:38 AM | Last Updated on Wed, Dec 26 2018 12:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment