అహ్మదాబాద్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘సి’లో భాగంగా శనివారం జరిగిన తమ తొలి పోరులో హైదరాబాద్ 42 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 48.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాటర్ అరవెల్లి అవనీశ్ (82 బంతుల్లో 100; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఆకట్టుకోగా... ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), వరుణ్ గౌడ్ (57) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ తిలక్ వర్మ (0) విఫలమయ్యాడు.
నాగాలాండ్ బౌలర్లలో ఇమ్లీవతి లెమ్టర్ 4, జొనాథన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నాగాలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. యుగంధర్ సింగ్ (80; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), జగదీశ సుచిత్ (66; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో పోరాడినా లాభం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో నిశాంత్, ముదస్సిర్ రెండేసి వికెట్లు తీశారు. అవనీశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో సోమవారం ముంబైతో హైదరాబాద్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment