‘పీబీఎల్’ టైటిల్ గెలుస్తాం: పీవీ సింధు
‘పీబీఎల్’ టైటిల్ గెలుస్తాం: పీవీ సింధు
Published Sat, Dec 10 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్‌లో సత్తా చాటేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని, ఈసారి టైటిల్ సొంతం చేసుకుంటామని భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. పీబీఎల్‌లో సింధు చెన్నై స్మాషర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘గత సీజన్‌లో కూడా మెరుగైన ప్రదర్శనతో సెమీస్ చేరాం. మా జట్టులో అనేక మంది అత్యుత్తమ షట్లర్లు ఉన్నారు. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం’ అని సింధు పేర్కొంది. మరోవైపు రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ కూడా సింధుతో పోరుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ‘మా మధ్య రియోలో ఫైనల్ చాలా బాగా జరిగింది. ఈసారి కూడా అలాంటి హోరాహోరీ ఆటను ఆశిస్తున్నాం. ఆమెతో మ్యాచ్ అంటే నాకు సవాలే.
ఆటలో తలపడి ఆ తర్వాత హైదరాబాద్‌లో సింధు ఆతిథ్యం కూడా స్వీకరిస్తా’ అని మాడ్రిడ్ నుంచి లైవ్ చాట్‌లో మారిన్ వ్యాఖ్యానించింది. హైదరాబాద్ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్న మారిన్, లీగ్‌లో అత్యధికంగా రూ. 61.5 లక్షలు అందుకుంటోంది. ఆరు జట్లు తలపడుతున్న పీబీఎల్ రెండో సీజన్ పోటీలు జనవరి 1 నుంచి 14 వరకు జరుగుతాయని లీగ్ నిర్వాహకులు ‘స్పోర్‌ట్సలైవ్’ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రసాద్ మంగినపూడి వెల్లడించారు. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి ఫార్మాట్‌ను కాస్త మారుస్తూ మూడు గేమ్‌లను కూడా 11 పారుుంట్లకు పరిమితం చేశారు. 11 పాయింట్ల మ్యాచ్‌ల వల్ల ఆటలో మరింత వేగం పెరుగుతుందని, ఒక్కసారి వెనుకబడితే కోలుకునే అవకాశం ఉండదని అవధ్ వారియర్స్ తరఫున బరిలోకి దిగనున్న తెలుగు ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
Advertisement