సింధు సంచలనం | Sindhu wins, Kashyap loses in Korea Open | Sakshi
Sakshi News home page

సింధు సంచలనం

Published Thu, Sep 17 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM

సింధు సంచలనం

సింధు సంచలనం

 సియోల్: తనదైన రోజున మేటి క్రీడాకారిణులను ఓడించే సత్తా తనలో ఉందని భారత బ్యాడ్మింటన్ యువతార పీవీ సింధు మరోసారి నిరూపించింది. గత నెలలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ చాంపియన్, మాజీ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా)ను బోల్తా కొట్టించిన ఈ హైదరాబాద్ అమ్మాయి... తాజాగా కొరియా ఓపెన్‌లో మరో సంచలనం సృష్టించింది. ప్రపంచ ఐదో ర్యాంకర్, ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్)తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు 21-19, 21-23, 21-13తో విజయం సాధించి శుభారంభం చేసింది. గతంలో రత్చనోక్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కనీసం ఒక్క గేమ్ నెగ్గలేకపోయిన సింధు ఈసారి ఏకంగా విజయాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ ఏడాది తాను ఆడిన ఏడు అంతర్జాతీయ టోర్నీల్లోనూ సెమీఫైనల్ దశను దాటలేకపోయిన సింధు ఎనిమిదో టోర్నీలోనైనా ఆ లోటు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది.
 
 రెండేళ్ల తర్వాత రత్చనోక్‌తో ఆడిన సింధు గతంలో కంటే మెరుగైన ఆటతీరును కనబరిచి అనుకున్న ఫలితాన్ని సాధించింది. తొలి గేమ్‌ను నెగ్గి, రెండో గేమ్‌లో 20-15తో ఆధిక్యంలో ఉన్న సింధు అనూహ్యంగా తడబడి వరుసగా ఆరు పాయింట్లను కోల్పోయింది. ఆ తర్వాత తాను ఒక పాయింట్ సాధించినా, మరో రెండు పాయింట్లను కోల్పోయి గేమ్‌ను 21-23తో చేజార్చుకుంది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో సింధు 3-7తో వెనుకబడింది. అయితే వెంటనే తేరుకున్న ఈ హైదరాబాద్ అమ్మాయి పదునైన స్మాష్‌లతో విరుచుకుపడి వరుసగా ఏడు పాయింట్లు సాధించి 10-7తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింధు తన జోరు కొనసాగించగా... రత్చనోక్ డీలా పడింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్ సయాక తకహాషి (జపాన్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో వీరిద్దరూ 1-1తో సమఉజ్జీగా ఉన్నారు.
 
 అక్సెల్‌సన్‌కు జయరామ్ షాక్
 పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ నాలుగో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, ఎనిమిదో ర్యాంకర్ పారుపల్లి కశ్యప్, 12వ ర్యాంకర్ మెచ్ ప్రణయ్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టగా... ప్రపంచ 31వ ర్యాంకర్ అజయ్ జయరామ్ అద్భుత ఆటతీరుతో ప్రపంచ ఆరో ర్యాంకర్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించాడు. శ్రీకాంత్ 21-12, 13-21, 17-21తో హూవీ తియాన్ (చైనా) చేతిలో; కశ్యప్ 21-17, 16-21, 18-21తో వీ నాన్ (హాంకాంగ్) చేతిలో; ప్రణయ్ 21-18, 19-21, 17-21తో తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. ఈ ముగ్గురూ తొలి గేమ్‌ను నెగ్గి, ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లను కోల్పోయి ఓటమి పాలవ్వడం గమనార్హం. మరోవైపు జయరామ్ 21-15, 21-15తో అక్సెల్‌సన్‌ను ఓడించి, గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో వోంగ్ వింగ్ విన్సెంట్ (హాంకాంగ్)తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె (భారత్) ద్వయం 24-26, 9-21తో షిజుకా-మామి నైటో (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement