బెంగాల్‌ భారీ విజయం | PKL 11: Bengal Warriors Beat Bengaluru Bulls | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ భారీ విజయం

Published Sat, Nov 9 2024 11:22 PM | Last Updated on Sun, Nov 10 2024 10:07 AM

PKL 11: Bengal Warriors Beat Bengaluru Bulls

నితిన్‌, మనిందర్‌ విజృంభణ

చిత్తుగా ఓడిన బెంగళూరు బుల్స్‌

ప్రొ కబడ్డీ లీగ్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 9, 2024: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో బెంగాల్‌ వారియర్స్‌ దుమ్మురేపింది. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన బెంగాల్‌ శనివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 40-29తో బెంగళూరు బుల్స్‌పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శన కనబరిచిన బెంగాల్‌ తరపున నితిన్‌కుమార్‌(14), మన్‌దీప్‌సింగ్‌(10) సూపర్‌-10తో కదంతొక్కారు. మరోవైపు బెంగళూరు జట్టులో అక్షిత్‌(11), అజింక్యా పవార్‌(8) రాణించినా..పర్దీప్‌ నార్వల్‌(2) ఘోరంగా విఫలమయ్యాడు.

బెంగాల్‌ జోరు: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతున్నది. లీగ్‌లో కీలకమైన ప్లేఆఫ్స్‌ దశకు చేరుకోవాలంటే గెలక తప్పని పరిస్థితుల నేపథ్యంలో అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. శనివారం బెంగళూరు బుల్స్‌, బెంగాల్‌ వారియర్స్‌ మధ్య మ్యాచ్‌ అభిమానులను ఆకట్టుకుంది. మాజీ చాంపియన్‌ బెంగాల్‌ తమదైన రీతిలో బెంగళూరుపై జోరు కనబరిచింది. ముఖ్యంగా స్టార్‌ రైడర్‌ మన్‌దీప్‌సింగ్‌ దూకుడు కనబరిచాడు. తన తొలి రైడ్‌లోనే సుబ్రమణ్యంను ఔట్‌ చేసి బెంగాల్‌ పాయింట్ల ఖాతా తెరిచాడు. 

మరోవైపు పర్దీప్‌ నార్వల్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మ్యాచ్‌ 16వ నిమిషంలో డూ ఆర్‌ డై రైడ్‌కు వెళ్లిన బెంగళూరు రైడర్‌ అక్షిత్‌ను నితీశ్‌కుమార్‌ ఉడుం పట్టుతో బెంగాల్‌కు పాయింట్‌ అందించాడు. రెండు నిమిషాల వ్యవధిలో రైడ్‌కు వెళ్లిన మన్‌దీప్‌సింగ్‌..ఈసారి నితిన్‌ రావల్‌, పర్దీప్‌ నర్వాల్‌ను ఔట్‌ రెండు పాయింట్లతో బెంగాల్‌ జట్టులో జోష్‌ నింపాడు. బెంగళూరు తరఫున పర్దీప్‌ నార్వల్‌ విఫలమైనా..అక్షిత్‌ వరుస పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఓవైపు రైడింగ్‌తో పాటు డిఫెన్స్‌లోనూ బెంగాల్‌ జోరు కనబర్చడంతో బెంగళూరు ఢీలా పడిపోయింది. ఈ క్రమంలో తొలి అర్ధభాగం ముగిసే సరికి బెంగాల్‌ 15-12తో బెంగళూరుపై ఆధిక్యంలో నిలిచింది.

అదే దూకుడు: కీలకమైన ద్వితీయార్ధంలో బెంగాల్‌ పాయింట్ల వేటలో అదే దూకుడు కనబరిచింది. అంతగా అనుభవం లేని బెంగళూరును బోల్తా కొట్టిస్తూ కీలక పాయింట్లు కొల్లగొట్టింది. మ్యాచ్‌ 17వ నిమిషంలో డూ ఆర్‌ డై రైడ్‌కు వచ్చిన నితిన్‌కుమార్‌..లకీకుమార్‌ను ఔట్‌ చేసి బెంగాల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. నిమిషం తేడాతో రైడ్‌కు వచ్చిన మనిందర్‌సింగ్‌..నితిన్‌ నార్వల్‌, అజింక్యా పవార్‌ను ఔట్‌ చేయడంతో బెంగళూరు తొలిసారి ఆలౌటైంది. అంతగా ప్రభావం చూపని పర్దీప్‌ నార్వల్‌ స్థానంలో మరో ప్లేయర్‌ను బెంగళూరు సబ్‌స్టిట్యూట్‌గా తీసుకుంది. మ్యాచ్‌ మరో మూడు నిమిషాల్లో ముగస్తుందనగా బెంగళూరు రెండో సారి ఆలౌట్‌ కావడంతో బెంగాల్‌ విజయం ఖరారైంది. మ్యాచ్‌ ఆసాంతం మన్‌దీప్‌సింగ్‌ రైడింగ్‌ జోరు సాగింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement