Rahul Chaudhari
-
కూతేస్తే.. కేకలే
క్రికెట్ ప్రపంచకప్ పండుగ ముగిసింది. కప్పు గెలిచిన ఇంగ్లండ్ సంబరాల్లో ఉండగా, అదృష్టం వెక్కిరించి గెలుపుగీతను దాటని న్యూజిలాండ్ దుఃఖ సాగరంలో మునిగింది. మూడోసారి జగజ్జేతగా నిలవాలనుకున్న భారత్ సెమీస్‌లోనే ఓడి ఇంటి ముఖం పట్టింది. ఈ పరాజయంతో నైరాశ్యంలో మునిగిన క్రీడాభిమానులను అలరించడానికి మట్టిలో పుట్టిన గ్రామీణ క్రీడ ‘కబడ్డీ’ సమాయత్తమవుతోంది. ఆటగాళ్ల అద్భుత రైడింగ్ విన్యాసాలు, అదిరిపోయే ఉడుంపట్టు డిఫెన్స్ మెరుపులతో క్షణక్షణం ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రొ కబడ్డీ సీజన్–7 సిద్ధమైంది. పల్లె క్రీడకు కార్పొరేట్ సొబగులద్దడంతో ప్రొ కబడ్డీ రూపంలో పిల్లాడి నుంచి పండు ముసలి వరకు, గ్రామం, పట్టణం, నగరాలనే తేడాల్లేకుండా అనతి కాలంలోనే క్రికెటేతర క్రీడల్లో కబడ్డీ అగ్రగామిగా మారింది. తమ అద్భుతమైన ఆటతో గత కొన్ని సీజన్లుగా వీక్షకుల మనసులు దోచిన కొందరు కూతగాళ్ల గురించి తెలుసుకుందాం.. డుబ్కీ వీరుడు పర్దీప్: ప్రొ కబడ్డీలో అందరికంటే ఎక్కువగా 858 రైడ్ పాయింట్లను అతి తక్కువ మ్యాచుల్లో (85) పర్దీప్ నర్వాల్ సాధించాడు. ‘డుబ్కీ కింగ్’ అని ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే పర్దీప్ ప్రొ కబడ్డీలో బెంగళూరు జట్టు నుంచి అరంగేట్రం చేశాడు. కానీ అతడికి ఎక్కువ అవకాశాలిచ్చింది మాత్రం పట్నా జట్టు. పట్నా పైరేట్స్ మూడుసార్లు టైటిల్ గెలవడంలో డుబ్కీ కింగ్ కీలకపాత్ర పోషించాడు. హాదీ ఓస్తరక్, జాంగ్ కున్ లీ, సురేందర్ నాడా, మహ్మద్ మగుసొద్లూ లాంటి సీనియర్ ఆటగాళ్ల కలబోతతో ఉన్న పట్నా పైరేట్స్‌ను పర్దీప్ టైటిల్ రేసులో నిలపడానికి తొడగొడుతున్నాడు. ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపుతున్న పర్దీప్ నర్వాల్ రైడ్ మెషీన్ రాహుల్: ప్రొ కబడ్డీలో పర్దీప్ నర్వాల్ తర్వాత అత్యధిక రెడింగ్ పాయింట్లను రాహుల్ చౌదరి నమోదు చేశాడు. అభిమానులు రాహుల్‌ను ముద్దుగా ‘ప్రొ కబడ్డీ పోస్టర్ బాయ్’, ‘రైడ్ మెషీన్’ అంటుంటారు. తొలి సీజన్ నుంచి తెలుగు టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన రాహుల్.. రైడింగ్‌లో సూపర్ సక్సెస్ అయినా జట్టుకు కప్పు సాధించడంలో విఫలమయ్యాడు. ఈసారి జట్టు మారిన అతడు తమిళ్ తలైవాస్ టీమ్‌లో అజయ్ ఠాకూర్‌తో కలసి ఆడబోతున్నాడు. తెలుగు టీమ్‌కు కప్పు తీసుకురాలేకపోయిన రాహుల్ తమిళ టీమ్తోనైనా కప్పు గెలిచి తన కోరికను తీర్చుకోవాలని కసిగా ఉన్నాడు. హ్యాండ్ టచ్ యత్నంలో రాహుల్ చౌదరి సొగసరి అజయ్ ఠాకూర్: భారత కబడ్డీ జట్టుకు అజయ్ ఠాకూర్ సారథనే విషయం తెలిసిందే. సంప్రదాయ ఆటతీరుతో అజయ్ ఆటతీరు సొగసుగా ఉంటుందంటుంటారు విశ్లేషకులు. అజయ్ రన్నింగ్ హ్యాండ్ టచ్‌లకు పేరున్న డిఫెండర్లు కూడా ఔటవ్వాల్సిందే. ప్రొ కబడ్డీలో గత రెండు సీజన్లుగా తమిళ్ తలైవాస్ టీమ్‌ను కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తున్న అజయ్ ఆయా సీజన్లలో యువ ఆటగాళ్లను బాగా ప్రోత్సహించాడు. శక్తివంచన లేకుండా పోరాడిన అజయ్ సారథ్యంలోని తలైవాస్ జట్టు చాలా మ్యాచుల్లో చివరి నిమిషాల్లో గెలిచింది. అజయ్ అద్భుత ఆటతో ఈ గెలుపులు సాధ్యమయ్యాయి. రాహుల్ చౌదరీ, షబ్బీర్ బాబు. మంజీత్ చిల్లర్ లాంటి ప్రముఖ ఆటగాళ్ల రాకతో ఇటు రైడింగ్, అటు డిఫెన్స్ దుర్బేధ్యంగా తయారైన తలైవాస్‌ను విజేతగా నిలపాలని అజయ్ ఠాకూర్ ఉవ్విళ్లూరుతున్నాడు. రన్నింగ్ హ్యాండ్ టచ్‌కు ప్రయత్నిస్తున్న అజయ్ ఠాకూర్ ఆల్‌రౌండర్‌కు మారుపేరు మంజీత్: వన్ మ్యాన్ ఆర్మీగా మంజీత్ చిల్లర్ కబడ్డీ ప్రేక్షకులకు సుపరిచితం. మొదటి రెండు సీజన్లలో బెస్ట్ డిఫెండర్, మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచిన మంజీత్.. తొలుత బెంగళూరుకు ఆడినా రెండేళ్ల క్రితం తమిళ్ తలైవాస్ జట్టుకు మారాడు. మంజీత్ ఫామ్‌లో ఉంటే ఎదుటి జట్టుకు చెమటలు పట్టడం ఖాయం. డిఫెన్స్‌లో కీలకంగా ఉండే మంజీత్ రైడర్లను ఒడిసిపట్టడంలో, డ్యాష్లతో భయపెట్టడంలో సిద్ధహస్తుడు. మంజీత్ది ఉడుంపట్టని అనొచ్చు. కుస్తీతో కూడిన అతడి డిఫెన్స్‌కు ఎంతటి రైడరైనా పట్టు చిక్కాల్సిందే. రైడర్‌ను నిలువరిస్తున్న మైటీ మంజీత్ చిల్లర్ వణుకు పుట్టించే అట్రాచలి: ఇరాన్ ఆటగాడైన ఫజల్ అట్రాచలి ప్రొ కబడ్డీలో చురుకైన డిఫెన్స్ స్కిల్స్‌తో తన మార్క్ చాటుకున్నాడు. లెఫ్ట్ కార్నర్లో ఆడే ఫజల్ నుంచి పాయింట్లు రాబట్టడం రైడర్లకు అంత సులువు కాదు. ఈసారి సందీప్ నర్వాల్, రాజ్‌గురు సుబ్రహ్మణ్యం, సురేందర్ సింగ్ లాంటి అనుభవజ్ఞుల అండతో డ్యాష్, యాంకిల్ హోల్డ్, బ్లాక్ లాంటి దాడులు చేస్తూ, ప్రత్యర్థులను కట్టడి చేయడానికి ఫజల్ తన డిఫెన్స్ బృందంతో సంసిద్ధమవుతున్నాడు. రైడర్‌ను పట్టుకోవడానికి పోరాడుతున్న ఫజల్ అట్రాచలి యూపీ యోధుడు రిషాంక్: యూపీ యోధాస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రిషాంక్ దేవడిగా రైడర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యూ–ముంబాకు ఆడినప్పుడు వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందుకున్న రిషాంక్ మూడో సీజన్లో 115 పాయింట్లు సాధించాడు. ఆ ప్రదర్శనతోనే యూపీ జట్టుకు కెప్టెన్‌గా అవకాశం అందుకున్నాడు. ఐదో సీజన్లో యూపీ తరఫున చెలరేగిన రిషాంక్ 170 పాయింట్లతో అందరి మనసులూ గెలుచుకున్నాడు. డూ ఆర్ డై స్పెషలిస్ట్‌గా పేరున్న రిషాంక్తోపాటు మోనూ గోయత్, శ్రీకాంత్ జాదవ్, మోసెన్ మొక్సూదులూతో యూపీకి కీలకం అవనున్నారు. కలసికట్టుగా ఆడితే ఏ జట్టునైనా చిత్తుచేయగల సామర్థ్యమున్న యూపీ కప్పు కలను రిషాంక్ మోయనున్నాడు. టో–టచ్ ప్రయత్నంలో రిషాంక్ దేవడిగా విరుచుకుపడే విశాల్: ప్రొ కబడ్డీలో విశాల్ భరద్వాజ్ ప్రస్థానం తెలుగు టైటాన్స్‌తో మొదలైంది. ఇప్పుడు అదే జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 5వ సీజన్లో 71 డిఫెండింగ్ పాయింట్లతో విశాల్ అందరి దృష్టిలో పడ్డాడు. రాహుల్ చౌదరీని కోల్పోయినా బిడ్డింగ్‌లో గత సీజన్ హీరో సిద్ధార్థ్ దేశాయ్‌ను దక్కించుకోవడంతో ఈసారి టైటాన్స్ జట్టు కప్పుపై ఆశలు పెంచుకుంది. అబోజర్ మిఘానీ, సి.అరుణ్ వంటి వారితో బలమైన డిఫెన్స్ బృందంతో రైడర్లపై విరుచుకుపడటానికి సమాయత్తమవుతున్న విశాల్ ఈ యేడు ఎలాగైనా తెలుగు ప్రేక్షకుల కప్పు కలను నెరవేర్చుతాననే నమ్మకంతో ఉన్నాడు. రైడర్‌ను లాఘవంగా ఒడిసిపడ్తున్న విశాల్ భరద్వాజ్ సిసలైన బుల్ రోహిత్: పట్నా జట్టుతో రోహిత్ కుమార్ ప్రొ కబడ్డీ ప్రయాణం మొదలైంది. గత మూడు సీజన్లుగా బెంగళూరు బుల్స్‌కు ఆడుతున్న అతడు, గతేడాది జరిగిన సీజన్–6లో బెంగళూరును చాంపియన్‌గా నిలిపాడు. రోహిత్, పవన్ షెరావత్ రైడింగ్‌లో చెలరేగితే అడ్డుకోవడం ప్రత్యర్థులకు కత్తి మీద సామే. పవన్ షెరావత్, ఆశిశ్ కుమార్, వినోద్ కుమార్, మోహిందర్ సింగ్‌లతో మంచి సమతూకంతో ఉన్న బుల్స్ జట్టును మళ్లీ విజేతను చేయడానికి రోహిత్ వ్యూహాలు రచిస్తున్నాడు. డిఫెండర్లపై దూసుకొస్తున్న రోహిత్ కుమార్ నిప్పులు చెరిగే నితిన్: యూపీ బాహుబలిగా పిలుచుకునే నితిన్ తోమర్ మూడో సీజన్‌తో ప్రొ కబడ్డీలో అడుగుపెట్టాడు. బెంగాల్, యూపీ, పట్నాలకు ప్రాతినిధ్యం వహించాడు. ఐదో సీజన్లో పుణెరి తరఫున నితిన్ ఆడుతూ 177 పాయింట్లతో అందరిని ఆకర్షించాడు. ఎస్కేప్, రన్నింగ్ టచ్ హ్యాండ్, కీలక సమయాల్లో బోనస్, టర్నింగ్ స్కిల్స్‌తో నితిన్ చెలరేగిపోతుంటే అవతలి జట్టుకు ఆపడం కష్టతరమే. పవన్ కుమార్, గిరీష్ ఎర్నాక్, సుర్జీత్ సింగ్‌లతో కూడిన పుణేరి పల్టన్ జట్టును టైటిల్ వేటలో ముందుంచడానికి ఉరిమే ఉత్సాహంతో నితిన్ సిద్ధమవుతున్నాడు. రైడ్ చేస్తున్న నితిన్ తోమర్ - నిధాన్ సింగ్ పవార్ -
రాహుల్ చౌదరిని వదిలేసిన టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. జూలై 19 నుంచి పీకేఎల్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లపై దృష్టి సారించాయి. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే ఆటగాళ్లను కొత్త సీజన్ కోసం తమతో అట్టిపెట్టుకున్నాయి. హైదరాబాద్ ఫ్రాంచైజీ తెలుగు టైటాన్స్ తమ కెప్టెన్ రాహుల్ చౌదరీని ఈసారి వేలంలో ఖరీదు చేసేందుకే నిర్ణయించుకున్నట్లుంది. రాహుల్‌కు బదులుగా అర్మాన్, మోహ్సీన్ మసౌదుల్జఫారీ, ఫర్హాద్ రాహిమి మిలాహర్దన్, కృష్ణ మదానేలను రిటెయిన్ చేసుకుంది. తమిళ్ తలైవాస్ జట్టు అజయ్ ఠాకూర్, మంజీత్ ఛిల్లర్, విక్టర్ ఓన్యాంగ్ ఓబెరోలను తమతో కొనసాగిస్తుండగా... పట్నా పైరెట్స్ జట్టు స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్, వికాస్ జగ్లాన్, తుషార్ పాటిల్, జవహర్లను తమతో అట్టిపెట్టుకుంది. ఇతర ఫ్రాంచైజీలు బెంగాల్ వారియర్స్ జట్టు బల్దేవ్ సింగ్, మణీందర్ సింగ్... బెంగళూరు బుల్స్ జట్టు రోహిత్ కుమార్, పవన్ కుమార్ సెహ్రావత్, ఆశిష్ కుమార్ సాంగ్వాన్... దబంగ్ ఢిల్లీ కేసీ జట్టు మేరాజ్, జోగీందర్ నర్వాల్... గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్టు సచిన్, సునీల్ కుమార్... హరియాణా స్టీలర్స్ జట్టు కుల్దీప్ సింగ్, వికాస్ ఖండోలా... జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు దీపక్ నివాస్ హుడా, సందీప్ కుమార్ ధూల్... యు ముంబా జట్టు ఫజెల్ అత్రాచలి, రాజగురు సుబ్రమణియన్, అర్జున్ దేశ్వాల్, యూపీ యోధా జట్టు అమిత్, సచిన్ కుమార్‌లను రిటెయిన్ చేసుకుంది. పుణేరి పల్టన్ జట్టు తమ మొత్తం ఆటగాళ్లను వేలం కోసం విడుదల చేసింది. మొత్తం 29 మంది ఎలైట్ ప్లేయర్లను ఫ్రాంచైజీలు తమతో అట్టిపెట్టుకున్నాయి. గతంలో 21 మంది ప్లేయర్లను మాత్రమే ఫ్రాంచైజీలు రిటెయిన్ చేసుకునే వీలుండేది. మరోవైపు గత సీజన్లో ఒక్కో టీమ్ గరిష్టంగా కేవలం నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకునే వీలుండగా... ఈసారి ఈ సంఖ్యను ఆరుకు పెంచారు. దీనితో పాటు మరో కొత్త అంశాన్ని కూడా లీగ్ నిబంధనల్లో జోడించారు. ‘రిటెయిన్డ్ యంగ్ ప్లేయర్స్’ కేటగిరీ ప్రకారం ఇకనుంచి ఫ్రాంచైజీలు రెండేళ్ల కాంట్రాక్టును పూర్తి చేసుకున్న కొత్త కుర్రాళ్లను తమతో రిటెయిన్ చేసుకోవచ్చు. రిటెయిన్డ్ యంగ్ ప్లేయర్ల జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఫ్రాంచైజీలు వదిలేసుకున్న క్రీడాకారులు ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరిగే వేలంలో అందుబాటులో ఉంటారు. -
వరుసగా ఎనిమిదో స్వర్ణం సాధిస్తాం: రాహుల్ చౌదరీ
సనత్‌నగర్: వరుసగా ఏడుసార్లు విజేత... ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్టు ఘనత. ఇదే ఆనవాయితీని కొనసాగించేందుకు అజయ్ ఠాకూర్ సేన సిద్ధమైంది. ఆగస్టులో ఇండోనేసియా వేదికగా జరుగనున్న ఈ క్రీడల్లో ఎనిమిదో స్వర్ణాన్ని సాధించడమే తమ లక్ష్యమంటున్నాడు భారత స్టార్ రైడర్ రాహుల్ చౌదరి. మషాల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘రైడ్ ఫర్ గోల్డ్’ పేరిట జరుగుతోన్న ప్రచార కార్యక్రమంలో రాహుల్ చౌదరి పాల్గొన్నాడు. బేగంపేట్‌లోని గీతాంజలి స్కూల్ ప్రాంగణంలో పాఠశాల విద్యార్థులతో కలిసి సందడి చేశాడు. చిన్నారులతో కబడ్డీ ఆడుతూ వారిని ప్రోత్సహించాడు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో గీతాంజలి స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయకరణ్, ప్రిన్సిపల్ మాయ సుకుమారన్, ఫిజికల్ ట్రైనర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో రాహుల్ చౌదరీ విద్యార్థుల ప్రశ్న: 1990లో తొలి స్వర్ణం సాధించి నప్పటికీ, ఇప్పటికీ జట్టులో తేడా ఏమైనా ఉందా? రాహుల్: మొదటిసారి పోటీలకు వెళ్లినప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు ఎలా ఉంటారో? వారి బలాలు, బలహీనతలు ఏంటి? అనే అంశాలపై అవగాహన లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేయగలుగుతున్నాం. కానీ అప్పుడు ఇప్పుడూ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. రోజూ ప్రాక్టీస్‌కు ఎంత సమయం కేటాయిస్తారు? ఉదయం 45 నిమిషాల వ్యాయామం, వాకింగ్‌తో సరిపెడితే కుదరదు. కోచ్ పర్యవేక్షణలో 6 గంటలు, స్వతహాగా టీమ్ సభ్యులందరం కలిసి మరో 6 గంటలు... మొత్తం 12 గంటలు ప్రాక్టీస్‌కే అంకితమవుతాం. ఫిట్నెస్ కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటారు? పిజ్జాలు, బర్గర్లకు చాలా దూరంగా ఉంటాం. సహజమైన పోషకాలు లభించే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాం. డ్రైప్రూట్స్, నట్స్ ఎక్కువగా తీసుకుంటాం. వరుసగా ఎనిమిదోసారి బంగారు పతకం సాధిస్తామని గట్టిగా ఎలా చెబుతున్నారు? ఏడేళ్లుగా వివిధ దేశాల జట్ల ఆటతీరును నిశితంగా పరిశీలించాం. వారి బలాలు, బలహీనతలు స్పష్టంగా అవగతమయ్యాయి. వీటితో పాటు యావత్ భారత జాతి కూడా మాకు మద్దతుగా ఉంది. కచ్చితంగా స్వర్ణం సాధిస్తామనే విశ్వాసం బలంగా ఉంది. -
సీజన్లో కబడ్డీ.. మరి అన్ సీజన్లో..?
ప్రొ కబడ్డీ లీగ్‌తో భారత కబడ్డీ క్రీడాకారుల పంట పండింది. అంతర్జాతీయ స్థాయిలో రాణించినా రాని గుర్తింపును ప్రొ కబడ్డీ లీగ్ స్టార్ ఆటగాళ్లుగా మార్చింది. ఐపీఎల్ తర్వాత అత్యధిక వీక్షకులు అందుకున్న ఈ లీగ్ ప్రాంతీయ ఆటకావడంతో గ్రామస్థాయికి వరకు పాతుకుపోయింది. ఒకప్పడు కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసమే ఆడిన ఆటగాళ్లు ప్రోకబడ్డీ లీగ్ పుణ్యమా అని కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. దీనికి నిదర్శనం ఐదో సీజన్లో నిర్వహించిన జూనియర్ కబడ్డీ లీగ్‌కు కార్పోరేట్ పాఠశాలలు పాల్గొనడమే. ఏడాదికి ఒక సారి జరిగే ఈ లీగ్‌తో ఆటగాళ్లు పారితోషకాన్ని బాగానే ఆర్జిస్తున్నా.. లీగ్ అనంతరం ఏం చేస్తారనే సందేహాం ప్రతి కబడ్డీ అభిమానికి కలుగుతోంది. మరీ స్టార్ కబడ్డీ ఆటగాళ్లు సీజన్ అనంతరం ఏం చేస్తారో ఓ లుక్కెద్దాం.. ♦ రైతుగా రాహుల్ చౌదరీ తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరీ పదోతరగతి వరకే చదువుకున్నాడు. సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్. నలుగురు అన్నదమ్ముల్లో మూడోవాడు. అన్నలిద్దరూ వ్యవసాయం చేస్తున్నారు. ‘కబడ్డీ ఏమైనా కూడు పెడుతుందా? చదువుకుంటే బాగు పడతావురా!’ అని తండ్రి రోజూ తిట్టిపోసినా, రాహుల్ పట్టించుకోలేదు. ‘ఏదేమైనా కబడ్డీతోనే జీవితం’ అని నిర్ణయించుకున్నాడు. అయిదేళ్లపాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) క్యాంపులకు హాజరయ్యాడు. ఇంటికి రాగానే మళ్లీ పొలం పనులు. ఇప్పటికీ సేద్యమంటే తనకు ప్రాణం. తనేం మారలేదు. కాకపోతే, అప్పుడు నాగలితో పొలం దున్నాడు, ఇప్పుడు ట్రాక్టరుతో దున్నుతున్నాడు. అంతే తేడా! పీకేఎల్ ద్వారా మొదటి సీజన్లో అందుకున్న మొత్తంతో ఓ మాంచి ట్రాక్టరు కొన్నాడు. మిగిలిన డబ్బుతో ఇష్టమైన బుల్లెట్ బండిని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రొ కబడ్డీ సీజన్-1లో 151 పాయింట్లతో అత్యధిక రైడింగ్ పాయింట్లు చేసిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక రెండో సీజన్లో 98, మూడో 87, నాలుగో సీజన్ 146 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచాడు. పీకేఎల్ ప్రస్థానంలో 517 పాయింట్లతో టాప్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ♦ హరియాణ డీసీపీ..అనూప్ కుమార్ హరియాణకు చెందిన ఈ స్టార్ రైడర్ స్కూల్ స్థాయి నుంచే కబడ్డీ ఆడటం మొదలు పెట్టాడు. తొలుత సీఆర్పీఎప్ కానిస్టేబుల్ ఉద్యోగం చేసినా.. కబడ్డీలో రాణించి హరియాణ డిప్యూటీ కమీషనర్ పోలీస్ (డీసీపీ)గా సేవలందిస్తున్నాడు. కేవలం ప్రభుత్వం ఉద్యోగం కోసం కబడ్డీ ఆడిన అనూప్ తర్వాత ఆటనే కెరీర్‌గా మలుచుకున్నాడు. భారత జట్టు కెప్టెన్‌గా 2016 కబడ్డీ వరల్డ్ కప్ అందించాడు. అర్జున అవార్డు కూడా అందుకున్నాడు ఈ స్టార్ రైడర్. ప్రోకబడ్డీ తొలి సీజన్లో ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ అందుకున్న అనూప్ సీజన్-2లో యుముంబాకు టైటిల్ అందించాడు. ఇక సీజన్-1,3లలో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ♦ ఏయిర్ ఇండియా ఉద్యోగి.. మంజీత్ చిల్లర్ మంజీత్ చిల్లర్ కూడా హరియాణకు చెందినవాడే.. తొలుత రెజ్లింగ్ నేర్చుకున్న మంజీత్ ముక్కు గాయం కావడంతో కబడ్డీవైపు మళ్లాడు. జాతీయ స్థాయిలో రాణించడంతో మంజీత్‌కు ఏయిర్ ఇండియా ఉద్యోగం లభించింది. జైపూర్ పింక్ పాంథర్స్‌కు కెప్టెన్‌గా ఉన్న మంజీత్. నాలుగు, మూడో సీజన్లో పుణేరీ పల్తాన్...తొలి రెండు సీజన్లలో బెంగళూరుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. లీగ్‌లోనే బెస్ట్ ఆల్‌రౌండర్. రెండో సీజన్లో ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు అందుకున్నాడు. ♦ స్కూల్ టీచర్ దీపక్ హుడా.. హరియాణకు చెందిన దీపక్ నివాస్ హుడా పార్ట్‌టైమ్ టీచర్‌గా చేస్తూ కబడ్డీ ఆడేవాడు. చిన్నప్పుడే తల్లి మరణించడంతో కష్టాలు అనుభవించిన హుడా ఇంటర్లో తండ్రి మరణాంతరం పార్ట్ టైమ్ టీచర్‌గా మారారు. అనంతరం స్కూల్ టీచర్‌గా ఉద్యోగం సంపాదించి జాతీయ కబడ్డీ జట్టుకు ఎంపికయ్యారు. ఇప్పటికీ హుడా గ్రామాలకు వెళ్లి కబడ్డీ శిక్షణిస్తుంటాడు. తొలి రెండు సీజన్లలో తెలుగు టైటాన్స్‌కు ఆడిన హుడా మూడు, నాలుగు సీజన్లలో పుణేరి పల్టాన్ కు ఆడాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ ఐదో సీజన్లో కూడా పుణేరి పల్టాన్కే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రైల్వే ఉద్యోగి కాశీలింగ్ మహారాష్ట్రకు చెందిన కాశీలింగ్ అడకే... కబడ్డీ అంటే ప్రాణం. తండ్రి అకాల మరణంతో, కుటుంబ పోషణలో తల్లికి అండగా నిలవాల్సి వచ్చింది. చదువుల్ని పక్కనపెట్టి సేద్యానికి దిగాడు. అదీ గిట్టుబాటు కాకపోవడంతో కూలీ పనులకెళ్లాడు. అన్ని కష్టాల్లోనూ కబడ్డీ మీద మమకారాన్ని చంపుకోలేదు. ఆ ఉత్సాహమే మహారాష్ట్ర జట్టులో స్థానం కల్పించింది. పీకేఎల్ ప్రారంభంలో కాశీని ఢిల్లీ జట్టు రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. పది లక్షలు! - ఆ రోజు కూలీకి అది చాలా పెద్ద మొత్తమే. మంత్రమేసినట్టు, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయాయి. తొలుత ఢిల్లీకి ఆడిన కాశీ. ప్రస్తుతం యుముంబా తరుపున ఆడుతున్నాడు. ప్రస్తుతం రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రెండో సీజన్లో అత్యధిక రైడింగ్పాయింట్లు సాధించాడు. ♦ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యజమానిగా వ్యవహరిస్తున్న తమిళ్ తలైవాస్ జట్టు కెప్టెన్ అజయ్ ఠాకూర్ కూడా ఏయిర్ ఇండియా ఉద్యోగే. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఈ స్టార్ రైడర్ తొలి రెండు సీజన్లు బెంగళూరు బుల్స్‌కు ప్రాతినిథ్యం వహించగా తరువాతి రెండు సీజన్లు పుణేరి పల్టాన్‌కు ఆడాడు. -
రాహుల్ 'సూపర్'
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం పుణెరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 10 పాయింట్లు సాధించి మరోసారి సత్తాచాటాడు. దీంతో ఓవరాల్ ప్రొ కబడ్డీ లీగ్‌లో 400 రైడింగ్ పాయింట్లను సాధించిన తొలి ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మరోవైపు సూపర్ -10ను 20వ సారి నమోదు చేసిన ఆటగాడిగా కొత్త చరిత్రను లిఖించాడు. ఈ మ్యాచ్‌లో 9 రైడింగ్ పాయింట్లను నమోదు చేసిన రాహుల్.. డిఫెన్స్‌లో ఒక పాయింట్ సాధించాడు. ఓవరాల్‌గా పీకేల్ సీజన్లో 434 (రైడింగ్, టాకిలింగ్) పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి మరో రికార్డును తన సొంతం చేసుకున్నాడు. పుణెతో మ్యాచ్‌లో రాహుల్ కళ్లు చెదిరే కదిలికలతో చెలరేగిపోయాడు. ఒక దశలో టైటాన్స్ వెనుకబడిన దశలో రాహుల్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు.వరుసగా పాయింట్లను సాధిస్తూ టైటాన్స్ కు ఘన విజయం అందించాడు.దీంతో ఈ సీజన్లో టైటాన్స్ వరుసగా నాల్గో విజయం సాధించగా, ఓవరాల్‌గా ఐదో విజయం నమోదు చేసింది. లీగ్ ఆరంభంలో తడబడిన టైటాన్స్.. ఆ తరువాత అంచనాలను అందుకుంటూ దూసుకెళుతుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ టైటాన్స్ సాధించిన విజయాల్లో రాహుల్ తో పాటు, సందీప్ నర్వాల్, సందీప్ ధూల్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకంగా రాహుల్ రైడింగ్‌లో అసాధారణ ప్రతిభ కనబరుస్తుంటే, సందీప్ నర్వాల్, సందీఫ్ ధూల్లు టాకిలింగ్లో ముఖ్యభూమిక నిర్వహిస్తున్నారు.