play-off
-
చెన్నై చతికిలపడింది
‘ఒకే రోజు మూడు సూపర్ ఓవర్లతో ఐపీఎల్లో అద్భుతం చూశారు కదా... రేపు టెస్టు మ్యాచ్ చూడవచ్చు, లెక్క సరిపోతుంది’... ఆదివారం ఒక సగటు క్రికెట్ అభిమాని సరదా వ్యాఖ్య ఇది. ఇప్పుడు సరిగ్గా అలాగే జరిగింది. పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన పోరు ఏమాత్రం ఆసక్తి రేపకుండా చప్పగా సాగింది. పరుగు తీయడమే కష్టంగా మారినట్లు, బౌండరీ బాదడం అంటే బ్రహ్మాండం బద్దలు కొట్టాలేమో అన్నంత భారంగా చెన్నై బ్యాటింగ్ చేసింది. ఛేదనలో రాజస్తాన్ కూడా తడబడ్డా... స్మిత్, బట్లర్ భాగస్వామ్యంతో కీలక గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 78 బంతుల్లో అభేద్యంగా 98 పరుగులు జోడించి మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు. అబుదాబి: ఐపీఎల్లో ఆడిన 10 సార్లూ ప్లే ఆఫ్ చేసిన అరుదైన రికార్డు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ముందంజ వేయడంపై ఆశలు వదులుకోవాల్సిందే! సీజన్ మొత్తం తడబడుతూనే వస్తున్న ఈ మాజీ చాంపియన్ ఏడో పరాజయంతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సీజన్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. రవీంద్ర జడేజా (30 బంతుల్లో 35; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఎమ్మెస్ ధోని (28 బంతుల్లో 28; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జాస్ బట్లర్ (48 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (34 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి జట్టును విజయతీరం చేర్చారు. సమష్టి వైఫల్యం... మ్యాచ్ మ్యాచ్‌కూ మరింత పేలవ ప్రదర్శన కనబరుస్తున్న చెన్నై జట్టు బ్యాటింగ్ బలహీనత మరోసారి కనిపించింది. ఇన్నింగ్స్ మొత్తంలో 12 ఫోర్లు, 1 సిక్స్ మాత్రమే ఉండగా... భారీ షాట్లు ఆడే ప్రయత్నం కూడా బ్యాట్స్‌మెన్ చేయకపోవడం పరిస్థితిని సూచిస్తోంది. పేరుకు ధోని, జడేజా మధ్య 51 పరుగుల భాగస్వామ్యం నెలకొన్నా... అదీ 46 బంతుల్లో రావడం దూకుడులేమిని స్పష్టంగా చూపించింది. డు ప్లెసిస్ (10)ను తొందరగా అవుట్ చేసి రాజస్తాన్‌కు ఆర్చర్ శుభారంభం అందించాడు. యువ బౌలర్ త్యాగి తన తొలి ఓవర్లో 3 బౌండరీలు ఇచ్చినా... అదే ఓవర్లో వాట్సన్ (8)ను వెనక్కి పంపించాడు. స్టోక్స్ వేసిన ఐదో ఓవర్లో చెన్నై 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 15 పరుగులు రాబట్టింది. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 43 పరుగులకు చేరింది. ఆ తర్వాత మూడు పరుగుల వ్యవధిలో స్యామ్ కరన్ (25 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), రాయుడు (13) వెనుదిరిగారు. 10 ఓవర్లలో 56 పరుగులు చేసిన చెన్నై స్కోరు 15 ఓవర్లలో 89 పరుగులకు చేరింది. అనంతరం రెండో పరుగు తీసే ప్రయత్నంలో ధోని రనౌటయ్యాడు. జడేజా చలవతో ఆఖరి 5 ఓవర్లలో 3 ఫోర్లతో చెన్నై 36 పరుగులు జోడించగలిగింది. 49 బంతుల తర్వాత... చెన్నై ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్ చివరి బంతికి రాయుడు ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత జట్టు మరో బౌండరీ కోసం ఏకంగా 8.1 ఓవర్లు ఎదురు చూడాల్సి వచ్చింది. త్యాగి వేసిన 14వ ఓవర్ రెండో బంతికి త్యాగి ధోని మళ్లీ ఫోర్ కొట్టాడు. ఒక టి20 మ్యాచ్‌లో రెండు బౌండరీల మధ్య విరామం 49 బంతులు! రాజస్తాన్ ఇద్దరు లెగ్ స్పిన్నర్లు శ్రేయస్ గోపాల్, రాహుల్ తేవటియా ఎంతో ప్రభావం చూపించారు. వీరిద్దరు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 8 ఓవర్లలో కలిపి 32 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశారు. పైగా ఒక్క ఫోర్ కూడా ఇవ్వకపోవడం విశేషం. భారీ భాగస్వామ్యం... రాజస్తాన్‌కు కూడా సరైన ఆరంభం లభించలేదు. పవర్‌ప్లే ముగిసేలోపే పేలవ షాట్లతో స్టోక్స్ (19), ఉతప్ప (4), సామ్సన్ (0) వెనుదిరిగారు. ఈ దశ లో స్మిత్, బట్లర్ కూడా సమర్థంగా ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. ఛేదించాల్సిన లక్ష్యం చిన్నది కావడంతో ఎలాంటి సాహసాలకు పోకుండా జాగ్రత్తగా, చక్కటి సమన్వయంతో ఆడారు. బట్లర్ తనదైన శైలిలో దూకుడుగా ఆడగా, స్మిత్ అతడికి సహకరించాడు. శార్దుల్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన బట్లర్... చావ్లా ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టి 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో మేం ఇక ముందుకు వెళ్లకపోవచ్చు. ప్రతీసారి అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. మా సన్నద్ధతలో ఏదైనా లోపం ఉందేమో చూడాలి. ఎందుకంటే సన్నాహాలను బట్టే ఫలితాలు ఉంటాయి. మన సన్నద్ధత బాగుంటే ఫలితాలు సాధించాలనే ఒత్తిడి దరిచేరదు. లోపాలను చక్కదిద్దుకునే పనిలో ఉన్నాం. 4–5 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత తుది జట్టులో పదే పదే మార్పులు చేయడం మంచిది కాదు. అలా చేస్తే ఆటగాళ్లలో అభద్రతాభావం పెరిగిపోతుంది. యువ ఆటగాళ్లను ఆడించడం లేదనే విమర్శ లో వాస్తవం ఉంది. అయితే మేం ఆశించినంత ప్రత్యేకత మా కుర్రాళ్లలో లేకపోవడం కూడా కారణం కావచ్చు. మున్ముందు వారికి అవకాశం ఇస్తే ఒత్తిడి లేకుండా ఆడతారేమో. –ఎమ్మెస్ ధోని, చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోని@200 ఐపీఎల్లో ధోని 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 170 మ్యాచ్‌లు చెన్నై తరఫున ఆడగా... చెన్నై నిషేధానికి గురైన రెండేళ్లలో పుణే సూపర్ జెయింట్స్ తరఫున మరో 30 మ్యాచ్‌లు ఆడాడు. లీగ్‌లో ధోని మొత్తం 4,596 పరుగులు సాధించగా... తాజా మ్యాచ్‌తో ఒక్క సీఎస్కే తరఫునే ధోని ఐపీఎల్లో 4 వేల పరుగుల మైలురాయిని (మొత్తం 4,022) కూడా దాటాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్యామ్ కరన్ (సి) బట్లర్ (బి) గోపాల్ 22; డు ప్లెసిస్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 10; వాట్సన్ (సి) తేవటియా (బి) త్యాగి 8; రాయుడు (సి) సామ్సన్ (బి) తేవటియా 13; ధోని (రనౌట్) 28; జడేజా (నాటౌట్) 35; కేదార్ జాదవ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–13; 2–26; 3–53; 4–56; 5–107. బౌలింగ్: ఆర్చర్ 4–0–20–1; అంకిత్ రాజ్‌పుత్ 1–0–8–0; కార్తీక్ త్యాగి 4–0–35–1; స్టోక్స్ 3–0–27–0; శ్రేయస్ గోపాల్ 4–0–14–1; రాహుల్ తేవటియా 4–0–18–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: స్టోక్స్ (బి) చహర్ 19; ఉతప్ప (సి) ధోని (బి) హాజల్‌వుడ్ 4; సామ్సన్ (సి) ధోని (బి) చహర్ 0; స్మిత్ (నాటౌట్) 26; బట్లర్ (నాటౌట్) 70; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–26; 2–28; 3–28. బౌలింగ్: దీపక్ చహర్ 4–1–18–2; హాజల్‌వుడ్ 4–0–19–1; జడేజా 1.3–0–11–0; శార్దుల్ 4–0–34–0; స్యామ్ కరన్ 1–0–6–0; చావ్లా 3–0–32–0. -
బెంగుళూరు పిలుస్తోంది
ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్, హైదరాబాద్ పోరు నేడు ఈ సీజన్ ఐపీఎల్ లీగ్ దశలో అధికశాతం రోజులు హైదరాబాద్, గుజరాత్ జట్లు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఆఖరి మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్‌కు వస్తుందో లేదో తెలియని బెంగళూరు మాత్రం సంచలన ఆటతీరుతో అందరికంటే ముందు వెళ్లి ఫైనల్లో కూర్చుంటే... ఇప్పుడు గుజరాత్, హైదరాబాద్ ఫైనల్ బెర్త్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. నేడు జరిగే క్వాలిఫయర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు బెంగళూరులో ఆదివారం జరిగే ఫైనల్లో బెంగళూరుతో ఆడుతుంది. న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పవర్‌కు, గుజరాత్ లయన్స్ హార్డ్ హిట్టర్లకు మధ్య రసవత్తర పోరుకు తెర లేవనుంది. ఫైనల్లో బెర్త్ కోసం ఈ రెండు జట్లు నేడు (శుక్రవారం) ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగే మ్యాచ్‌లో తలపడనున్నాయి. లీగ్ దశలో లయన్స్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ నెగ్గింది. అంతేకాకుండా బుధవారం జరిగిన ఎలిమినేటర్‌లో కోల్‌కతాను చిత్తు చేసిన జోష్‌లో వార్నర్ బృందం బరిలోకి దిగబోతోంది. మరోవైపు టేబుల్ టాపర్‌గా తొలి క్వాలిఫయర్ ఆడిన లయన్స్... డి విలియర్స్ ధాటికి బెంగళూరు చేతిలో అనూహ్యంగా ఓడింది. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్‌ను వదులుకోకూడదనే కసితో ఉంది. తద్వారా లీగ్ మ్యాచ్‌ల్లో సన్‌పై ఓటమికి ప్రతీకారం తీర్చుకోవచ్చు కూడా. ఆత్మవిశ్వాసంతో సన్‌రైజర్స్ కోల్‌కతాతో ఇదే మైదానంలో ఎలిమినేటర్ ఆడిన సన్‌రైజర్స్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటింగ్‌లో యువరాజ్ సరైన సమయంలో టచ్‌లోకొచ్చాడు. వార్నర్, ధావన్‌ల ఫామ్ జట్టుకు అదనపు బలం. కేన్ విలియమ్సన్ స్థానంలో బరిలోకి దిగిన ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్ బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో మాత్రం ఆదుకున్నాడు. దీపక్ హుడా కూడా కోల్‌కతాతో కీలక సమయంలో బ్యాట్ ఝళిపించాడు. బౌలింగ్‌లో ముస్తఫిజుర్, భువనేశ్వర్, శరణ్ ముగ్గురూ మంచి ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్ బిపుల్‌శర్మ మరోసారి కీలకం కావచ్చు. ఒత్తిడిలో లయన్స్: ఒక్క మ్యాచ్ గెలిస్తే ఫైనల్‌కు వెళ్లాల్సిన దశ నుంచి రెండో క్వాలిఫయర్ ఆడాల్సి వచ్చిన స్థితిలో లయన్స్‌పై కాస్త ఒత్తిడి ఉంది. ఓపెనర్లు మెకల్లమ్, ఫించ్ ఎవరికి వారు విధ్వంసకర ఆటగాళ్లే అయినా కలిసి మాత్రం ఆ మ్యాజిక్ చూపించలేకపోతున్నారు. రైనా, కార్తీక్, స్మిత్‌లపై బ్యాటింగ్ ఆధారపడి ఉంది. బెంగళూరుపై ధావల్ కులకర్ణి సంచలన బౌలింగ్‌తో అదరగొట్టాడు. హైదరాబాద్ టాప్-4 బ్యాట్స్‌మెన్‌లో ముగ్గురు ఎడమచేతివాటం వారే కావడం వల్ల ఈ మ్యాచ్‌లో జకాతిని ఆడించకపోవచ్చు. సోనీ సిక్స్‌లో రాత్రి 8.00 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం -
ప్లే ఆఫ్‌కు భారత్
♦ మలేసియాపై ఘన విజయం ♦ ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్ : ఫెడ్ కప్ (ఆసియా/ఓషియానియా గ్రూప్ 2) టోర్నీలో భారత జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. ఎల్బీ స్టేడియం సెంటర్ కోర్టులో గురువారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భారత్ 3-0 తేడాతో మలేసియాను చిత్తు చేసింది. కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన మొదటి సింగిల్స్‌లో ప్రార్థనా తోంబరే 6-1, 6-0తో నబీలా బిన్తిని చిత్తు చేసింది. రెండో సింగిల్స్ మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో అంకితా రైనా 6-1, 3-6, 6-4తో జవైరియా నూర్దిన్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఏకంగా 2 గంటల 18 నిమిషాల పాటు సాగింది. డబుల్స్‌లో కూడా భారత్‌దే పైచేయి అయింది. ప్రార్థన-నటాషా జోడి 6-0, 6-2తో సెల్వరజూ-నబీలా బిన్తి జంటపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కూడా సానియా మీర్జా బరిలోకి దిగలేదు. భారత్ ప్రత్యర్థి తుర్క్మెనిస్తాన్ మరో వైపు ఫిలిప్పీన్స్, ఇండోనేసియా, తుర్క్మెనిస్తాన్ జట్లు కూడా ప్లే ఆఫ్‌కు చేరుకున్నాయి. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లలో ఇండోనేసియా 3-0తో శ్రీలంకపై, తుర్క్మెనిస్తాన్ 3-0తో కిర్గిస్తాన్‌పై గెలుపొందాయి. సింగపూర్‌పై గెలిచి గ్రూప్ ‘ఎ’ నుంచి ఫిలిప్పీన్స్ తొలి రోజే ప్లే ఆఫ్ చేరింది. శుక్రవారం జరిగే తొలి ప్లే ఆఫ్ మ్యాచ్‌లో తుర్క్‌మెనిస్తాన్‌తో భారత్... మరో మ్యాచ్‌లో ఇండోనేసియాతో ఫిలిప్పీన్స్ తలపడతాయి. -
ఐపీఎల్ 20-20పై బెట్టింగుల జోరు
పలమనేరు,న్యూస్‌లైన్ : జిల్లాలోని తిరుపతి, మదనపల్లె, చిత్తూరులో ఐపీఎల్20-20 బెట్టింగులు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండు గంటల్లో ఫలితమొస్తుండడంతో ఈ మ్యాచ్‌లకు లక్షలాది రూపాయలు బెట్టింగుల రూపేణా చేతులు మారుతున్నాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ విన్ ఎవరవుతారు? విన్ అయితే బ్యాటింగా, బౌలిం గా? పది ఓవర్ల మ్యాచ్ తర్వాత ఎంత స్కోరు వస్తుంది? సెకెండ్ బ్యాటింగ్‌కు దిగిన జట్టు గెలుస్తుందా, ఓడుతుం దా? ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడతారు? వికెట్లు పడగొట్టేదెవరు? ఎవరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కుతుంది? అంటూ పందెం కాస్తున్నారు. మరికొందరు తొందరగా డబ్బులు సంపాదించుకోవాలనో ఏమో ఓవర్ టు ఓవర్ బెట్టింగులు కడుతున్నారు. ఒక్క ఓవర్లో ఆరు బంతులకు ఎన్ని పరుగులొస్తాయి ? అనే విషయంపై నిమిషాల వ్యవధిలో డబ్బులు చేతులు మారుతున్నాయి. ఐదు జట్లపైనే భారీగా బెట్టింగులు పంజాబ్, చెన్నైలు ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకోగా, మిగిలిన జట్లలో ఐదు అర్హత సాధించే అవకాశాలున్నాయి. దీంతో రాజస్థాన్ రాయల్స్, కోల్కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్పై భారీగా పందేలు కాస్తున్నట్లు సమాచారం. తిరుపతికి చెందిన ఓ పారిశ్రామికవేత్త ఐపీఎల్ ట్రోఫీని పంజాబ్ కైవసం చేసుకుంటుందంటూ రూ.50 లక్షలు పందెం కాసినట్లు తెలుస్తోంది. ఇక మదనపల్లెకు చెందిన పలువురు రియల్టర్లు, పంజాబ్,రాజస్థాన్, కోల్‌కత్తాపై లక్షల రూపాయల బెట్టింగులు పెట్టినట్లు వినికిడి. పల్లెల నుంచి పట్టణాల దాకా........ పల్లెల్లో కోళ్ల పందేలు, పేకాట తదితర జూదాలుండేవి. పట్టణాల్లో అయితే పేకాట జోరుగా సాగుతుండేది. అయితే వ్యసనపరులు ట్రెండ్ మార్చారు. ఎవరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా ఓ టీకొట్టులో కుర్చొని క్రికెట్ చూస్తూ పందెం కాస్తున్నారు. పట్టణాల్లో దాబాల వద్ద ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ బెట్టింగుకు వ్యసనపరులుగా మారిన యువకులు నిత్యం పందేలు కాసి తీవ్రంగా నష్టపోతున్నారు. తిరుపతి, మదనపల్లెలో పలువురు ఇంజినీరింగ్ విద్యార్థులు బైక్‌లు, వారు ధరించిన బంగారు ఆభరణాలను సైతం ఈ బెట్టింగుల్లో పెట్టి నష్టపోతున్నారని పలువురు చెబుతున్నారు.