- అందుబాటులో సైనాతో సహా 50 మంది షట్లర్లు
- నాలుగు ఫ్రాంచైజీల పేర్లను ప్రకటించిన ‘బాయ్’
న్యూఢిల్లీ: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) వేలం నేడు (సోమవారం) జరగనుంది. స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, శ్రీకాంత్‌లతో సహా మొత్తం 50 మంది క్రీడాకారులు ఈ వేలానికి అందుబాటులో ఉండనున్నారు. అలాగే లక్నో, ఢిల్లీలతో పాటు మరో నాలుగు ఫ్రాంచైజీలను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది.
హైదరాబాద్ ఫ్రాంచైజీని అజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్; ముంబైని దేవయాని లీజర్స్ ప్రైవేట్ లిమిటెడ్; చెన్నైని ది వోనెస్ ప్రైవేట్ లిమిటెడ్; బెంగళూరును బ్రాండ్‌ప్రిక్స్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లు దక్కించుకున్నాయి. ఇప్పటికే టోర్నీలో ఉన్న అవధ్ వారియర్స్ (లక్నో); ఢిల్లీ ఏసర్స్ (ఢిల్లీ)లతో పాటు ఈ ఫ్రాంచైజీల తరఫున వరుసగా హైదరాబాద్ హంటర్స్; ముంబై రాకెట్స్; చెన్నై స్మాషర్స్; బెంగళూరు టాప్‌గన్స్ జట్లు బరిలోకి దిగుతున్నాయి.
వచ్చే ఏడాది జనవరి 2న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంతో ఈ టోర్నీకి తెరలేవనుంది. 17న ఫైనల్‌తో ముగస్తుంది. పీబీఎల్‌కు ఎంపికైన అన్ని ఫ్రాంచైజీలను స్వాగతిస్తున్నామని బాయ్ అధ్యక్షుడు, లీగ్ చైర్మన్ అఖిలేష్ దాస్‌గుప్తా అన్నారు. రాబోయే టోర్నీ అద్భుతంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) పేరుతో తొలిసారి 2013 టోర్నీని ఏర్పాటు చేసిన ‘బాయ్’ ఆ తర్వాత రెండేళ్ల పాటు పోటీలను నిర్వహించలేదు. దీంతో ఐబీఎల్ పేరు మార్చి పీబీఎల్ రూపంలో 2016లో లీగ్‌ను జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.
నేడు పీబీఎల్ వేలం
Published Mon, Dec 7 2015 2:36 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM
Advertisement
Advertisement