పట్నా: పేరుకు తగ్గట్టే బెంగాల్ వారియర్స్ అసలైన వారియర్‌లా పోరాడింది. ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు 5 పాయింట్ల అంతరాన్ని పూడ్చి విజేతగా నిలిచింది. ఒత్తిడి సమయాన ఎలా ఆడాలో మిగతా జట్లకు నేర్పింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 32–30తో యు ముంబాను ఓడించింది. అదిరే ఆరంభం లభించినా... దానిని సద్వినియోగం చేసుకోలేని యు ముంబా సీజన్‌లో నాలుగో పరాభవాన్ని మూటగట్టుకుంది. యు ముంబా రైడర్ అర్జున్ దేశ్వాల్ సూపర్ ‘టెన్’తో చెలరేగినా... వారియర్స్ సమష్టి కృషి ముందు అది ఏ మాత్రం నిలవలేదు. వారియర్స్ డిఫెండర్లయిన మణీందర్ సింగ్, బల్దేవ్ సింగ్‌లు చెరో 5 టాకిల్ పాయింట్లతో మెరిశారు.
ముంబా... విజయం ముంగిట...
మ్యాచ్ మొదటి అర్ధ భాగంలో యు ముంబా ఆడిన తీరు చూస్తే ఆ జట్టు ఖాతాలో మరో విజయం ఖాయమన్నట్లు కనిపించింది. విరామ సమయానికి ఆ జట్టు 16–11తో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే సూపర్ రైడ్‌తో చెలరేగిన వారియర్ రైడర్ ప్రపంజన్ కుమార్ యు ముంబా ఆధిక్యాన్ని 14–16కు తగ్గించాడు. అనంతరం మరో నాలుగు పాయింట్లు సాధించిన బెంగాల్ జట్టు 18–17తో ముందంజ వేసింది. ప్రత్యర్థి ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్లు కనిపించిన ముంబై జట్టు వరుసగా పాయింట్లు సాధించి 26–21తో మరోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇటువంటి ఒత్తిడి సమయంలో ముంబైని తమ పట్టుతో పట్టేసిన బెంగాల్ డిఫెండర్లు ఆ జట్టును ఆలౌట్ చేసి... అనంతరం ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకున్నారు.
సొంత మైదానంలో పట్నా పైరేట్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. అంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పట్నా... చివరి మ్యాచ్‌లో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. 41–20తో యూపీ యోధపై ఘన విజయం సాధించింది. పట్నా తరపున ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి గుజరాత్ అంచె పోటీలు అహ్మదాబాద్‌లో ఆరంభం కానున్నాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్; పుణేరి పల్టన్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి.
వారెవ్వా వారియర్స్
Published Sat, Aug 10 2019 4:51 AM | Last Updated on Sat, Aug 10 2019 4:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment