
న్యూఢిల్లీ: ప్రొ హాకీ లీగ్ యూరప్ అంచె పోటీల్లో భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో... హాకీ ఇండియా (హెచ్‌ఐ) దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. యువ ఆటగాళ్లకు యూరప్‌లో మ్యాచ్ ప్రాక్టీస్ దక్కాలనే ఉద్దేశంతో... భారత ‘ఎ’ జట్టును యూరప్ పర్యటనకు పంపుతోంది. దీని కోసం మంగళవారం 20 మంది యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 8 నుంచి 20 మధ్య ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనున్న భారత ‘ఎ’ జట్టు... ఇంగ్లండ్, బెల్జియంతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ‘నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుంది.
ప్రతిభగల ప్లేయర్లను గుర్తించడంతో పాటు వారికి అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ పరిస్థితులు కలి్పంచేందుకు ఇది తోడ్పడుతుంది’అని హాకీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. భారత ‘ఎ’ జట్టుకు సంజయ్ సారథ్యం వహిస్తుండగా... రబిచంద్రసింగ్ వైస్ కెపె్టన్‌గా వ్యవహరించనున్నాడు. భారత జాతీయ జట్టుకు సహాయక కోచ్‌గా పనిచేస్తున్న శివేంద్ర సింగ్... ఈ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ‘యూరప్ ఆటగాళ్ల శైలిని అర్థం చేసుకునేందుకు మన యువ ఆటగాళ్లకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ముందే అంతర్జాతీయ అనుభవం గడించడం ఆటగాళ్లకు ఎంతో తోడ్పడుతుంది’ అని శివేంద్ర సింగ్ అన్నాడు. దీంతో జాతీయ జట్టు భవిష్యత్తుకు భరోసా పెరుగుతుందని వెల్లడించాడు.
భారత ‘ఎ’ హాకీ జట్టు: గోల్ కీపర్స్: పవన్, మోహిత్. డిఫెండర్స్: ప్రతాప్ లాక్రా, వరుణ్ కుమార్, అమన్‌దీప్ లాక్రా, ప్రమోద్, సంజయ్ (కెప్టెన్). మిడ్‌ఫీల్డర్స్: పూవన్న చందూర బాబీ, మొహమ్మద్ రాహిల్, రబిచంద్ర సింగ్, విష్ణుకాంత్ సింగ్, ప్రదీప్ సింగ్, రాజిందర్ సింగ్. ఫార్వర్డ్స్: అంగద్‌బీర్ సింగ్, బాబీ సింగ్ ధామి, మణీందర్ సింగ్, వెంకటేశ్ కెంచె, ఆదిత్య అర్జున్ లాథె, సెల్వమ్ కార్తీ, ఉత్తమ్ సింగ్. స్టాండ్‌బై: అంకిత్ (గోల్‌కీపర్), సునీల్ (డిఫెండర్), సుదీప్ (ఫార్వర్డ్).