PKL 11: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ శుభారంభం సత్తా చాటిన గౌరవ్ ఖత్రి
Published Sat, Oct 19 2024 10:56 PM | Last Updated on Sun, Oct 20 2024 6:06 PM
హైదరాబాద్, అక్టోబర్ 19: డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో శుభారంభం చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటుతూ పది పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్‌ను చిత్తు చేసింది. శనివారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పల్టాన్ 35–25 తో స్టీలర్స్‌పై ఘన విజయం సాధించింది. తన ఉడుం పట్టుతో ప్రత్యర్థులను నిలువరించిన డిఫెండర్ గౌరవ్ ఖత్రి 7 పాయింట్లతో పుణెరి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్, ఆల్‌రౌండర్ అస్లాం ఇనాందర్ ఐదు పాయింట్లతో ఆకట్టుకోగా.. పంకజ్ మోహితే, మోహిత్ గోయత్, అమన్ నాలుగేసి పాయింట్లు రాబట్టారు. హర్యానా స్టీలర్స్ జట్టులో శివం పతారె, శంకర్ మిశ్రా ఐదు పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచారు.. ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా షాడ్లోయి (4), రైడర్ వినయ్ పోరాడినా మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు.
ఆట ఆరంభంలో ఇరు జట్లూ వరుస పాయింట్లతో పోటాపోటీగా తలపడ్డాయి. 6–6తో స్కోరు సమంగా ఉన్న దశలో పుణెరి పల్టాన్ వేగం పెంచింది. రైడింగ్‌లో పాటు డిఫెన్స్‌లోనూ సత్తా చాటుతూ 13వ నిమిషంలోనే హర్యానా స్టీలర్స్‌ను ఆలౌట్ చేసి 13–7తో ఆధిక్యం సాధించింది. శివం పతారే డుబ్కి స్కిల్ చూపెడుతూ రెండు పాయింట్లు తీసుకురావడంతో స్టీలర్స్9–13తో పుంజుకునేలా కనిపించింది. కానీ, పంకజ్ మోహితే మూడు పాయింట్ల సూపర్ రైడ్ చేయడంతో పుణెరి తన ఆధిక్యాన్ని 18–10కి పెంచుకుంది. పుణెరి రైడర్ మోహిత్ గోయత్‌ను చియానే చేసిన సూపర్ ట్యాకిల్ చేసి రెండు పాయింట్టు రాబట్టినా పల్టాన్ 19–13 ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది.
రెండో భాగంలో డిఫెండర్ చియనే సత్తా చాటినా రైడింగ్‌లో హర్యానా అంతగా ఆకట్టుకోలేక వెనుకబడింది. పుణెరి డిఫెండర్ ఖత్రి వరుసగా విజయ్, శివం పతారేను ట్యాకిల్ చేశాడు. చివరి నిమిషాల్లో ఆ జట్టు తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. అయితే, హర్యానా ఆఖరి రైడ్‌లో శంకర్ మిశ్రా మూడు టచ్ పాయింట్లు సహా నాలుగు పాయింట్లతో సూపర్ రైడ్ చేయడంతో హర్యానా తన ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించుకుంది. ఆదివారం రాత్రి జరిగే తొలి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్–జైపూర్ పింక్ పాంథర్స్ తలపడాయి. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్–బెంగళూరు బుల్స్ పోటీ పడతాయి.
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment