ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు పోరాటం ముగిసింది. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 45–50 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ పుణేరి పల్టన్ చేతిలో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్‌పై విజయంతో పుణేరి పల్టన్ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌లో మూడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
తొమ్మిదో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన పుణేరి పల్టన్ జట్టు పదో సీజన్‌లో తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. రేపు జరిగే ఫైనల్లో మాజీ విజేత దబంగ్ ఢిల్లీ జట్టుతో పుణేరి పల్టన్ తలపడుతుంది. టైటాన్స్‌తో జరిగిన పోరులో పుణేరి పల్టన్ జట్టు పలుమార్లు వెనుకంజలో ఉన్నా సంయమనం కోల్పోకుండా ఆడి చివరకు విజయాన్ని అందుకుంది.
పుణేరి తరఫున రెయిడర్లు ఆదిత్య షిండే 22 పాయింట్లు, పంకజ్ మొహితే 10 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్ తరఫున కెప్టెన్ విజయ్ మలిక్, భరత్ మెరిపించినా ఇతర ఆటగాళ్లు తడబడటంతో ఓటమి తప్పలేదు. విజయ్ మలిక్ 11 పాయింట్లు, భరత్ 23 పాయింట్లు స్కోరు చేశారు.


