ఐపీఎల్ 20-20పై బెట్టింగుల జోరు
పలమనేరు,న్యూస్‌లైన్ : జిల్లాలోని తిరుపతి, మదనపల్లె, చిత్తూరులో ఐపీఎల్20-20 బెట్టింగులు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండు గంటల్లో ఫలితమొస్తుండడంతో ఈ మ్యాచ్‌లకు లక్షలాది రూపాయలు బెట్టింగుల రూపేణా చేతులు మారుతున్నాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ విన్ ఎవరవుతారు? విన్ అయితే బ్యాటింగా, బౌలిం గా? పది ఓవర్ల మ్యాచ్ తర్వాత ఎంత స్కోరు వస్తుంది?
సెకెండ్ బ్యాటింగ్‌కు దిగిన జట్టు గెలుస్తుందా, ఓడుతుం దా? ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడతారు? వికెట్లు పడగొట్టేదెవరు? ఎవరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కుతుంది? అంటూ పందెం కాస్తున్నారు. మరికొందరు తొందరగా డబ్బులు సంపాదించుకోవాలనో ఏమో ఓవర్ టు ఓవర్ బెట్టింగులు కడుతున్నారు. ఒక్క ఓవర్‌లో ఆరు బంతులకు ఎన్ని పరుగులొస్తాయి ? అనే విషయంపై నిమిషాల వ్యవధిలో డబ్బులు చేతులు మారుతున్నాయి.
ఐదు జట్లపైనే భారీగా బెట్టింగులు
పంజాబ్, చెన్నైలు ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకోగా, మిగిలిన జట్లలో ఐదు అర్హత సాధించే అవకాశాలున్నాయి. దీంతో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్‌పై భారీగా పందేలు కాస్తున్నట్లు సమాచారం. తిరుపతికి చెందిన ఓ పారిశ్రామికవేత్త ఐపీఎల్ ట్రోఫీని పంజాబ్ కైవసం చేసుకుంటుందంటూ రూ.50 లక్షలు పందెం కాసినట్లు తెలుస్తోంది. ఇక మదనపల్లెకు చెందిన పలువురు రియల్టర్లు, పంజాబ్,రాజస్థాన్, కోల్‌కత్తాపై లక్షల రూపాయల బెట్టింగులు పెట్టినట్లు వినికిడి.
పల్లెల నుంచి పట్టణాల దాకా........
పల్లెల్లో కోళ్ల పందేలు, పేకాట తదితర జూదాలుండేవి. పట్టణాల్లో అయితే పేకాట జోరుగా సాగుతుండేది. అయితే వ్యసనపరులు ట్రెండ్ మార్చారు. ఎవరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా ఓ టీకొట్టులో కుర్చొని క్రికెట్ చూస్తూ పందెం కాస్తున్నారు.
పట్టణాల్లో దాబాల వద్ద ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ బెట్టింగుకు వ్యసనపరులుగా మారిన యువకులు నిత్యం పందేలు కాసి తీవ్రంగా నష్టపోతున్నారు. తిరుపతి, మదనపల్లెలో పలువురు ఇంజినీరింగ్ విద్యార్థులు బైక్‌లు, వారు ధరించిన బంగారు ఆభరణాలను సైతం ఈ బెట్టింగుల్లో పెట్టి నష్టపోతున్నారని పలువురు చెబుతున్నారు.