క్రికెట్ ప్రపంచకప్ పండుగ ముగిసింది. కప్పు గెలిచిన ఇంగ్లండ్ సంబరాల్లో ఉండగా, అదృష్టం వెక్కిరించి గెలుపుగీతను దాటని న్యూజిలాండ్ దుఃఖ సాగరంలో మునిగింది. మూడోసారి జగజ్జేతగా నిలవాలనుకున్న భారత్ సెమీస్‌లోనే ఓడి ఇంటి ముఖం పట్టింది. ఈ పరాజయంతో నైరాశ్యంలో మునిగిన క్రీడాభిమానులను అలరించడానికి మట్టిలో పుట్టిన గ్రామీణ క్రీడ ‘కబడ్డీ’ సమాయత్తమవుతోంది. ఆటగాళ్ల అద్భుత రైడింగ్ విన్యాసాలు, అదిరిపోయే ఉడుంపట్టు డిఫెన్స్ మెరుపులతో క్షణక్షణం ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రొ కబడ్డీ సీజన్–7 సిద్ధమైంది.
పల్లె క్రీడకు కార్పొరేట్ సొబగులద్దడంతో ప్రొ కబడ్డీ రూపంలో పిల్లాడి నుంచి పండు ముసలి వరకు, గ్రామం, పట్టణం, నగరాలనే తేడాల్లేకుండా అనతి కాలంలోనే క్రికెటేతర క్రీడల్లో కబడ్డీ అగ్రగామిగా మారింది. తమ అద్భుతమైన ఆటతో గత కొన్ని సీజన్లుగా వీక్షకుల మనసులు దోచిన కొందరు కూతగాళ్ల గురించి తెలుసుకుందాం..
డుబ్కీ వీరుడు పర్దీప్:
ప్రొ కబడ్డీలో అందరికంటే ఎక్కువగా 858 రైడ్ పాయింట్లను అతి తక్కువ మ్యాచుల్లో (85) పర్దీప్ నర్వాల్ సాధించాడు. ‘డుబ్కీ కింగ్’ అని ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే పర్దీప్ ప్రొ కబడ్డీలో బెంగళూరు జట్టు నుంచి అరంగేట్రం చేశాడు. కానీ అతడికి ఎక్కువ అవకాశాలిచ్చింది మాత్రం పట్నా జట్టు. పట్నా పైరేట్స్ మూడుసార్లు టైటిల్ గెలవడంలో డుబ్కీ కింగ్ కీలకపాత్ర పోషించాడు. హాదీ ఓస్తరక్, జాంగ్ కున్ లీ, సురేందర్ నాడా, మహ్మద్ మగుసొద్లూ లాంటి సీనియర్ ఆటగాళ్ల కలబోతతో ఉన్న పట్నా పైరేట్స్‌ను పర్దీప్ టైటిల్ రేసులో నిలపడానికి తొడగొడుతున్నాడు.
ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపుతున్న పర్దీప్ నర్వాల్
రైడ్ మెషీన్ రాహుల్:
ప్రొ కబడ్డీలో పర్దీప్ నర్వాల్ తర్వాత అత్యధిక రెడింగ్ పాయింట్లను రాహుల్ చౌదరి నమోదు చేశాడు. అభిమానులు రాహుల్‌ను ముద్దుగా ‘ప్రొ కబడ్డీ పోస్టర్ బాయ్’, ‘రైడ్ మెషీన్’ అంటుంటారు. తొలి సీజన్ నుంచి తెలుగు టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన రాహుల్.. రైడింగ్‌లో సూపర్ సక్సెస్ అయినా జట్టుకు కప్పు సాధించడంలో విఫలమయ్యాడు. ఈసారి జట్టు మారిన అతడు తమిళ్ తలైవాస్ టీమ్‌లో అజయ్ ఠాకూర్‌తో కలసి ఆడబోతున్నాడు. తెలుగు టీమ్‌కు కప్పు తీసుకురాలేకపోయిన రాహుల్ తమిళ టీమ్‌తోనైనా కప్పు గెలిచి తన కోరికను తీర్చుకోవాలని కసిగా ఉన్నాడు.
హ్యాండ్ టచ్ యత్నంలో రాహుల్ చౌదరి
సొగసరి అజయ్ ఠాకూర్:
భారత కబడ్డీ జట్టుకు అజయ్ ఠాకూర్ సారథనే విషయం తెలిసిందే. సంప్రదాయ ఆటతీరుతో అజయ్ ఆటతీరు సొగసుగా ఉంటుందంటుంటారు విశ్లేషకులు. అజయ్ రన్నింగ్ హ్యాండ్ టచ్‌లకు పేరున్న డిఫెండర్లు కూడా ఔటవ్వాల్సిందే. ప్రొ కబడ్డీలో గత రెండు సీజన్లుగా తమిళ్ తలైవాస్ టీమ్‌ను కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తున్న అజయ్ ఆయా సీజన్లలో యువ ఆటగాళ్లను బాగా ప్రోత్సహించాడు. శక్తివంచన లేకుండా పోరాడిన అజయ్ సారథ్యంలోని తలైవాస్ జట్టు చాలా మ్యాచుల్లో చివరి నిమిషాల్లో గెలిచింది. అజయ్ అద్భుత ఆటతో ఈ గెలుపులు సాధ్యమయ్యాయి. రాహుల్ చౌదరీ, షబ్బీర్ బాబు. మంజీత్ చిల్లర్ లాంటి ప్రముఖ ఆటగాళ్ల రాకతో ఇటు రైడింగ్, అటు డిఫెన్స్ దుర్బేధ్యంగా తయారైన తలైవాస్‌ను విజేతగా నిలపాలని అజయ్ ఠాకూర్ ఉవ్విళ్లూరుతున్నాడు.
రన్నింగ్ హ్యాండ్ టచ్‌కు ప్రయత్నిస్తున్న అజయ్ ఠాకూర్
ఆల్‌రౌండర్‌కు మారుపేరు మంజీత్:
వన్ మ్యాన్ ఆర్మీగా మంజీత్ చిల్లర్ కబడ్డీ ప్రేక్షకులకు సుపరిచితం. మొదటి రెండు సీజన్లలో బెస్ట్ డిఫెండర్, మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచిన మంజీత్.. తొలుత బెంగళూరుకు ఆడినా రెండేళ్ల క్రితం తమిళ్ తలైవాస్ జట్టుకు మారాడు. మంజీత్ ఫామ్‌లో ఉంటే ఎదుటి జట్టుకు చెమటలు పట్టడం ఖాయం. డిఫెన్స్‌లో కీలకంగా ఉండే మంజీత్ రైడర్లను ఒడిసిపట్టడంలో, డ్యాష్‌లతో భయపెట్టడంలో సిద్ధహస్తుడు. మంజీత్‌ది ఉడుంపట్టని అనొచ్చు. కుస్తీతో కూడిన అతడి డిఫెన్స్‌కు ఎంతటి రైడరైనా పట్టు చిక్కాల్సిందే.
రైడర్‌ను నిలువరిస్తున్న మైటీ మంజీత్ చిల్లర్
వణుకు పుట్టించే అట్రాచలి:
ఇరాన్ ఆటగాడైన ఫజల్ అట్రాచలి ప్రొ కబడ్డీలో చురుకైన డిఫెన్స్ స్కిల్స్‌తో తన మార్క్ చాటుకున్నాడు. లెఫ్ట్ కార్నర్‌లో ఆడే ఫజల్ నుంచి పాయింట్లు రాబట్టడం రైడర్‌లకు అంత సులువు కాదు. ఈసారి సందీప్ నర్వాల్, రాజ్‌గురు సుబ్రహ్మణ్యం, సురేందర్ సింగ్ లాంటి అనుభవజ్ఞుల అండతో డ్యాష్, యాంకిల్ హోల్డ్, బ్లాక్ లాంటి దాడులు చేస్తూ, ప్రత్యర్థులను కట్టడి చేయడానికి ఫజల్ తన డిఫెన్స్ బృందంతో సంసిద్ధమవుతున్నాడు.
రైడర్‌ను పట్టుకోవడానికి పోరాడుతున్న ఫజల్ అట్రాచలి
యూపీ యోధుడు రిషాంక్:
యూపీ యోధాస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రిషాంక్ దేవడిగా రైడర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యూ–ముంబాకు ఆడినప్పుడు వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందుకున్న రిషాంక్ మూడో సీజన్‌లో 115 పాయింట్లు సాధించాడు. ఆ ప్రదర్శనతోనే యూపీ జట్టుకు కెప్టెన్‌గా అవకాశం అందుకున్నాడు. ఐదో సీజన్‌లో యూపీ తరఫున చెలరేగిన రిషాంక్ 170 పాయింట్లతో అందరి మనసులూ గెలుచుకున్నాడు. డూ ఆర్ డై స్పెషలిస్ట్‌గా పేరున్న రిషాంక్‌తోపాటు మోనూ గోయత్, శ్రీకాంత్ జాదవ్, మోసెన్ మొక్సూదులూతో యూపీకి కీలకం అవనున్నారు. కలసికట్టుగా ఆడితే ఏ జట్టునైనా చిత్తుచేయగల సామర్థ్యమున్న యూపీ కప్పు కలను రిషాంక్ మోయనున్నాడు.
టో–టచ్ ప్రయత్నంలో రిషాంక్ దేవడిగా
విరుచుకుపడే విశాల్:
ప్రొ కబడ్డీలో విశాల్ భరద్వాజ్ ప్రస్థానం తెలుగు టైటాన్స్‌తో మొదలైంది. ఇప్పుడు అదే జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 5వ సీజన్‌లో 71 డిఫెండింగ్ పాయింట్లతో విశాల్ అందరి దృష్టిలో పడ్డాడు. రాహుల్ చౌదరీని కోల్పోయినా బిడ్డింగ్‌లో గత సీజన్ హీరో సిద్ధార్థ్ దేశాయ్‌ను దక్కించుకోవడంతో ఈసారి టైటాన్స్ జట్టు కప్పుపై ఆశలు పెంచుకుంది. అబోజర్ మిఘానీ, సి.అరుణ్ వంటి వారితో బలమైన డిఫెన్స్ బృందంతో రైడర్లపై విరుచుకుపడటానికి సమాయత్తమవుతున్న విశాల్ ఈ యేడు ఎలాగైనా తెలుగు ప్రేక్షకుల కప్పు కలను నెరవేర్చుతాననే నమ్మకంతో ఉన్నాడు.
రైడర్‌ను లాఘవంగా ఒడిసిపడ్తున్న విశాల్ భరద్వాజ్
సిసలైన బుల్ రోహిత్:
పట్నా జట్టుతో రోహిత్ కుమార్ ప్రొ కబడ్డీ ప్రయాణం మొదలైంది. గత మూడు సీజన్లుగా బెంగళూరు బుల్స్‌కు ఆడుతున్న అతడు, గతేడాది జరిగిన సీజన్–6లో బెంగళూరును చాంపియన్‌గా నిలిపాడు. రోహిత్, పవన్ షెరావత్ రైడింగ్‌లో చెలరేగితే అడ్డుకోవడం ప్రత్యర్థులకు కత్తి మీద సామే. పవన్ షెరావత్, ఆశిశ్ కుమార్, వినోద్ కుమార్, మోహిందర్ సింగ్‌లతో మంచి సమతూకంతో ఉన్న బుల్స్ జట్టును మళ్లీ విజేతను చేయడానికి రోహిత్ వ్యూహాలు రచిస్తున్నాడు.
డిఫెండర్లపై దూసుకొస్తున్న రోహిత్ కుమార్
నిప్పులు చెరిగే నితిన్:
యూపీ బాహుబలిగా పిలుచుకునే నితిన్ తోమర్ మూడో సీజన్‌తో ప్రొ కబడ్డీలో అడుగుపెట్టాడు. బెంగాల్, యూపీ, పట్నాలకు ప్రాతినిధ్యం వహించాడు. ఐదో సీజన్‌లో పుణెరి తరఫున నితిన్ ఆడుతూ 177 పాయింట్లతో అందరిని ఆకర్షించాడు. ఎస్కేప్, రన్నింగ్ టచ్ హ్యాండ్, కీలక సమయాల్లో బోనస్, టర్నింగ్ స్కిల్స్‌తో నితిన్ చెలరేగిపోతుంటే అవతలి జట్టుకు ఆపడం కష్టతరమే. పవన్ కుమార్, గిరీష్ ఎర్నాక్, సుర్జీత్ సింగ్‌లతో కూడిన పుణేరి పల్టన్ జట్టును టైటిల్ వేటలో ముందుంచడానికి ఉరిమే ఉత్సాహంతో నితిన్ సిద్ధమవుతున్నాడు.
రైడ్ చేస్తున్న నితిన్ తోమర్
- నిధాన్ సింగ్ పవార్
Comments
Please login to add a commentAdd a comment