Pro Kabaddi
-
బెంగాల్ భారీ విజయం
హైదరాబాద్, నవంబర్ 9, 2024: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో బెంగాల్ వారియర్స్ దుమ్మురేపింది. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన బెంగాల్ శనివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 40-29తో బెంగళూరు బుల్స్‌పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శన కనబరిచిన బెంగాల్ తరపున నితిన్‌కుమార్(14), మన్‌దీప్‌సింగ్(10) సూపర్-10తో కదంతొక్కారు. మరోవైపు బెంగళూరు జట్టులో అక్షిత్(11), అజింక్యా పవార్(8) రాణించినా..పర్దీప్ నార్వల్(2) ఘోరంగా విఫలమయ్యాడు.బెంగాల్ జోరు: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతున్నది. లీగ్‌లో కీలకమైన ప్లేఆఫ్స్ దశకు చేరుకోవాలంటే గెలక తప్పని పరిస్థితుల నేపథ్యంలో అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. శనివారం బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. మాజీ చాంపియన్ బెంగాల్ తమదైన రీతిలో బెంగళూరుపై జోరు కనబరిచింది. ముఖ్యంగా స్టార్ రైడర్ మన్‌దీప్‌సింగ్ దూకుడు కనబరిచాడు. తన తొలి రైడ్‌లోనే సుబ్రమణ్యంను ఔట్ చేసి బెంగాల్ పాయింట్ల ఖాతా తెరిచాడు. మరోవైపు పర్దీప్ నార్వల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మ్యాచ్ 16వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన బెంగళూరు రైడర్ అక్షిత్‌ను నితీశ్‌కుమార్ ఉడుం పట్టుతో బెంగాల్‌కు పాయింట్ అందించాడు. రెండు నిమిషాల వ్యవధిలో రైడ్‌కు వెళ్లిన మన్‌దీప్‌సింగ్..ఈసారి నితిన్ రావల్, పర్దీప్ నర్వాల్‌ను ఔట్ రెండు పాయింట్లతో బెంగాల్ జట్టులో జోష్ నింపాడు. బెంగళూరు తరఫున పర్దీప్ నార్వల్ విఫలమైనా..అక్షిత్ వరుస పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఓవైపు రైడింగ్‌తో పాటు డిఫెన్స్‌లోనూ బెంగాల్ జోరు కనబర్చడంతో బెంగళూరు ఢీలా పడిపోయింది. ఈ క్రమంలో తొలి అర్ధభాగం ముగిసే సరికి బెంగాల్ 15-12తో బెంగళూరుపై ఆధిక్యంలో నిలిచింది.అదే దూకుడు: కీలకమైన ద్వితీయార్ధంలో బెంగాల్ పాయింట్ల వేటలో అదే దూకుడు కనబరిచింది. అంతగా అనుభవం లేని బెంగళూరును బోల్తా కొట్టిస్తూ కీలక పాయింట్లు కొల్లగొట్టింది. మ్యాచ్ 17వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన నితిన్‌కుమార్..లకీకుమార్ను ఔట్ చేసి బెంగాల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. నిమిషం తేడాతో రైడ్‌కు వచ్చిన మనిందర్‌సింగ్..నితిన్ నార్వల్, అజింక్యా పవార్‌ను ఔట్ చేయడంతో బెంగళూరు తొలిసారి ఆలౌటైంది. అంతగా ప్రభావం చూపని పర్దీప్ నార్వల్ స్థానంలో మరో ప్లేయర్‌ను బెంగళూరు సబ్‌స్టిట్యూట్‌గా తీసుకుంది. మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగస్తుందనగా బెంగళూరు రెండో సారి ఆలౌట్ కావడంతో బెంగాల్ విజయం ఖరారైంది. మ్యాచ్ ఆసాంతం మన్‌దీప్‌సింగ్ రైడింగ్ జోరు సాగింది. -
హర్యానాదే ఆల్‌రౌండ్ షో
హైదరాబాద్, నవంబర్ 7: ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మ్యాచ్‌లను రసవత్తరంగా సాగుతున్నాయి. పాయింట్ పాయింట్‌కు ప్లేయర్లు కసికొద్ది తలపడుతున్నారు. గురువారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 35-22తో గుజరాత్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన హర్యానా తరఫున వినయ్(9), మహమ్మద్ రెజా(6),సంజయ్(4) అదరగొట్టారు. వినయ్ రైడింగ్‌లో విజృంభిస్తే..రెజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మరోవైపు గుమన్‌సింగ్(11) ఒంటరిపోరాటం గుజరాత్‌ను గెలిపించలేకపోయింది. ఈ విజయంతో హర్యానా 21 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోగా, గుజరాత్ జెయింట్స్(7) ఆఖరి స్థానానికి పరిమితమైంది.స్టీలర్స్ జోరు.. ప్రొ కబడ్డీ లీగ్‌లో ఓటములతో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న హర్యానా స్టీలర్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. లీగ్‌లో ముందంజ వేయాలంటే కచ్చితంగా గెలువాల్సిన పరిస్థితుల మధ్య బరిలోకి దిగిన రెండు జట్లు అద్భుతంగా పోరాడుతున్నాయి. ఇప్పటికే వరుస ఓటములతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన గుజరాత్‌పై హర్యానా ఒకింత ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్ 19వ నిమిషంలో రోహిత్, నీరజ్, బాలాజీని ఔట్ చేయడం ద్వారా హర్యానాకు వినయ్ ఒకే రైడ్‌లో మూడు పాయింట్లు తీసుకొచ్చాడు.ఓవైపు హర్యానాకు వినయ్ వరుస రైడ్లలో పాయింట్లు తీసుకొస్తే..మరోవైపు గుజరాత్ తరఫున గుమన్‌సింగ్ పాయింట్లు అందించాడు. అయితే 16వ నిమిషంలో రైడ్‌కు వెళ్లిన వినయ్‌ను గుమన్‌సింగ్ సూపర్ ట్యాకిల్‌తో కట్టడి చేశాడు. ఈ క్రమంలో మరింత పట్టు బిగించిన స్టీలర్స్ వరుస రైడ్లతో గుజరాత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన నీరజ్‌కుమార్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి నిమిషంలో రైడ్‌కు వచ్చిన నవీన్..జితేందర్‌యాదవ్‌ను ఔట్ చేయడంతో 10వ నిమిషంలో గుజరాత్ ఆలౌటైంది. స్టీలర్స్ పక్కా వ్యూహాంతో గుజరాత్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ తొలి అర్ధభాగం ముగిసే సరికి 18-13తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.అదే దూకుడు: తొలి అర్ధభాగంలో హర్యానాకు వినయ్, జయ పాయింట్ల వేటలో కీలకంగా వ్యవహరించగా, గుమన్‌సింగ్..గుజరాత్‌కు ఆయువుపట్టుగా నిలిచాడు. తొలిరైడ్‌కు వెళ్లిన గుమన్‌సింగ్..నవీన్‌ను ఔట్ చేసి జట్టులో జోష్ నింపే ప్రయత్నం చేశాడు. ఓవైపు వినయ్ తనదైన దూకుడు కొనసాగిస్తే..అతనికి మహమ్మద్ రెజా జతకలిశాడు. వరుస రైడ్లలో పాయింట్లకు తోడు డిఫెన్స్‌లోనూ చెలరేగిన రెజా స్టీలర్స్‌కు కీలక పాయింట్లు అందించాడు. గుమన్‌సింగ్ ఒంటరి పోరాటం గుజరాత్‌ను ఒడ్డున పడేయలేకపోయింది. దీంతో మరో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. -
బెంగళూర్ బుల్స్ రెండో విక్టరీ
4 నవంబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆడిన తొలి ఆరు మ్యాచుల్లో ఐదింట పరాజయాలు చవిచూసిన బెంగళూర్ బుల్స్.. ఎట్టకేలకు సీజన్లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ పర్దీప్ నర్వాల్ బరిలో లేకపోయినా.. బలమైన తమిళ్ తలైవాస్‌పై 36-32తో నాలుగు పాయింట్ల తేడాతో బెంగళూర్ బుల్స్ ఉత్కంఠ విజయం సాధించింది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ తడబాటుకు గురైంది. సీజన్లో ఆరు మ్యాచులు ఆడిన తమిళ్ తలైవాస్‌కు ఇది రెండో పరాజయం. బెంగళూర్ బుల్స్ ఆటగాళ్లలో అజింక్య పవార్ (6 పాయింట్లు), అక్షిత్ (6 పాయింట్లు), సురిందర్ దెహల్ (5 పాయింట్లు) రాణించారు. తమిళ్ తలైవాస్ తరఫున నరందర్ (6 పాయింట్లు), సచిన్ (5) రాణించారు. బెంగళూర్ పైచేయి : వరుస పరాజయాలు చవిచూసిన బెంగళూర్ బుల్స్.. సోమవారం తమిళ్ తలైవాస్‌తో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసింది. డిఫెండర్లు అంచనాలకు మించి రాణించటంతో ప్రథమార్థం ఆటలో తమిళ్ తలైవాస్‌పై బెంగళూర్ బుల్స్ ఓ పాయింట్ ఆధిక్యం సాధించింది. రెయిడర్లు అజింక్య పవార్, జై భగవాన్ కూతలో మెప్పించారు. డిఫెండర్లు సౌరభ్ నందల్, సురిందర్ దెహల్ మెరుపు ట్యాకిల్స్ చేశారు. తమిళ్ తలైవాస్ సైతం రెయిడ్‌లో కాస్త నిరాశపరిచినా.. డిఫెన్స్‌లో మెప్పించింది. ఉత్కంఠగా సాగిన తొలి 20 నిమిషాల ఆటలో బెంగళూర్ బుల్స్ 14-13తో పైచేయి సాధించింది.సెకండ్‌హాఫ్‌లో తమిళ్ తలైవాస్ పుంజుకుంది. డిఫెండర్ల జోరుకు.. రెయిడర్లు సైతం జత కలిశారు. దీంతో తమిళ్ తలైవాస్ వేగంగానే కోలుకుంది. చివరి పది నిమిషాల ఆటలో ఏకంగా మూడు పాయింట్ల ముందంజలో నిలిచిన తమిళ్ తలైవాస్.. ఆ తర్వాత నిరాశపరిచింది. 36వ నిమిషంలో 26-26తో స్కోరు సమం చేసింది బెంగళూర్ బుల్స్. ఆఖరు ఐదు నిమిషాల్లో తలైవాస్‌ను ఆలౌట్ చేసి 29-26తో మూడు పాయింట్ల ఆధిక్యం సాధించింది బుల్స్. ఆఖరు వరకు అదే జోరు కొనసాగించిన బెంగళూర్ బుల్స్ 36-32తో తమిళ్ తలైవాస్‌ను బోల్తా కొట్టించింది. -
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11: ఎదురులేని పుణెరి పల్టన్
హైదరాబాద్, 4 నవంబర్ 2024 : డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్ టాప్ లేపింది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఐదో విజయం ఖాతాలో వేసుకున్న పుణెరి పల్టన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం మరింత పదిలం చేసుకుంది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 49-30తో పుణెరి పల్టన్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్నప్పటికీ సమిష్టిగా మెరిసిన పుణెరి పల్టన్ 19 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేయటం విశేషం. పుణెరి పల్టన్ ఆటగాళ్లలో ఆకాశ్ షిండె (11 పాయింట్లు) సూపర్ టెన్తో మెరువగా.. పంకజ్ మోహితె (8 పాయింట్లు), మోహిత్ గోయత్ ( 5 పాయింట్లు), ఆమన్ ( 5 పాయింట్లు), గౌరవ్ ఖత్రి ( 5 పాయింట్లు) అదరగొట్టారు. గుజరాత్ జెయింట్స్ తరఫున గుమన్ సింగ్ ( 13 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో ఒంటరి పోరాటం చేశాడు. పుణెరి పల్టన్ ఏడు మ్యాచుల్లో ఐదో విజయం సాధించగా, గుజరాత్ జెయింట్స్ ఐదు మ్యాచుల్లో నాల్గో పరాజయం చవిచూసింది.పల్టన్ వన్‌సైడ్ షో : వరుస విజయాల జోరుమీదున్న డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్.. గుజరాత్ జెయింట్స్‌పై పంజా విసిరింది. ప్రథమార్థంలోనే ఆ జట్టుపై ఏకంగా 21 పాయింట్ల భారీ ఆధిక్యం సాధించింది. ప్రథమార్థం తొలి ఐదు నిమిషాల్లో, చివరి ఐదు నిమిషాల ఆటలో గుజరాత్ జెయింట్స్‌ను ఆలౌట్ చేసిన పుణెరి పల్టన్ 30-9తో వన్‌సైడ్ షో చేసింది. కెప్టెన్ అస్లాం ఇనందార్ బరిలో లేకపోయినా.. ఆకాశ్ షిండే, పంకజ్ మోహితె, మోహిత్ గోయత్‌లు కూతలో కేక పెట్టించారు. పంకజ్ మోహితె, మోహిత్ గోయత్‌లు కండ్లుచెదిరే సూపర్ రెయిడ్లతో ఆకట్టుకున్నారు. డిఫెన్స్‌లో గౌరవ్ ఖత్రి, ఆమన్ ట్యాకిల్స్ జెయింట్స్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. తొలి పది నిమిషాల్లో 14-5తో ముందంజ వేసిన పుణెరి పల్టన్.. తర్వాతి పది నిమిషాల్లో రెట్టించిన ఉత్సాహంతో పాయింట్లు సాధించింది. గుజరాత్ జెయింట్స్ పూర్తిగా తేలిపోయింది. గుమన్ సింగ్ కూతలో మెరిసినా.. ఇతర ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారు.గుజరాత్ పుంజుకున్నా.. పుణెరి అదే జోరు : విరామం అనంతరం సైతం పుణెరి పల్టన్ జోరు తగ్గలేదు. గుజరాత్ జెయింట్స్ ఆట కాస్త మెరుగైనా.. పుణెరి పల్టన్‌కు పోటీ ఇచ్చే స్థాయిలో రాణించలేదు. ద్వితీయార్థం తొలి పది నిమిషాల తర్వాత పుణెరి పల్టన్ 41-16తో 25 పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది. క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిన గుజరాత్ జెయింట్స్ ఆఖరు ఐదు నిమిషాల ఆట మిగిలి ఉండగా పుణెరి పల్టన్‌ను ఆలౌట్ చేసింది. పాయింట్ల అంతరం తగ్గించేందుకు చివరి ఐదు నిమిషాల్లో మంచి ప్రయత్నమే చేసింది. అయినా, పుణెరి పల్టన్ అలవోకగా సీజన్లో ఐదో విజయం సాధించింది. ద్వితీయార్థంలో పుణెరి పల్టన్ 19 పాయింట్లు సాధించగా, గుజరాత్ జెయింట్స్ 21 పాయింట్లు దక్కించుకుంది. -
అదరగొట్టిన తెలుగు టైటాన్స్
హైదరాబాద్, 2 నవంబర్ 2024 : తెలుగు టైటాన్స్ పంజా విసిరింది. బెంగళూర్ బుల్స్‌ను బోల్తా కొట్టించి సీజన్లో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ మూడు పాయింట్ల తేడాతో బెంగళూర్ బుల్స్‌పై గెలుపొందింది. తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు పవన్ సెహ్రావత్ (14 పాయింట్లు), ఆశీష్ నర్వాల్ (6 పాయింట్లు), అజిత్ పవార్ (5 పాయింట్లు), విజయ్ మాలిక్ (5 పాయింట్లు) అదరగొట్టారు. బెంగళూర్ బుల్స్ తరఫున ఆల్‌రౌండర్లు పంకజ్ (9 పాయింట్లు), నితిన్ రావల్ (7 పాయింట్లు), రెయిడర్ అజింక్య పవార్ (9 పాయింట్లు), డిఫెండర్ అరుల్ నంద బాబు వేలుస్వామి (4 పాయింట్లు) రాణించారు. తెలుగు టైటాన్స్‌కు ఇది ఆరు మ్యాచుల్లో మూడో విజయం కాగా.. బెంగళూర్ బుల్స్‌కు ఆరు మ్యాచుల్లో ఇది ఐదో పరాజయం కావటం గమనార్హం. ఈ విజయంతో తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రెయిడర్ పవర్ సెహ్రావత్ సీజన్లో అత్యధిక రెయిడ్ పాయింట్లు (65) సాధించిన ఆటగాడిగా నిలిచాడు.తెలుగు టైటాన్స్ పంజా : ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. బెంగళూర్ బుల్స్‌పై ధనాధన్ ప్రదర్శన చేసింది. కూతలో టైటాన్స్ కేక అనిపించగా తొలి పది నిమిషాల్లోనే తెలుగు జట్లు ఏకంగా 15 పాయింట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. రెయిడర్లు పవన్ సెహ్రావత్, ఆశీష్ నర్వాల్‌లు కూతకెళ్లి బుల్స్‌ను ఆలౌట్ చేశారు. దీంతో 18-3తో తెలుగు టైటాన్స్ తిరుగులేని స్థానంలో నిలిచింది. తర్వాతి పది నిమిషాల ఆటలో బెంగళూర్ బుల్స్ కాస్త కోలుకుంది. డిఫెండర్లు మెరవటంతో సూపర్ ట్యాకిల్స్‌తో పాయింట్లు సాధించింది. ప్రథమార్థం ఆటలో తెలుగు టైటాన్స్ 23-12తో నిలిచింది. విరామ సమయానికి 11 పాయింట్ల ముందంజలో నిలిచింది.బుల్స్ మెరుపు వేగంతో.. : విరామం అనంతరం బెంగళూర్ బుల్స్ భిన్నమైన ఆటను ప్రదర్శించింది. ద్వితీయార్థం ఆట మొదలైన నాలుగు నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేసింది. చివరి ఎనిమిది నిమిషాల ఉండగా మరోసారి టైటాన్స్ ఆలౌట్ చేసింది. మెరుపు ట్యాకిల్స్‌కు కూత పాయింట్లు సైతం తోడయ్యాయి. దీంతో భారీ వెనుకంజ నుంచి పుంజుకుని 31-33తో రేసులోకి వచ్చింది బెంగళూర్ బుల్స్. స్టార్ రెయిడర్ పవర్ సెహ్రావత్ విఫలమైతే.. టైటాన్స్ శిబిరం నైరాశ్యంలో పడటం ప్రతికూలంగా మారింది. ఆఖరు వరకు టైటాన్స్‌కు పోటీ ఇచ్చిన బెంగళూర్ బుల్స్ ద్వితీయార్థంలో 23 పాయింట్లు సాధించగా.. ఆతిథ్య జట్టు 15 పాయింట్లు మాత్రమే సాధించింది. -
పట్నా పైరేట్స్ సూపర్ షో
హైదరాబాద్: పీకెఎల్ మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ముచ్చటగా మూడో విజయం సాధించింది. శనివారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై 42-37తో పట్నా పైరేట్స్ పైచేయి సాధించింది. రెయిడింగ్‌లో, డిఫెన్స్‌లో హవా చూపించిన పైరేట్స్ 5 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను చిత్తు చేసింది. పట్నా పైరేట్స్ రెయిడర్ దేవాంక్ (11 పాయింట్లు) సూపర్ టెన్ షోతో మెరువగా.. అయాన్ ( 9 పాయింట్లు) అదరగొట్టాడు. యూపీ యోధాస్ ఆటగాళ్లలో గగన్ గౌడ (9 పాయింట్లు), భరత్ (6 పాయింట్లు) , సురేందర్ గిల్(5 పాయింట్లు) రాణించినా ఆ జట్టుకు సీజన్లో మూడో పరాజయం తప్పలేదు.పైరేట్స్ ముందంజ : యూపీ యోధాస్, పట్నా పైరేట్స్ మ్యాచ్‌లో మూడుసార్లు ప్రథమార్థంలో ముందంజ వేసింది. తొలి 20 నిమిషాల ఆటలో 23-19తో నాలుగు పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది. పైరేట్స్ ఆధిక్యం సాధించినా.. ప్రథమార్థం హోరాహోరీగా సాగింది. రెయిడింగ్, డిఫెన్స్‌లో ఇరు జట్లు తగ్గ పోటీనిచ్చాయి. దీంతో ఇరు జట్లు ఆలౌట్ సైతం చవిచూశాయి. డిఫెన్స్‌లో పైచేయి సాధించిన పట్నా పైరేట్స్.. తొలి అర్థభాగం ఆటను ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ శుభమ్ షిండె మెరుపు ట్యాకిల్స్‌తో అదరగొట్టాడు. రెయిడర్ దేవాంక్ సహజంగానే తనదైన జోరు కొనసాగించాడు.యోధాస్‌కు నిరాశ : ఆట ద్వితీయార్థంలో యూపీ యోధాస్ పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రథమార్థం ఆధిక్యం కొనసాగించిన పట్నా పైరేట్స్.. ఓ దశలో ఏడు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. యూపీ యోధాస్ రెయిడర్లు సురేందర్ గిల్, గగన్ గౌడ సహా ఆల్‌రౌండర్ భరత్ వరుసగా పాయింట్లు సాధించారు. యూపీ యోధాస్‌ను ఆఖరు వరకు రేసులో నిలపాలని చూశారు. ఇదే సమయంలో పట్నా పైరేట్స్ సైతం పాయింట్ల వేటలో దూకుడు చూపించింది. దేవాంక్‌కు అయాన్ సైతం జత కలవటంతో పట్నా పైరేట్స్ ఏ దశలోనూ ఆధిక్యం కోల్పోలేదు. ఆఖరు రెయిడ్లోనూ రెండు పాయింట్లు సాధించిన అయాన్ పట్నా పైరేట్స్‌కు మెరుపు విజయాన్ని అందించాడు. ద్వితీయార్థంలో యూపీ యోధాస్ 18 పాయింట్లు సాధించగా, పట్నా పైరేట్స్ 19 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. -
హర్యానా స్టీలర్స్ హ్యాట్రిక్ విజయం
హైదరాబాద్, 30 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 రన్నరప్ హర్యానా స్టీలర్స్ పీకెఎల్ 11వ సీజన్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన హర్యానా స్టీలర్స్ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో సాధికారిక విజయాలు సాధించింది. బుధవారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై 30-28తో హర్యానా స్టీలర్స్ గెలుపొందింది. నాలుగు మ్యాచుల్లో హర్యానా స్టీలర్స్‌కు ఇది మూడో విక్టరీ కాగా.. యూపీ యోధాస్‌కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో పరాజయం. ఈ విజయంతో హర్యానా స్టీలర్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానం నుంచి నాల్గో స్థానానికి ఎగబాకింది. హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లలో రెయిడర్ వినయ్ (8 పాయింట్లు), డిఫెండర్ సంజయ్ ధుల్ (6 పాయింట్లు) రాణించారు. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ ( 9 పాయింట్లు), భరత్ (5 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.ప్రథమార్థంలోనూ యూపీ యోధాస్‌పై హర్యానా స్టీలర్స్ పైచేయి సాధించింది. తొలి అర్థభాగం ఆటలో ఇరు జట్లకు పాయింట్లు అంత సులువుగా దక్కలేదు. కూతలో హర్యానా, యూపీ నాలుగేసి పాయింట్లు సాధించాయి. కానీ స్టీలర్స్ డిఫెండర్ సంజయ్ ధుల్ మెరుపు ట్యాకిల్స్ చేశాడు. హర్యానా స్టీలర్స్‌కు డిఫెన్స్‌లో ఏడు పాయింట్లు అందించాడు. దీంతో తొలి 20 నిమిషాల ఆటలో హర్యానా స్టీలర్స్ 11-9తో పైచేయి సాధించింది. విరామ సమయానికి రెండు పాయింట్ల ఆధిక్యంతో నిలిచింది. ద్వితీయార్థంలో స్టీలర్స్ ఆధిపత్యం కొనసాగినా.. ఆఖరు ఐదు నిమిషాల్లో యూపీ యోధాస్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. పాయింట్ల లోటు నెమ్మదిగా పూడ్చకుంటూ హర్యానాపై యోధాస్ ఒత్తిడి పెంచింది. హర్యానా 26-24తో ముందంజలో నిలువగా.. చివరి రెండు నిమిషాల ఆటలో ఇరు జట్లు ఒక్కో పాయింట్ సాధిస్తూ వచ్చాయి. ఆఖరు వరకు రెండు పాయింట్ల ఆధిక్యత నిలుపుకున్న హర్యానా స్టీలర్స్ సీజన్లలో మూడో విజయం ఖాతాలో వేసుకుంది. -
ఆశీష్ మెరిసే.. టైటాన్స్ మురిసే
హైదరాబాద్, 28 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి నుంచి పుంజుకున్న తెలుగు టైటాన్స్.. సోమవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై మెరుపు విజయం సాధించింది. ప్రథమార్థంలో వెనుకంజ వేసిన టైటాన్స్.. ద్వితీయార్థంలో దుమ్మురేపే ప్రదర్శన చేసింది. 2 పాయింట్ల తేడాతో సీజన్లలో రెండో విజయం సాధించి.. వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. తెలుగు టైటాన్స్ రెయిడర్లు ఆశీష్ నర్వాల్ (9 పాయింట్లు), పవన్ సెహ్రావత్(5 పాయింట్లు), డిఫెండర్ అంకిత్ (4 పాయింట్లు) రాణించారు. పట్నా పైరేట్స్ తరఫున రెయిడర్లు దేవాంక్(7 పాయింట్లు), అయాన్ (6 పాయింట్లు) రాణించారు. పట్నా పైరేట్స్‌కు మూడు మ్యాచుల్లో ఇది రెండో ఓటమి కాగా.. తెలుగు టైటాన్స్‌కు ఐదు మ్యాచుల్లో ఇది రెండో విజయం కావటం విశేషం. ప్రథమార్థం హోరాహోరీ : వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్.. పట్నా పైరేట్స్‌తో మ్యాచ్‌లో సైతం శుభారంభం చేయలేదు. స్టార్ రెయిడర్ పవన్ సెహ్రావత్ తొలి కూతలోనే అవుట్ కాగా.. ఐదు నిమిషాల వరకు అతడు బెంచ్‌పైనే కూర్చుకున్నాడు. ఆరో నిమిషంలో పవన్ సెహ్రావత్ రాకతో తెలుగు టైటాన్స్ పాయింట్ల వేట మొదలైంది. పది నిమిషాల అనంతరం 5-7తో టైటాన్స్ రెండు పాయింట్ల వెనుకంజలో నిలిచింది. కానీ ఆ తర్వాత పట్నా పైరేట్స్‌కు గట్టి పోటీ ఇచ్చింది. పైరేట్స్ రెయిడర్లలో అయాన్, దేవాంక్‌లు మెరువగా.. డిఫెండర్లు దీపక్, అంకిత్‌లు ఆకట్టుకున్నారు. దీంతో ప్రథమార్థం అనంతరం పట్నా పైరేట్స్ 13-10తో మూడు పాయింట్ల ముందంజలో నిలిచింది. రెయిడింగ్, డిఫెన్స్‌లో పైరేట్స్‌తో సమవుజ్జీగా నిలిచిన టైటాన్స్.. అదనపు పాయింట్ల రూపంలో ఆధిక్యాన్ని కోల్పోయింది. పుంజుకున్న టైటాన్స్ : విరామం అనంతరం తెలుగు టైటాన్స్ గొప్పగా పుంజుకుంది. ఓ ట్యాకిల్, ఓ రెయిడ్ పాయింట్‌తో 12-13తో పాయింట్ల అంతరాన్ని కుదించింది. పవన్ సెహ్రావత్‌కు ఆశీష్ నర్వాల్ జతకలిశాడు. దీంతో టైటాన్స్ వరుస పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ద్వితీయార్థం తొలి పది నిమిషాల్లో పది పాయింట్లు సాధించిన టైటాన్స్ 20-18తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో పట్నా పైరేట్స్ కేవలం ఐదు పాయింట్లు మాత్రమే సొంతం చేసుకుంది. పట్నా పైరేట్స్ రెయిడర్లు దేవాంక్, అయాన్లు మెరవటంతో తెలుగు టైటాన్స్‌పై ఒత్తిడి పెరిగింది. 22-21తో ఆధిక్యం ఒక్క పాయింట్‌కు చేరుకుంది. ఈ సమయంలో ఆశీష్ నర్వాల్ సూపర్ రెయిడ్‌తో అదరగొట్టాడు. మూడు పాయింట్లు తీసుకొచ్చి 25-21తో టైటాన్స్‌ను ఆధిక్యంలో నిలిపాడు. పైరేట్స్‌కు అయాన్ సూపర్ రెయిడ్ ఇవ్వగా.. ఆ జట్టు 25-25తో స్కోరు సమం అయ్యింది. ఆఖరు నిమిషంలో ఒత్తిడిలోనూ అద్బుతంగా రాణించిన తెలుగు టైటాన్స్ చివరి రెండు కూతల్లో పాయింట్లు సాధించింది. 28-26తో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. -
తలైవాస్, పాంథర్స్ మ్యాచ్ టై
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్ టైగా ముగిసింది. ఆఖరు రెయిడ్ వరకు ఉత్కంఠ రేపిన జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ 30-30తో టైగా ముగిసింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్, జైపూర్ పింక్ పాంథర్స్ సమవుజ్జీలుగా నిలిచి పాయింట్లను సమంగా పంచుకున్నాయి. జైపూర్ పింక్ పాంథర్స్ ఆటగాళ్లలో అర్జున్ (7 పాయింట్లు), వికాశ్ (6 పాయింట్లు), రెజా (3 పాయింట్లు), అంకుశ్ ( 4 పాయింట్లు) రాణించారు. తమిళ్ తలైవాస్ శిబిరం నుంచి సచిన్ (11 పాయింట్లు), నరేందర్ (3 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ప్రథమార్థంలో ఐదు పాయింట్ల వెనుకంజలో నిలిచిన తలైవాస్.. సచిన్ సూపర్ టెన్ షోతో ద్వితీయార్థంలో గొప్పగా పుంజుకుంది. జైపూర్ చేజేతులా విజయాన్ని దూరం చేసుకోగా.. తలైవాస్ ఓటమి నుంచి తప్పించుకుంది.జైపూర్ సమిష్టిగా.. :గత మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ చేతిలో ఓడిన జైపూర్ పింక్ పాంథర్స్.. తమిళ్ తలైవాస్‌తో మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించింది. ఆరంభం నుంచి రెయిడింగ్‌లో, డిఫెన్స్‌లో పాయింట్లు సాధిస్తూ ఆధిక్యం నిలుపుకుంది. తొలి 20 నిమిషాల ఆట అనంతరం జైపూర్ పింక్ పాంథర్స్ 21-16తో ముందంజ వేసింది. ఐదు పాయింట్లతో తలైవాస్‌పై పైచేయి సాధించింది. తలైవాస్ రెయిడర్లు సచిన్, నరేందర్‌లు మూడేసి బోనస్ పాయింట్లు సాధించగా జైపూర్‌కు పోటీ ఇవ్వగలిగింది. జైపూర్‌లో అర్జున్ దేశ్వాల్కు వికాశ్, రెజా, అంకుశ్‌లు సహకరించారు. దీంతో పింక్ పాంథర్స్ ప్రథమార్థంలో విలువైన ఆధిక్యం సొంతం చేసుకుంది.పుంజుకున్న తలైవాస్ విరామ సమయం అనంతరం జైపూర్ పింక్ పాంథర్స్ నెమ్మదించగా.. తమిళ్ తలైవాస్ వరుసగా పాయింట్లు ఖాతాలో వేసుకుంది. కానీ జైపూర్ పింక్ పాంథర్స్ ఆధిక్యాన్ని నిలుపుకుంది. సచిన్ సూపర్ రెయిడ్‌కు తోడు విశాల్ సక్సెస్ఫుల్ రెయిడ్‌తో మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 26-29తో పాయింట్ల అంతరాన్ని కుదించిన తమిళ్ తలైవాస్ ఆఖరు వరకు రేసులోనే నిలిచింది. ఆఖర్లో కూతలో, పట్టులో అదరగొట్టిన తలైవాస్ స్కోరు సమం చేసింది. సక్సెస్ఫుల్ రెయిడ్‌తో అంతరాన్ని ఓ పాయంట్‌కు కుదించి.. ఆఖరు కూతకు వచ్చిన జైపూర్ రెయిడర్ రెజాను అవుట్ చేసింది. దీంతో 30-30తో స్కోరు సమమైంది. -
PKL 2024: పుణెరి పల్టాన్ తీన్మార్
హైదరాబాద్, 25 అక్టోబర్ 2024 : మాజీ చాంపియన్ పుణెరి పల్టాన్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ముచ్చటగా మూడో విజయం సాధించింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బెంగళూర్ బుల్స్‌పై పుణెరి పల్టాన్ 14 పాయింట్ల తేడాతో ఏకపక్ష విజయం నమోదు చేసింది. జట్టుగా రాణించటంలో పూర్తిగా విఫలమైన బెంగళూర్ బుల్స్ సీజన్లో వరుసగా నాల్గో మ్యాచ్‌లో చేతులెత్తేసింది. 36-22తో బెంగళూర్ బుల్స్‌పై పుణెరి పల్టాన్ ఏకపక్ష విజయం సాధించింది. పల్టాన్ తరఫున పంకజ్ మోహితె (6 పాయింట్లు), మోహిత్ గోయత్ (6 పాయింట్లు) రాణించారు. బెంగళూర్ బుల్స్ ఆటగాళ్లలో పంకజ్ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. బెంగళూర్ బుల్స్‌కు ఏదీ కలిసి రావటం లేదు. హ్య్రాటిక్ పరాజయాలు చవిచూసిన బుల్స్.. నాల్గో మ్యాచ్‌లోనూ ఏమాత్రం మారలేదు. కెప్టెన్ పర్దీప్ నర్వాల్ పేలవ ప్రదర్శన ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. శుక్రవారం పుణెరి పల్టాన్‌తో మ్యాచ్‌లో బుల్స్ పూర్తిగా తేలిపోయింది. తొలి అర్థభాగం ఆటలో ఆ జట్టు 11-18తో నిలిచింది. తొలి పది నిమిషాల ఆటలో ఆ జట్టు పాయింట్లు రెండెంకలకు చేరుకోలేదు. ప్రథమార్థంలో చివర్లో పంకజ్ మెరుపులతో బుల్స్ 11 పాయింట్ల వరకు చేరుకుంది. మరోవైపు పల్టాన్ ఆటగాళ్లు పంకజ్ మోహితె, మోహిత్ గోయత్‌లకు కెప్టెన్ అస్లాం ఇనామ్దార్ (5 పాయింట్లు), గౌరవ్ ఖత్రి (4 పాయింట్లు), ఆమన్ (4 పాయింట్లు) జతకలిశారు. మ్యాచ్ రెండో అర్థభాగంలో బెంగళూర్ బుల్స్ ప్రదర్శన కాస్త మెరుగైనా.. ఏ దశలోనూ పుణెరి పల్టాన్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. విరామం అనంతరం సైతం మెరుపు ప్రదర్శన పునరావృతం చేసిన పుణెరి పల్టాన్ చివరి 20 నిమిషాల ఆటలోనూ 18-11తో బుల్స్‌ను చిత్తు చేసింది. దీంతో పుణెరి పల్టాన్ 36-22తో బెంగళూర్‌పై అలవోక విజయం సాధించింది. సీజన్లలో పుణెరి పల్టాన్‌కు ఇది నాలుగు మ్యాచుల్లో మూడో విజయం. ఈ విక్టరీతో పీకెఎల్ 11 పాయింట్ల పట్టికలో పుణెరి పల్టాన్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. వరుసగా నాల్గో పరాజయంతో బెంగళూర్ బుల్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. -
PKL 2024: దేవాంక్ సూపర్ షో
హైదరాబాద్, పట్నా పైరేట్స్ స్టార్ రెయిడర్ దేవాంక్ కండ్లుచెదిరే కూతతో రికార్డులు తిరగరాశాడు. కూతకెళ్లి ఏకంగా 25 పాయింట్లు సాధించిన దేవాంక్ ఒంటిచేత్తో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌కు ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తొలి విజయం అందించాడు. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌పై పట్నా పైరేట్స్ 42-40తో ఉత్కంఠ విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆది నుంచి ఆధిక్యంలో కొనాసాగిన తమిళ్ తలైవాస్ హ్యాట్రిక్ విజయం దిశగా సాగింది. కానీ కీలక సమయంలో తలైవాస్‌ను ఆలౌట్ చేసిన దేవాంక్.. పట్నా పైరేట్స్‌ను గెలుపు పట్టాలెక్కించాడు. పట్నా పైరేట్స్ తరఫున ఆల్‌రౌండర్ అనికెత్ (4 పాయింట్లు), గుర్దీప్ (2 పాయింట్లు), సందీప్ (2 పాయింట్లు) మెరిశారు. తమిళ్ తలైవాస్ రెయిడర్ నరేందర్ ఖండోలా (15 పాయింట్లు), సచిన్ (6 పాయింట్లు) సహా డిఫెండర్ నితేశ్ (4 పాయింట్లు) మెరిసినా.. ఆ జట్టుకు సీజన్లో తొలి పరాజయం తప్పలేదు.తలైవాస్ జోరు తమిళ్ తలైవాస్ వరుసగా మూడో మ్యాచ్‌లో జోరు చూపించింది. తలైవాస్, పట్నా పైరేట్స్ తొలి రెయిడ్‌లోనే పాయింట్ల ఖాతా తెరిచినా.. ఆ తర్వాత తలైవాస్ జొరందుకుంది. తలైవాస్ రెయిడర్లకు డిఫెండర్లు సైతం జత కలవటంతో పట్నా పైరేట్స్‌కు చిక్కులు తప్పలేదు. తొలి 20 నిమిషాల ఆట అనంతరం తమిళ్ తలైవాస్ 5 పాయింట్ల ఆధిక్యం సాధించింది. నరేందర్ సూపర్ టెన్తో కూతలో చెలరేగగా.. డిఫెండర్ నితేశ్ నాలుగు ట్యాకిల్స్‌తో మెరిశాడు. దీంతో తలైవాస్ 23-18లో పట్నా పైరేట్స్‌పై పైచేయి సాధించింది. పైరేట్స్ తరఫున దేవాంక్ 11 రెయిడ్ పాయింట్లతో మెరిసినా.. డిఫెన్స్‌లో పైరేట్స్ తేలిపోయింది. కూతలో తలైవాస్ కంటే మెరుగ్గా రాణించినా.. ట్యాకిల్స్‌లో వెనుకంజ వేయటంతో ఆధిక్యం కోల్పోవాల్సి వచ్చింది.పుంజుకున్న పైరేట్స్ ద్వితీయార్థంలోనూ తమిళ్ తలైవాస్ ఆధిక్యం కొనసాగించింది. కానీ ఆట మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా మ్యాచ్ మలుపు తిరిగింది. కండ్లుచెదిరే కూతతో ఒంటరి పోరాటం చేసిన పైరేట్స్ రెయిడర్ దేవాంక్ 34వ నిమిషంలో సూపర్ రెయిడ్‌తో చెలరేగాడు. తలైవాస్ మ్యాట్‌పై నలుగురు ఆటగాళ్లను అవుట్ చేయటంతో పాటు ఆ జట్టును ఆలౌట్ చేశాడు. దీంతో నాలుగు పాయింట్ల వెనుకంజ నుంచి పైరేట్స్ ఏకంగా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరు ఐదు నిమిషాల్లో ఆధిక్యం నిలుపుకున్న పైరేట్స్ సీజన్లో తొలి విజయం సాధించింది. మ్యాచ్‌లో మెజార్టీ భాగం ఆధిక్యంలో నిలిచిన తలైవాస్ ఒక్క ఆలౌట్తో కుదేలైంది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో మూడు మ్యాచుల్లో తలైవాస్‌కు ఇది తొలి పరాజయం. -
PKL 11: హర్యానా స్టీలర్స్ గెలుపు
హైదరాబాద్, 24 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో హర్యానా స్టీలర్స్ తొలి విజయం నమోదు చేసింది. గత సీజన్ ఫైనలిస్ట్ హర్యానా స్టీలర్స్‌కు తొలి మ్యాచ్‌లో చుక్కెదురైనా.. రెండో మ్యాచ్‌లో గొప్పగా పుంజుకుంది. వరుస విజయాల ఊపుమీదున్న జైపూర్ పింక్ పాంథర్స్‌ను 37-25తో చిత్తు చేసి సీజన్లో తొలి విక్టరీ సాధించింది. కూతలో, పట్టులో హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించటంతో పింక్ పాంథర్స్‌పై ఆ జట్టు 12 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెయిడర్లు వినయ్ (10), నవీన్ (6), శివం (4).. డిఫెండర్లు రాహుల్ (3), మహ్మద్రెజా (2) సూపర్ షోతో మెరిశారు. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున రెయిడర్ అభిజిత్ మాలిక్ (6) ఒక్కడే ఆకట్టుకున్నాడు. రెజా (2), అర్జున్ (3), శ్రీకాంత్ (2) నిరాశపరిచారు.స్టీలర్స్ షో : తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన గత సీజన్ రన్నరప్ హర్యానా స్టీలర్స్.. రెండో మ్యాచ్‌లో పుంజుకుంది. వరుసగా తొలి రెండు మ్యాచుల్లో విజయాలు సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్‌ను నిలువరించి.. స్టీలర్స్ షో చేసింది. తొలి 20 నిమిషాల ఆటలోనే ఆధిపత్యం చూపించిన హర్యానా స్టీలర్స్ విజయానికి గట్టి పునాది వేసుకుంది. రెయిడింగ్, ట్యాక్లింగ్‌లో దుమ్మురేపిన స్టీలర్స్ ప్రథమార్థంలో 20-11తో తొమ్మిది పాయింట్ల ఆధిక్యం సాధించింది. రెయిడర్ వినయ్ సూపర్ టెన్తో చెలరేగగా.. నవీన్ సైతం అదరగొట్టాడు. డిఫెన్స్‌లో రాహుల్, మహ్మద్రెజా ఆకట్టుకున్నారు.మరోవైపు జైపూర్ పింక్ పాంథర్స్ సమిష్టిగా రాణించటంలో విఫలమైంది. ఇటు కూతలో, అటు పట్టులో తేలిపోయింది. ప్రథమార్థంలో 11 పాయింట్లు సాధించిన పింక్ పాంథర్స్ ద్వితీయార్థంలో ఆ మాత్రం ప్రదర్శన సైతం చేయలేకపోయింది. ఆల్‌రౌండ్ షోతో చెలరేగిన హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లు ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తొలి విజయం సాధించారు. ఈ సీజన్లో మూడు మ్యాచుల ఆడిన పింక్ పాంథర్స్‌కు ఇది తొలి పరాజయం. -
PKL 11: బెంగాల్ వారియర్స్ బోణీ, యూపీ యోధాస్‌పై 32-29తో గెలుపు
హైదరాబాద్, 24 అక్టోబర్ 2024: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో బెంగాల్ వారియర్స్ బోణీ కొట్టింది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసి బరిలోకి దిగిన యూపీ యోధాస్‌పై బెంగాల్ వారియర్స్ మెరుపు విజయం నమోదు చేసింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌స్టేడియంలో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై బెంగాల్ వారియర్స్ 32-29తో గెలుపొందింది. ఉత్కంఠ మ్యాచ్‌లో మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించిన బెంగాల్ వారియర్స్.. యూపీ యోధాస్‌కు సీజన్లో తొలి ఓటమి రుచి చూపించింది. బెంగాల్ వారియర్స్ సమిష్టి ప్రదర్శనతో రాణించింది. రెయిడర్లు మణిందర్ సింగ్ (8), నితిన్ (7), సుశీల్ (7) అదరగొట్టారు. యూపీ యోధాస్ ఆల్‌రౌండర్ భరత్ (13) సూపర్ టెన్తో షో చేసినా.. ఫలితం దక్కలేదు.ప్రథమార్థం హోరాహోరీ : బెంగాల్ వారియర్స్, యూపీ యోధాస్ తొలి అర్థభాగం ఆటలో నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. తొలి రెండు మ్యాచుల్లో విజయాలతో ఊపుమీదున్న యూపీ యోధాస్‌ను ఒత్తిడిలో నిలువరించిన బెంగాల్ వారియర్స్ 12-11తో ప్రథమార్థంలో ఆధిక్యం సాధించింది. ఇరు జట్లూ రెయిడింగ్, డిఫెన్స్‌లో బలంగా ఉండటంతో ఏ జట్టు సైతం ఆలౌట్ స్కోరు చేయలేకపోయింది. భరత్ సక్సెస్ఫుల్ రెయిడ్‌తో యూపీ యోధాస్ తొలుత ఖాతా తెరిచినా.. బెంగాల్ వారియర్స్‌ను మణిందర్ సింగ్ ముందుండి నడిపించాడు. బెంగాల్ వారియర్స్ రెయిడింగ్‌లో 9 పాయింట్లు సాధించగా, యూపీ యోధాస్ 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. డిఫెన్స్‌లో ఇరు జట్లు మూడేసి పాయింట్లు సాధించాయి.వారియర్స్ దూకుడు : ప్రథమార్థం ఆటలో ఒక్క పాయింట్ ఆధిక్యంలో నిలిచిన బెంగాల్ వారియర్స్ విరామం అనంతరం దూకుడు పెంచింది. ఆఖరు పది నిమిషాల ఆట వరకు యూపీ యోధాస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ మణిందర్ సింగ్‌కు నితిన్ జత కలవటంతో బెంగాల్ దూకుడు ముందు యూపీ యోధాస్ నిలువలేదు. వరుసగా సక్సెస్ఫుల్ రెయిడ్స్‌తో బెంగాల్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 25-21తో నాలుగు పాయింట్ల ముందంజ వేసిన బెంగాల్ ఆ తర్వాత యోధాస్‌కు చిక్కలేదు. యోధాస్ రెయిడర్ భరత్ సూపర్ టెన్ ప్రదర్శనతో మెరిసినా.. ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. ఆఖరు రెండు నిమిషాల్లోనూ యూపీ యోధాస్ గట్టిగా ప్రయత్నించినా అప్పటికే మ్యాచ్ బెంగాల్ వారియర్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. -
తెలుగు టైటాన్స్‌కు రెండో ఓటమి
హైదరాబాద్, ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో విజృంభించడంతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 30 పాయింట్ల తేడాతో వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. మంగళవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 52–22 తేడాతో తెలుగు టైటాన్స్‌ను ఓడించింది. జైపూర్ జట్టులో అర్జున్ తో పాటు అభిజీత్ మాలిక్ (8) కూడా ఆకట్టుకున్నాడు. ఆతిథ్య టైటాన్స్ జట్టులో పవన్ సెహ్రావత్ (7 ), విజయ్ మాలిక్ ( 5), ఆశీష్ నర్వాల్ (5) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో డిఫెన్స్‌లో పూర్తిగా తేలిపోయిన టైటాన్స్ నాలుగుసార్లు ఆలౌటైంది.ఇరు జట్ల మధ్య ఆరంభం నుంచి ఆట హోరాహోరీగా సాగింది. తొలి అర్ధభాగం మొదటి పది నిమిషాల్లో తెలుగు టైటాన్స్ మెప్పించగా.. చివరి పది నిమిషాల్లో జైపూర్ పింక్ పాంథర్స్ పైచేయా సాధించింది. తన తొలి రైడ్‌లోనే టచ్ పాయింట్‌తో కెప్టెన్ పవన్ సెహ్రావత్ తెలుగు టైటాన్స్ ఖాతా తెరిచాడు. ఆ వెంటనే అర్జున్ దేశ్వాల్ జైపూర్‌కు తొలి పాయింట్ అందించాడు. రెండు జట్లూ చెరో పాయింట్ నెగ్గుతూ ముందుకెళ్లాయి. 6–6తో స్కోరు సమంగా నిలిచిన దశలో అర్జున్ను ట్యాకిల్ చేసిన టైటాన్స్.. పవన్ వరుస రైడ్ పాయింట్లతో 9–6తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో పవన్‌ను ఔట్ చేయడంతో పాటు వరుసగా మూడు పాయింట్లు రాబట్టిన జైపూర్ 9–9తో స్కోరు సమం చేసింది. అయితే, 18వ నిమిషంలో జైపూర్ అభిజీత్ చేసిన సూపర్ రైడ్ ఆటను మలుపు తిప్పింది. బోనస్‌తో పాటు అంకిత్, పవన్, క్రిషన్‌లను ఔట్ చేసిన అభిజీత్ ఏకంగా నాలుగు పాయింట్లు తీసుకొచ్చాడు. ఆ వెంటనే అర్జున్ కోర్టులో మిగిలిన ఇద్దరు డిఫెండర్ల పట్టు నుంచి తప్పించుకొని వచ్చాడు. దాంతో టైటాన్స్‌ను తొలిసారి ఆలౌట్ చేసిన పింక్ పాంథర్స్ 18–13తో ఐదు పాయింట్ల ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది.రెండో భాగంలో జైపూర్ విజృంభించగా.. తెలుగు జట్టూ పూర్తిగా డీలా పడింది. విరామం తర్వాత అర్జున్ జైపూర్‌కు మరో రైడ్ పాయింట్ అందించగా, విజయ్ మాలిక్ జైపూర్ ఆటగాడు రెజాను టచ్ చేసి వచ్చాడు. కానీ, తన తర్వాతి రైడ్‌లో అర్జున్.. విజయ్, సాగర్‌ను ఔట్ చేసి జట్టుకు మరో రెండు పాయింట్లు తెచ్చి పెట్టడంతో జైపూర్ తన ఆధిక్యాన్ని 21–14కి పెంచుకుంది. ఆపై ఇరు జట్ల డూ ఆర్ డై రైడ్స్‌లో ఇటు పవన్, అటు అర్జున్ సక్సెస్ అయ్యారు.ఈ క్రమంలో అర్జున్ సూపర్ టెన్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు కెప్టెన్లు వరుస రైడ్స్ చేయగా.. ఇందులో అర్జున్ పైచేయి సాధించాడు. అర్జున్ వరుసగా రెండు డబుల్ రైడ్స్‌తో సత్తా చాటగా.. పవన్‌ను అంకుష్ ట్యాకిల్ చేశాడు. విజయ్ మాలిక్‌ను కూడా ట్యాకిల్ చేసిన పింక్ పాంథర్స్ జట్టు టైటాన్స్‌ను రెండోసారి ఆలౌట్ చేసి 31–17తో విజయం ఖాయం చేసుకుంది. చివరి పది నిమిషాల్లో టైటాన్స్ మరింత నిరాశ పరిచింది. సెహ్రావత్ సహా రైడర్లు ప్రత్యర్థికి దొరికిపోగా.. డిఫెండర్లు సైతం చేతులెత్తేశారు. దాంతో మరో రెండుసార్లు ఆలౌటైన తెలుగు జట్టు 21–49తో వెనుకబడింది. మరోవైపు అర్జున్ సూపర్ రైడింగ్‌తో జైపూర్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
PKL Season 11: పుణెరి పల్టాన్‌కు రెండో విజయం
హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ వరుసగా రెండో విజయం సాధించింది. రైడింగ్, డిఫెన్స్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ 15 తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. సోమవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పుణెరి 40–25 తేడా తో పట్నా పైరేట్స్‌పై ఘన విజయం సాధించింది. కెప్టెన్, ఆల్‌రౌండర్ అస్లాం ఇనాందార్ (9 పాయింట్లు), మోహిత్ గోతయ్ (8) సత్తా చాటారు. డిఫెండర్లు గౌరవ్ ఖత్రి (6), అమన్ (6) కూడా ఆకట్టుకున్నారు. పట్నా పైరేట్స్ జట్టులో దేవాంక్ (6), అంకిత్ (6), అయాన్ (5) పోరాడినా మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు. ఈ మ్యాచ్‌లో పుణెరి రెండుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఆట ఆరంభం నుంచే పుణెరి జోరు ప్రదర్శించింది. వరుసగా నాలుగు పాయింట్లతో 4–0తో ఆ జట్టు మ్యాచ్‌ను మొదలు పెట్టింది. పట్నా కోర్టులో ముగ్గురే మిగలగా అస్లాం ఇనాందార్‌ను సూపర్ ట్యాకిల్ చేసిన ఆ జట్టు ఖాతా తెరిచింది. మోహిత్ గోయత్‌ను కూడా ట్యాకిల్ చేసి 4–4తో స్కోరు సమం చేసింది. కానీ, అస్లాం ఇనాందర్ డబుల్ రైడ్ పాయింట్‌తో పుణెరి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. అక్కడి నుంచి ఆ జట్టు వరుస పాయింట్లతో విజృంభించింది. ఈ క్రమంలో 13వ నిమిషంలో ప్రత్యర్థిని తొలిసారి ఆలౌట్ చేసి 16–8తో ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. అదే జోరుతో 20–10తో మొదటి అర్ధభాగాన్ని ముగించింది. విరామం తర్వాత అస్లాం ఇనాందర్‌ను నిలువరించిన పట్నా డిఫెండర్లు పంకజ్ మోహితేను సూపర్ ట్యాకిల్ చేసి తమ జట్టును రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, పల్టాన్ రైడింగ్‌తో పాటు డిఫెన్స్‌లోనూ సత్తా చాటుతూ తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఈ క్రమంలో పట్నా కోర్టులో మిగిలిన దేవాంక్‌ను ప్రత్యర్థికి దొరికిపోయాడు. దాంతో రెండోసారి ఆలౌట్‌కు గురైన పట్నా 15–27తో వెనుకబడింది. అస్లాంతో పాటు మోహిత్ గోయత్ రైడింగ్‌లో సత్తా చాటగా.. గౌరవ్ ఖత్రి, అమన్ తమ ఉడుం పట్టుతో పట్నా రైడర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. మరోవైపు పట్నా అన్ని విభాగాల్లో తేలిపోయింది. సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా జాంగ్ కున్ లీని దింపినా పాయింట్లు రాబట్టలేక ఓటమి మూటగట్టుకుంది. కాగా, ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌తో బెంగళూరు బుల్స్ పోటీ పడుతుంది. -
దబాంగ్ ఢిల్లీపై యూపీ యోధాస్ అద్భుత విజయం
హైదరాబాద్,: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌ను యూపీ యోధాస్ జట్టు అద్బుత విజయంతో ఆరంభించింది. డిఫెన్స్‌లో గొప్ప ప్రదర్శన చేస్తూ రెండో భాగంలో గొప్పగా పుంజుకున్న యూపీ.. బలమైన దబాంగ్ ఢిల్లీ కేసీపై పైచేయి సాధించింది. సోమవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధాస్ 28–23 తేడాతో దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. యూపీ జట్టులో రైడర్లు భవానీ రాజ్‌పుత్ (7 పాయింట్లు), సురేందర్ గిల్ (4) ఆకట్టుకోగా.. డిఫెండర్ సాహుల్ కుమార్ 5 పాయింట్లతో హైఫైవ్ సాధించాడు. ఢిల్లీ జట్టులో కెప్టెన్, స్టార్ రైడర్ అషు మాలిక్ 15 రైడ్స్‌లో నాలుగే పాయింట్లు రాబట్టాడు. నవీన్ కుమార్ (4), ఆశీష్ (4) పోరాడినా ఫలితం లేకపోయింది.ఈ మ్యాచ్ ఆరంభం నుంచి హోరాహోరీగా సాగింది. ఇరు జట్లూ పోటాపోటీగా తలపడుతూ చెరో పాయింట్ సాధిస్తూ ముందుకెళ్లాయి. సురేందర్ గిల్ తెచ్చిన బోనస్‌తో యూపీ ఖాతా తెరవగా.. భరత్‌ను ట్యాకిల్ చేసిన యోగేశ్ ఢిల్లీకి తొలి పాయింట్ అందించాడు. డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన అషు సింగ్ సింగిల్ టయాకిల్ చేయగా.. భరత్ రెండోసారి ఢిల్లీ డిఫెండర్లకు దొరికిపోయాడు. ఈ దశలో అషు మాలిక్ వరుసగా రెండు రైడ్ పాయింట్లు రాబట్టాడు. మరోసారి రైడ్‌కు వచ్చిన అతడిని.. యూపీ ట్యాకిల్ చేయగా.. సురేందర్ గిల్‌ను యోగేశ్ నిలువరించాడు. ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో డూ ఆర్ డై రైడ్‌లోనే ఢిల్లీ, యూపీ పాయింట్లు రాబట్టే ప్రయత్నం చేశాయి. దాంతో ఆట సమంగా సాగింది. విరామం ముంగిట చివరి రైడ్‌కు వచ్చిన అషు మాలిక్‌ను సుమిత్ ట్యాకిల్ చేయడంతో యూపీ 12–11తో ఒక పాయింట్ ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. కోర్టు మారిన తర్వాత యూపీ యోధాస్ పైచేయి సాధించింది. ఆలౌట్ ప్రమాదం తప్పించుకొని ప్రత్యర్థిని ఆలౌట్ చేసి ముందంజ వేసింది. విరామం నుంచి వచ్చిన వెంటనే ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్.. సాహుల్ కుమార్, అషు సింగ్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చి రెండు పాయింట్లు అందించాడు. ఆపై విక్రాంత్‌ను భరత్ ట్యాకిల్ చేయడంతో దబాంగ్ ఢిల్లీ 16–14తో రెండు పాయింట్ల ఆధిక్యంలోకి వచ్చింది. మరోవైపు కోర్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగలడంతో యూపీ ఆలౌట్ ప్రమాదం ముంగిట నిలిచింది. కానీ, హితేశ్, మొహమ్మద్రెజా కలిసి ఢిల్లీ కెప్టెన్ అషు మాలిను సూపర్ ట్యాకిల్ చేయడంతో 16–16తో స్కోరు మరోసారి సమం అయింది. ఇక్కడి నుంచి యూపీ వేగం పెంచింది. భవాని రాజ్‌పుత్, సురేందర్ గిల్ చెరో రైడ్ పాయింట్ రాబట్టగా.. నవీన్, మోహిత్‌తో పాటు ఆశీష్‌ను యూపీ డిఫెండర్లు ట్యాకిల్ చేయడంతో 33వ నిమిషంలో ఢిల్లీ ఆలౌట్ అయింది. దాంతో యోధాస్ 24–18తో ఆరు పాయింట్ల ఆధిక్యం అందుకుంది. చివర్లో దబాంగ్ ఢిల్లీ పుంజుకునే ప్రయత్నం చేసినా ఆ జట్టుకు యోధాస్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రైడింగ్‌లో భవనీ రాజ్‌పుత్, నితిన్ జోరు చూపెట్టగా.. అషు మాలిక్‌ను మరోసారి ట్యాకిల్ చేసిన సాహుల్ కుమార్ హైఫైవ్ సాధించాడు. దాంతో తన ఆధికాన్ని 27–20కి పెంచుకున్న యూపీ విజయం ఖాతాలో వేసుకుంది. -
బెంగాల్ వారియర్స్‌పై పింక్ పాంథర్స్ ఉత్కంఠ విజయం
హైదరాబాద్: కెప్టెన్, స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్ 15 పాయింట్లతో అదరగొట్టడంతో ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌ను జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ఉత్కంఠ విజయంతో ఆరంభించింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 39–34తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. అర్జున్‌తో పాటు రైడర్ అభిజీత్ మాలిక్ (7 పాయింట్లు) జైపూర్ విజయంలో కీలకంగా నిలిచాడు. బెంగాల్ జట్టులో నితిన్ ధాంకర్ (13) సూపర్ టెన్ సాధించగా, మణిందర్ సింగ్ (8), కెప్టెన్ ఫజెల్ అత్రాచలి (6) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో జైపూర్ తన ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసింది. ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు బెంగాల్‌పై జైపూర్ పైచేయి సాధించింది. అర్జున్ దేశ్వాల్ను ట్యాకిల్ చేసిన నితేష్ కుమార్ జైపూర్‌కు తొలి పాయింట్ అందించగా.. వికాష్ ఖండోలా తన రైడ్‌లో నితేష్‌ను టచ్ చేసి బెంగాల్ ఖాతా తెరిచాడు. మరోసారి రైడ్‌కు వచ్చిన అర్జున్ను ఫజెల్ అత్రాచలి ట్యాకిల్ చేయగా.. మణిందర్ సింగ్ వరుసగా రెండు బోన్ పాయింట్లు తేవడంతో బెంగాల్ 5–2తో ఆరంభం ఆధిక్యం అందుకుంది. ఈ దశలో అర్జున్ దేశ్వాల్ ఒక్కసారిగా జోరు పెంచాడు.వరుసగా సక్సెస్ఫుల్ రైడ్లతో పాయింట్లు రాబట్టి 9–8తో పింక్ పాంథర్స్‌ను తొలిసారి ఆధిక్యంలోకి తెచ్చాడు. అతని దెబ్బకు బెంగాల్ కోర్టులో నితిన్ ధాంకర్ ఒక్కడే మిగిలిపోయాడు. నితిన్‌ను కూడా ట్యాకిల్ చేసి 11వ నిమిషంలో ప్రత్యర్థిని తొలిసారి ఆలౌట్ చేసిన జైపూర్ 12–9తో తన ఆధిక్యాన్ని పెంచుకుంది. ఇక్కడి నుంచి ఇరు జట్లూ పోటాపోటీగా ఆడాయి. సుర్జీత్ పట్టు నుంచి తప్పించుకొని వచ్చిన నితిన్ సూపర్ రైడ్ చేయడంతో బెంగాల్ 13–15తో ప్రత్యర్థిని అందుకునే ప్రయత్నం చేసింది. కానీ, మరోవైపు అర్జున్ తన జోరు కొనసాగిస్తూ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నాడు. జట్టును 21–15తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే, విరామానికి ముందు ఫజల్ అత్రాచలి సూపర్ ట్యాకిల్‌తో అర్జున్ను మరోసారి నిలువరించాడు. దాంతో తొలి అర్ధభాగాన్ని జైపూర్ 21–18తో మూడు పాయింట్ల ఆధిక్యంతో ముగించింది.రెండో భాగంలో బెంగాల్ డిఫెన్స్‌లో మెరుగైంది. ఆ జట్టు కెప్టెన్ ఫజల్ అత్రాచలి వరుసగా రెండు సూపర్ ట్యాకిల్స్‌తో సత్తా చాటడంతో 23–24తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. కానీ, ఫజెల్ పోరాటం బెంగాల్‌ను మరో ఆలౌట్ ప్రమాదం నుంచి తప్పించలేపోయింది. 31వ నిమిషంలో బెంగాల్‌ను రెండోసారి ఆలౌట్ చేసిన జైపూర్ 29–25తో నాలుగు పాయింట్ల ఆధిక్యం సంపాదించుకుంది. కోర్టుపైకి పూర్తి జట్టు వచ్చిన తర్వాత బెంగాల్ పుంజుకుంది. రైడర్లు మణిందర్, నితిన్ తెలివిగా ఆడుతూ వరుసగా పాయింట్లు తీసుకొచ్చారు. అభిజీత్ మాలిక్‌ను ఔట్ చేసి నితిన్ సూపర్10 పూర్తి చేసుకోగా.. బెంగాల్ 30–32తో ముందుకొచ్చింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా నితిన్.. అర్జున్, లక్కీ శర్మను ఔట్ చేసి రెండు పాయింట్లు రాబట్టడంతో 34–35తో మ్యాచ్‌లో ఉత్కంఠ రేగింది. కానీ, మరోసారి రైడ్‌కు వచ్చిన నితిన్ సూపర్ ట్యాకిల్ చేసిన జైపూర్ విజయం సొంతం చేసుకుంది. -
PKL 11: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ శుభారంభం సత్తా చాటిన గౌరవ్ ఖత్రి
హైదరాబాద్, అక్టోబర్ 19: డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో శుభారంభం చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటుతూ పది పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్‌ను చిత్తు చేసింది. శనివారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పల్టాన్ 35–25 తో స్టీలర్స్‌పై ఘన విజయం సాధించింది. తన ఉడుం పట్టుతో ప్రత్యర్థులను నిలువరించిన డిఫెండర్ గౌరవ్ ఖత్రి 7 పాయింట్లతో పుణెరి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్, ఆల్‌రౌండర్ అస్లాం ఇనాందర్ ఐదు పాయింట్లతో ఆకట్టుకోగా.. పంకజ్ మోహితే, మోహిత్ గోయత్, అమన్ నాలుగేసి పాయింట్లు రాబట్టారు. హర్యానా స్టీలర్స్ జట్టులో శివం పతారె, శంకర్ మిశ్రా ఐదు పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచారు.. ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా షాడ్లోయి (4), రైడర్ వినయ్ పోరాడినా మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు. ఆట ఆరంభంలో ఇరు జట్లూ వరుస పాయింట్లతో పోటాపోటీగా తలపడ్డాయి. 6–6తో స్కోరు సమంగా ఉన్న దశలో పుణెరి పల్టాన్ వేగం పెంచింది. రైడింగ్‌లో పాటు డిఫెన్స్‌లోనూ సత్తా చాటుతూ 13వ నిమిషంలోనే హర్యానా స్టీలర్స్‌ను ఆలౌట్ చేసి 13–7తో ఆధిక్యం సాధించింది. శివం పతారే డుబ్కి స్కిల్ చూపెడుతూ రెండు పాయింట్లు తీసుకురావడంతో స్టీలర్స్9–13తో పుంజుకునేలా కనిపించింది. కానీ, పంకజ్ మోహితే మూడు పాయింట్ల సూపర్ రైడ్ చేయడంతో పుణెరి తన ఆధిక్యాన్ని 18–10కి పెంచుకుంది. పుణెరి రైడర్ మోహిత్ గోయత్‌ను చియానే చేసిన సూపర్ ట్యాకిల్ చేసి రెండు పాయింట్టు రాబట్టినా పల్టాన్ 19–13 ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండో భాగంలో డిఫెండర్ చియనే సత్తా చాటినా రైడింగ్‌లో హర్యానా అంతగా ఆకట్టుకోలేక వెనుకబడింది. పుణెరి డిఫెండర్ ఖత్రి వరుసగా విజయ్, శివం పతారేను ట్యాకిల్ చేశాడు. చివరి నిమిషాల్లో ఆ జట్టు తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. అయితే, హర్యానా ఆఖరి రైడ్‌లో శంకర్ మిశ్రా మూడు టచ్ పాయింట్లు సహా నాలుగు పాయింట్లతో సూపర్ రైడ్ చేయడంతో హర్యానా తన ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించుకుంది. ఆదివారం రాత్రి జరిగే తొలి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్–జైపూర్ పింక్ పాంథర్స్ తలపడాయి. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్–బెంగళూరు బుల్స్ పోటీ పడతాయి. -
హైదరాబాద్ : మొదలైన ప్రో కబడ్డీ పోటీలు..బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ సందడి (ఫొటోలు)
-
పర్దీప్ నర్వాల్ టూ ఫజెల్ అత్రాచలి.. ప్రోకబడ్డీ లీగ్‌లో స్టార్స్ వీళ్లే
ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ వేలం ముంబైలో ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న జరిగిన వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. రాజస్తాన్‌కు చెందిన సచిన్ తన్వర్‌పై రూ. 2.15 కోట్లు వెచ్చించి మరి తమిళ్ తలైవాస్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మరో స్టార్ కబడ్డీ ప్లేయర్, ఇరానియన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజాను రూ. 2.07 కోట్లతో హరియాణా స్టీలర్స్ కైవసం చేసుకుంది. ఇక పీకేఎల్-2024వ సీజన్ ఆక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.పర్దీప్ నర్వాల్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) స్టార్ ప్లేయర్స్‌లో హర్యానాకు చెందిన రైడర్ పర్దీప్ నర్వాల్ ముందు వరుసలో ఉంటాడు. పీకేఎల్ 2024 వేలంలో బెంగళూరు బుల్స్ పర్దీప్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 170 మ్యాచ్‌లు ఆడిన పర్దీప్.. 1690 పాయింట్లతో టాప్ రైడర్‌గా కొనసాగుతున్నాడు. పీకేఎల్‌లో 10 రైడ్ పాయింట్ల కంటే ఎక్కువ సగటుతో 1000 పాయింట్ల మార్కు స్కోర్‌ను అధిగమించిన మొదటి ఆటగాడిగా నర్వాల్ నిలిచిచాడు. అతడిని అభిమానులు ‘దుబ్కీ కింగ్’ పిలుస్తారు. గతంలో అతడు పాట్నా పైరేట్స్, యుపీ యోధాస్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.ఫజెల్ అత్రాచలిపీకేఎల్లో అద్భుతమైన డిఫెండర్లలో ఇరాన్‌కు చెందిన ఫజెల్ అత్రాచలి ఒకడు. పీకేఎల్ 2024 వేలంలో అత్రాచలిని బెంగాల్ వారియర్స్ రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. అతడు ఖాతాలో మొత్తం 486 ట్యాకిల్ పాయింట్స్ ఉన్నాయి. పీకేఎల్‌లో అత్యధిక ట్యాకిల్ పాయింట్ల చేసిన జాబితాలో ఫజెల్ అత్రాచలి అగ్రస్ధానంలో ఉన్నాడు. లెఫ్ట్ కార్నర్లో ఫజెల్ ఉన్నాడంటే రైడర్స్ భయపడాల్సిందే. అతడు యూ ముంబా, పాట్నా పైరేట్స్ టైటిల్స్ సాధించడంలో ఫజెల్ది కీలక పాత్ర.సచిన్ తన్వార్..పీకేఎల్ 2024 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన సచిన్ తన్వర్.. తమిళ్ తలైవాస్ తరపున ఆడనున్నాడు. గత కొన్ని సీజన్లగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో తలైవాస్ అతడిపై భారీ మొత్తం వెచ్చించింది. అతడి ఖాతాలో మొత్తంగా 951 రైడ్ పాయింట్లు ఉన్నాయి. గత సీజన్లో మొత్తం 171 పాయింట్లు సాధించాడు. 7వ సీజన్లో పర్దీప్ నర్వాల్ ఫ్రాంచైజీ మారడంతో పట్నా పైరేట్స్ రైడింగ్ డిపార్ట్మెంట్ను సచిన్ లీడ్ చేశాడు. గతంలో గుజరాత్ జెయింట్స్‌కు కూడా సచిన్ ఆడాడు.మణిందర్ సింగ్ (రైడర్)మణిందర్ సింగ్ మళ్లీ తన సొంతగూటకి చేరాడు. పీకేఎల్-2024 వేలంలో రూ.1.5 కోట్లకు మణిందర్‌ను బెంగాల్ వారియర్స్ దక్కించుకుంది. పీకేఎల్ చరిత్రలో పర్దీప్ నర్వాల్ తర్వాత అత్యంత విజయవంతమైన రైడర్లలో మణిందర్ సింగ్ ఒకడు. ఈ ఆరు అడుగుల ఆజానుబాహుడు రైడ్‌కు వెళ్లడాంటే ప్రత్యర్ధి డిఫెండర్లకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. మణిందర్ సింగ్ ఖాతాలో 1,428 పాయింట్లు ఉన్నాయి. అతడి ఖాతాలో జైపూర్ పింక్ పాంథర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. -
ప్రొ కబడ్డీ లీగ్‌లో 118 మంది
ముంబై: రెండు రోజుల పాటు జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆటగాళ్ల వేలంపాట ముగిసింది. మొత్తం 118 మంది ఆటగాళ్లు ఈ వేలంలో అమ్ముడుపోగా... తొలిరోజు రూ.2 కోట్లయినా వెచ్చించేందుకు వెనుకాడని ఫ్రాంచైజీలు రెండో రోజు మాత్రం పెద్దగా ఎగబడలేదు. శుక్రవారం ‘సి’, ‘డి’ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహించగా ఏ ఒక్కరు రూ. కోటి దాకా వెళ్లలేకపోయారు. రెయిడర్ అజిత్ కుమార్‌కు అత్యధికంగా రూ. 66 లక్షలు దక్కాయి. రెండో రోజు వేలంలో ఇదే పెద్ద మొత్తం కాగా, పుణేరి పల్టన్ ఆ రెయిడర్‌ను దక్కించుకుంది. జై భగవాన్ను రూ. 63 లక్షలకు బెంగళూరు బుల్స్ కొనుగోలు చేసింది. వీరిద్దరితో పాటు ‘సి’ కేటగిరీలో మరో ఇద్దరు రూ.అరకోటి మార్క్ దాటారు. ఆల్‌రౌండర్ గుర్దీప్ను రూ. 59 లక్షలకు, డిఫెండర్ దీపక్ రాజేందర్ సింగ్‌ను రూ. 50 లక్షలకు పట్నా పైరేట్స్ పైరేట్స్ కొనుక్కుంది. ‘డి’ కేటగిరీ ఆటగాళ్ల జాబితాలో రెయిడర్ అర్జున్ రాఠికి అత్యధికంగా రూ.41 లక్షలు లభించాయి. బెంగాల్ వారియర్స్ అతన్ని చేజిక్కించుకోగా, ఆ తర్వాత ఇంకెవరూ ఈ జాబితాలో కనీసం రూ.20 లక్షలైనా పొందలేకపోయారు. డిఫెండర్ మొహ్మద్ అమన్‌ను రూ.16.20 లక్షలకు పుణేరి పల్టన్, రెయిడర్ స్టువర్ట్ సింగ్‌ను రూ.14.20 లక్షలకు యు ముంబా జట్లు తీసుకున్నాయి. మొత్తం మీద ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ఇద్దరు ప్లేయర్లు సచిన్ (రూ.2.15 కోట్లు; తమిళ్ తలైవాస్), మొహమ్మద్ రెజా (రూ.2.07 కోట్లు; హరియాణా) రెండు కోట్లపైచిలుకు అమ్ముడయ్యారు.ఆరు మందికి రూ.కోటికి పైగా మొత్తం లభించింది. ఇక 12 ఫ్రాంచైజీల్లో ఆటగాళ్ల కోసం అత్యధికంగా హరియాణా స్టీలర్స్ ఫ్రాంచైజీ దాదాపు రూ. ఐదు కోట్లు (రూ.4.99 కోట్లు) ఖర్చు చేసింది. -
PKL: సచిన్‌కు రూ. 2.15 కోట్లు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆటగాళ్ల వేలంలో రూ. కోట్ల కూత కూసింది. దీంతో కబడ్డీ ప్లేయర్ల రాత కూడా రానురానూ మారుతోంది. పీకేఎల్ 11వ సీజన్ కోసం నిర్వాహకులు గురువారం ఆటగాళ్ల వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. తొలిరోజు ఎ, బి కేటగిరీలకు చెందిన ఆటగాళ్ల వేలం నిర్వహించగా, రాజస్తాన్‌కు చెందిన సచిన్ తన్వర్‌పై ఫ్రాంచైజీలు రూ. రెండు కోట్లకు పైగా వెచ్చించేందుకు పోటీపడ్డాయి. చివరకు తమిళ్ తలైవాస్ ఈ రెయిడర్పై రూ. 2.15 కోట్లు కురిపించి మరీకైవసం చేసుకుంది. గత సీజన్లో పట్నా పైరేట్స్ తరఫున కూత పెట్టిన సచిన్ అంతకుముందు గుజరాత్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన్వర్ భారత జట్టులో కీలక సభ్యుడు. గతేడాది హాంగ్జూలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన విజేత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇతనితో పాటు ‘ఎ’ కేటగిరీలో ఉన్న మరో స్టార్ కబడ్డీ ప్లేయర్, ఇరానియన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా కోసం ఫ్రాంచైజీలు ఎగబడి వేలం పాట పాడాయి. చివరకు అతన్ని రూ. 2.07 కోట్లతో హరియాణా స్టీలర్స్ చేజిక్కించుకుంది. తొలి రోజు వేలంలో రెండు కేటగిరీల్లో కలిపి 8 మంది ఆటగాళ్లు రూ. కోటికి పైగా ధర పలికారు. రెయిడర్లు గుమన్ సింగ్ రూ. 1.97 కోట్లు (గుజరాత్ జెయింట్స్), మణీందర్ సింగ్ రూ. 1.15 కోట్లు (బెంగాల్ వారియర్స్), అజింక్యా అశోక్ రూ. 1.10 కోట్లు (బెంగళూరు బుల్స్), ఆల్‌రౌండర్లు పవన్ కుమార్ సెహ్రావత్ రూ.1.72 కోట్లు (తెలుగు టైటాన్స్), భరత్ రూ. 1.30 కోట్లు (యూపీ యోధాస్), డిఫెండర్ సునీల్ కుమార్ రూ. 1.01 కోట్లు (యు ముంబా)లు భారీ ధర పలికారు. తెలుగు టైటాన్స్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ పవన్ సెహ్రావత్‌తో పాటు డిఫెండర్ క్రిషన్ ధుల్ (రూ. 70 లక్షలు), ఆల్‌రౌండర్ విజయ్ మలిక్ (రూ. 20 లక్షలు)లను తొలిరోజు వేలంలో కొనుక్కుంది. రెండో రోజు శుక్రవారం వేలంలో ‘ఎ’, ‘బి’లతో పాటు ‘సి’ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహిస్తారు. -
దబంగ్ ఢిల్లీపై బెంగాల్ విజయం..
ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్లో భాగంగా శుక్రవారం ఢిల్లీలో 100వ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో బెంగాల్ వారియర్స్ 45–38 పాయింట్ల స్కోరుతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. బెంగాల్ తరఫున నితిన్ కుమార్ 13 పాయింట్లతో అగ్ర స్థానాన నిలవగా, కెప్టెన్ మణీందర్ సింగ్ 11 పాయింట్లు సాధించాడు. దబంగ్ ఢిల్లీ ఆటగాళ్లలో కెప్టెన్ అషు మలిక్ 17 పాయింట్లతో చెలరేగినా... ఇతర ఆటగాళ్ల వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 34–30 తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. హరియాణా ఆటగాళ్ళలో వినయ్ 9 పాయింట్లు రాబట్టగా... మోహిత్ నందల్, మోహిత్ చెరో 4 పాయింట్లు సాధించారు. గుజరాత్ తరఫున ఫజల్ అత్రచి, పార్తీక్ దహియా చెరో 7 పాయింట్లు స్కోర్ చేయగా, దీపక్ సింగ్ 5 పాయింట్లు రాబట్టాడు. ఈ సీజన్లో 101 మ్యాచ్‌లు ముగించిన తర్వాత 71 పాయింట్లతో జైపూర్ పింక్ పాంథర్స్ అగ్రస్థానాన్ని పటిష్టపర్చుకుంది. చదవండి: IND vs ENG: అయ్యో రజత్.. బ్యాడ్ లక్ అంటే నీదే బ్రో! వీడియో వైరల్ -
గచ్చిబౌలి స్టేడియంలో తొడగొట్టనున్న తెలుగు టైటాన్స్.. ఎప్పుడంటే?
క్రీడా సంబురాలకు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. ప్రో కబాడ్డీ లీగ్ సీజన్ 10లో తమ హోమ్ మ్యాచ్‌లను ప్రారంభించడానికి తెలుగు టైటాన్స్ సిద్ధమైంది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం తెలుగు టైటాన్స్ తలపడనుంది. హోమ్ మ్యాచ్‌లను జనవరి 19 నుండి 24 వరకు హైదరాబాద్‌లో ఆడనుంది. వీటికి సంబంధించిన టికెట్లు bookmyshow లో అందుబాటులో ఉన్నాయి. తెలుగు టైటాన్స్ సీఈఓ త్రినాధ్ రెడ్డి మాట్లాడుతూ: “ఈ లీగ్ పోటీ నాణ్యత, గేమ్‌ప్లే, ఆటగాళ్ల ప్రదర్శనల పరంగా గొప్ప స్థాయికి పెరిగిందన్నారు. . ప్రో కబడ్డీ లీగ్ ప్రస్తుత సీజన్‌లా గట్టి పోటీతో కూడిన కొన్ని మ్యాచ్‌లకు సాక్షిగా నిలబోతుందన్నారు. తెలుగు టైటాన్స్‌లో కెప్టెన్ పవన్ సెహ్రావత్, సందీప్ ధుల్, పర్వేష్ వంటి దిగ్గజాలు తమ ఆటను పునర్నిర్వచించుకోవడం తో పాటుగా కొత్త ఆటగాళ్లు కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వనున్నారని చెప్పారు. తెలుగు టైటాన్స్ తమ మొదటి హోమ్ లెగ్ మ్యాచ్‌ను జనవరి 19, 2024న బెంగళూరు బుల్స్‌తో ఆడుతుంది. అభిమానులు ప్రతి మ్యాచ్‌ని లైవ్‌లో, రాత్రి 7:30 గంటలకు FTA ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ 2 & స్టార్ స్పోర్ట్స్ 2 HD – ఇంగ్లీష్, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, కన్నడలో స్టార్ సువర్ణ ప్లస్‌లో, తెలుగులో స్టార్ మా గోల్డ్ మరియు హాట్‌స్టార్ తో సహా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు. -
యూపీ యోధాస్‌ను చిత్తు చేసిన తమిళ్ తలైవాస్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తమిళ్ తలైవాస్ మూడో విజయం నమోదు చేసింది. యూపీ యోధాస్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 46–27తో గెలిచింది. యు ముంబా, హరియాణా స్టీలర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 44–44తో ‘డ్రా’ అయింది. ప్రస్తుతం పుణేరీ పల్టన్ (10 మ్యాచ్‌ల్లో 9 విజయాలు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, జైపూర్ పింగ్ పాంథర్స్, యు ముంబ రెండు నుంచి ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచిన తెలుగు టైటాన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.