ప్రి-క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సైనా, సింధు | Saina, Sindhu enter pre-quarters of World Championships | Sakshi
Sakshi News home page

ప్రి-క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సైనా, సింధు

Published Wed, Aug 7 2013 6:11 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

ప్రి-క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సైనా, సింధు

ప్రి-క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సైనా, సింధు

అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం ఈసారి ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో ఉన్న భారత స్టార్ సైనా నెహ్వాల్ ఆ దిశగా తొలి అడుగు వేసింది. మొదటి రౌండ్‌లో ‘బై’ పొందిన ఈ హైదరాబాద్ అమ్మాయి రెండో రౌండ్‌లో సునాయాస విజయం నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పి.వి.సింధు శ్రమించి గెలుపొందగా... పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి గాయంతో వైదొలగడంతో ప్రిక్వార్టర్ ఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ప్రస్తుతం బరిలో మిగిలిన ఈ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కావడం విశేషం.
 
 గ్వాంగ్‌జూ (చైనా): మూడు విజయాలు... రెండు పరాజయాలు... మెరుగైన ప్రదర్శన చేస్తారనుకున్న డబుల్స్‌లో నిరాశ... పతకంపై ఆశల రేకెత్తిస్తున్న సింగిల్స్‌లో మిశ్రమ ఫలితాలు... వెరసి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు ఇదీ భారత ప్రదర్శన. ఎలాంటి తడబాటు లేకుండా ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత స్టార్ సైనా నెహ్వాల్... తీవ్ర ప్రతిఘటన ఎదురైనా సంయమనంతో ఆడిన తెలుగు అమ్మాయి పి.వి.సింధు... గాయంతో ప్రత్యర్థి మధ్యలోనే చేతులెత్తేయడంతో పారుపల్లి కశ్యప్ విజయాలు నమోదు చేసి ఈ మెగా ఈవెంట్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
 
 బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ సైనా 21-5, 21-4తో ఓల్గా గొలొవనోవా (రష్యా)ను చిత్తు చేసింది. కేవలం 23 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనాకు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. స్మాష్‌లు, డ్రాప్ షాట్‌లు, వైవిధ్యభరిత సర్వీస్‌లు... ఇలా అన్ని విభాగాల్లో సైనా తన ఆటతీరును పరీక్షించుకుంది. ఈ మ్యాచ్‌లో ఓల్గా నెగ్గిన తొమ్మిది పాయింట్లలో ఎక్కువగా సైనా చేసిన అనవసర తప్పిదాలతో వచ్చినవే కావడం గమనార్హం. తొలి గేమ్‌లో స్కోరు 8-5 వద్ద ఉన్నపుడు సైనా వరుసగా 13 పాయింట్లు నెగ్గి 10 నిమిషాల్లో గేమ్‌ను చేజిక్కించుకుంది. అనంతరం 13 నిమిషాలపాటు జరిగిన రెండో గేమ్‌లో  సైనా రెండుసార్లు వరుసగా ఏడేసి పాయింట్లను సాధించింది.
 
 కవోరి ఇమబెపు (జపాన్)తో జరిగిన రెండో రౌండ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 21-19, 19-21, 21-17తో విజయం సాధించింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడుతోన్న సింధుకు గట్టిపోటీనే లభించింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒక దశలో 10-13తో వెనుకబడింది. ఈ దశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడిన సింధు వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 14-13తో ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో సింధు 42 స్మాష్‌లు సంధించడం విశేషం.
 
 జయరామ్ పరాజయం
 పురుషుల సింగిల్స్ విభాగంలో కశ్యప్ ముందంజ వేయగా... అజయ్ జయరామ్ ఓడిపోయాడు. పీటర్ కౌకుల్ (చెక్ రిపబ్లిక్)తో జరిగిన రెండో రౌండ్‌లో కశ్యప్ తొలి గేమ్‌లో 14-5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో కౌకుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో కశ్యప్‌ను విజేతగా ప్రకటించారు.
 
 తొలి రౌండ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ను ఓడించిన అజయ్ జయరామ్ రెండో రౌండ్ నిరాశపరిచాడు. ప్రపంచ 88వ ర్యాంకర్ పాబ్లీ ఎబియన్ (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో జయరామ్ 9-21, 17-21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో కోనా తరుణ్-అరుణ్ విష్ణు జంట 15-21, 21-13, 17-21తో మార్కిస్ కిడో-యూలియాంతో చంద్ర (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. దాంతో ఈ మెగా ఈవెంట్‌లోని డబుల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. సింగిల్స్‌లో సైనా, సింధు, కశ్యప్ మిగిలి ఉన్నారు.
 
 గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 15వ సీడ్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్‌సుక్ (థాయ్‌లాండ్)తో సైనా నెహ్వాల్; రెండో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో సింధు; ఆరో సీడ్ యున్ హూ (హాంకాంగ్)తో కశ్యప్ తలపడతారు. తమ ప్రిక్వార్టర్ ఫైనల్స్ ప్రత్యర్థులతో ముఖాముఖి రికార్డులో సైనా 5-0తో ఆధిక్యంలో ఉండగా... సింధు 0-1తో; కశ్యప్ 0-2తో వెనుకబడి ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement