
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్‌లో హైదరాబాద్ హంటర్స్ జట్టు సొంతగడ్డపై శుభారంభం చేసింది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన పోరులో హంటర్స్ 2–1 తేడాతో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌ను ఓడించింది. అయితే వరల్డ్ చాంపియన్ పీవీ సింధు మాత్రం తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయింది. అభిమానుల సమక్షంలో ఆడిన తొలి మ్యాచ్‌లో తడబడి ఓటమితో నిరాశపర్చింది. తుది ఫలితం హంటర్స్‌కు అనుకూలంగా రావడం మాత్రం ఊరట.మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 8–15, 9–15 స్కోరుతో మిషెల్లీ లీ (నార్త్ ఈస్టర్స్ వారియర్స్) చేతిలో పరాజయంపాలైంది. ముందుగా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–ఇవనోవ్ జోడి 15–12, 8–15, 15–12తో కృష్ణ ప్రసాద్–కిమ్ హా నా పై గెలిచి శుభారంభం చేసింది.
అయితే ట్రంప్ మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 14–15, 14–15తో సేన్‌సోమ్‌బూన్‌సుక్ చేతిలో ఓడటంతో హంటర్స్ పాయింట్ కోల్పోవాల్సి వచ్చింది. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ జంట బెన్ లేన్–ఇవనోవ్ 15–7, 15–10తో బోదిన్ ఇసారా–లీ యంగ్ డేపై సంచలన విజయం సాధించింది. ఇది నార్త్ ఈస్టర్న్‌కు ట్రంప్ మ్యాచ్ కావడంతో స్కోరు 1–1తో సమమైంది. ఈ దశలో జరిగిన రెండో పురుషుల సింగిల్స్‌లో హంటర్స్ ప్లేయర్ డారెన్ ల్యూ 15–9, 15–10తో లీ చెక్ యు ను ఓడించి హైదరాబాద్ శిబిరంలో ఆనందం నింపాడు. నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌స్టార్స్‌తో పుణే సెవెన్ ఏసెస్ జట్టు తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment