P.V. Sindhu
-
పతాకధారిగా పీవీ సింధు
న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు అరుదైన గౌరవం లభించింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ఆమె భారత బృందానికి పతాకధారిగా (ఫ్లాగ్ బేరర్) వ్యవహరించనుంది. ఏప్రిల్ 4న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సింధు త్రివర్ణ పతాకం చేతబూని భారత క్రీడాకారులను ముందుకు నడిపించనుందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) శనివారం ప్రకటించింది. భారత్‌కే చెందిన మరో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... మేటి మహిళా బాక్సర్ మేరీకోమ్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చినా... 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన 22 ఏళ్ల సింధువైపే ఐఓఏ మొగ్గు చూపింది. గత మూడు కామన్వెల్త్ గేమ్స్‌లో షూటర్లే భారత బృందాలకు పతాకధారులగా వ్యవహరించడం గమనా ర్హం. 2006 మెల్బోర్న్ గేమ్స్‌లో రాజ్యవర్ధన్ రాథోడ్... 2010 ఢిల్లీ గేమ్స్‌లో అభినవ్ బింద్రా... 2014 గ్లాస్గో గేమ్స్‌లో విజయ్ కుమార్ ఫ్లాగ్ బేరర్లుగా పాల్గొన్నారు. -
తొలిసారి ఆల్ ఇంగ్లండ్ టోర్నీ సెమీఫైనల్లోకి
-
శభాష్ సింధు...
తొలి రెండు మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయిన తెలుగు తేజం పీవీ సింధు అసలు సిసలు పోరులో మాత్రం అబ్బురపరిచింది. తన ముందు ప్రపంచ చాంపియన్ ప్రత్యర్థిగా ఉన్నా... మ్యాచ్‌లో పలుమార్లు వెనుకబడినా... తన వ్యూహాలకు దీటుగా ప్రత్యర్థి జవాబు ఇస్తున్నా... ఏదశలోనూ తొణకకుండా... విజయంపై ఆశలు వదులుకోకుండా... చివరి పాయింట్ వరకు పోరాడిన సింధు ఆఖరికి విజయనాదం చేసి ఔరా అనిపించింది. బర్మింగ్‌హామ్: కొన్నాళ్లుగా తనకు కొరకరాని కొయ్యగా మారిన ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై భారత స్టార్ పీవీ సింధు మరోసారి పైచేయి సాధించింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అద్వితీయ విజయంతో తెలుగు తేజం సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 84 నిమిషాలపాటు ఉత్కంఠభరితంగా సాగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 20–22, 21–18, 21–18తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ప్రస్తుత వరల్డ్ చాంపియన్ ఒకుహారాను ఓడించింది. ఈ మెగా ఈవెంట్లో ఆరో ప్రయత్నంలో తొలిసారి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇప్పటివరకు సింధు, ఒకుహారా 10 సార్లు తలపడగా... ఇద్దరూ 5–5తో సమఉజ్జీగా ఉన్నారు. ఈ టోర్నీలో సింధు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మూడు గేమ్‌లు ఆడి విజయాన్ని దక్కించుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. యామగుచితో ముఖాముఖి రికార్డులో సింధు 6–3తో ఆధిక్యంలో ఉంది. గతేడాది ఒకుహారాతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచి, మరో రెండు ఓడిన సింధు ఈ మ్యాచ్‌లో మాత్రం పట్టుదలతో పోరాడింది. మూడు గేమ్‌లూ నువ్వా నేనా అన్నట్లు సాగాయి. తన ఎత్తు కారణంగా పదునైన స్మాష్‌లు సంధించే వీలున్న సింధుకు ఒకుహారా ఆ అవకాశం ఇవ్వలేదు. ర్యాలీ సుదీర్ఘంగా కొనసాగేలా చూస్తూ అవకాశం దొరకగానే డ్రాప్ షాట్లు సంధిస్తూ పాయింట్లు రాబట్టింది. సింధు కూడా ఏమాత్రం తీసిపోకుండా ఆడుతూ ఆమె వ్యూహాలకు తగినరీతిలో జవాబిచ్చింది. దాంతో స్కోరు పలుమార్లు సమమైంది. తొలి గేమ్‌లో స్కోరు 20–20 వద్ద సింధు వరుసగా రెండు పాయింట్లు కోల్పోయి గేమ్ చేజార్చుకుంది. మ్యాచ్‌లో నిలవాలంటే తప్పనిసరిగా రెండో గేమ్‌లో నెగ్గాల్సిన స్ధితిలో సింధు ఆరంభంలోనే 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం 6–4తో.. 9–7తో... 11–9తో...14–11, 16–13తో సింధు ఈ ఆధిక్యాన్ని కొనసాగించింది. ఈ దశలో సింధు తప్పిదాలతో స్కోరు 18–18 వద్ద సమమైంది. కానీ ఈ హైదరాబాద్ అమ్మాయి సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి రెండో గేమ్ దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు మూడుసార్లు (1–4, 11–14, 12–16)తో వెనుకబడినా... ఒత్తిడి దరిచేరనీయకుండా ఆడింది. 12–16తో వెనుకంజలో ఉన్నపుడు సింధు వరుసగా నాలుగు పాయిం ట్లు గెలిచి స్కోరును 16–16తో సమం చేసింది. అనంతరం ఇద్దరూ రెండేసి పాయింట్లు సాధించడంతో మళ్లీ 18–18 వద్ద స్కోరు సమమైంది. ఈ దశలో సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా మూడు పాయింట్లు గెలిచి ఒకుహారాను ఇంటిదారి పట్టించింది. శ్రీకాంత్‌కు నిరాశ గురువారం ఆలస్యంగా ముగిసిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ శ్రీకాంత్ 11–21, 21–15, 20–22తో అన్‌సీడెడ్ హువాంగ్ యుజియాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ 20–18తో విజయానికి చేరువగా వచ్చాడు. అయితే వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయిన ఈ హైదరాబాద్ ప్లేయర్ ఓటమిని మూటగట్టుకున్నాడు. -
‘పీబీఎల్’ టైటిల్ గెలుస్తాం: పీవీ సింధు
-
‘పీబీఎల్’ టైటిల్ గెలుస్తాం: పీవీ సింధు
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్లో సత్తా చాటేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని, ఈసారి టైటిల్ సొంతం చేసుకుంటామని భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు వ్యాఖ్యానించింది. పీబీఎల్‌లో సింధు చెన్నై స్మాషర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘గత సీజన్లో కూడా మెరుగైన ప్రదర్శనతో సెమీస్ చేరాం. మా జట్టులో అనేక మంది అత్యుత్తమ షట్లర్లు ఉన్నారు. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం’ అని సింధు పేర్కొంది. మరోవైపు రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ కూడా సింధుతో పోరుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ‘మా మధ్య రియోలో ఫైనల్ చాలా బాగా జరిగింది. ఈసారి కూడా అలాంటి హోరాహోరీ ఆటను ఆశిస్తున్నాం. ఆమెతో మ్యాచ్ అంటే నాకు సవాలే. ఆటలో తలపడి ఆ తర్వాత హైదరాబాద్‌లో సింధు ఆతిథ్యం కూడా స్వీకరిస్తా’ అని మాడ్రిడ్ నుంచి లైవ్ చాట్‌లో మారిన్ వ్యాఖ్యానించింది. హైదరాబాద్ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్న మారిన్, లీగ్‌లో అత్యధికంగా రూ. 61.5 లక్షలు అందుకుంటోంది. ఆరు జట్లు తలపడుతున్న పీబీఎల్ రెండో సీజన్ పోటీలు జనవరి 1 నుంచి 14 వరకు జరుగుతాయని లీగ్ నిర్వాహకులు ‘స్పోర్‌ట్సలైవ్’ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రసాద్ మంగినపూడి వెల్లడించారు. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి ఫార్మాట్‌ను కాస్త మారుస్తూ మూడు గేమ్‌లను కూడా 11 పారుుంట్లకు పరిమితం చేశారు. 11 పాయింట్ల మ్యాచ్‌ల వల్ల ఆటలో మరింత వేగం పెరుగుతుందని, ఒక్కసారి వెనుకబడితే కోలుకునే అవకాశం ఉండదని అవధ్ వారియర్స్ తరఫున బరిలోకి దిగనున్న తెలుగు ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. -
న్యూ లుక్‌లో స్పోర్ట్స్ క్వీన్ సుందరీ
-
సింధు మరో నెల తర్వాత...
హైదరాబాద్: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ రజత పతక విజేత పీవీ సింధు మరో నెల రోజుల తర్వాత తొలి టోర్నీ ఆడనుంది. అక్టోబరు 18 నుంచి జరిగే డెన్మార్క్ ఓపెన్‌లో ఆడుతుంది. ఈ లోగా జరిగే రెండు పెద్ద టోర్నీలు జపాన్ ఓపెన్, కొరియా ఓపెన్‌లో ఆడటం లేదు. గతేడాది డెన్మార్క్ ఓపెన్‌లో సింధు రన్నరప్‌గా నిలిచింది. సూపర్ సిరీస్ టోర్నీలలో తనకు ఇదే ఉత్తమ ప్రదర్శన. -
సింధు సంచలనం
సియోల్: తనదైన రోజున మేటి క్రీడాకారిణులను ఓడించే సత్తా తనలో ఉందని భారత బ్యాడ్మింటన్ యువతార పీవీ సింధు మరోసారి నిరూపించింది. గత నెలలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ చాంపియన్, మాజీ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా)ను బోల్తా కొట్టించిన ఈ హైదరాబాద్ అమ్మాయి... తాజాగా కొరియా ఓపెన్‌లో మరో సంచలనం సృష్టించింది. ప్రపంచ ఐదో ర్యాంకర్, ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్)తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు 21-19, 21-23, 21-13తో విజయం సాధించి శుభారంభం చేసింది. గతంలో రత్చనోక్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కనీసం ఒక్క గేమ్ నెగ్గలేకపోయిన సింధు ఈసారి ఏకంగా విజయాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ ఏడాది తాను ఆడిన ఏడు అంతర్జాతీయ టోర్నీల్లోనూ సెమీఫైనల్ దశను దాటలేకపోయిన సింధు ఎనిమిదో టోర్నీలోనైనా ఆ లోటు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. రెండేళ్ల తర్వాత రత్చనోక్‌తో ఆడిన సింధు గతంలో కంటే మెరుగైన ఆటతీరును కనబరిచి అనుకున్న ఫలితాన్ని సాధించింది. తొలి గేమ్‌ను నెగ్గి, రెండో గేమ్‌లో 20-15తో ఆధిక్యంలో ఉన్న సింధు అనూహ్యంగా తడబడి వరుసగా ఆరు పాయింట్లను కోల్పోయింది. ఆ తర్వాత తాను ఒక పాయింట్ సాధించినా, మరో రెండు పాయింట్లను కోల్పోయి గేమ్‌ను 21-23తో చేజార్చుకుంది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో సింధు 3-7తో వెనుకబడింది. అయితే వెంటనే తేరుకున్న ఈ హైదరాబాద్ అమ్మాయి పదునైన స్మాష్‌లతో విరుచుకుపడి వరుసగా ఏడు పాయింట్లు సాధించి 10-7తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింధు తన జోరు కొనసాగించగా... రత్చనోక్ డీలా పడింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్ సయాక తకహాషి (జపాన్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో వీరిద్దరూ 1-1తో సమఉజ్జీగా ఉన్నారు. అక్సెల్సన్కు జయరామ్ షాక్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ నాలుగో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ఎనిమిదో ర్యాంకర్ పారుపల్లి కశ్యప్, 12వ ర్యాంకర్ మెచ్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టగా... ప్రపంచ 31వ ర్యాంకర్ అజయ్ జయరామ్ అద్భుత ఆటతీరుతో ప్రపంచ ఆరో ర్యాంకర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించాడు. శ్రీకాంత్ 21-12, 13-21, 17-21తో హూవీ తియాన్ (చైనా) చేతిలో; కశ్యప్ 21-17, 16-21, 18-21తో వీ నాన్ (హాంకాంగ్) చేతిలో; ప్రణయ్ 21-18, 19-21, 17-21తో తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. ఈ ముగ్గురూ తొలి గేమ్‌ను నెగ్గి, ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లను కోల్పోయి ఓటమి పాలవ్వడం గమనార్హం. మరోవైపు జయరామ్ 21-15, 21-15తో అక్సెల్సన్ను ఓడించి, గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో వోంగ్ వింగ్ విన్సెంట్ (హాంకాంగ్)తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె (భారత్) ద్వయం 24-26, 9-21తో షిజుకా-మామి నైటో (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. -
'మకావు'లో సింధు కేక
మళ్లీ మన ‘రాకెట్’ మెరిసింది. రెండు వారాల క్రితం చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా నెహ్వాల్, శ్రీకాంత్ సాధించిన అపూర్వ విజయాలు మదిలో మెదులుతుండగానే... మరో తెలుగు తేజం పి.వి.సింధు తీపి కబురు అందించింది. మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి దిగ్విజయంగా తన టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈ ఏడాదిని విజయంతో సగర్వంగా ముగించింది. టైటిల్ నిలబెట్టుకున్న తెలుగు తేజం ⇒ ఫైనల్లో అలవోక విజయం ⇒ కెరీర్లో మూడో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ ⇒ రూ. 5 లక్షల 60 వేల ప్రైజ్‌మనీ సొంతం మకావు: నిలకడగా రాణిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు నిరూపించింది. అపార ప్రతిభ సొంతమైనా... ఆటలో నిలకడలేమి కారణంగా ఈ హైదరాబాద్ అమ్మాయి ఈ సీజన్‌ను ఒక్క టైటిల్ కూడా నెగ్గకుండానే ముగిస్తుందా అనే అనుమానం కలిగింది. కానీ ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఈ సంవత్సరం చివరి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్ మకావు ఓపెన్‌లో 19 ఏళ్ల సింధు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సింధు 21-12, 21-17తో కిమ్ హ్యో మిన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సింధుకు 9 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 60 వేలు)తోపాటు 7 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 45 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో సింధు ఆద్యంతం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. కళ్లు చెదిరే స్మాష్‌లు... నెట్ వద్ద అప్రమత్తత... ర్యాలీల్లో పైచేయి... ఇలా ప్రతి అంశంలో ఈ తెలుగు తేజం తన ఆధిపత్యాన్ని చాటుకొని కొరియా అమ్మాయికి ఏ దశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వలేదు. సెమీఫైనల్లో ప్రపంచ 19వ ర్యాంకర్ యూ సున్ (చైనా)ను ఓడించిన కిమ్ హ్యో మిన్ ఫైనల్లో మాత్రం సింధు దూకుడుకు అడ్డుకట్ట వేయడంలో విఫలమైంది. తొలి గేమ్ ఆరంభంలో సింధు 0-3తో వెనుకబడినా ఆ వెంటనే కోలుకొని స్కోరును 8-8 వద్ద సమం చేసింది. ఆ తర్వాత సింధు ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13-8తో ఆధిక్యంలోకి వెళ్లింది. కిమ్ పుంజుకునేందుకు కృషి చేసినా సింధు అవకాశమివ్వకుండా ఈసారి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 19-9తో ముందంజ వేసింది. అదే జోరులో తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో సింధుకు కాస్త పోటీ ఎదురైంది. ఒకదశలో ఇద్దరి మధ్య తేడా ఒక పాయింట్ ఉంది. కానీ కీలకదశలో ఈ హైదరాబాద్ అమ్మాయి పైచేయి సాధించి మూడు పాయింట్లు నెగ్గి 20-16తో ఆధిక్యాన్ని సంపాదించి, అదే ఉత్సాహంలో మరో పాయింట్ కైవసం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. సింధు కెరీర్లో ఇది మూడో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్. గతేడాది ఆమె మలేసియా ఓపెన్, మకావు ఓపెన్ టైటిల్స్‌ను సాధించింది. ఈ ఏడాది సింధు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో, ఉబెర్ కప్‌లోనూ కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. ఇండియన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. స్విస్ ఓపెన్‌లో సెమీస్‌లో ఓడిన సింధు... డెన్మార్క్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, సింగపూర్ ఓపెన్లలో మాత్రం క్వార్టర్ ఫైనల్స్‌లో వెనుదిరిగింది. ఒకే అంతర్జాతీయ టోర్నీని వరుసగా రెండుసార్లు గెల్చుకున్న రెండో భారతీయ క్రీడాకారిణిగా సింధు నిలిచింది. గతంలో సైనా నెహ్వాల్ ఈ ఘనతను మూడుసార్లు సాధించింది. సంతోషంగా ఉంది విజయంతో 2014 సంవత్సరాన్ని ముగించడం సంతోషంగా ఉంది. వరుసగా రెండో ఏడాది మకావు గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్‌ను గెల్చుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. నా ప్రత్యర్థి ఫైనల్‌కు ముందు అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించింది. కాబట్టి ఆమెను బలహీన ప్లేయర్‌గా చెప్పలేం. వరుస గేమ్‌లలో మ్యాచ్ ముగిసినా ఆమె గట్టి పోటీ ఇవ్వడంతో గెలుపు కోసం శ్రమించాల్సి వచ్చింది. నా ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాను. కెరీర్లో గుర్తుంచుకోదగ్గ విజయాలు ఈ ఏడాది నాకు లభించాయి. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచాను. కొన్ని పరాజయాలు ఉన్నా ఎలాంటి బాధ లేదు. గ్లాస్గోలో స్వర్ణంతో పాటు ఏషియాడ్‌లో వ్యక్తిగత పతకం గెలవాల్సింది. మరింత కష్టపడి వచ్చే సంవత్సరం ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తాను. - పీవీ సింధు -
కశ్యప్, సింధు ముందంజ
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత షట్లర్లు పీవీ సింధు, పారుపల్లి కశ్యప్ ముందంజ వేశారు. సింగిల్స్‌లో తెలుగుతేజాలు సెమీస్‌లో ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో వరల్డ్ నెంబర్ 11 సింధు 21-10, 21-9 స్కోరుతో అన్నా రాంకిన్పై సునాయాస విజయం సాధించింది. సింధు 24 నిమిషాల్లోనే వరస గేమ్‌ల్లో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సెమీస్‌లో మిచెల్లి లీతో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో కశ్యప్ 21-13, 21-14తో లీవ్‌ను చిత్తు చేశాడు. -
నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
గిమ్‌చియోన్ (కొరియా): స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గైర్హాజరీలో... ఈసారి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో భారత ఆశలన్నీ పి.వి.సింధు, పారుపల్లి కశ్యప్‌లపైనే ఆధారపడి ఉన్నాయి. తొలి రోజు మంగళవారం క్వాలిఫయింగ్ పోటీల తర్వాత బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో చెయుంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)తో సింధు... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో గో సూన్ హువాట్ (మలేసియా)తో కశ్యప్ తలపడతారు. స్థాయికి తగ్గట్టు ఆడితే కశ్యప్ సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశముంది. కశ్యప్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్, గురుసాయిదత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్ లిన్ డాన్ (చైనా)తో శ్రీకాంత్; ఫెట్‌ప్రదాబ్ ఖోసిట్ (థాయ్‌లాండ్)తో గురుసాయిదత్ ఆడతారు. ‘రెండేళ్ల క్రితం చివరిసారి లిన్ డాన్‌తో థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఆడాను. లిన్ డాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అతనితో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటను ఆస్వాదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతాను. గెలిచేందుకు నా వందశాతం కృషి చేస్తాను. సింగపూర్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీతో ఆడిన మ్యాచ్‌తో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. అన్ని విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరుకున్న వారికి కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. 1991లో మొదలైన ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. 2007లో అనూప్ శ్రీధర్... 2010లో సైనా నెహ్వాల్ సెమీఫైనల్స్‌లో ఓడిపోయి కాంస్య పతకాలను గెల్చుకున్నారు. -
‘సూపర్’ శ్రీకాంత్
* సింగపూర్ ఓపెన్ లో ప్రపంచ 14వ ర్యాంకర్ యున్ హూపై గెలుపు * తొలిసారి ‘సూపర్’ టోర్నీ సెమీస్‌లోకి * సింధు, సాయిప్రణీత్ పరాజయం సింగపూర్: ఇటీవల తాను బరిలోకి దిగిన మూడు టోర్నీల్లోనూ తొలి రౌండ్లోనే ఓడిపోయిన ఆంధ్రప్రదేశ్ యువతార కిడాంబి శ్రీకాంత్... సింగపూర్ ఓపెన్‌లో మాత్రం తన జోరు కొనసాగిస్తున్నాడు. తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులను బోల్తా కొట్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఈ టోర్నీలో అన్‌సీడెడ్‌గా అడుగుపెట్టిన శ్రీకాంత్ శుక్రవారం మరో సంచలనం సృష్టించాడు. కెరీర్లో తొలిసారి సూపర్ సిరీస్ స్థాయి టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. 63 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ శ్రీకాంత్ 17-21, 21-14, 21-19తో ప్రపంచ 15వ ర్యాంకర్ యున్ హూ (హాంకాంగ్)ను ఓడించాడు. * ఈ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ టకుమా ఉయెదా (జపాన్)పై నెగ్గిన శ్రీకాంత్... ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్ తియాన్ మిన్హ్ నగుయాన్ (వియత్నాం)ను ఓడించాడు. ఓవరాల్‌గా యున్ హూపై శ్రీకాంత్‌కిది వరుసగా రెండో విజయం. ఈ ఏడాది మలేసియా ఓపెన్ తొలి రౌండ్లోనూ యున్ హూపై ఈ గుంటూరు జిల్లా క్రీడాకారుడు గెలిచాడు. * శ్రీకాంత్‌కు శనివారం అసలు సవాల్ ఎదురుకానుంది. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)తో అతను తలపడనున్నాడు. ముఖాముఖి రికార్డులో లీ చోంగ్ వీ 1-0తో ఆధిక్యంలో ఉన్నాడు వీరిద్దరూ గతేడాది హాంకాంగ్ ఓపెన్ తొలి రౌండ్లో ఆడగా... లీ చోంగ్ వీ 21-18, 21-14తో గెలిచాడు. * యున్ హూతో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన శ్రీకాంత్ ఆ తర్వాత తేరుకున్నాడు. రెండో గేమ్‌లో వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 6-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే ఆధిక్యాన్ని కొనసాగించి గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. కీలక దశలో పాయింట్లు నెగ్గిన శ్రీకాంత్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. * పురుషుల సింగిల్స్ మరో క్వార్టర్ ఫైనల్లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ పోరాటం ముగిసింది. ప్రపంచ 7వ ర్యాంకర్ డూ పెంగ్యూ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ 15-21, 15-21తో ఓటమి చవిచూశాడు. ఏకపక్షంగా సాగిన పోరులో తొలి గేమ్‌లో ఒక్కసారీ ఇద్దరి స్కోర్లు సమంకాలేదు. రెండో గేమ్ ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లిన పెంగ్యూ డూ వెనుదిరిగి చూడలేదు. * మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి.సింధుకు నిరాశ ఎదురైంది. ప్రపంచ 3వ ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 19-21, 15-21తో పరాజయం పాలైంది. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో యిహాన్ వాంగ్‌ను ఓడించిన సింధు అదే ఫలితాన్ని ఈసారి పునరావృతం చేయలేకపోయింది. -
మలేసియా సూపర్ సిరీస్ నుంచి సైనా, సింధు నిష్క్రమణ
కౌలాలంపూర్: మలేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత దేశ అగ్రశ్రేణి క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి సింధులు ఓటమి పాలైయ్యారు. తొలి రౌండ్ ను ఎంతో కష్టం మీద అధిగమించిన ఈ క్రీడాకారిణులు రెండో రౌండ్ ను దాటలేకపోయారు. ఎనిమిదో ర్యాంక్ సైనా నెహ్వాల్ కు ప్రపంచ ఇరవై అయిదవ ర్యాంక్ క్రీడాకారిణి జుయ్ యావో (చైనా)తో జరిగిన మ్యాచ్ లో చుక్కెదురైంది. సైనా నెహ్వాల్ 16-21,21-10, 21-19 తేడాతో యావో చేతిలో కంగుతింది. తొలి సెట్ ను సైనా అలవోకగా గెలుచుకున్నా ఆపై పోరాటం సాగించడంలో విఫలమై ఓటమి పాలైంది. అంతకుముందు జరిగిన మ్యాచ్ లో ఆరో సీడ్ క్రీడాకారిణి జు బే (కొరియన్)చేతిలో 21-16,21-19 పాయింట్ల తేడాతో పి.వి.సింధు ఓటమి పాలైంది. ఎనిమిదో సీడ్ సైనా బుధవారం జరిగిన తొలి రౌండ్లో 21-10, 21-16తో ఇండోనేసియాకు చెందిన హిరా దేసిని ఓడించిన సైనా రెండో రౌండ్ కు చేరిన సంగతి తెలిసిందే. -
ప్రి-క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సైనా, సింధు
అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం ఈసారి ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో ఉన్న భారత స్టార్ సైనా నెహ్వాల్ ఆ దిశగా తొలి అడుగు వేసింది. మొదటి రౌండ్లో ‘బై’ పొందిన ఈ హైదరాబాద్ అమ్మాయి రెండో రౌండ్లో సునాయాస విజయం నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పి.వి.సింధు శ్రమించి గెలుపొందగా... పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి గాయంతో వైదొలగడంతో ప్రిక్వార్టర్ ఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ప్రస్తుతం బరిలో మిగిలిన ఈ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కావడం విశేషం. గ్వాంగ్జూ (చైనా): మూడు విజయాలు... రెండు పరాజయాలు... మెరుగైన ప్రదర్శన చేస్తారనుకున్న డబుల్స్‌లో నిరాశ... పతకంపై ఆశల రేకెత్తిస్తున్న సింగిల్స్‌లో మిశ్రమ ఫలితాలు... వెరసి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు ఇదీ భారత ప్రదర్శన. ఎలాంటి తడబాటు లేకుండా ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత స్టార్ సైనా నెహ్వాల్... తీవ్ర ప్రతిఘటన ఎదురైనా సంయమనంతో ఆడిన తెలుగు అమ్మాయి పి.వి.సింధు... గాయంతో ప్రత్యర్థి మధ్యలోనే చేతులెత్తేయడంతో పారుపల్లి కశ్యప్ విజయాలు నమోదు చేసి ఈ మెగా ఈవెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సైనా 21-5, 21-4తో ఓల్గా గొలొవనోవా (రష్యా)ను చిత్తు చేసింది. కేవలం 23 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనాకు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. స్మాష్‌లు, డ్రాప్ షాట్లు, వైవిధ్యభరిత సర్వీస్‌లు... ఇలా అన్ని విభాగాల్లో సైనా తన ఆటతీరును పరీక్షించుకుంది. ఈ మ్యాచ్‌లో ఓల్గా నెగ్గిన తొమ్మిది పాయింట్లలో ఎక్కువగా సైనా చేసిన అనవసర తప్పిదాలతో వచ్చినవే కావడం గమనార్హం. తొలి గేమ్‌లో స్కోరు 8-5 వద్ద ఉన్నపుడు సైనా వరుసగా 13 పాయింట్లు నెగ్గి 10 నిమిషాల్లో గేమ్‌ను చేజిక్కించుకుంది. అనంతరం 13 నిమిషాలపాటు జరిగిన రెండో గేమ్‌లో సైనా రెండుసార్లు వరుసగా ఏడేసి పాయింట్లను సాధించింది. కవోరి ఇమబెపు (జపాన్)తో జరిగిన రెండో రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 21-19, 19-21, 21-17తో విజయం సాధించింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడుతోన్న సింధుకు గట్టిపోటీనే లభించింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒక దశలో 10-13తో వెనుకబడింది. ఈ దశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడిన సింధు వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 14-13తో ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో సింధు 42 స్మాష్‌లు సంధించడం విశేషం. జయరామ్ పరాజయం పురుషుల సింగిల్స్ విభాగంలో కశ్యప్ ముందంజ వేయగా... అజయ్ జయరామ్ ఓడిపోయాడు. పీటర్ కౌకుల్ (చెక్ రిపబ్లిక్)తో జరిగిన రెండో రౌండ్లో కశ్యప్ తొలి గేమ్‌లో 14-5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో కౌకుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో కశ్యప్‌ను విజేతగా ప్రకటించారు. తొలి రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ను ఓడించిన అజయ్ జయరామ్ రెండో రౌండ్ నిరాశపరిచాడు. ప్రపంచ 88వ ర్యాంకర్ పాబ్లీ ఎబియన్ (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో జయరామ్ 9-21, 17-21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో కోనా తరుణ్-అరుణ్ విష్ణు జంట 15-21, 21-13, 17-21తో మార్కిస్ కిడో-యూలియాంతో చంద్ర (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. దాంతో ఈ మెగా ఈవెంట్‌లోని డబుల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. సింగిల్స్‌లో సైనా, సింధు, కశ్యప్ మిగిలి ఉన్నారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 15వ సీడ్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్)తో సైనా నెహ్వాల్; రెండో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో సింధు; ఆరో సీడ్ యున్ హూ (హాంకాంగ్)తో కశ్యప్ తలపడతారు. తమ ప్రిక్వార్టర్ ఫైనల్స్ ప్రత్యర్థులతో ముఖాముఖి రికార్డులో సైనా 5-0తో ఆధిక్యంలో ఉండగా... సింధు 0-1తో; కశ్యప్ 0-2తో వెనుకబడి ఉన్నారు.