హరియాణాలోని సోనీపత్.. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖ ఆటగాళ్లకు కేంద్రం. యోగేశ్వర్ దత్, రవి దహియా, సీమా అంటిల్ తదితర ఆటగాళ్లంతా అక్కడి నుంచి వచ్చినవాళ్లే. సోనీపత్‌లో ఉన్న క్రీడా వాతావరణం అక్కడి సమీప పట్టణాలు, గ్రామాల్లో కూడా కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల్లో స్థానికులంతా కచ్చితంగా ఏదో ఒక ఆటను ఎంచుకొని అందులో కనీస స్థాయి వరకు రాణించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి గ్రామాల్లో ఒకటి.. సోనీపత్‌కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రింఢానా. సుమారు 7 వేల జనాభా గల ఈ ఊర్లో కబడ్డీ ఆటపై ప్రత్యేక ఆకర్షణ ఉంది. చిన్నా, పెద్దా ఒక చోట చేరితే కబడ్డీ కూత పెట్టాల్సిందే. అలాంటి ఊరు నుంచి వచ్చిన ఒక యువకుడు ఇప్పుడు భారత కబడ్డీలో తనదైన ముద్ర వేశాడు. అత్యంత ప్రజాదరణ పొందిన ప్రో కబడ్డీ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయర్‌గా నిలిచిన అతనే ప్రదీప్ నర్వాల్. 11 సీజన్ల లీగ్‌లో పది సీజన్లే ఆడినా రికార్డు స్థాయిలో అత్యధిక పాయింట్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
రింఢానాలో నర్వాల్ కుటుంబంలో చాలామందికి కబడ్డీ కూడా దినచర్యలో భాగమే. వాళ్లలో ప్రదీప్ బాబాయ్‌కి బెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు ఉంది. ఆయనను చూసే ప్రదీప్ కబడ్డీపై ఆసక్తి పెంచుకున్నాడు. ఆయన ద్వారానే ఆ ఆటలో మెలకువలు నేర్చుకున్నాడు. ఎనిమిదేళ్ల వయసులోనే ప్రదీప్‌కి కబడ్డీ లోకమైపోయింది. ఎంతగా అంటే బ్యాగ్‌తో స్కూల్‌కు వెళ్లి అటెండెన్స్ అయిపోగానే గ్రౌండ్ వైపు పరుగెత్తేవాడు. బడిలో అతని షెడ్యూల్ అదేనని చాలారోజుల దాకా ఇంట్లో తెలీలేదు. పరీక్షల్లో కనీసం మార్కులు కూడా రాకపోయేసరికి సందేహించిన పెద్దలు ఆరా తీస్తే అసలు సంగతి బయటపడింది.
అయితే తాను ఆటవైపు పూర్తిస్థాయిలో మళ్లేందుకు అదే మలుపు అని చెబుతాడు ప్రదీప్. ఎందుకంటే ఆ రోజు ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లాడు బాగా చదవడం లేదని తిట్టలేదు. ఆటపై ఆసక్తి ఉంది, బాగా ఆడుతున్నాడు కాబట్టి అందులోనే భవిష్యత్తు వెతుక్కొమ్మంటూ ప్రోత్సహించారు. 11 ఏళ్ల వయసులో స్కూల్ టీమ్ తరఫున మొదటిసారి బరిలోకి దిగిన ప్రదీప్ ఆట అందరినీ ఆకట్టుకుంది. దాంతో మరింత మెరుగైన శిక్షణ కోసం తల్లిదండ్రులు వెంటనే సోనీపత్‌లోని కబడ్డీ అకాడమీలో చేర్పించారు. అక్కడే అతని ఆట పదునెక్కింది.
హ్యట్రిక్ టైటిల్స్ అందించి..
హరియాణా రాష్ట్ర జట్టు తరఫున పలు టోర్నీల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న అనంతరం ప్రదీప్ కెరీర్ 18 ఏళ్ల వయసులో కీలక మలుపు తిరిగింది. 2014లో ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్ ఒక్కసారిగా దేశంలోని క్రీడా ప్రేమికుల దృష్టి కబడ్డీ వైపు మళ్లేలా చేసింది. కొత్త కొత్త హంగులు, సరికొత్త నిబంధనల మధ్య వచ్చిన ఈ లీగ్.. కబడ్డీ రూపురేఖలను మార్చింది. 2015 టోర్నీ కోసం లీగ్ నిర్వాహకులు దేశవ్యాప్తంగా ప్రతిభాన్వేషణ కార్యక్రమంలో ఉన్నారు. ఆ క్రమంలో కొందరు కోచ్‌లు, సీనియర్ ఆటగాళ్లు హరియాణాలో ప్రదీప్ ఆడిన మ్యాచ్‌లు చూశారు. వెంటనే మరో మాట లేకుండా అతడిని తమ లీగ్ కోసం ఎంచుకున్నారు. 2015లో తొలిసారి బెంగళూరు బుల్స్ తరఫున ప్రో కబడ్డీ లీగ్ ఆడే అవకాశం ప్రదీప్‌కు వచ్చింది.
అతని రైడింగ్ నైపుణ్యం అన్ని జట్లనూ ఆకర్షించింది. దాంతో మరుసటి ఏడాది అతణ్ణి పట్నా పైరేట్స్ తమ టీమ్‌లోకి ఎంచుకుంది. తర్వాత నాలుగేళ్ల పాటు అతను లీగ్‌ను తన అద్భుత ఆటతో శాసించాడు. తన మెరుపు రైడింగ్‌తో రికార్డు పాయింట్లు సాధిస్తూ వరుసగా మూడేళ్లు పట్నా పైరేట్స్‌ను విజేతగా నిలబెట్టాడు. ఈ హ్యట్రిక్ టైటిల్స్ ప్రదీప్ స్థాయిని అమాంతం ఆకాశానికి పెంచేశాయి. ఆ తర్వాత రెండు సీజన్ల పాటు యూపీ యోధాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రదీప్.. 2024లో మళ్లీ తన మొదటి జట్టు బెంగళూరుకు చేరాడు.
రికార్డులే రికార్డులు..
కబడ్డీ.. కబడ్డీ అని కూత పెడుతూ ప్రదీప్ నర్వాల్ ఒక్కసారి ప్రత్యర్థి కోర్టులోకి అడుగు పెట్టాడంటే పాయింట్ల వర్షం కురవాల్సిందే. తన చురుకైన కదలికలతో అటు వైపు ఆటగాడిని టచ్ చేస్తూనే కిందకు వంగుతూ డిఫెండర్లకు అందకుండా సురక్షితంగా లైన్ దాటడంలో అతనికి అతనే సాటి. నీటిలోకి దూకి బయటకు వెళుతున్నట్లుగా ఉండే ఆ ఆట శైలి వల్లే అభిమానులు ప్రదీప్‌కు డుబ్కీ కింగ్ అనే నిక్ నేమ్ పెట్టారు. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో పెద్ద సంఖ్యలో రికార్డులు అతని పేరిటే ఉండటం విశేషం. అత్యధిక సంఖ్యలో రైడింగ్ పాయింట్లు, అత్యధిక సూపర్ రైడ్‌లు, అత్యధిక సూపర్ 10 పాయింట్లు, సింగిల్ రైడ్‌లో అత్యధిక పాయింట్లు, ఒకే సీజన్‌లో అత్యధిక పాయింట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.
ముందుగా 1000 పాయింట్లు అందుకున్న ఆటగాడిగా మొదలై 1700 పాయింట్లు సాధించిన ఏకైక ఆటగాడిగా అతను నిలిచాడు. అతనికి, రెండో స్థానంలో ఉన్న ఆటగాడికి మధ్య 200 పాయింట్లకు పైగా అంతరం ఉండటం అతని ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ఈ ఆట ప్రదీప్‌కు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ను తెచ్చిపెట్టింది. అత్యధిక సంఖ్యలో సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్న కబడ్డీ ప్లేయర్ కూడా ప్రదీప్ నర్వాలే! గత ఎనిమిదేళ్లుగా భారత సీనియర్ కబడ్డీ సభ్యుడిగా కూడా పలు కీలక విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు.
∙
Comments
Please login to add a commentAdd a comment