ముంబై మెరిసె... | Premier Badminton League: Gurusai Dutt powered Mumbai Rockets 'trump' Saina-less Awadhe Warriors | Sakshi
Sakshi News home page

ముంబై మెరిసె...

Published Sun, Jan 3 2016 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

ముంబై మెరిసె...

ముంబై మెరిసె...

* తొలి మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌పై గెలుపు
* సింగిల్స్‌లో గురుసాయిదత్, రుత్విక విజయం
* గాయంతో బరిలోకి దిగని సైనా నెహ్వాల్
* ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్

ముంబై: సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లోనే ముంబై రాకెట్స్ మెరిసింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన అవధ్ వారియర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో శుభారంభం చేసింది. స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ముంబై రాకెట్స్ జట్టు 2-1 పాయింట్ల తేడాతో అవధ్ వారియర్స్‌ను ఓడించింది.

వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన ముంబై రాకెట్స్ విజయాన్ని ఖరారు చేసుకోగా... నామమాత్రమైన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో వారియర్స్ నెగ్గినా  ఫలితం లేకపోయింది. కొత్త నిబంధన ‘ట్రంప్ మ్యాచ్’ రెండు జట్లకు కలసి రాలేదు. అవధ్ వారియర్స్ తొలుత పురుషుల డబుల్స్ మ్యాచ్‌ను ‘ట్రంప్ మ్యాచ్’గా ఎంచుకొని ఓడిపోగా... ముంబై రాకెట్స్ రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ను ‘ట్రంప్ మ్యాచ్’గా పేర్కొని ఓటమి పాలైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు టాప్‌గన్స్‌తో హైదరాబాద్ హంటర్స్; ముంబై రాకెట్స్‌తో చెన్నై స్మాషర్స్ తలపడతాయి.
 
ఇద్దరు తెలుగు తేజాల మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ప్రపంచ 47వ ర్యాంకర్ గురుసాయిదత్ (ముంబై) 14-15, 15-10, 15-8తో ప్రపంచ 34వ ర్యాంకర్ సాయిప్రణీత్ (అవధ్ వారియర్స్)ను ఓడించాడు.  
 పురుషుల డబుల్స్ పోటీలో మథియాస్ బో-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై రాకెట్స్) ద్వయం 15-11, 15-11తో కాయ్ యున్-హెంద్రా గుణవాన్ (అవధ్ వారియర్స్) జంటపై గెలిచింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో తెలుగు అమ్మాయి గద్దె రుత్విక శివాని (ముంబై) 15-13, 15-10తో మరో తెలుగు అమ్మాయి గుమ్మడి వృశాలి(వారియర్స్)ని ఓడించడంతో ముంబై విజయం ఖరారైంది.

వాస్తవానికి ఈ మ్యాచ్‌లో వృశాలి బదులుగా సైనా నెహ్వాల్ ఆడాలి. అయితే గాయం కారణంగా సైనా తొలి లీగ్ మ్యాచ్‌కు దూరం కావడంతో ఆమె స్థానంలో వృశాలి బరిలోకి దిగింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మరో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్ తనోంగ్‌సక్ సెన్‌సోమ్‌బున్‌సుక్ (అవధ్ వారియర్స్) 15-12, 14-15, 15-14తో ప్రపంచ 20వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ (ముంబై రాకెట్స్)పై సంచలన విజయం సాధించడంతో అవధ్ వారియర్స్ ఖాతాలో తొలి విజయం చేరింది. చివరిదైన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో బోదిన్ ఇసారా-క్రిస్టినా (వారియర్స్) జంట 15-9, 14-15, 15-14తో కామిల్లా జుల్-ఇవనోవ్ (ముంబై) జోడీని ఓడించింది.
 
వైభవంగా ఆరంభం
కొత్త రూపుతో.. సరికొత్త ఆటతీరుతో అభిమానులను అలరించాలని చూస్తున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) శనివారం వైభవంగా ఆరంభమైంది. తారల నృత్యాలతో పాటు బాలీవుడ్ మధుర గీతాలతో ప్రారంభోత్సవ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రపంచ టాప్ స్టార్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా శ్రీలంక బ్యూటీ, హిందీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పలు హిట్ గీతాలకు స్టెప్పులేసి హుషారు తెచ్చింది.

అనంతరం సంగీత ద్వయం సలీం, సులేమాన్ చక్‌దే ఇండియా, బాండ్ బాజా బరాత్ తదితర సినిమాల్లోని పాటలను మరోసారి ప్రేక్షకులకు వినిపించారు. వీరే స్వరపర్చిన పీబీఎల్ అధికారిక గీతం ‘హల్లా మచాదే’ను కూడా ఆలపించి అందరిలో ఉత్తేజాన్ని నింపారు. అయితే ఈ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్ కుమార్ తొలి రోజు హాజరుకాలేదు. రెండో రోజు ఆదివారం రానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ‘పీబీఎల్‌కు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఫ్రాం చైజీలకు, యజమానులకు, మద్దతుదారులకు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరం కలిసి లీగ్‌ను సక్సెస్ చేయాలి’ అని పీబీఎల్ చైర్మన్ అఖిలేశ్ దాస్‌గుప్తా కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement