సాక్షి, హైదరాబాద్: అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. జూలై 19 నుంచి పీకేఎల్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లపై దృష్టి సారించాయి. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే ఆటగాళ్లను కొత్త సీజన్ కోసం తమతో అట్టిపెట్టుకున్నాయి. హైదరాబాద్ ఫ్రాంచైజీ తెలుగు టైటాన్స్ తమ కెప్టెన్ రాహుల్ చౌదరీని ఈసారి వేలంలో ఖరీదు చేసేందుకే నిర్ణయించుకున్నట్లుంది. రాహుల్‌కు బదులుగా అర్మాన్, మోహ్‌సీన్ మసౌదుల్‌జఫారీ, ఫర్హాద్ రాహిమి మిలాహర్దన్, కృష్ణ మదానేలను రిటెయిన్ చేసుకుంది. తమిళ్ తలైవాస్ జట్టు అజయ్ ఠాకూర్, మంజీత్ ఛిల్లర్, విక్టర్ ఓన్‌యాంగ్ ఓబెరోలను తమతో కొనసాగిస్తుండగా... పట్నా పైరెట్స్ జట్టు స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్, వికాస్ జగ్లాన్, తుషార్ పాటిల్, జవహర్‌లను తమతో అట్టిపెట్టుకుంది. ఇతర ఫ్రాంచైజీలు బెంగాల్ వారియర్స్ జట్టు బల్‌దేవ్ సింగ్, మణీందర్ సింగ్...
బెంగళూరు బుల్స్ జట్టు రోహిత్ కుమార్, పవన్ కుమార్ సెహ్రావత్, ఆశిష్ కుమార్ సాంగ్వాన్... దబంగ్ ఢిల్లీ కేసీ జట్టు మేరాజ్, జోగీందర్ నర్వాల్... గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ జట్టు సచిన్, సునీల్ కుమార్... హరియాణా స్టీలర్స్ జట్టు కుల్‌దీప్ సింగ్, వికాస్ ఖండోలా... జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు దీపక్ నివాస్ హుడా, సందీప్ కుమార్ ధూల్... యు ముంబా జట్టు ఫజెల్ అత్రాచలి, రాజగురు సుబ్రమణియన్, అర్జున్ దేశ్‌వాల్, యూపీ యోధా జట్టు అమిత్, సచిన్ కుమార్‌లను రిటెయిన్ చేసుకుంది. పుణేరి పల్టన్ జట్టు తమ మొత్తం ఆటగాళ్లను వేలం కోసం విడుదల చేసింది.
మొత్తం 29 మంది ఎలైట్ ప్లేయర్లను ఫ్రాంచైజీలు తమతో అట్టిపెట్టుకున్నాయి. గతంలో 21 మంది ప్లేయర్లను మాత్రమే ఫ్రాంచైజీలు రిటెయిన్ చేసుకునే వీలుండేది. మరోవైపు గత సీజన్‌లో ఒక్కో టీమ్ గరిష్టంగా కేవలం నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకునే వీలుండగా... ఈసారి ఈ సంఖ్యను ఆరుకు పెంచారు. దీనితో పాటు మరో కొత్త అంశాన్ని కూడా లీగ్ నిబంధనల్లో జోడించారు. ‘రిటెయిన్డ్ యంగ్ ప్లేయర్స్’ కేటగిరీ ప్రకారం ఇకనుంచి ఫ్రాంచైజీలు రెండేళ్ల కాంట్రాక్టును పూర్తి చేసుకున్న కొత్త కుర్రాళ్లను తమతో రిటెయిన్ చేసుకోవచ్చు. రిటెయిన్డ్ యంగ్ ప్లేయర్ల జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఫ్రాంచైజీలు వదిలేసుకున్న క్రీడాకారులు ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరిగే వేలంలో అందుబాటులో ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment