ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్
హైదరాబాద్, 24 అక్టోబర్ 2024: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో బెంగాల్ వారియర్స్ బోణీ కొట్టింది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసి బరిలోకి దిగిన యూపీ యోధాస్‌పై బెంగాల్ వారియర్స్ మెరుపు విజయం నమోదు చేసింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌స్టేడియంలో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై బెంగాల్ వారియర్స్ 32-29తో గెలుపొందింది. ఉత్కంఠ మ్యాచ్‌లో మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించిన బెంగాల్ వారియర్స్.. యూపీ యోధాస్‌కు సీజన్లో తొలి ఓటమి రుచి చూపించింది. బెంగాల్ వారియర్స్ సమిష్టి ప్రదర్శనతో రాణించింది. రెయిడర్లు మణిందర్ సింగ్ (8), నితిన్ (7), సుశీల్ (7) అదరగొట్టారు. యూపీ యోధాస్ ఆల్‌రౌండర్ భరత్ (13) సూపర్ టెన్‌తో షో చేసినా.. ఫలితం దక్కలేదు.
ప్రథమార్థం హోరాహోరీ :
బెంగాల్ వారియర్స్, యూపీ యోధాస్ తొలి అర్థభాగం ఆటలో నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. తొలి రెండు మ్యాచుల్లో విజయాలతో ఊపుమీదున్న యూపీ యోధాస్‌ను ఒత్తిడిలో నిలువరించిన బెంగాల్ వారియర్స్ 12-11తో ప్రథమార్థంలో ఆధిక్యం సాధించింది. ఇరు జట్లూ రెయిడింగ్, డిఫెన్స్‌లో బలంగా ఉండటంతో ఏ జట్టు సైతం ఆలౌట్ స్కోరు చేయలేకపోయింది. భరత్ సక్సెస్‌ఫుల్ రెయిడ్‌తో యూపీ యోధాస్ తొలుత ఖాతా తెరిచినా.. బెంగాల్ వారియర్స్‌ను మణిందర్ సింగ్ ముందుండి నడిపించాడు. బెంగాల్ వారియర్స్ రెయిడింగ్‌లో 9 పాయింట్లు సాధించగా, యూపీ యోధాస్ 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. డిఫెన్స్‌లో ఇరు జట్లు మూడేసి పాయింట్లు సాధించాయి.
వారియర్స్ దూకుడు :
ప్రథమార్థం ఆటలో ఒక్క పాయింట్ ఆధిక్యంలో నిలిచిన బెంగాల్ వారియర్స్ విరామం అనంతరం దూకుడు పెంచింది. ఆఖరు పది నిమిషాల ఆట వరకు యూపీ యోధాస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ మణిందర్ సింగ్‌కు నితిన్ జత కలవటంతో బెంగాల్ దూకుడు ముందు యూపీ యోధాస్ నిలువలేదు. వరుసగా సక్సెస్‌ఫుల్ రెయిడ్స్‌తో బెంగాల్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 25-21తో నాలుగు పాయింట్ల ముందంజ వేసిన బెంగాల్ ఆ తర్వాత యోధాస్‌కు చిక్కలేదు. యోధాస్ రెయిడర్ భరత్ సూపర్ టెన్ ప్రదర్శనతో మెరిసినా.. ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. ఆఖరు రెండు నిమిషాల్లోనూ యూపీ యోధాస్ గట్టిగా ప్రయత్నించినా అప్పటికే మ్యాచ్ బెంగాల్ వారియర్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment