Pro Kabaddi 2019
-
సెమీస్‌లో బెంగళూరు, ముంబా
అహ్మదాబాద్: ఆరంభంలో తడబడినా... పవన్ అసాధారణ పోరాటంతో ఓడాల్సిన మ్యాచ్‌ను డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ గెలిచింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫలితం కోసం అదనపు సమయం వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7లో సోమవారం జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 48–45తో యూపీ యోధపై విజయం సాధించి సెమీస్‌లో అడుగు పెట్టింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 36–36తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ఆరు నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. అదనపు సమయంలో వవన్ సూపర్ రైడ్‌తో చెలరేగడంతో బెంగళూరు బుల్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది. పవన్‌కు సుమిత్ సింగ్ (7 పాయింట్లు), మహేందర్ సింగ్ (4 పాయింట్లు) సహకరించారు. రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌లో యు ముంబా 46–38తో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. బుధవారం జరిగే సెమీఫైనల్స్‌లో బెంగళూరు బుల్స్‌తో దబంగ్ ఢిల్లీ; యు ముంబాతో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
ప్లే ఆఫ్స్‌కు చేరువగా ముంబా
పంచకుల: ప్రస్తుత ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ ప్లే ఆఫ్స్‌కు యు ముంబా మరింత చేరువైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ముంబా 36–32తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. దీంతో 59 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది. ముంబై రైడర్ అభిషేక్ సింగ్ సూపర్ ‘టెన్’తో ఆకట్టుకున్నాడు. తలైవాస్ రైడర్ అజిత్ (16 పాయింట్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యు ముంబాకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో... ఒక్క మ్యాచ్ గెలిచినా ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ బెర్తును సొంతం చేసుకుంటుంది. ఒక వేళ రెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం ఇతర మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ 42–33తో దబంగ్ ఢిల్లీపై నెగ్గింది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరాయి. -
ప్రదీప్ 26, తలైవాస్ 25
కోల్‌కతా: పట్నా పైరేట్స్ రైడర్ ప్రదీప్ నర్వాల్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 26 పాయింట్లు సాధించి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. దీంతో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా 51–25తో తమిళ్ తలైవాస్‌ను చిత్తు చేసింది. పట్నా సాధించిన మొత్తం పాయింట్లల్లో ప్రదీప్ సాధించిన పాయింట్లు సగం ఉండటం విశేషం. అంతే కాకుండా ప్రత్యర్థి సాధించిన పాయింట్ల కంటే ప్రదీప్ సాధించిన పాయింట్లే ఎక్కువ. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధ 33–26తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై విజయం సాధించింది. గుజరాత్ రైడర్ సచిన్ సూపర్ టెన్తో రాణించినా జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. -
యు ముంబా సిక్సర్...
బెంగళూరు: రైడర్ అభిషేక్ సింగ్ (13 పాయింట్లు), డిఫెండర్ ఫజల్ అత్రాచలి (6 పాయింట్లు) ఆకట్టుకునే ప్రదర్శనతో ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో యు ముంబా జట్టు జయాపజయాలను సమం చేసింది. స్థానిక కంఠీరవ స్టేడియంలో శనివారం మ్యాచ్‌లో యు ముంబా 47–21తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను చిత్తుగా ఓడించి ఈ సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన ముంబా 6 మ్యాచ్‌ల్లో గెలిచి మరో ఆరింటిలో ఓడినట్లయింది. అభిషేక్ సింగ్ 18 సార్లు రైడింగ్‌కు వెళ్లి 10 సార్లు సఫలమయ్యాడు. మరో 7 పర్యాయాలు పాయింట్లేమీ తీసుకురాకుండా, ఒకసారి మాత్రం ప్రత్యర్థి డిఫెండర్లకు దొరికిపోయాడు. మరో రైడర్ అర్జున్ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. హరేంద్ర ఐదుగురిని పట్టేసి ఐదు పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లలో రైడింగ్‌లో నితిన్ రావల్ (5 పాయింట్లు), ట్యాకిల్‌లో అమిత్ హుడా (3 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 32–23తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. విజేత జట్టులో సౌరభ్ (8 పాయింట్లు), మహేందర్ సింగ్ (4 పాయింట్లు) రాణించారు. బెంగళూరు జట్టులో సచిన్, జీబీ మోరే చెరో 5 పాయింట్లు సాధించారు. నేడు యూపీ యోధాతో బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్‌తో తమిళ్ తలైవాస్ ఆడతాయి. -
హరియాణాను గెలిపించిన వికాశ్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 36–33తో బెంగాల్ వారియర్స్‌ను కంగుతినిపించింది. హరియాణా రైడర్ వికాశ్ కండోలా 11 పాయింట్లతో చెలరేగాడు. మరో రైడర్ వినయ్ 9 పాయింట్లతో వికాశ్‌కు చక్కని సహకారం అందించాడు. బెంగాల్ వారియర్స్ రైడర్ మణీందర్ సింగ్ 15 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్‌గా నిలిచినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 35–30తో పుణేరి పల్టన్‌పై నెగ్గింది. నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
టైటాన్స్ మూడో విజయం
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ మూడో విజయాన్ని సాధించింది. ఢిల్లీ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 24–21తో జైపూర్ పింక్ పాంథర్స్‌కు షాకిచ్చింది. డిఫెండర్ విశాల్ భరద్వాజ్ 8 టాకిల్ పాయింట్లతో ప్రత్యర్థిని పట్టేయడంలో సఫలం అయ్యాడు. చివర్లో టైటాన్స్ సారథి అబొజర్ తన అనుభవంతో ప్రత్యర్థిని పట్టేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో ఆతిథ్య ఢిల్లీ దబంగ్ 33–31తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్; యూపీ యోధతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
వారియర్స్ విజయం
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో బెంగాల్ వారియర్స్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 35–26తో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. రైడర్ మణీందర్ సింగ్ సూపర్ ‘టెన్’తో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. అతనికి డిఫెండర్ రింకు నర్వాల్ (5 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. పట్నా తరఫున ఒంటరి పోరాటం చేసిన ప్రదీప్ నర్వాల్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచినా... సహచరులు రాణించకపోవడంతో జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మ్యాచ్ లో బెంగాల్ ప్రత్యర్థిని 4 సార్లు ఆలౌట్ చేయగా... పట్నా రెండు సార్లు ఆలౌట్ చేసింది. ఈ విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్‌తో యు ముంబా తలపడతాయి. -
తమిళ్ తలైవాస్ ఓటమి
చెన్నై: సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ పరాభవాన్ని మూటగట్టుకుంది. ప్రొ కబడ్డీ లీగ్ ఎడో సీజన్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 21–32తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. తలైవాస్ స్టార్ ఆటగాళ్లు రాహుల్ చౌదరి, మంజీత్ చిల్లర్, అజయ్ ఠాకూర్లు పూర్తిగా విఫలమయ్యారు. బెంగళూరు ఆటగాడు పవన్ షెరావత్ సూపర్ ‘టెన్’ (మొత్తం 11 పాయింట్లు)తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీల మ్యాచ్ చివరకు 30–30తో ‘టై’గా ముగిసింది. దబంగ్ ఢిల్లీ ఆటగాడు ప్రవీన్ కుమార్ 11 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్‌గా నిలిచాడు. -
యు ముంబా విజయం
అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7 మ్యాచ్‌లో యు ముంబా 34–30తో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. యు ముంబా రైడర్ రోహిత్ బలియాన్ 9 పాయింట్లతో జట్టుకు విజయాన్ని అందించాడు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 22–19తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌పై విజయం సాధించింది. జైపూర్ రైడర్ దీపక్ నివాస్ హుడా 7 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి చెన్నైలో పోటీలు జరుగుతాయి. తొలి రోజు తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్; బెంగాల్ వారియర్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
జైపూర్ విజయాల బాట
అహ్మదాబాద్: జైపూర్ పింక్ పాంథర్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. తమ చివరి మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ చేతిలో అనూహ్యంగా ఓడిన పింక్ పాంథర్స్ ఆ షాక్ నుంచి త్వరగానే తేరుకున్నట్లు కనిపించింది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 33–25తో పుణేరి పల్టన్‌ను ఓడించింది. జైపూర్ స్టార్ రైడర్ దీపక్ నివాస్ హుడా మరో సూపర్ ‘టెన్’తో చెలరేగాడు. పుణే తరఫున పంకజ్ మోహిత్ 8 పాయింట్లతో రాణించాడు. ఆట ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జైపూర్... ఎక్కడా తడబాటుకు గురికాలేదు. తమ రైడింగ్‌తో ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదిస్తూ... అలాగే పుణే రైడర్లను పట్టేస్తూ దూసుకెళ్లింది. ఇదే జోరులో పుణేని ఆలౌట్ చేసి 17–11తో తొలి అర్ధ భాగాన్ని ముగించింది. రెండో అర్ధ భాగంలోనూ దూకుడును కొనసాగించిన జైపూర్ సీజన్లో 5 విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. నేటి మ్యాచ్‌ల్లో యూ ముంబాతో పట్నా పైరేట్స్; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
వారియర్స్‌తో ‘టై’టాన్స్
అహ్మదాబాద్: గుజరాత్‌పై విజయంతో ఇక తెలుగు టైటాన్స్ గాడిలో పడిందని అనుకుంటే... ఆ దూకుడు కేవలం ఒక విజయానికి మాత్రమే పరిమితమైంది. సోమవారం బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను టైటాన్స్ 29–29తో ‘టై’ చేసుకుంది. ఈ సీజన్లో టైటాన్స్‌కిది రెండో ‘టై’ కావడం విశేషం. ఆట ఆరంభంలోనే సిద్ధార్థ్ దేశాయ్ తన రైడ్‌తో పాయింట్ తెచ్చి జట్టు ఖాతా తెరిచాడు. మ్యాచ్ మొదటి భాగంలో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురవడంతో తెలుగు టైటాన్స్ 13–11తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన టైటాన్స్ 17–12తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే ఆధిక్యంలో ఉన్నామన్న అతివిశ్వాసం జట్టును దెబ్బతీసింది. ప్రతి రైడర్‌ను పట్టేయాలని డిఫెండర్ విశాల్ భరద్వాజ్ చూపించిన అనవసరపు దూకుడు అతడిని పలుమార్లు కోర్టును వీడేలా చేసింది. అప్పటి వరకు నిలకడగా రాణించిన సిద్ధార్థ్ దేశాయ్, సూరజ్ దేశాయ్‌ల రైడింగ్ లయ తప్పడంతో ప్రత్యర్థులకు సులభంగా దొరికిపోయారు. ఒక్కో పాయింట్ సాధిస్తూ వచ్చిన వారియర్స్ టైటాన్స్‌ను ఆలౌట్ చేసి 23–21తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే చివర్లో పుంజుకున్న టైటాన్స్ స్కోర్‌ను సమం చేసి ఊపిరి పీల్చుకుంది. టైటాన్స్ రైడర్ సూరజ్ దేశాయ్ 7 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధ జట్టు 35–33తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. యూపీ రైడర్ పవన్ శెరావత్ అటు రైడింగ్‌లో, ఇటు ప్రత్యర్థిని పట్టేయడంలోనూ చెలరేగాడు. మొత్తం 15 పాయింట్ల (6 రైడ్, 3 టాకిల్, 6 బోనస్)తో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధతో హరియాణా స్టీలర్స్; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
జెర్సీ మారింది... బోణీ కొట్టింది
అహ్మదాబాద్: మారిన జెర్సీ రంగు తెలుగు టైటాన్స్ జట్టుకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో అందని ద్రాక్షలా ఉన్న గెలుపు ఎట్టకేలకు తెలుగు టైటాన్స్‌ను పలకరించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30–24తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించి ఈ లీగ్‌లో తొలి విజయాన్ని అందుకుంది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్, విశాల్ భరద్వాజ్‌లు చెరో ఏడు పాయింట్లతో జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. మ్యాచ్ మొత్తంలో 16 టాకిల్ పాయింట్లు, 11 రైడ్ పాయింట్లతో ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేసిన తెలుగు జట్టు గెలుపు బోణీ కొట్టింది. సీజన్లో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ పసుపు రంగు జెర్సీతో బరిలో దిగిన టైటాన్స్... గుజరాత్‌తో మ్యాచ్‌లో మాత్రం నల్ల రంగు జెర్సీతో ఆడింది. కొత్త జెర్సీ రంగు ఏం అదృష్టం తెచ్చిందో ఏమో కానీ.. ప్రత్యర్థి జట్టును ఆట ఆరంభమైన ఏడో నిమిషంలోనే ఆలౌట్ చేసింది. మొదటి అర్ధ భాగంలో సిద్ధార్థ్ రైడింగ్‌లో చెలరేగితే... రెండో అర్ధ భాగంలో విశాల్ భరద్వాజ్ తన పట్టుతో ప్రత్యర్థి రైడర్లను పట్టేశాడు. దీంతో గుజరాత్ సొంత మైదానంలో వరుసగా రెండో ఓటమిని నమోదు చేసింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 30–33తో హరియాణా స్టీలర్స్ చేతిలో ఓడింది. హరియాణా రైడర్ వికాస్ ఖండోలా 12 పాయింట్లతో రాణించాడు. నేటి మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్; యూపీ యోధతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
వారెవ్వా వారియర్స్
పట్నా: పేరుకు తగ్గట్టే బెంగాల్ వారియర్స్ అసలైన వారియర్‌లా పోరాడింది. ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు 5 పాయింట్ల అంతరాన్ని పూడ్చి విజేతగా నిలిచింది. ఒత్తిడి సమయాన ఎలా ఆడాలో మిగతా జట్లకు నేర్పింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 32–30తో యు ముంబాను ఓడించింది. అదిరే ఆరంభం లభించినా... దానిని సద్వినియోగం చేసుకోలేని యు ముంబా సీజన్లో నాలుగో పరాభవాన్ని మూటగట్టుకుంది. యు ముంబా రైడర్ అర్జున్ దేశ్వాల్ సూపర్ ‘టెన్’తో చెలరేగినా... వారియర్స్ సమష్టి కృషి ముందు అది ఏ మాత్రం నిలవలేదు. వారియర్స్ డిఫెండర్లయిన మణీందర్ సింగ్, బల్దేవ్ సింగ్‌లు చెరో 5 టాకిల్ పాయింట్లతో మెరిశారు. ముంబా... విజయం ముంగిట... మ్యాచ్ మొదటి అర్ధ భాగంలో యు ముంబా ఆడిన తీరు చూస్తే ఆ జట్టు ఖాతాలో మరో విజయం ఖాయమన్నట్లు కనిపించింది. విరామ సమయానికి ఆ జట్టు 16–11తో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే సూపర్ రైడ్‌తో చెలరేగిన వారియర్ రైడర్ ప్రపంజన్ కుమార్ యు ముంబా ఆధిక్యాన్ని 14–16కు తగ్గించాడు. అనంతరం మరో నాలుగు పాయింట్లు సాధించిన బెంగాల్ జట్టు 18–17తో ముందంజ వేసింది. ప్రత్యర్థి ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్లు కనిపించిన ముంబై జట్టు వరుసగా పాయింట్లు సాధించి 26–21తో మరోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇటువంటి ఒత్తిడి సమయంలో ముంబైని తమ పట్టుతో పట్టేసిన బెంగాల్ డిఫెండర్లు ఆ జట్టును ఆలౌట్ చేసి... అనంతరం ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకున్నారు. సొంత మైదానంలో పట్నా పైరేట్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. అంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పట్నా... చివరి మ్యాచ్‌లో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. 41–20తో యూపీ యోధపై ఘన విజయం సాధించింది. పట్నా తరపున ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి గుజరాత్ అంచె పోటీలు అహ్మదాబాద్‌లో ఆరంభం కానున్నాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్; పుణేరి పల్టన్‌తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
పరాజయాల టైటాన్స్
పట్నా: ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ ఇప్పట్లో బోణీ కొట్టేలా కనిపించడం లేదు. గురువారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47–26తో ఓడిన టైటాన్స్ సీజన్లో మరో పరాభవాన్ని మూటగట్టుకుంది. టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 11 పాయింట్లతో తొలిసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచినా... బుల్స్ రైడర్ పవన్ కుమార్ (17 పాయింట్లు) రైడింగ్ ముందు నిలబడలేకపోయాడు. దీంతో సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడి, ఒక దాంట్లో ‘టై’తో సరిపెట్టుకున్న టైటాన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో బెంగాల్ వారియర్స్, పట్నా పైరేట్స్‌తో యూపీ యోధ తలపడతాయి. -
హరియాణా స్టీలర్స్ గెలుపు
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో హరియాణా స్టీలర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో హరియాణా 35–26 స్కోరుతో పట్నాపై నెగ్గింది. స్టీలర్స్ జట్టులో రైడర్ వికాస్ (10) చక్కని ప్రదర్శన కనబరిచాడు. వినయ్ (6) కూడా రైడింగ్‌లో మెరువగా... డిఫెండర్లు రవి కుమార్ (4), సునీల్ (4), ధర్మరాజ్ చేరలతన్ (3) ప్రత్యర్థుల్ని అద్భుతంగా టాకిల్ చేయడంతో విజయం సులువైంది. పట్నా జట్టులో ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లు తెచ్చిపెట్టాడు. జట్టు సాధించిన స్కోరులో సగం కంటే ఎక్కువ పాయింట్లు ఇతనివే అయినా... సహచరుల వైఫల్యంతో జట్టు పరాజయం చవిచూసింది. యూపీ, తమిళ్ మ్యాచ్ టై... అంతకుముందు యూపీ యోధ, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య ఉత్కంఠ రేపిన మ్యాచ్ చివరకు 28–28తో టై అయింది. తలైవాస్ స్టార్ రాహుల్ చౌదరి (5 పాయింట్లు) ఆటలు సాగలేదు. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. -
తమిళ్ తలైవాస్ విజయం
పట్నా: తమిళ్ తలైవాస్ ఖాతా ఆలస్యంగానే తెరిచింది. పుంజు కుంది ఆలస్యంగానే... చివరకు గెలిచింది మాత్రం దర్జాగా! రాహుల్ చౌదరి (14 పాయింట్లు) రైడింగ్ ప్రదర్శనతో... ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 35–28తో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి హరియాణా స్టీలర్స్ ధాటికి 19–10 స్కోరుతో తలైవాస్ వెనుకబడింది. కానీ ద్వితీయార్ధంలో అటు రైడింగ్, ఇటు టాకిల్స్‌తో తమిళ్ జట్టు వేగం పెంచి గెలిచింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 20–41తో పుణేరి పల్టన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆట మొదలై పది నిమిషాలైనా... ప్రత్యర్థి పుణేరి 14 పాయింట్లు చేసినా... పట్నా మాత్రం ఖాతా తెరువలేకపోయింది. రెండుసార్లు ఆలౌటై భారీ తేడాతో మూల్యం చెల్లించుకుంది. పుణేరి తరఫున అమిత్ 9, పంకజ్ 8, మన్జీత్ 6 పాయింట్లు చేసి జట్టును గెలిపించారు. -
టైటాన్స్ నాన్ టెక్నికల్ టై
ముంబై: తెలుగు టైటాన్స్ ఆటగాళ్ల అత్యుత్సాహం జట్టుకు విజయాన్ని దూరం చేసింది. సాధారణంగా మ్యాచ్ ముగిశాక రిఫరీ వేసే లాంగ్ విజిల్ కంటే ముందుగా కబడ్డీ కోర్టు వెలుపల ఉన్న సహచర ఆటగాళ్లు గెలిచామనే ఆనందంతో కోర్టులోకి దూసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన రిఫరీలు యూపీ యోధకు నాన్ టెక్నికల్ రైడ్ పాయింట్ కేటాయించడంతో... టైటాన్స్‌కు ఈ సీజన్లో దక్కాల్సిన తొలి విజయం కాస్తా ‘టై’గా ముగిసింది. ముంబై వేదికగా శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, యూపీ యోధ జట్లు నిర్ణీత సమయానికి 20–20తో సమంగా నిలిచాయి. దీంతో ప్రొ కబడ్డీ సీజన్ – 7లో తొలి ‘టై’ నమోదైంది. టైటాన్స్ తరపున సిద్ధార్థ్ దేశాయ్ (5 పాయింట్లతో) ఫర్వాలేదనిపించాడు. చేజేతులా... ఎలాగైనా విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో బరిలో దిగిన టైటాన్స్ మొదట ఆధిక్యాన్ని ఆ తర్వాత గెలుపుని చేజేతులా జారవిడుచుకుంది. మొదట 7–3తో ఆధిక్యంలో ఉన్న సమయంలో అలసత్వం ప్రదర్శించడంతో యూపీ వరుస పాయింట్లను సాధించి స్కోర్‌ను సమం చేసింది. మళ్లీ చివరి నిమిషంలో అదే అలసత్వం ప్రదర్శించి గెలుపును వదులుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో కూతకెళ్లిన టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ పాయింట్ సాధించి జట్టును 20–19తో ఆధిక్యంలో నిలిపాడు. దీంతో గెలిచామనే ఆనందంలో టైటాన్స్ జట్టు సభ్యులు రిఫరీ లాంగ్ విజిల్ వేశాడా..? లేదా... అనేది చూసుకోకుండా కోర్టులోకి దూసుకురావడంతో రిఫరీలు యూపీ జట్టుకు నాన్ టెక్నికల్ రైడ్ పాయింట్‌ను కేటాయించారు. దీనిపై టైటాన్స్ సమీక్షకు వెళ్లగా... టీవీ అంపైర్ రిఫరీల నిర్ణయానికే కట్టుబడటంతో గెలవాల్సిన మ్యాచ్ కాస్త టైగా ముగిసింది. ఆఖరి పంచ్ ముంబైదే.. ముంబై వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆఖరి పంచ్ ముంబై కొట్టింది. గుజరాత్ ఫార్చున్ జెయింట్స్‌పై 20–32తో ముంబై గెలిచి వరుస పరాజయాలకు పుల్‌స్టాప్ పెట్టింది. ముంబై ఆటగాళ్లు సురీందర్ సింగ్ 9 పాయింట్లతో, అభిషేక్ సింగ్ 6 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; బెంగాల్ వారియర్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
దబంగ్ ఢిల్లీకి కళ్లెం
ముంబై: ఈ సీజన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీకి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ కళ్లెం వేసింది. ముంబైలోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 31–26తో ఢిల్లీని కంగుతినిపించింది. మ్యాచ్ ఆసాంతం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం కీలక సమయంలో ఒత్తిడిని జయించిన ఫార్చూన్ జెయింట్స్నే వరించింది. దీంతో లీగ్‌లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన మోరే 9 పాయింట్ల(4 రైడ్ పాయింట్లు, 4 టాకిల్ పాయింట్లు, ఒక బోనస్ పాయింటు)తో గుజరాత్‌కు విజయాన్ని అందించాడు. అతనికి రోహిత్ గులియా (8 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. దబంగ్ రైడర్ నవీన్ కుమార్ సూపర్ ‘టెన్’ సాధించినా ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ యోధతో తెలుగు టైటాన్స్; యు ముంబాతో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్ తలపడతాయి. -
ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు
ప్రపంచకప్‌లో పటిష్ట జట్లపై ప్రతాపం చూపిన బంగ్లాదేశ్ నెలతిరిగే లోపే చేవలేని శ్రీలంక చేతిలో ‘జీరో’ అయ్యింది. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌ను మంగళవారం ప్రకటించింది.ఇలాంటి మరిన్ని క్రీడా విశేషాలు మీ కోసం. -
గట్టెక్కిన పట్నా పైరేట్స్
ముంబై: ఉత్కంఠభరిత మ్యాచ్‌లకు వేదికగా మారిన ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్ నమోదైంది. విజయం కోసం చివరి వరకు పోరాడిన తమిళ్ తలైవాస్ కేవలం ఒక పాయింట్ తేడాతో పట్నా పైరేట్స్ ముందు తలవంచింది. సోమవారం ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 24–23 తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. వరుసగా తానాడిన రెండు మ్యాచ్‌లలో విజయం అంచుల వరకు వచ్చి ఓడిపోవడంతో తలైవాస్ డీలా పడింది. పైరేట్స్ డిఫెండర్ జైదీప్ 5 టాకిల్ పాయింట్లతో పాటు కీలక సమయంలో రైడ్‌కు వెళ్లి రెండు బోనస్ పాయింట్లు తెచ్చి హీరోగా నిలిచాడు. మోను 5 పాయింట్లతో అతనికి తన వంతు సాయం చేశాడు. రాహుల్ చౌదరి (5 పాయింట్లు), మంజీత్ చిల్లర్ (4 పాయింట్లు) ఆకట్టుకోలేకపోయారు. తడబడి నిలబడి... పట్నా పైరేట్స్ ఆటను అంత గొప్పగా ఆరంభించలేదు. మరోవైపు తలైవాస్ మొదటి మూడు నిమిషాల్లోనే నాలుగు పాయింట్లు సాధించి 4–0తో అధిక్యంలోకెళ్లింది. అయితే తరువాతి నిమిషంలో రాహుల్‌ని సూపర్ టాకిల్ చేసిన పట్నా రెండు పాయింట్లు సాధించి ఖాతా తెరిచింది. ఆ వెంటనే రైడ్‌కు వెళ్లిన ఇస్మాయిల్ రాన్ సింగ్‌ను ఔట్ చేయడంతో పాటు బోనస్ పాయింట్‌ను సాధించి స్కోరును సమం చేశాడు. తర్వాత ఇరు జట్లు సమానంగా పాయింట్లను సంపాదించడంతో విరామ సమయానికి 11–11తో సమంగా నిలిచాయి. చివరి మూడు నిమిషాల్లో... ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా తలైవాస్ 18–22తో వెనుకబడింది. ఈ దశలో రాహుల్, రాన్ సింగ్‌లు తమ రైడ్లతో మూడు పాయింట్లు తెచ్చారు. అదే సమయంలో పైరేట్స్ రెండు పాయింట్లను సాధించడంతో స్కోరు 21–24కు వెళ్లింది. చివరి రైడ్‌కు వెళ్లిన ప్రదీప్‌ను సూపర్ టాకిల్ చేసిన తలైవాస్‌కు రెండు పాయింట్లు వచ్చినా అది విజయాన్ని అందించలేకపోయింది. బెంగాల్ ఘనవిజయం రెండో మ్యాచ్‌లో బెంగాల్‌వారియర్స్ 43–23తో పుణేరి పల్టన్‌ను బోల్తా కొట్టించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో బెంగాల్ ముందు పుణేరి ఏమాత్రం నిలబడలేకపోయింది. బెంగాల్ తరపున మణీందర్ సింగ్ సూపర్ ‘టెన్’ (మొత్తం 14 పాయింట్లు)తో అదరగొట్టాడు. అతనికి ఇస్మాయిల్ నబీబ„Š (8 పాయింట్లు) సహకారం తోడవడంతో బెంగాల్ రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పుణేరి ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. దీంతో పాయింట్ల పట్టికలో 11వ స్థానంలో నిలిచింది. మంగళవారం విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో యూపీ యోధ తలపడతాయి. ప్రొ కబడ్డీలో 900 పాయింట్లను సాధించిన తొలి రైడర్‌గా రాహుల్ చౌదరి చరిత్ర సృష్టించాడు. మంజీత్ చిల్లర్ 300 టాకిల్ పాయింట్ల మార్క్‌ను అందుకున్నాడు. అజయ్ ఠాకూర్ రైడింగ్‌లో 600 పాయింట్లను సాధించాడు. -
బెంగాల్ చేతిలో పుణెరి చిత్తుచిత్తుగా..
ముంబై : బెంగాల్ వారియర్స్ దూకుడుకు పుణెరి పల్టన్ కుదేలైంది. మ్యాచ్ ఆరంభం నుంచే అటాకింగ్ గేమ్ ఆడిన బెంగాల్.. ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇక బెంగాల్ ఆటగాళ్ల దూకుడైన ఆటకు పుణెరి ఆటగాళ్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. సోమవారం ముంబై ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 43-23 తేడాతో పుణెరి పల్టాన్‌పై ఘన విజయం సాధించింది. బెంగాల్ వారియర్స్ రైడర్ మణిందర్ సింగ్(14) హోరెత్తించగా.. మహ్మద్ నబిబక్ష్(8), రింకూ నర్వాల్(5) రాణించారు. ఆ జట్టు స్టార్ రైడర్ ప్రపంజన్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇక పుణెరి ఆటగాళ్లలో ఏ ఒక్కరూ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. సారథి సుర్జీత్ సింత్ చేతులెత్తేయగా.. పంకజ్ మోహితె(6) ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఇక డిఫెండర్ గిరీష్ ఎర్నాక్(3) ప్రత్యర్థి రైడర్లను కట్టడి చేయలేకపోయాడు. ఓవరాల్‌గా బెంగాల్ వారియర్స్ 22రైడ్, 12 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. పుణెరి జట్టు 13 రైడ్, 9 టాకిల్ పాయింట్లతో అందుకోలేకపోయింది. దీంతో పుణెరి ఖాతాలో హ్యాట్రిక్ ఓటమి పడింది. -
తమిళ్ తలైవాస్‌కు పట్నా షాక్
ముంబై : దబాంగ్ ఢిల్లీపై విజయంతో మంచి జోరు మీదున్న తమిళ్ తలైవాస్‌కు పట్నా పైరేట్స్ షాక్ ఇచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక్క పాయింట్ తేడాతో తమిళ్ తలైవాస్ జట్టు ఓటమి చవిచూసింది. ఆ జట్టు స్టార్ రైడర్లు రాహుల్ చౌదరి(5) ఓ మోస్తారుగా రాణించినప్పటికీ.. సారథి అజయ్ ఠాకూర్(1)లు పూర్తిగా నిరాశపరిచాడు. సోమవారం ముంబై ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తమిళ్ జట్టు 23-24 తేడాతో పట్నాపై పోరాడి ఓడిపోయింది. ఇరుజట్టు ఆది నుంచి ఆచితూచి ఆడాయి. దీంతో పాయింట్లు సాధించడం కష్టంగా మారింది. తొలి అర్దభాగం ముగిసే సరికి 11-11తో సమంగా నిలిచాయ. అయితే రెండో అర్దభాగం మొదట్లో తమిళ్ జట్టు పొరపాట్లు చేయడంతో మూల్యం చెల్లించుకుంది. ఇక చివర్లో తమిళ్ జట్టు పోరాడినప్పటికీ అదృష్టం కలిసిరాక ఓటమిచవిచూసింది. పట్నా స్టార్ రైడర్, సారథి పర్దీప్ నర్వాల్(1)ను కట్టడి చేసిన తమిళ్ ఢిఫెండర్లు.. జైదీప్(7)ను మాత్రం కట్టడి చేయలేకపోయారు. ఇక ఈ మ్యాచ్‌లో పట్నా 7 రైడ్, 17 టాకిల్ పాయింట్లను సాధించగా.. తమిళ్ తలైవాస్ 9 రైడ్, 10 టాకిల్ పాయింట్లను సాధించింది. ఇరుజట్లు చెరో నాలుగు ఎక్సట్రా పాయింట్లను సాధించాయి. -
దబంగ్ ఢిల్లీ హ్యాట్రిక్
ముంబై : ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో దబంగ్ ఢిల్లీ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఆదివారం ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 41–21 పాయింట్లతో హరియాణా స్టీలర్స్‌ను చిత్తు చేసింది. ఢిల్లీ రైడర్లు చంద్రన్ రంజిత్ (11 పాయింట్లు), నవీన్ కుమార్ (10 పాయింట్లు)లు అదరగొట్టారు. వీరికి సయిద్ ఘఫారి డిఫెన్స్ అండ దొరకడంతో ఢిల్లీకి విజయం ఖాయమైంది. మ్యాచ్‌లో 22 రైడ్ పాయింట్లు, 9 టాకిల్ పాయింట్లతో రెండు సార్లు ఆలౌట్ చేసిన ఢిల్లీ ముందు 16 రైడ్ పాయింట్లు, 4 టాకిల్ పాయింట్లతో హరియాణా నిలబడలేకపోయింది. హరియాణా తరపున నవీన్ 9 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. మెరిసిన చంద్రన్... మ్యాచ్ ఆరంభంలో ఒకే రైడ్‌లో రెండు పాయింట్లు తెచ్చిన చంద్రన్ రంజిత్ ఢిల్లీకి మంచి ఆరంభాన్నిచ్చాడు. దీనికి సమాధానంగా హరియాణా జట్టు కూడా ఒక రైడ్ పాయింట్ సాధించి ఖాతా తెరిచింది. స్కోర్ 10–9తో ఉండగా ఢిల్లీ సూపర్ టాకిల్ చేసి రెండు పాయింట్లు సాధించింది.తర్వాత మరో మూడు పాయింట్లను సాధించి 15–10తో ఆధిక్యంలోకి నిలిచింది. విరామం అనంతరం మరింత దూకుడు పెంచిన ఢిల్లీ వరుస రైడ్, టాకిల్ పాయింట్లతో ప్రత్యర్థికి అందకుండా దూసుకెళ్లింది. మ్యాచ్‌లో ఢిల్లీ డిఫెండర్ ధర్మరాజ్ చేరాలథన్ ప్రొ కబడ్డీ లీగ్‌లో 400 పాయింట్ల మార్కును అందుకోగా... అతని సహచరుడు నవీన్ కుమార్ తన రైడ్‌లో విక్రమ్ కండోరా, కుల్దీప్ సింగ్‌లను ఔట్ చేయడం ద్వారా లీగ్‌లో 200 పాయింట్లను దాటాడు. బుల్స్ జోరు.. ఆద్యంతం నువ్వా నేనా అన్నట్టు సాగిన యు ముంబా, బెంగళూరు బుల్స్ మ్యాచ్‌లో బుల్స్ విజయాన్ని అందుకుంది. సొంత ప్రేక్షకుల మద్దతు లభించినా చివరి నిమిషాల్లో ఒత్తిడికి లోనైన ముంబై 26–30తో ఓటమి పాలైంది. బెంగళూరు రైడర్ పవన్ షెరావత్ సూపర్ ‘టెన్’ (మొత్తం 11 పాయింట్లు)తో జట్టును గెలిపించగా... ముంబా జట్టు కెప్టెన్ ఫజేల్ అత్రాచలి (3 పాయింట్లు) నిరాశ పరిచాడు. మ్యాచ్‌లో రెండు జట్లు చిత్రంగా ఖాతా తెరిచాయి. ఇరు జట్ల రైడర్లు తమను తామే ఔట్ చేసుకుని ప్రత్యర్థి జట్లకు పాయింట్లను సమర్పించుకున్నారు. మొదట రైడ్‌కు వెళ్లిన ముంబా జట్టు రైడర్ అభిషేక్ సింగ్ ప్రత్యర్థి ఆటగాళ్లను ఔట్ చేసే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయి ఎల్లో లాబీని తొక్కాడు. అదే విధంగా బెంగళూరు రైడర్ పవన్ షెరావత్ కూడా ఔటయ్యాడు. ‘షేర్’వత్ స్కోర్ 23–19తో ముంబై ఆధిక్యంలో ఉన్నప్పుడు బుల్స్ రైడర్ సింహంలా చెలరేగాడు. వరుస రైడ్లలో పాయింట్లను తెచ్చి జట్టు స్కోర్‌ను 23–23తో సమం చేశాడు. అనంతరం ప్రత్యర్థిని కీలక సమయంలో ఆలౌట్ చేసిన బుల్స్ నాలుగు పాయింట్ల తేడాతో గేమ్‌ను గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి. -
గెలుపు ముంగిట బోర్లా పడిన బెంగాల్
ముంబై : బెంగాల్ వారియర్స్ విజయం ముంగిట బోల్తాపడింది. యూపీ యోధపై భారీ విజయంతో ఊపు మీదున్న బెంగాల్‌కు జైపూర్ పింక్ పాంథర్స్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రొ కబడ్డీ సీజన్ 7లో భాగంగా జైపూర్ పింక్ పాంథర్స్ 27-25 తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో బెంగాల్ నాలుగు పాయింట్లతో లీడింగ్‌లో ఉంది. కనీసం ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నా బెంగాల్ విజయం సాధించేదే. కానీ జైపూర్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన.. బెంగాల్ ఆటగాళ్ల తొందరపాటుతో గెలుపు సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. జైపూర్ విజయంలో సారథి దీపక్ హుడా, డిఫెండర్ సందీప్ దుల్లు కీలకపాత్ర పోషించారు. మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించిన బెంగాల్.. ప్రత్యర్థి జట్టును తొలి నాలుగు నిమిషాలు పాయింట్ల ఖాతాను తెరవనివ్వలేదు. దీంతో 0-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రపంజన్(7), మణిందర్ సింగ్(6), బల్దేవ్ సింగ్(6)లు రాణించడంతో తొలి అర్ద భాగం ముగిసే సరికి బెంగాల్ 14-10తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో అర్దభాగంలోనూ బెంగాల్ ఆటగాళ్లు ఆచితూచి ఆడారు. అయితే చివర్లో తడబడటంతో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. జైపూర్ ఆటగాళ్లు సందీప్ దుల్(8), దీపక్ హుడా(6), దీపక్ నర్వాల్(4) కీలక సమయంలో రాణించి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక ఓవరాల్‌గా జైపూర్ 12 రైడ్, 10 టాకిల్ పాయింట్లు సాధించగా.. బెంగాల్ 13 రైడ్, 11 టాకిల్ పాయింట్లను సాధించింది. అయితే బెంగాల్‌ను ఓ సారి ఆలౌట్ చేయడం, మూడు ఎక్సట్రా పాయింట్లు సాధించడం జైపూర్‌కు కలిసొచ్చింది. -
పుణెరీని బోల్తా కొట్టించిన యు ముంబా
ముంబై: సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో యు ముంబా అదరగొట్టింది. సుర్జీత్ సింగ్ సారథ్యంలోని పుణెరీ పల్టన్‌ను యు ముంబా బోల్తా కొట్టించి విజయం సాధించింది. శనివారం ముంబై ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 33-23 తేడాతో పుణెరీ పల్టన్‌పై విజయాన్ని అందుకుంది. దీంతో పుణెరి ఖాతాలో రెండో ఓటమి పడింది. తొలి మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆరంభంలో ధాటిగా ఆడిన పుణెరి ఆటగాళ్లు.. మ్యాచ్ జరిగే కొద్దీ ఢీలా పడ్డారు. ప్రత్యర్థి జట్టుకు దాసోహమయ్యారు. రైడింగ్‌లో, టాకిల్‌లో పూర్తిగా విఫలమయ్యారు. తొలి అర్థభాగంలో ఇరుజట్లు ఆచితూచి ఆడటంతో పాయింట్ల వేగం తగ్గింది. అయితే రెండో అర్ద భాగంలో యు ముంబా ఆటగాళ్లు విరుచుకపడ్డారు. ఇక ఈ మ్యాచ్‌లో యు ముంబా ఆటగాళ్లు ఒకరిపై ఆధారపడకుండా సమిష్టిగా ఆడారు. రైడర్లు అభిషేక్ సింగ్(5), రోహిత్ బలియాన్(4) రాణించగా.. డిఫెండర్లు సురిందర్ సింగ్(4), సందీప్ నర్వాల్(4), ఫజల్ అత్రచలి(4) పుణెరి పని పట్టారు. ఇక పుణెరీ ఆటగాళ్లలో సారథి సుర్జీత్ సింగ్(4) ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. ఆ జట్టు స్టార్ డిఫెండర్ గిరీష్ ఎర్నాక్ పూర్తిగా విఫలమయ్యాడు. ఒక్క టాకిల్ కూడా చేయలేకపోయాడు. ముంబా జట్టు 15 రైడ్, 12 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. పుణెరి జట్టు 12 రైడ్, 11 టాకిల్ పాయింట్లు మాత్రమే సాధించింది. యు ముంబా ధాటికి పుణెరి పల్టాన్ జట్టు రెండు సార్లు ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.