ఏడో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు దూరమైన తెలుగు టైటాన్స్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో సత్తా చాటిన తెలుగు టైటాన్స్... ఆ తర్వాత పడుతూ లేస్తూ చివరకు గ్రూప్ దశతోనే పోరాటాన్ని ముగించింది. మంగళవారం ముగిసిన లీగ్ దశ చివరి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ యు ముంబా 36–27 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. యు ముంబా జట్టు ఆఖరి పోరులో 48 పాయింట్ల తేడాతో ఓడిపోయి ఉంటే టైటాన్స్ ఆరో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేది.
కానీ యు ముంబా విజయం సాధించడంతో తెలుగు టైటాన్స్ ఏడో స్థానంతో లీగ్ దశకే పరిమితమైంది. కీలక పోరులో ముంబా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అమీర్ మొహమ్మద్ 7 పాయింట్లు, అజిత్ చవాన్ 6 పాయింట్లు, సునీల్ కుమార్ 5 పాయింట్లు సాధించారు. బెంగాల్ వారియర్స్ తరఫున ప్రణయ్ 12 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది.
తాజా సీజన్‌లో 22 మ్యాచ్‌లాడి 12 విజయాలు, 8 పరాజయాలు, 2 ‘టై’లతో 71 పాయింట్లు ఖాతాలో వేసుకున్న యు ముంబా జట్టు పట్టికలో ఐదో స్థానానికి చేరి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 44–30 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. యూపీ యోధాస్ తరఫున శివమ్ చౌధరీ 13 పాయింట్లు, సురేందర్ గిల్ 9 పాయింట్లతో రాణించారు.
బెంగళూరు బుల్స్ తరఫున సుశీల్ 12 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. నేడు విశ్రాంతి రోజు. గురువారం జరగనున్న తొలి ఎలిమినేటర్‌లో యూపీ యోధాస్‌తో జైపూర్ పింక్ పాంథర్స్, రెండో ఎలిమినేటర్‌లో పట్నా పైరేట్స్‌తో యు ముంబా తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment