IPL 2024 RR vs MI: ఐదేసి అదరగొట్టిన అమ్ముడుపోని ఆటగాడు | IPL 2024: Unsold Sandeep Sharma Took Fifer And Guided RR To Huge Victory Over MI - Sakshi
Sakshi News home page

IPL 2024 RR vs MI: ఐదేసి అదరగొట్టిన అమ్ముడుపోని ఆటగాడు

Published Tue, Apr 23 2024 10:26 AM | Last Updated on Tue, Apr 23 2024 12:07 PM

IPL 2024: This Season First Unsold Sandeep Sharma Took Fifer And Guided RR To Huge Victory Over MI - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 22) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ అదిరిపోయే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. వేలంలో అమ్ముడుపోని సందీప్‌ శర్మ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వేరే ఆటగాడికి రీ ప్లేస్‌మెంట్‌గా రాయల్స్‌లోకి వచ్చిన సందీప్‌ శర్మ ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, తన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో అదరగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో సందీప్‌ వేసిన స్పెల్‌ విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ తీసిన సందీప్‌.. నాలుగో ఓవర్‌లో అతి భయంకరుడైన సూర్యకుమార్‌ వికెట్‌ను పడగొట్టాడు. ఆ తర్వాత 15వ ఓవర్‌లో బంతినందుకున్న సందీప్‌.. ఆ ఓవర్‌లో వికెట్‌ లేకుండా 11 పరుగులు సమర్పించుకున్నాడు.

ఆఖరి ఓవర్‌లో మరోసారి బంతినందుకు సందీప్‌ ఈసారి తన అద్భుతమైన స్లో బాల్స్‌ టెక్నిక్‌ను ఉపయోగించి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన సందీప్‌ 18 పరుగులు సమర్పించుకుని 5 వికెట్లు​ పడగొట్టాడు. సందీప్‌కు ఐపీఎల్‌ కెరీర్‌లో ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. మొత్తంగా ఈ మ్యాచ్‌లో సందీప్‌ తన అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో రాయల్స్‌కు భారీ విజయాన్ని అందించాడు.

సందీప్‌ దెబ్బకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌.. 179 పరుగులు మాత్రమే చేసింది. తిలక్‌ వర్మ (65), నేహల్‌ వధేరా (49) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు ఆడకపోయుంటే ముంబై పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. రాయల్స్‌ బౌలర్లలో సందీప్‌తో పాటు బౌల్ట్‌ (4-0-32-2) కూడా రాణించాడు. 

అనంతరం​ నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌.. 18.4  ఓవర్లలో కేవలం వికెట్‌ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. యశస్వి జైస్వాల్‌ (60 బంతుల్లో 104 నాటౌట్‌) మెరుపు సెంచరీతో రాయల్స్‌ను గెలిపించాడు. బట్లర్‌ (35), సంజూ శాంసన్‌ (38 నాటౌట్‌) రాణించారు. రాయల్స్‌ కోల్పోయిన ఏకైక వికెట్‌ (బట్లర్‌) పియూశ్‌ చావ్లాకు దక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement